పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

"పీడిత ప్రజల‌ గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు"
(జననం : 02- 10 - 1926, మరణం : 05 - 11 - 1993)

కడ'వెండి' గిన్నెలో కడిగిన తెల్లని ముత్యమతను/ శ్రమజీవుల బువ్వకుండలో కుతకుత ఉడికిన ఎర్రని మెతుకతను/ దోపీడీ గడీలపై సంఘమయి/ దౌర్జన్యాల మీద గుతుపయి‌/ పీడితుల్ని ఏకం చేసిన  'నల్ల పులి' అతను.. - మోహనకృష్ణ


తెలంగాణా ఉద్యమ చరిత్రలో గుర్తింపు నోచుకోలేక చీకటిలో మిగిలిన వీరులెందరో.. సాయుధులై నేల రాలిన తారలెందరో.. పోరు వెనుక దాగిన కన్నీటి గాథలెన్నో.. వారి త్యాగాలను స్పృశించి, గౌరవించాల్సిన బాధ్యత మనందరిది. ఇదే కోవకు చెందిన మరో తార, సాయుధ పోరాటానికి ఊపిరిగా నిలిచిన తెలంగాణ బెబ్బులి, నల్ల పులి నల్లా నర్సింహ్ములు.. ఆయన ఉద్యమ ప్రస్థానంపై విస్తృత చర్చ, పరిశోధన, ప్రచారం అవసరం..


(1 అక్టోబర్ 2023 రోజున - ప్రజా మంటలు దిన పత్రికలో ప్రచురితమైన వ్యాసం..)

'జనగామ' పోరాటాల పురిటి గడ్డ. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం, బానిస సంకెళ్ల నుండి స్వేచ్ఛ కోసం పోరాడి నేల రాలిన అమరులెందరో ఈ నేల చరిత్రలో శాశ్వత స్థానాన్ని నెలకొల్పుకున్నారు. సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య వంటి ఎందరో పోరాటయోధులకు పురుడుపోసిందీ నేల.

ఇదే నేలపై కడవెండి గ్రామంలోని ఓ సామాన్య చేనేత కుటుంబం నల్ల లచ్చమ్మ - లచ్చయ్య దంపతులకు 02 అక్టోబర్ 1926 రోజున ఉదయించిందో కిరణం. తన జీవితాన్ని సమాజానికి అంకితమిచ్చి, చీకటిపాలైన పీడిత బతుకుల్లో వెలుగులు నింపి నల్ల సూరీడయ్యాడతడు..

'కడవెండి గ్రామాన నల్లోల నర్సిమ్మ /
పేర్జెప్పి గుంజి కొట్టెరా దొరగాడా /
నీకైన మొనగాడురా..!'


అంటూ.. ప్రజలు కీర్తించే స్థాయికి ఎదిగాడు, వారి మనసుల్లో శాశ్వతంగా ఒదిగాడు, సాయుధ పోరాటంలో సామాన్యుడి చేత ఆయుధమై నిలిచాడు.


తన పోరాట పటిమలను చూసి నివ్వెరపోయిన నిజాం పోలీస్ అధికారులు సైతం సెల్యూట్ చేయక తప్పలేదు. నాటి సైనిక గవర్నర్ జనరల్ జయంత్ చౌదరి స్వయంగా నల్లా నర్సింహ్ములుని 'టైగర్ ఆఫ్ తెలంగాణ' అని బిరుదును ప్రకటించాడు. అత్యున్నత పోలీస్ అధికారులు ధనరాజ్ నాయుడు, డాక్టర్ జయసూర్య పత్రికా ముఖంగా 'జనగామ సింహం' అనే బిరుదును ప్రకటించారు. నిజాం విముక్త పోరాటంతో మొదలైన ఆయన ప్రస్థానం సుధీర్ఘంగా తన చివరి శ్వాస 05 నవంబర్ 1993 వరకు సాగింది.

వీర తెలంగాణ విమోచన పోరాటంలో తన అనుభవాలను, నాటి పరిస్థితులను 1989లో  'తెలంగాణ సాయుధ పోరాటం - నా అనుభవాలు' అనే పేరుతో విశాలాంధ్ర సౌజన్యంతో పుస్తకాన్ని ప్రచురించాడు.

ఒకవైపు నిజాం ప్రభువు రజాకార్ అనే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజల్ని అత్యంత కిరాతకంగా హింసిస్తుండటం, అనేక అరాచకాలు, మహిళలపై అకృత్యాలకు పాల్పడుతుండటంతో యావత్ సంస్థానంలో ఉవ్వెత్తున నిరసన జ్వాలలు చెలరేగాయి. ఎదురు తిరిగిన వారిని, ప్రశ్నించిన వారిని జైలుపాలు చేయడం, ఉరిశిక్షలు విధించటం సాధారణంగా మారింది. ఎందరో వీరుల బలిదానాలు కళ్లారా చూసిన ప్రజలు తిరగబడి ఆయుధాలు చేపట్టారు. ఈ పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటంగా ప్రపంచ వ్యాప్త గుర్తింపునొందింది.

సాయుధ పోరాటం పురుడు పోసుకున్న తొలినాళ్ళలోనే సాయుధ పోరాట దళ నేతగా పేరొందాడు నల్లా నర్సింహ్ములు. తానే స్వయంగా ఎంతోమందికి ఆయుధాల వినియోగాన్ని నేర్పించి దళాలుగా రూపొందించి తిరిగుబాటు చర్యలకు ఆజ్యం పోశాడు, దళ నాయకుడయ్యాడు.

నిజాం ప్రభుత్వ అండదండలతో దేశ్ ముఖ్ , సర్దేశ్ ముఖ్, దేశాయి, జమీందార్ వంటివారు ప్రజలపై 'వెట్టి' అనే చాకిరీ విధానాన్ని ప్రవేశపెట్టి, ఉత్పత్తి శ్రామిక వర్గాలను దోచుకునేవారు. నిజాంకు రాచరికంగా వచ్చిన పదివేల చదరపు మైళ్ల విస్తీర్ణం గల 'సర్ఫ్- ఏ- ఖాస్' అని పిలువబడే భూముల నుండి ఆదాయాన్ని సంపాదించడానికి నిజాం భూస్వాములకు అధికారాలను అందజేసాడు. వివిధ రకాల పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చేందుకు వారు శ్రమదోపిడీ, వస్తుదోపిడీలతో చెలరేగడమే కాకుండా పైశాచిక ఆనందాల‌ కోసం ప్రజల్ని విపరీతంగా హింసిస్తూ దోపిడీలు, అణచివేత, హత్యాకాండలకు పాల్పడేవారు. 

జనగామ ప్రాంతంలోని అరవై గ్రామాలలోని భూములను విసునూరు దేశ్ ముఖ్ రేపాక వెంకట రామచంద్రారెడ్డి ఆధీనంలోకి తీసుకున్నాడు. ప్రజల నుండి బలవంతంగా భూములను కాజేయడం, సిస్తులతో ఆస్తులు దోచుకోవడం వంటి వాటితో వందల ఎకరాల భూములను పోగుచేసుకున్నాడు. అతని తల్లి జానమ్మ, ఈవిడ ఉండేది కడవెండి గ్రామంలో, ప్రజలంతా ఆవిడ ముందు తలవంచి 'దొరసాని' అని పిలుస్తూ 'బాంచన్' అంటూ దండం పెట్టేవారు, తల ఎత్తి చూసిన వాడి తల అక్కడే తెగి పడేది..

రజాకార్ మూఖలు మహిళలపై అకృత్యాలకు పాల్పడేవారు. తెలంగాణా ప్రజల అస్థిత్వానికి గురుతులు, విశ్వాసాలకు ప్రతీకలైన భోనము, బతుకమ్మ ఎత్తాలన్నా, బయట అడుగు పెట్టాలన్నా భయపడే పరిస్థితులు దాపురించాయి. భోనం ఎత్తుకున్న మహిళల వక్షోజాలను రజాకార్ మూఖలు చేతితో పట్టుకొని సుంకం విధించారు. 
బతుకమ్మ ఆడటానికి వచ్చిన మహిళల జాకిట్లు విప్పించి, అర్థ నగ్నంగా వీధుల్లో బతుకమ్మ ఆడించారు. 

దేవాలయాలని దర్శించుకోవాలన్నా సుంకం కట్టాల్సిందే.. ఉత్సవాలు, వేడుకలు, వివాహాలు జరుపుకోవాలన్నా సుంకం కట్టాల్సిందే.. చివరకు హిందూ వ్యతిరేక విధానాలతో పాలకుర్తి వైపుగా పూజకు వెళ్ళి వస్తున్న కొడకండ్ల బ్రాహ్మణులను కిరాతకంగా చెట్లకు కట్టేసి చంపారు. దొరపై న్యాయపోరాటం చేసి గెలిచిన షేక్ బందగీ ని జనగామ పరిసరాల్లో గొడ్డల్లతో దాడి చేసి చంపారు. ఆంధ్రమహాసభలో పాల్గొన్న దొడ్డి కొమురయ్యని తుపాకులతో కాల్చి చంపారు. ఇలా గ్రామాలపై పడి ప్రజలను అణచివేసేందుకు అనేక రకాలుగా యత్నించారు, ప్రజలు పలుగు పార చేత పట్టి ఊర్లలోకి ప్రవేశించిన మూకలను తరిమికొట్టేవారు, ప్రజల ప్రతీ రక్తపు బొట్టు స్వేచ్చ కోసం రగిలిన క్షణాలవి.

నల్లా నర్సింహ్ములు తన పుస్తకంలో ఒక‌ సంఘటనను వివరించిన తీరు నాటి పరిస్థితులకు అద్దం పడుతుంది..

'ఒకనాడు దొర రామచంద్రం ఓ గ్రామంలోని బజారుకు వెళ్తున్న సందర్భంలో పొరపాటున ఒక రైతు తన ఇంటిముందు అరుగుపై కూర్చున్నాడు. దొర వచ్చిన విషయాన్ని రైతు గమనించలేదు, ఇంకేముంది ఆ గ్రామంలోని ఇండ్లముందరి అరుగులన్ని మూలమట్టం కూలగొట్టించాడు'

అంటూ.. నాటి ప్రజల నిస్సహాయ, దౌర్భాగ్య పరిస్థితులను తెలియజేశారు.

నల్లా నర్సింహ్ములు చారిత్రాత్మక తెలంగాణా సాయుధ పోరాటానికి నాయకత్వం వహించడమే కాదు, తానే ప్రత్యక్షంగా సాయుధ దళాలను నిర్మాణం చేసేవాడు. విప్లవ గేయాలతో ప్రజల్లో చైతన్యాన్ని, స్వాతంత్ర్య కాంక్షని నూరిపోసేవాడు. సామాన్య పౌరులను పోరాట యోధులుగా తీర్చిదిద్ది నైజాం ప్రభుత్వ దురాగతాలను, భూస్వాముల అరాచకాలను ప్రతిఘటిస్తూ వీరోచితంగా దాడులు చేసేవారు. ఎన్నో సార్లు ఎంతో మంది పోలీసుల చేతికి చిక్కి చిత్రహింసలకు గురయ్యేవారు. పలువురు హత్యాకాండకు ఆహుతయ్యారు, పలువురు ఆత్మబలిదానాలు చేస్కునేవారు, పలువురు ఉరిశిక్షకు ప్రాణాలు వదిలేవారు. ఇలా అమరులైన వారి సంఖ్య వేలల్లో, లక్షల్లోనే ఉంటుంది.


నాడు పోరాటాల్లో అరెస్ట్ అయిన వారిపట్ల పోలీస్ లు వ్యవరించిన తీరును నర్సింహ్ములు తన పుస్తకంలో తెలుపుతూ..

'భూస్వాములకు, పోలీసులకు వ్యతిరేకంగా అలజడి చేస్తారా.? అంటూ బోర్లా పండపెట్టి ఒక జవాన్ నడుం మీద కూర్చుని, అరికాళ్లు పైకి లేపి పట్టుకున్నాడు. మరొక జవాన్ కర్రతో అరికాళ్లపై వంద దెబ్బలైనా కొట్టుంటారు. రక్తం ఎర్రగా కమిలిపోయింది, రెండు రోజులు కదలకుండా పడిపోయాను. పోలీసులు మాకు మూత్రం తాగించారు, వారి వృషణాలు నోట్లో జొప్పించడం వంటి కిరాతకాలకు పాల్పడ్డారు..'

అంటూ.. రాసిన వాక్యాలు చూస్తే, పోరాట యోధుల పట్ల నాటి పాలకులు, అధికారులు, పోలీస్ బలగాలు ఎంతటి దుర్మార్గంగా వ్యవహరించేవారో అర్థం చేస్కోవచ్చు.

1944లో నర్సింహ్ములు '11వ ఆంధ్రమహాసభ' లో చేరి, సేవలందించి, విస్తృతంగా ప్రజలను చైతన్యం చేసే ప్రచారాల్లో‌ పాల్గొని అనతి కాలంలోనే ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. నాటికి జనగామ పరిసర ప్రాంతాలలో విస్నూరు దొరపై ఉవ్వెత్తున చెలరేగుతున్న ఉద్యమ జ్వాలకు నల్లా నర్సింహ్ములు ఆజ్యం పోస్తూ.. జనగామాలోనే ఆంధ్రమహాసభ సమావేశాలను ఏర్పాటు చేశారు. దీనిని రాంచంద్రారెడ్డి తీవ్రంగా పరిగణించి అరెస్టుల వేట కొనసాగించాడు. నల్లా నర్సింహ్ములు వీరి చేతికి చిక్కకుండా తల దాచుకుంటూ తిరగవలసిన పరిస్థితి ఎదుర్కోక తప్పలేదు. పలువురు సానుభూతిపరులు, సహాయకులు, బంధువుల ఇండ్లల్లో రహస్యంగా సంచరిస్తూ ఉండేవాడు. దొడ్డి కొమురయ్య వీరమరణం తరువాత కొద్ది రోజుల్లోనే నర్సింహ్ములు పోలీసులకు దొరికిపోయినప్పటికీ కొద్ది రోజుల్లోనే ఎంతో చాకచక్యంగా జైలు నుండి తప్పించుకున్నాడు. అంతటితో ఆగిపోకుండా విస్తృతంగా గెరిల్లా పోరాటాల్లో, ప్రజా ఉద్యమాల్లో, కమ్యూనిస్ట్ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నాడు.

నిజాం పై సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన ఆపరేషన్ పోలో - సైనిక చర్య తరువాత హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. ఆ తరువాత అరణ్యాలను దాటి జనజీవన స్రవంతిలోకి వచ్చిన నర్సింహ్ములును సైనికాధికారులు పట్టుకున్నారు.

మూడు ప్రధాన కేసుల్లో నిందితుడిగా, రజాకార్ ఇన్ఫార్మర్లను హతమార్చిన కేసులో నర్సింహ్ములుకి ఉరిశిక్ష ప్రకటించారు., ఇంకా శిక్ష అమలు కాకముందే, తరువాత కొంత కాలంలోనే ప్రభుత్వం పలువురిని అరెస్ట్ చేసి ఉరిశిక్ష అమలుకి సన్నద్ధమైనది, అయితే అందులో ఇద్దరు యువకులు కూడా ఉన్నారు. నాటికి ఇంకా నర్సింహ్ములుకి ఉరిశిక్ష అమలు కాలేదు.. యువకులకు ఉరిశిక్ష అనే విషయంపై సమాజంలో చర్చ మొదలైంది., దీనికి ఆజ్యం పోస్తూ.. టైమ్ మాగజైన్ 'బాలుడికి ఉరిశిక్ష' అనే శీర్షికతో వార్త ప్రచురించింది,. తదుపరి పరిస్థితుల రీత్యా భారీ ఎత్తున నిరసన సెగలు చెలరేగాయి, యువత భారీ ర్యాలీలు చేపట్టడం వంటి పర్యవసానాలు మరియు లండన్ నుండి డి.ఎన్.ప్రింట్ బృందం రాష్ట్రపతి బాబూ జగజ్జీవన్ రావ్ ని సంప్రదించగా, ఆయన స్పందించి ఉరిశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. ఏడేళ్ల సాధారణ శిక్ష అనంతరం   విడుదల అయ్యాడు.

తెలంగాణా సాయుధ పోరాటంలో ఎంతో కీలక పాత్ర పోశించి, తన జీవితనాన్ని త్యాగం చేసి, ఎన్నో పోరాటాలు చేసిన నల్లా నర్సింహ్ములకు తగిన గౌరవం, గుర్తింపు దక్కలేదు. కమ్యునిస్ట్ నాయకులు నర్సింహ్ములు పోరాటాన్ని ఎర్ర జెండాకు వెనుక దాచడమే ఇందుకు కారణంగా భావించాలి. ఆయన పోరాటం‌ జెండా కోసం కాదు, నిజాం రక్కసి పాలన నుండి స్వేచ్చా, దొరల దురాగతాల నుండి విముక్తి తన ఎజెండా.. నేటికైన ప్రభుత్వం, సమాజం, మేధావులు నల్లా నర్సింహ్ములు పోరాట ఉద్యమ స్పూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు కృషి చేయాలని కాంక్షిస్తూ‌..


- డా. ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ
సామాజిక కవి, రచయిత
జాతీయ సాహిత్య పురస్కార గ్రహీత
జనగామ, తెలంగాణ..
సెల్‌: 7416252587












కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత