జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి || డా. మోహనకృష్ణ భార్గవ
"జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి.."
-- ఐదు రోజుల దీపావళి పండుగ విశేషాలతో, ప్రతీ హిందువు తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలతో ప్రత్యేక వ్యాసం..
-- డా. మోహనకృష్ణ భార్గవ
(ఈనెల పద్మ మిత్ర మాస పత్రికలో ప్రచురితమైన వ్యాసం)
భారతీయ వైదిక సంస్కృతిలో అతి ముఖ్యమైనది, ప్రాచీనమైది, తెలుగు ప్రజలకు అత్యంత ప్రధానమైన పండుగ దీపావళి.. ఉత్తరాది దక్షిణాది సాంప్రదాయక సారూప్యత, వ్యత్యాసాలు ఎన్ని ఉన్నప్పటికీ కుల, వర్ణ, వర్గ, జాతి, భాషా భేదం లేకుండా భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా యావత్ దేశ ప్రజలందరూ కలిసి జరుపుకునే ఏకైక పర్వదినంగా దీపావళి నిలుస్తున్నది. ఎన్ని యుగాలు, ఎన్ని లక్షల సంవత్సరాల నుండి ఈ దీపావళి జరుపుకుంటున్నామో చెప్పలేము కానీ సత్యయుగానికి పూర్వమే జరిగిన క్షీరసాగర మథనం నుండి రావణుడిపై విజయానంతరం అయోధ్యకు రాముడి ఆగమనం, నరకాసుర వధ, ప్రజలకు రాక్షసుల నుండి విముక్తి వరకు అనేక పురాణ గాథలు దీపావళి వైభవాన్ని తెలియజేస్తున్నాయి.. కార్తవీర్యార్జునుడి నుండి సగర చక్రవర్తి వరకు నేటి కాకతీయుల వరకు కూడా ఎందరో చక్రవర్తి, సార్వభౌములు ఈ దీపావళి ఉత్సవాలను నిర్వహించినట్లు తెలుస్తున్నది..
శ్లో " దీపం జ్యోతిః పరబ్రహ్మా దీపజ్యోతి జనార్ధనః !
దీపో హరతుమే పాపం సంధ్యాదీప నమోస్తుతే !!
ఆధ్యాత్మిక పరంగా ఎన్నో పురాతన, వైదిక విశిష్టతలను కలిగివున్న దీపావళి ప్రతీ ఇంట వెలిగే దీపాల పండుగ.. పిల్లల నుండి ముసలి వరకు కలిసి కేరింతలు వేసే ఆనందాల పండుగ.! నూతన వస్త్రాలు, తీపి పదార్థాలు, బహుమతులు, బంధుమిత్ర పరివార ఆనందోత్సాహాలతో చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, చీకటిపై వెలుగు, అధర్మంపై ధర్మం విజయానికి సంకేతంగా బాణాసంచా కాలుస్తూ శోభాయమానంగా అంబరాన్నంటే సంబరాలతో చైతన్యాన్ని నింపుకునే వేడుక..
దీపం అంటే వెలుగు, ఆవలి అంటే ముంగిట.. శరద్ ఋతువులో వచ్చే ఆశ్వీయుజ మాస అమావాస్యకు ముందు రెండు రోజులు, తరువాతి రెండు రోజులతో, ఐదు రోజుల పాటు తమ గృహాలను, వ్యాపార సముదాయాలను, దేవాలయాలను, పురవీధులను నానావర్ణ చిత్ర రంగవల్లికలతో, తోరణాలతో, పుష్పాలతో అలంకరించి.. కష్టాలు, కన్నీల్లు, బాధలు, సమస్యలు, నష్టాలు వంటి గతాన్ని, దారిద్ర్యమనే అలక్ష్మిని సాగనంపి.. మనిషి జీవితంలో అలుముకున్న అజ్ఞానమనే అంధకార అమావాస్య చీకటిలో జ్ఞానమనే జ్యోతిని వెలిగించి.. ధర్మ, అర్థ కామ్య మోక్షాలను సాధించే దిశగా భవిష్యత్తు వైపు అడుగులు వేస్తూ.. భోగభాగ్యాలను అష్టైశ్వర్యాలను పొందేందుకు వాకిట దీపకాంతులతో మహాలక్ష్మీకి స్వాగతం పలికే దేదీప్య శోభావళి.. దీపావళి..
శ్లో" శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః !
శతృబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే !!
పరమాత్మ స్వరూపమైన దీప జ్యోతి విశ్వానికి ఏవిధంగా అయితే అనంత శక్తిని, సామర్థ్యాన్ని అందిస్తున్నదో.! అదే విధంగా మన జీవితాల్లో చీకట్లను తొలగించి, వెలుగు నింపి సకల శుభాలను ఆరోగ్య ఆయుష్య ఐశ్వర్య ధన కనక వస్తు వాహనాది సకల సంపత్ సమృద్ధి కలిగిస్తుంది, శతృవుల ఆలోచనలను నాశనం చేసి, విజయాన్ని, భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది..
దీపావళి ఐదు రోజుల పండుగ.! ప్రతీ రోజుకు ఒక ప్రత్యేకత దాగి వున్నది. ఈ ఐదు రోజులు దీక్షాక్రమంలో దేవతారాధన జరుపుకోవాలి.. సమస్త విశ్వానికి కాంతిని, శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించే ఈ ఐదు రోజులు మహాలక్ష్మిని ఆరాధించి, శక్తి, సంపత్, భాగ్య, విజయ, జ్ఞాన సముపార్జన సాధిస్తారు..
మొదటి రోజు ధనత్రయోదశి :
ఇదే రోజున క్షీరసాగర మథనంలో అమృత కలశంతో విష్ణు అంశావతారం, ఆయుర్వేద పితామహుడు, వైద్యానికి అధిష్టాన దైవమైన ధన్వంతరి ఉద్భవించాడు. ఈ రోజున ఆయుష్షు ఆరోగ్యాలను కాంక్షిస్తూ.. తులసీ, గోవులను, ఔషదులను, ధన్వంతరి పూజ నిర్వహిస్తారు. ఆయుర్వేద వైద్యులు మరియు ఆయుష్య ఆరోగ్యాలను కాంక్షించేవారు ఈ రోజున ధన్వంతరీ సార్థవ్రతాన్ని నిర్వహిస్తారు.
ఈ రోజు నుండి మూడు రోజులపాటు శ్రీ మహాలక్ష్మీని ఆరాధిస్తారు.. సాయంకాలం దీపాలు వెలిగించి మహాలక్ష్మీ పూజతో దీపావళి ఉత్సవాలను ప్రారంభిస్తారు.
బంగారం, విలువైన లోహాలను, వస్తువులను కొనుగోలు చేయడం చేస్తారు.. గృహాల్లో కలశ స్థాపన చేసి లక్ష్మీ కుబేర పూజలు నిర్వహిస్తారు.. ఉత్తరాదిలో ధన్తేరస్ అని ఉత్సవాలను నిర్వహిస్తారు,
రెండవ రోజు నరక చతుర్దశి :
వరాహమూర్తి భూదేవి సంతానంగా నరకాసురుడు జన్మించాడు. అతడు తపస్సుతో దేవదానవ యక్షరాక్షసులు ఎవరితోనూ మరణం లేకుండా వరం పొందాడు. వరగర్వంతో విచక్షణ మరచి దేవతలను అణచివేసి, అనేక రాజ్యాలను గెలచి పదహారు వేలమంది స్త్రీలను అపహరించాడు. అతడి నుండి ప్రజలకు విముక్తి కలిగించేందుకు కృష్ణుడు సత్యభామా సమేతంగా యుద్ధానికి బయల్దేరాడు, యుద్ధంలో కృష్ణుడు అలసిన సందర్భంలో భూదేవి అంశైన సత్యభామ స్వయంగా యుద్ధం చేసి నరకాసురుడిని వధించింది.
నరక చతుర్దశి అంటే నరకలోకం నుండి విముక్తి పొందుటకు కేటాయించిన రోజు.. పాపకర్మలతో నరకంలో చిక్కిన పూర్వీకులకు ఆత్మశాంతి, ముక్తి కలిగించేందుకు వారి ఆత్మకు శాంతి చేకూర్చేందుకు నరక చతుర్దశి పూజలు నిర్వహిస్తారు.
శ్లో " నీరాజయేయు దేవాంశ్చ విప్రాన్ గాశ్చ తురంగమాన్ !
జ్యేష్ఠాన్ శ్రేష్ఠాన్ జఘన్యాంశ్చ మాతృ ముఖ్యాశ్చ యోషితః !!
అనారోగ్యం, అపమృత్య భయము, స్వర్గ నరక భయము ఉన్నవారు తిల తైల అభ్యంగన స్నానం ఆచరించాలి.. సూర్యోదయాత్ పూర్వమే నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసి.. ఆరాధనలో భాగంగా దేవతలకు, ఋషులకు, పండితులకు, గోవులకు, తల్లితండ్రులకు, పెద్దలకు శ్రేష్టులకు నీరాజనమిచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి.. అనంతరం యమాయ నమః, యమం తర్పయామి..! అంటూ యమతర్పణాదులు సమర్పించాలి..
పితృపక్షంలో భూమిపైకి వచ్చిన పితృదేవతలకు అక్షయ, స్వర్గ, పుణ్యలోకాలకు దారిచూపుతూ సాయంకాలంలో దీపాలు వెలిగించి ఆకాశమార్గం చూపాలి.. యమదీపం వెలిగించి, మృత్యుదేవత అనుగ్రహం పొంది అకాల మరణాల నుండి విముక్తి పొందుతారు..
శ్లో" తతః ప్రదోష సమయే దీపాన్ దద్యాన్మనో రమాన్ !
దేవాలయే మఠే వాపి ప్రాకారోద్యాన వీధిషు !
గోవాజిహస్తి శాలయా మేవం ఘస్రత్ర యే పిచ !
తులా సంస్థే సహస్రాంశౌ ప్రదోషే భూత దర్శయోః !
ఉల్కాహస్తానరాః కుర్యుః పిత్రూణాం మార్గదర్శనం !!
నరక చతుర్దశి మొదలుకొని సాయంకాలంలో దివ్యమైన దీపాలను దేవాలయ ప్రాంగణంలో, మఠాలలో, ఆశ్రమాలలో, గోశాల గజశాల అశ్వశాలల్లో, వీధులలో, వాకిట ద్వారముల ముందు, ప్రాకారాల వెంబడి విస్తారంగా అనేక దీపాలను వెలిగించాలి..
మూడవ రోజు దీపావళి :
క్షీర సాగరమథనం - శ్రీ లక్ష్మీ ఉద్భవించిన రోజు..
తొలుత భృగు మహర్షి పుత్రికగా ఖ్యాతీదేవి గర్భంలో జన్మించిన శ్రీ లక్ష్మీ, మహా విష్ణువుని వివాహమాడి శ్రీ మహాలక్ష్మిగా యావత్ దేవ మానవులకు శ్రీ భాగ్య ప్రదాతగా సంపదలను ప్రసాదిస్తున్నది. ఒక సందర్భంలో దూర్వాస మహర్షి, విద్యాదరి అనే అప్సరస ద్వారా స్వర్గపు పుష్పహారాన్ని పొందాడు, దానిని ఇంద్రుడికి గౌరవంగా బహూకరించాడు. ఆ దివ్య పుష్పమాలను వినయంతో స్వీకరించిన ఇంద్రుడు తన ఐరావతం శిరస్సుపై ఉంచాడు, అది గాఢమైన సువాసన కారణంగా తొండంతో తీసి నేలన వేసింది. అది చూసిన దూర్వాసుడు ఆగ్రహానికి లోనయ్యాడు, శ్రీ భాగ్యం, శక్తి, ఆధిపత్యం కారణంగా అహంకారంతో తనను అవమానించిన ఇంద్రుడిని దూర్వాసుడు మూడు లోకాలపై ఆధిపత్యాన్ని, సమస్త సంపదలను, శక్తిని కోల్పోతావని శపించాడు.
ఋషి శాప విముక్తి కోసం సంపదలకు, భాగ్యాలకు, విజయాలకు అధిష్టాన దేవత అయిన మహాలక్ష్మి క్షీరసాగరంలో చేరింది. దేవదానవులు అమరత్వాన్ని కలిగించే అమృతం, శక్తి, సంపదలు కోసం క్షీరసాగర మథనాన్ని జరిపారు. అందులోనుండి శ్రీ మహాలక్ష్మి ఉద్భవించి మహావిష్ణువుని పరిణయమాడింది.. తిరిగి దేవతలు శక్తిని, సంపదలను పొంది యావత్ దేవతాలోకం హర్షించి ఉత్సవాలను జరుపుకుంది.. నాటినుండి యావత్ దేవ ఋషి మనుష్య యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులందరూ ఇదే రోజున లక్ష్మీ నారాయణుల ఆరాధన జరుపుతారు..
అయోధ్యలో సంబరాలు..
త్రేతాయుగంలో పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసంలో సమస్త ప్రపంచాలను హింసిస్తున్న రావణాసురుడిని విజయ దశమి రోజున సంహరించి అమావాస్య రోజున హనుమత్ లక్ష్మణ పరివార సమేతంగా సీతారామచంద్రస్వామి అయోధ్య చేరుకున్నాడు. రాముడి రాకతో పరవశించిన ప్రజలు గృహాలను, దేవాలయాలు, పురవీధులన్నిటిని దీప వెలుగులతో నింపగా దేవతలు పుష్పామృత వర్షాన్ని కురిపించగా, మంగళవాయిద్యాలతో, బాణాసంచా మెరుపులతో, చెడుపై మంచి చారిత్రాత్మక విజయానికి ప్రతీకగా అంబరాన్నంటే సంభరాలతో స్వాగతం పలకి తమ భక్తిని, సంతోషాన్ని చాటిచెప్పారు.. నాటి నుండి రాముడి ఆగమనానికి ప్రతీకగా దీపావళి ఉత్సవాలను, సంభరాలను జరుపుకుంటున్నారు..
నరకాసుర వధ..
ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా నరకాసురుడిని చతుర్దశి రోజున వధించి సమస్త లోకాలకు రాక్షస పీడనుండి విముక్తి కలిగించాడు.. పదహారు వేల మంది స్త్రీలను చేరబట్టినవాడు పుత్రుడైన అయినా క్షమించకుండా సంహరించిన సత్యభామ స్త్రీ శక్తికి ప్రతీక.. రాక్షస అంతన్ని పురస్కరించుకొని యావత్ దేవ మానవ లోకాలకు వేడుకలు నిర్వహించారు.. అదే దీపావళి..
అనేక చారిత్రక ప్రాముఖ్యతలను కలిగివున్న దీపావళిని ప్రజలందరూ ఎంతో వేడుకగా జరుపుకుంటారు. తమ గృహాలను, వ్యాపార సముదాయాలను, దేవాలయాలను, వీధులను రంగవల్లికలతో, పుష్పాలతో, తోరణాలతో సుమనోహరంగా అలంకరిస్తారు. ఆవుపేడతో వాకిలి అలుకుట ద్వారా అలక్ష్మీ (దారిద్ర్యం) తొలగిపోతుంది, పాదముద్రలతో మహాలక్ష్మికి స్వాగతం పలుకుతారు..
సూర్యదయానికి పూర్వమే అభ్యంగన స్నానము చేసి, నూతన వస్త్రాలు ధరించి, దేవతలను ఆరాధిస్తారు, అనంతరం తమ తల్లిదండ్రులను, పెద్దలను పూజించి ఆశిస్సులు స్వీకరిస్తారు. సాయంకాలంలో దీప ప్రజ్వలన చేసి తమ గృహాలన్నిటిని దీపాలతో అలంకరిస్తారు.
దీప వెలుగుల్లో అష్టలక్ష్మీ సహితంగా..
"లక్ష్మీర్యా లోకపాలానాం..!
లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం..!
సిద్ధ లక్ష్మీ, మోక్ష లక్ష్మీ, జయ లక్ష్మీ..!
హిరణ్యవర్ణాం హరిణీం.. అంటూ..
అనేక శ్లోకాలు, స్త్రోత్రాలతో సువర్ణంతో లక్ష్మీ కుభేర పూజలు నిర్వహిస్తారు.. అభివృద్ధిని, ఐశ్వర్యం, శ్రేయస్సు, విజయం, సంపదలను కాంక్షిస్తూ తమ వ్యాపార సముధాయాల్లో సైతం అష్ట లక్ష్మీ పూజలు జరుపుకుంటారు. తీపిపదార్థాలు పంచుతూ, బాణాసంచా కాలుస్తూ అంబరాన్నంటే రీతిలో సంభరాలు జరుపుకుంటారు.
తెలంగాణా ప్రాంతంలో ఈ రోజున దాదాపుగా ప్రతీ గ్రామంలోనూ ప్రజలు ఇంటింటా శ్రీ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు. ఇది గ్రామీణ సాంప్రదాయాల్లో గొప్ప శోభను సంతరించుకున్న పూజ..
నాలుగవ రోజు బలి పాడ్యమి :
కార్తీక మాసంలోని తొలిరోజుని బలిపాడ్యమిగా జరుపుకుంటారు.. సంవత్సరానికి ఒకరోజు భూమిపై సంచరించేందుకు బలి వరప్రదానం పొందాడు.. ఈ రోజున పరమ విష్ణు భక్తుడైన బలి చక్రవర్తిని ఉద్దేశించి ఏ దానము చేసిన అనంత పుణ్యఫలితాలను ఇస్తుంది. అలాగే భోజన దానము, వస్త్రదానము, దీపదానము విశేషమైనదిగా పరిగణిస్తారు. విష్ణు పూజ, గోవర్ధన పూజ, గోపూజ నిర్వహించి సాయంకాలం దీపాలు వెలిగించే వారి ఇంట లక్ష్మీ స్థిరంగా ఉంటుంది..
ఈ రోజున నూతన దంపతులకు నూతన వస్త్రాలంకరణ, ఒడినింపే ఆచారం తెలంగాణా ప్రత్యేకమని చెప్పాలి, ఈ సంస్కృతులు సమృద్ధి కి సూచకంగా నిలుస్తాయి.
ఐదవ రోజు యమద్వితీయ :
శ్లో "కార్తికేతు ద్వితీయాంయా శుక్లాయాం భ్రాతృపూజనం!
యా నకుర్యాత్ వినశ్యంతి భ్రాతరస్సప్తజన్మసు!!
రాఖీ పండుగ తరువాత సోదరీ సోదరులకు అంతే విశేషమైన పండుగ భగినీ హస్త భోజనం.. పూర్వం యమధర్మరాజుకి సోదరి అయిన యమున అన్నపై ప్రేమతో ఎన్నో సంవత్సరాలు తన గృహానికి సోదరుడి రాకకై నిరీక్షించింది. కార్తీక విదియ రోజున విచ్చేసిన యముడికి సోదరి అభిమానంతో.. ఎంతో విశేషంగా ఆతిథ్యాన్ని ఇచ్చి, భోజనము పెట్టి, సపర్యలు చేసింది.. సంతోషంతో ఏ వరం కావాలో కోరుకోమని యముడు అడుగగా.. అందుకు యమున ఈ రోజున ఏ సోదరుడు అయితే సోదరి ఇంటికి వెళ్లి సొదరి చేతి భోజనం చేస్తారో.. వారికి అకాల మరణాలు తొలిగి, పరిపూర్ణ ఆయుష్షు ఆరోగ్యాలతో వర్థిల్లాలని కోరుతుంది.. కనుక ఈ రోజున సోదరీసోదరుల పర్వదినంగా జరుపుకుంటారు..
ఈ విధంగా ఐదు రోజులు, ఐదు ప్రత్యేకతలతో మనముందుకు వస్తుంది దీపావళి.. పౌరాణిక చరిత్రని, అందులో దాగిన రహస్యాలను తెలుసుకుని, జీవితంలో నెలకొన్న అంధకారాన్ని పటాపంచలు చేసి దీపకాంతులతో సంతోషాలకు స్వాగతం పలుకుదాం...
జ్యోతిష్య రత్న, శిరోమణి, మహర్షి, పురోహిత సార్వభౌమ
డా. ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ
సామాజిక కవి, రచయిత, పండితులు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి