సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ
శ్రీ స్వయంభూః సిద్ధేశ్వర స్వామి దేవస్థానము
కొడవటూరు సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం
(సంవత్సరమునకు చింతాకు పరిమాణం పెరుగుతున్న ఏకైక స్వయంభూః శివలింగం)
పరిశోధన వ్యాస రచయిత : డా. మోహనకృష్ణ భార్గవ
ఓం. శుద్ధాయ బుద్ధాయ తధైవనిత్యం, ముక్తాయ సిద్ధాయ తధేశ్వరాయ !
ఏవం భవన్త్యై భవ వామగామై, భూయాంపిమేసంతు నమాంసి నిత్యం !!
ఓం. మహాతీర్థ రాజస్య తీరే విభాంతం, మహాభూతిరూపం మహాత్మైక వేద్యం !
మహాసిద్ధిపూర ప్రధానైక దక్షం, భజామైవ సిద్ధేశ్వరం సిద్ధ శంభుమ్ !!
(మోహనకృష్ణ స్వయంగా ప్రచురించిన కరపత్రాలు)
ఉపోద్ఘాతం - శైవమతము
మనిషి మోక్షగామి, నిత్యాన్వేషి.. పునర్జన్మ లేనటువంటి శాశ్వత జీవన్ముక్తి కొరకు నిరంతరం తాపత్రయ పడుతుంటాడు. ‘శం కరోతితి శంకరః’ అన్నట్లుగా మనిషి జీవితంలో దుఃఖాలను దూరం చేసి సుఖసంతోషాలను, భోగభాగ్యాలను ప్రసాదించి, చివరన శాశ్వత కైవల్య ముక్తి ప్రసాదించే ఈశ్వరత్వం కలిగినవాడు పరమేశ్వరుడు.
ఆది అంతము లేని ఆదిపురుషుడు, సకల చరాచర సృష్టికి మూలపురుషుడు, సాకార నిరాకార అనంత శక్తి స్వరూప సర్వేశ్వరుడు, అనంత విశ్వాన్ని తనలో ఇముడ్చుకున్న లయకారుడు, మృత్యువును సైతం దూరం చేసి అమరత్వాన్ని ప్రసాదించే మృత్యుంజయుడు, జీవానికి వెలుగుని ప్రసాదించే దేవాదిదేవుడైన సాక్షాత్ పరమాత్మయే పరమేశ్వరుడు..
ఆయనే రుద్రుడు, పశుపతి, అఘోరుడు, ఆదియోగి, మహాకాళుడు, తాత్విక దృష్టిలో ఆయనే మహా గురువు..
అనంత శూన్యంలో ఉద్భవించిన జ్యోతిలింగమే సాకార స్వరూపమైన పరమేశ్వరుడు. ‘యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం’ సమస్త కర్మలను ఈశ్వరార్పణ చేస్తూ.. ‘దేహోదేవాలయః ప్రోక్తో జీవో దేవ స్సనాతనః’ దేహమే దేవాలయం, అందులోని ఆత్మనే పరమాత్మగా భావిస్తూ..
నిత్యం శివారాధన చేయడం ద్వారా ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటూ బ్రహ్మత్వాన్ని, శాశ్వతముక్తిని పొందుతున్నారు.
లింగాకారంలోని పరమేశ్వరుడిని ప్రధాన దైవంగా ఆరాధిస్తూ ఏర్పడిన శైవ, వీరశైవ, పాశుపత, అఘోర, నాగ, స్మార్త సాంప్రదాయాలు ప్రపంచ చరిత్రలోనే అతి ప్రాచీనమైనవి. ఋగ్వేదం మొదలుకొని నాలుగు వేదాల్లోను, శ్వేతాశ్వతరోపనిషత్ వంటి అనేక ఉపనిషత్తుల్లోను, స్మృతి ధర్మశాస్త్రాలలోను, శివ వాయు లింగ వంటి అష్టాదశ మహా పురాణల్లోను, ఇతిహాసాల్లోను పరమేశ్వరుడిని అద్వితీయ పరబ్రహ్మగా కీర్తించడం జరిగింది.
సమస్త దేవతలు మహాదేవుడి భక్తులే.. పరమేశ్వరుడి అనుగ్రహంతోనే దేవతలు సైతం శక్తిని పొందుతున్నారు. సాక్షాత్తూ నారాయణుడే తొలి శివభక్తుడు, రామావతారంలోను, పరశురామావతారంలోను విష్ణువు శివుడిని ప్రత్యక్షంగా ఆరాధించడమే కాదు, ఎన్నో శివాలయాల ప్రతిష్ఠాపనలు జరిపించాడు. అత్రి, అగస్త్య, కశ్యప, భరద్వాజ, గౌతమ, భృంగి, నంది, సనత్కుమార, మార్కండేయ, రావణ, బోధాయన వంటి ఎందరో మహర్షులు శివ భక్తాగ్రగణ్యులుగా దర్శనమిస్తున్నారు. కాగా ఆదిశంకరాచార్యులు, బసవేశ్వరుడు, రేణుకాచార్యులు మొదలుకొని నాయనార్లు, అప్పర్లు, నాచియార్లు ఆధునిక శైవ సిద్ధాంత కర్తలుగా నిలుస్తున్నారు.
లింగధారణ, నిత్య లింగారాధన, పంచాక్షరీ జపము, గురుపూజ వంటి లింగాచార, గణాచార, భృత్యాచార, సదాచారాలు.. పశుపతి, అఘోర, వీరభద్ర సాంప్రదాయాలు, వీరముష్టి, ఖడ్గముష్టి, వీర నాట్యాలు, అగ్నిగుండాలు, దిష్టికుంబాలు, కాగడ హారతులు, బండారీ పూజలు, శైవార్చనలు, శక్తి ఆరాధనలు, గురుపీఠం వంటి ప్రముఖ శైవ, వీరశైవ, జానపద సంస్కృతులను, కళలను, కాపాడేందుకు అనేక కుటుంబాలు, వంశాలు తరతరాలుగా ఎన్నో త్యాగాలు చేస్తూ వస్తున్నాయి..
అనేక వేల సంవత్సరాల పూర్వమే ప్రపంచవ్యాప్తంగా శైవమతం విస్తరించివున్నది, నేడు అనేక దేశదేశాలలో శిలారూపక ఆనవాళ్లు, విగ్రహాలు తవ్వకాల్లో లభిస్తున్నాయి. భారతీయ చరిత్రకు, వైభవానికి శైవక్షేత్రాలే ప్రతీకలుగా నిలుస్తున్నాయి. విభిన్న భాషలు, సంస్కృతులతో భిన్నత్వంలో ఏకత్వం, వసుదైక కుటుంబంగా వెలసిల్లితున్న భారతీయ జీవన వ్యవస్థకు, ప్రాచీన సాంస్కృతిక వైభవానికి ఆధ్యాత్మిక, వైదిక విశ్వాసాలు, సంస్కృతీ సాంప్రదాయాలు, గ్రామీణ ప్రజల జీవన విధానాలే మూలాలై నిలుస్తున్నాయి.
ఓరుగల్లు మహాసామ్రాజ్యాన్ని పరిపాలించిన కాకతీయ చక్రవర్తులు పరమశివ భక్తులు కావడం చేత, ఓరుగల్లు ప్రాంతంలోని వేయిస్తంభాల గుడి, రామప్ప, పద్మాక్షి, భద్రకాళి, అయినవోలు, కొమురవెల్లి, పాలకుర్తి, మెట్టుగుట్ట, సిద్ధులగుట్ట వంటి శివ క్షేత్రాలన్నిటిని కాకతీయ వైభవాన్ని చాటిచెప్పే విధంగా శిలా నిర్మాణాలతో, అద్భతమైన రీతిలో అభివృద్ధి చేసారు.
జనగామాపై శైవుల ప్రభావం
శైవ సంస్కృతీ సాంప్రదాయాలకు, సాహిత్యానికి, జానపద కళలకు జనగామా జిల్లా కేంద్ర బిందువుగా వెలుగొందినది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రాంతం నుండే శైవ మత వ్యాప్తి జరిగింది..
శైవ మత సాంప్రదాయ స్థాపకుల్లో ముఖ్యుడైన శ్రీ రేణుకాచార్యుల వారు జనగామాకు దగ్గరలోని కొలనుపాక గ్రామంలోని శివాలయంలో లింగం నుండి ఉద్భవించారు. ఇక్కడి నుండే వారు శైవ మఠాల స్థాపనలు, శైవమత వ్యాప్తి చేసారు. శైవ సాహిత్యానికి ఆధ్యుడు, ఆరాధ్యుడైన పాల్కురికి సోమనాథుడు జన్మించినది జనగామ జిల్లా కేంద్రంలోని పాలకుర్తి గ్రామంలోనే కావడం విశేషం. ఇక్కడి నుండే వారు బసవపురాణం, పండితారాధ్య చరిత్ర వంటి అనేక శైవ గ్రంథాలను అందించి, దేశవ్యాప్తంగా శైవ సాహిత్య కీర్తికిరీటంగా గుర్తింపునొందారు. మరింత దగ్గరలోని బమ్మెరలో ఉదయించిన మరో సాహిత్య కిరణం బమ్మెర పోతన, ఇటు భాగవతంతో పాటు వీరభద్ర విజయం వంటి శైవ సాహిత్యాన్ని ఇక్కడే సేద్యం చేసాడు. కొమురవెల్లి మల్లన్న క్షేత్రం జానపద ఒగ్గు కళలకు పుట్టినిల్లు వంటిది, ఇక్కడి వీరశైవ సంస్కృతులు విశ్వవ్యాప్తంగా గుర్తింపునొందాయి. కొన్ని వేల కుటుంబాలను పోషిస్తున్నాయి.
జనగామ జిల్లాకి నలువైపులా ఐదు శైవ క్షేత్రాలు నెలకొని ఉన్నాయి. తూర్పున పాలకుర్తి శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం, దక్షిణంలో కొలనుపాక శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం, నైఋతిలో కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం, పడమర బెక్కల్ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, ఉత్తరం కొడువటూరు శ్రీ సిద్దేశ్వర స్వామి దేవస్థానం.. ఈ క్షేత్రాలన్నీ వందలు, వేల సంవత్సరాల చరిత్ర కలిగి శైవ సాంప్రదాయాలను ఆచరిస్తూ వస్తున్నాయి..
ఈ క్షేత్రాలను దర్శించుకునే భక్తులు జనగామా కేంద్రంలోనే బసచేసేవారని ప్రతీతి. ఆయా క్షేత్రాల ప్రభావం ఇక్కడి ప్రజలపై అధికంగా ఉంది, క్షేత్రాల అధిష్టాన దేవతలను ఇక్కడి ప్రజలు ఆరాధించేవారు. వారు కొన్ని వంశాలకు ఇలవేలుపులు, కులాలకు కులదేవతలయ్యారు. నేటికి ఆయా క్షేత్రాల సాంప్రదాయాలను ఆచరిస్తూ.. ఉత్సవాలు, జాతరలు, పర్వదిన వేడుకల్లో పాల్గొంటారు. ఆయితే ఇక్కడి క్షేత్రాలు అన్నీ శైవమత సాంప్రదాయాలే అయినప్పటికీ అన్నిటిలో భిన్న సంస్కృతులు దర్శనమిస్తాయి. అందుకు ఆ క్షేత్రాల చరిత్ర, పూర్వపరంపరాగత ఆచారాలు మూలకారణమవుతున్నాయి.
సిద్దులగుట్ట (సిద్ధాద్రి) స్థల పురాణం - చరిత్ర
కాకతీయ పాలనలో వైభవంగా వెలుగొందిన శైవక్షేత్రాలలో చెప్పుకోదగినది సిద్దులగుట్ట. ఇది గొప్ప తపోవనం, సిద్ధులు నడయాడిన నేల.. జనగామ జిల్లా కేంద్రానికి 20. కిలోమీటర్ల దూరంలో గల బచ్చన్నపేట మండలంలోని కొడవటూరు గ్రామంలోని గుట్టపై పరమేశ్వరుడు లింగాకారంలో స్వయంభువుగా వెలిసాడు.
పూర్వం ఈ క్షేత్రంలో ఎందరో ఋషులు, యోగులు, సాధువులు, శైవోపాసకులు దర్శించి స్వామిని పూజించేవారు. ఈ గుట్టపై పవిత్ర తీర్థములున్నాయి, సిద్దులు ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి రహస్య సొరంగ మార్గాలను, తీర్థాలను వినియోగించుకునే వారని చరిత్ర తెలియజేస్తుంది.
16వ శతాబ్ధానికి పూర్వం ఋషులు, యోగులు ఈ క్షేత్రానికి సమీపంలో గల తోట నుండి ఫలాలను సేకరించి స్వామికి అర్పించేవారని, తోట యజమాని దొంగలే పండ్లను అపహరిస్తున్నారని వారికి బుద్ది చెప్పేందుకు, చెట్లకు చెప్పులు కట్టడం, అది చూసిన సిద్దులు, ఆ చెట్లను శిలలుగా మార్చారని స్థల పురాణం. ఆయా ఋషుల శాపం వలన చెట్లు శిలలుగా మారిన ఆనవాళ్లు నేటికీ కలవు. ఋషులు, యోగులు ఆ సిద్ధేశ్వరునిలో ఐఖ్యమయ్యారని, తరువాత కాలంలో మత్స్యేంద్రనాథ్, గోరక్ నాథ్, కనిక్ నాథ్ వంటి నవనాథ తీర్థంకర సాధువులు ఇక్కడ తపస్సు చేసారు. ఇక్కడ పాండవులు సైతం సంచరించారని ప్రజల విశ్వాసం. ఇక్కడ సుమారుగా వేయి సంవత్సరాల పూర్వమే చెక్కిన భద్రకాళీ, గణపతి, బైరవుడు వంటి నల్లరాతి విగ్రహాలు దర్శనమిస్తాయి. కాకతీయ చక్రవర్తి ప్రతాప రుద్రుడు నిర్మించిన అతి పురాతన త్రికూటాలయం శ్రీ ముక్కంటీశ్వర దేవాలయం శిథిలావస్థలో దర్శనమిస్తున్నాయి, ఇటువంటి అనేక పౌరాణిక, చారిత్రక విశేషాలను ఈ క్షేత్రం కలిగివుంది. కాగా తురుష్కుల పాలనలో ఇక్కడ శాసనాలను ద్వంసం చేసారని చరిత్రకారులు తెలియజేస్తున్నారు.
1693లో మహంతస్వామి అనే సాధువుకి సిద్దేశ్వరస్వామి స్వప్నంలో సాక్షాత్కరించి, గుట్టపై స్వయంభువుగా వెలసినట్లు తెలుపగా, వెంటనే ఆయన మనుషులు చేరడానికి వీలులేని కొండగుహల్లో వెలసిన స్వయంభూ పరమేశ్వరుడిని భక్తులకు చేరువ చేసేందుకు గుట్టపైనే నివాసముండి, ఆలయాన్ని వెలుగులోకి తెచ్చారు, ఆయన ఉపయోగించిన గృహోపకరణాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. నృసింహస్వామి అనే యోగి ఇక్కడ తపస్సు చేసి శివ సాక్షాత్కారం పొంది, లింగంలోనే ఐఖ్యమయ్యాడని స్థల పురాణం తెలుపుతున్నది.
సిద్ధులు ఆరాధించిన క్షేత్రం కనుక సిద్ధులగుట్టగా, స్వామిని సిద్దేశ్వరుడిగా పిలిచారని ప్రతీతి.
క్షేత్ర విశేషాలు - మాహాత్మ్యం
-- ఈ క్షేత్రంలోని ప్రధాన శివలింగమైన శ్రీ సిద్ధేశ్వర స్వామి విగ్రహం, ప్రతీ సంవత్సరం చింతాకు పరిమాణం మేరకు పెరుగుతుంది. ఇలా పెరిగే ఏకైక శివలింగం కావడం, ఇలా పెరగాడానికి కారణాన్ని పరిశోధకులు సైతం తేల్చలేకపోవడం ఆశ్చర్యకరం. గర్భాలయంలోనే వినాయక పరివార ముర్తులు, సప్తమాతృకలు దర్శనమిస్తాయి.
-- గుట్టపై అతిపురాతన బాలసిద్ధేశ్వర లింగము, సంగమేశ్వర లింగము, భస్మేశ్వర విభూతి లింగం యమకోణ హనుమంత గుహాలయం కలవు.
సిద్ధులగుట్టకు ఎదురుగా పాండవుల గుట్టపై ప్రాచీన కాకతీయ ప్రతాపరుద్రుడు ప్రతిష్టించిన శ్రీ ముక్కంటీశ్వర త్రికూటాలయం కలవు..
-- ఈ గుట్ట నుండి సిద్దెంకి, కొన్నె, ఓబుల్ కేశవాపూర్, కొలనుపాక గ్రామాలకు గుప్త సొరంగ మార్గాలున్నాయి. వీటి ద్వారా సిద్దులు ఈ క్షేత్రాన్ని చేరుకొని ఆరాధించేవారని ప్రతీతి, కాగా గుప్తనిధుల కోసం దుండగుల ప్రయత్నాల్లో మార్గాలు ధ్వంసమయ్యాయి.
-- గుట్టపై ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన మూడు ప్రాచీన కోనేరులు ఉన్నాయి, వాటిని సిద్ధుల గుండము, రాముల గుండము, ముక్కంటి (కప్పు) గుండము అని పిలుస్తారు. సిద్దులే తమ తపశ్శక్తితో ఈ కోనేరులను సృష్టించారని భక్తుల విశ్వాసం. బాలాలయం ఎదురుగా వున్న కోనేరులో నేటికీ సిద్ధులు రహస్యంగా స్నానమాచరిస్తారని ప్రజల విశ్వాసం, పూర్వం నుండి భక్తులు ఈ కోనేటిలో స్నానాలు ఆచరించి శివున్ని దర్శించుకుంటారు.
-- ఈ క్షేత్రములో ఎంతో పవిత్రమైన ఔషది మూలికలు, అరుదైన వృక్షాలు కలవు. స్వామి వారి సన్నిధిలో ప్రాచీన నూతిబావి కలదు. ఈ బావి ఎప్పుడు, ఎవరు, ఎందుకు తొవ్వించారో ఎవరికీ తెలియదు.. కానీ క్షేత్ర మాహాత్మ్యంలో ఈ బావి కీలకపాత్ర పోశిస్తుంది, ఈ బావి నీరు సహజంగా ఎంతో తీపిగా ఉంటాయి. పూర్వం పస్కలు, కామర్లు, కుష్టు, మహామారీ వంటి ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, ఇక్కడి బావి నీరు నలబై రోజుల పాటు సేవించి, ఆయా వ్యాధుల నుండి ఉపశమనం పొందారు.
-- భక్తులు కోర్కెలు నెరవేరటం, సమస్యలు తీరటం వంటి ఆయుః, ఆరోగ్య, ఆర్థిక, అభివృద్ధి, వివాహం, సంతానం వంటి అభీష్టాలను పొందడానికి, క్షేత్రంలో 11, 21, 41 (మండల, అర్థ మండల) రోజుల పాటు నిద్రలు చేస్తారు. దీనిని గుట్టనిద్ర అని పిలుస్తుంటారు. ఇలాగే కోర్కెల మొక్కుబడి ముడుపులు కట్టడం ద్వారా శీఘ్రఫలితాలు పొందుతారు, ఇలా వంశ పరంపరాగత భక్తులు అనేకమంది కలరు.
-- దేవాలయంలోనే వెలసిన మరో మూర్తి క్షేత్రపాలకుడు భైరవస్వామికి శతృ బాధ నివారణ, గ్రహపీడ, ప్రయోగాలు, దుష్టశక్తులు, భూతప్రేతాల నుండి విముక్తి, భయం, ఆందోళన, చికాకులు, కష్టాలు, కోర్టు వ్యవహారాలు వంటి సమస్యల నుండి బయటపడేందుకు మొక్కలు చెల్లిస్తారు. క్షేత్రానికి దూరంగా బలిసమర్పణ చేస్తుండటం గ్రామీణ ప్రజల ఆనవాయితీ..
-- నేటికీ ఆలయ ప్రాంగణంలో ప్రతీరోజు మధ్యాహ్నం, నిశిరాత్రి ఆలయాన్ని ఆర్చకులు మూసివేసిన తరువాత ఎవరో పూజలు చేసినట్లుగా శబ్ధాలు, పరిమళాలు వస్తాయని, అక్కడ నిద్ర చేసేవారికి సైతం ఆ భావన, అనుభూతి కలిగిందని, ఆ సిద్దులే ఈ పూజలు చేస్తారని అర్చకులు, భక్తులు, స్థానికులు చెప్పుకుంటారు.
-- క్షేత్రంలో అనేక ఉపాలయాలు, ఆశ్రమాలు కలవు. శైవ, దత్తాత్రేయ, గురు పరంపరా సాంప్రదాయస్తులకు ఈ క్షేత్రం అత్యంత విశేషమైనదిగా భావిస్తారు. సాధువులు, సద్గురువులు నిత్యం స్వామిని ఆరాధిస్తారు, యోగ సాధనలు, తపస్సు, దీక్షలు చేస్తుంటారు.
జాతరలు - విశ్వాసాలు - జానపద సంపద
-- గిరి ప్రదక్షిణ : సిద్ధాద్రిగా కీర్తినొందిన సిద్దులగుట్ట.. సుమారుగా 147 ఎకరాల విస్తీర్ణం, 8-9 కి’’మీ చుట్టుకొలత గల గుట్ట చుట్టూ పూర్వం నుండి గిరిప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తున్నది. క్షేత్రంలో వెలసిన అధిష్టాన దేవాలయం, ఉపాలయాలు, తీర్థాలు, ఔషదులు అన్నిటికీ ఏకాలంలో ప్రదక్షిణ చేయడానికి గిరిప్రదక్షిణ దోహదపడుతుంది. ప్రతీ మహాశివరాత్రి రోజున, కార్తీక, శ్రావణ మాసాలలోని మొదటి సోమవారం, ఆర్ద్రా నక్షత్రం, పౌర్ణమి రోజుల్లో తెల్లవారుజామున శివపార్వతుల ఉత్సవ మూర్తులతో పల్లకి/సేవ మోసుకొంటూ కాగడ హారతులతో గిరిప్రదక్షిణ చేస్తారు.
దీనిని ‘‘గిరి సేవ’’ అని పిలుస్తారు. భక్తులు సైతం తమ కోర్కెలు, మొక్కులు తీర్చుకోవడానికి గిరిప్రదక్షిణ చేస్తుంటారు.
-- ప్రతీ శ్రావణ, మాఘ మాసాలలో త్రికాల శివార్చనలు, కార్తీక మాసాల్లో శతఘఠాభిషేకాలు నిర్వహిస్తారు. అర్చకులు లోక కళ్యాణార్థం శాంతి కళ్యాణాలు తరచుగా నిర్వహిస్తుంటారు.
-- ప్రతీ రోజు దేవాలయాన్ని సన్నాయి, మేళతాలాలు వంటి ప్రత్యేక చప్పుల్లతో మేల్కొలుపు సేవ మొదలుకొని రాత్రి పవలింపు సేవ వరకు శివనామస్మరణల నడుమ జరిగే ఈ నిత్య సేవలు, క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
-- సిద్దులగుట్ట దేవాలయానికి క్షేత్రపాలకుడు కాలబైరవస్వామి. ఈ ఉపాలయ చరిత్ర అందుబాటులో లేనప్పటికీ.. పూర్వ తరతరాలుగా ఈ కాలబైరవుడికి మొక్కులు తీర్చుకునే ఆనవాయితీ వస్తున్నది. పలువురు గ్రామీణ భక్తులు క్షేత్రానికి దూరంగా చెట్ల కింద కోళ్లు, మేకలు బలిహరణ చేసి వాటి కాళ్లను చెట్టుకు కట్టి భోజనాలు చేస్తుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో మొక్కులు తీర్చుకోవడం ప్రకృతి ఆరాధన, వనభోజనాలని తలపిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తుంది.
-- శివరాత్రి, కార్తీక, శ్రావణ మాసాలలో ఇక్కడ అగ్నిగుండాలు నిర్వహిస్తారు. ఈ అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం భక్తులను విశేషంగా అలరిస్తుంది. ఇది ఆశ్చర్యాన్ని, ఓ కొత్త ఆధ్యాత్మిక అనుభూతిని నింపుతుంది. శివరాత్రి ఉత్సవాలలో.. శ్రీ భద్రకాళీ వీరభద్రేశ్వర స్వామి వారలను ఆవాహన చేస్తారు.
గ్రామీణ జానపద సాహిత్యానికి ప్రతిరూపంగా వివిధ పాటలు, కీర్తనలు, భజనలతో భగవంతుడ్ని స్మరిస్తూ బియ్యాన్ని రాసిగా పోసి, కలశ స్థాపనలు చేస్తారు. ఈ కలశాలపై భద్రకాళి వీరభద్ర స్వామిని ఆవాహన చేస్తారు. దీనిని ‘‘సుంకు బియ్యం’’ అని పిలుస్తారు.
అనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలని వీరశైవ సాంప్రదాయంలో జరుపుతారు. అష్ఠదిక్పాలక, క్షేత్ర పాలక బలిహరణలు జరుపుతారు. ఈ పూజల్లో దిష్టి కుంభం ప్రత్యేక ఆకర్షణీయమౌతుంది.
-- భద్రకాళి, వీరభద్ర, కాలబైరవ పూజలు జరిపి, అనంతరం అగ్నిగుండ స్థాపన, ప్రవేశం చేస్తారు. అర్చకులు, భక్తులు భారీ సంఖ్యలో ఈ అగ్ని గుండాలను తొక్కుతారు. అగ్ని గుండాల ప్రవేశ అనంతరం భక్తులందరూ కలిసి ‘‘గెలుపు ఉత్సవాలు’’ అనే సంబరాలను జరుపుకుంటారు.
-- దీపోత్సవాలు, కృత్తికోత్సవాలు, జ్వాలా తోరణాలు వంటి ఉత్సవాలు ఎంతో శోభాయమానంగా జరుగుతాయి.
-- భక్తులు సిద్దేశ్వర స్వామికి కొబ్బరికాయతో ముడుపులు కడుతుంటారు, ఈ ముడుపులు కట్టడం ద్వారా కోర్కెలు వెంటనే నెరవేరతాయని భక్తుల విశ్వాసం. తలనీలాలు సమర్పించుకోవడం, నిత్యార్చనలు, ఆర్జిత సేవలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు, మహాన్యాసాలు, మహాభోగాలు, శాంతి కళ్యాణాలు, బిల్వార్చనలు, సహస్రనామాలు, ఊరేగింపు ఉత్సవాలు వంటి అనేక నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, వార్షికోత్సవ
ఉత్సవాలను, ఆర్జిత సేవలను భక్తులు జరుపుకుంటారు. ఈ సేవలు దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో జరుగుతాయి.
-- ఈ గ్రామానికి దగ్గరగా ఉన్నటువంటి పలు గ్రామాల వ్యవసాయదారులు, తమ తొలిపంట నుండి తెచ్చిన ధాన్యాన్ని హుండిలో సమర్పించి, పంటను కాపాడి, లాభాలతో అందించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు.
-- వివిధ సందర్భాలలో భక్తులు, తమ మొక్కులను తీర్చుకోవడానికి భోనాలను సమర్పిస్తారు. ఇక్కడే మట్టికుండలపై వంటలు చేసి ప్రకృతికి, క్షేత్రపాలకుడికి సమర్పిస్తుంటారు.
ప్రత్యేక ఉత్సవాలు, పర్వదినాలు, జాతరల్లో వివిధ జానపద, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
-- అగ్ని గుండాలు మరియు భద్రకాళీ వీరభద్ర పూజల సందర్భాలలో వీరభద్ర ఖడ్గము, వీరభద్ర ముష్టి, వీర నాట్య ప్రదర్శనలు చేస్తారు. వీరభద్రస్వామి రూపంలో వేషధారణ చేసిన వీరశైవ పురోహితుడు చేతిలో ఖడ్గాన్ని ధరించి హరోం హర, అశ్శరభ శరభ అనే పలు శబ్ధాలు, స్తోత్రాలతో భీకరమైన శబ్ధాలు చేస్తూ, డప్పుచప్పుల్ల నడుమ పంచాక్షరీ, వీరభద్ర ఖడ్గ స్తోత్రాన్ని చెప్తారు. తదుపరి అతి వేగంగా భక్తుల చేతుల్లో, నెత్తిన, భుజాలపై కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గుమ్మడికాయలు ఉంచి, ఖడ్గము, చేయి, కర్రలతో పగలగొడతారు, చేతిలో కర్పూర హారతులు ఇస్తుంటారు. కత్తి, కర్ర పైకి విసిరివేయడం, రంగురంగుల ముగ్గుల మధ్య బలిహరణలు చేయడం చేస్తారు. శూలాలు, దప్పలం సూదులు చెంపలకు, నాలుకకు, చెవులకు గుచ్చడం, బండారి పసుపు, విభూది భక్తులకు రాయడం వంటి చిత్ర విచిత్రమైన ప్రదర్శనలు చేసి ఒక రకమైన ఆనందోత్సాహాలకు గురి చేస్తారు. ఇది ఒకరకమైన శాంతి క్రియ తద్వారా సకల దోషాలు, అరిష్టాలు తొలగిపోతాయిని విశ్వాసం.
-- చిందూ యక్షగానం - వివిధ బృందాల వారిచే, అంశాల వారీగా ప్రచీన యక్షగానాన్ని నిర్వహిస్తారు. నృత్యాలతో, గేయాలతో అలరించే ఈ చిందూ యక్షగానం భక్తులను విశేషంగా అలరిస్తుంది.
హరికథ పురాణ కాలక్షేపం - శివ వాయు లింగ మహాభారత పురాణ గాథలను, భాగవత హరికథలను, శివ, దేవీ, గణపతి, సుబ్రహ్మణ్య పౌరాణిక గాథలను.. చేతిలో పిడతలు, కాలికి గజ్జెలు ధరించి శబ్ధ సౌందర్యమైన పద్య, గద్య, స్తోత్ర, వచన రీతిలో రమ్యంగా కథా కాలక్షేపం చేస్తారు.
ఒగ్గు కథలు - శివుడు ప్రధాన అంశంగా, రాగభావ యుక్తమైన కథా గానాలతో, వివిధ డప్పు చప్పుల్లతో ఒగ్గు కళాకారులతో ప్రత్యేకమైన కార్యక్రమాలని నిర్వహిస్తారు. ఇవి ప్రాచీన జానపద సంపదను, సంస్కృతిని పరిక్షించుకునే కార్యక్రమాలుగా నిలుస్తున్నాయి.
ఇక్కడ అనేక ప్రాంతాలకు చెందినవారు భజన బృందాలు, సేవ సమూహాలుగా ఏర్పడ్డారు, అనేక గురుపరంపరా శిష్యబృందాలున్నాయి. వారు అనేక గ్రామాలలో భగవన్ నామస్మరణ చేస్తూ భక్తి, ధర్మ ప్రచారం చేస్తున్నారు. సందర్భానుసారంగా భజనలు, కీర్తనలు, నృత్య ప్రదర్శనలు, సంగీత వాయిద్యాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఒకనాడు గొప్ప శైవ మహా క్షేత్రంగా, జానపద సంస్కృతులకు, కళలకు ఋషిపరంపరాగత సాంప్రదాయాలకు నెలవై సిద్దుల తపోవనంగా వెలుగొందిన సిద్ధులగుట్ట (సిద్ధాద్రి).. నేడు అనేక శాసనాలు, ప్రాచీన ఆధారాలు, ఆనవాళ్లను, గుర్తింపును కోల్పోతున్నది.. పట్టణానికి దూరమైనందున సరైన అభివృద్ధికి నోచుకోవడం లేదు. పర్యాటక క్షేత్రానికి కావలసిన భౌగోళిక వనరులు, పరీస్థితులన్నీ కలిగివున్నప్పటికీ, ప్రజలకు శైవ సాంప్రదాయ విశిష్టత, తరతరాలుగా అనేక వంశాలు చేస్తున్న త్యాగాలు, ప్రాచీన క్షేత్ర చరిత్ర తెలియకపోవటం వలన ఆధరణ పొందలేకపోతున్నది.
స్థానిక దేవాలయాలను చీకటికి వదిలేసి కాశీ రామేశ్వరం వంటి ఎన్ని తీర్థాలు సేవించినా ప్రయోజనం వుండదు. భారతీయ జానపద కళలను, శైవ సంస్కృతులను, విశ్వాసాలను పరిరక్షిస్తున్నటువంటి సిద్దుల గుట్ట చరిత్ర ప్రజల్లోకి తీసుకుపోవడం ద్వారా ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక, సాంస్కృతిక చైతన్యాన్ని భవిష్యత్తుకు పదిలంగా అందించిన వారమవుతాము.
మన సిద్ధులగుట్ట చరిత్ర, మహాత్మ్యం, వైభవాలను ప్రచారం చేయడం, క్షేత్ర అభివృద్ధికి కృషి చేయడం, ప్రభుత్వ దృష్టికి తీసుకువెల్లి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత..























బాగుంది
రిప్లయితొలగించండి