పితృ అమావాస్య | మహాలయ అమావాస్య
మహాలయ అమావాస్య.. పితృ అమావాస్య (పితర/పెతర) అమావాస్య..
మరణించిన మన పితృదేవతలను (పెద్దలను) స్మరించుకోవడానికి కేటాయించిన సాంప్రదాయక రోజు..
సాధారణంగా ఈరోజున మహాలయ పక్ష శ్రాద్ధ కర్మ నిర్వహిస్తారు.. అంటే మరణించిన వారి పేరిట తిల తర్పణాలు (నువ్వులు, దర్బలు, నాణేలు కలిపి గోత్ర నామాలతో తర్పణాలు విడుస్తారు), పితృకార్యాలు (పిండ ప్రదానం వంటివి) నిర్వహించాలి.. వ్యక్తి మరణించిన మాసంలోని తిథుల రీత్యా కర్మలు నిర్వహించినా కూడా.. ఈ మహాలయ పక్షంలోని అమవాస్య రోజున ఇచ్చే తిలతర్పణాలు, దానాలు మరింత విశిష్టమైనవిగా పరిగణిస్తారు.. అంటే తిథికార్యం సంవత్సరీకాలు చేసినా కూడా మరింత విశేష పుణ్యఫలితాల కోసం మహాలయ పక్ష శ్రాద్ధం, కర్మలు నిర్వహిస్తారు..
పూర్వం.. మహాలయ పక్షంలో విశేష దానాలు (వస్త్ర, ధాన్య, ధన, స్వర్ణ, గో, భూదానాలు వంటివి) దశదాన, షోడశ దానాలు నిర్వహించేవారు.. ఇది హిరణ్య/ఆమ మహాలయ శ్రాద్ధాలుగా పిలిచే ఉన్నత కర్మ.. అంటే గతించిన పెద్దల ఆత్మ సంతృప్తి, ముక్తి, కైవల్య ప్రాప్తి కొరకు సశాస్త్రీయ వైదిక క్రియ.. పుణ్యలోకాలలో వారి పెద్దలకు ఆయా వస్తువులు పుష్కలంగా లభించాలని వారి భావన.. ఆహారం, నీరు, చెప్పులు, గొడుగు, దీపం వంటివి లోటులేకుండా.. అది కాలక్రమంలో కేవలం అన్నసమారాధన (అన్నదానం)తో ముగించేసారు..
దీనిని వివరిస్తూ.. ఒక కథ కూడా ఉంది..
దాన వీర కర్ణుడిగా పెరొందిన కర్ణుడు మరణించి పుణ్యలోకాలకు పయనమైనపుడు ఆకలి దప్పిక వేసి.. దగ్గరలోని చెట్టు ఫలాలను తాకాడట అవి వెంటనే బంగారంగా మారాయి.. దాహంతో నీటిని ముట్టుకున్నాడు కొలను అంతా బంగారంగా మారింది.. అది చూసి ఆశ్చర్యానికి లోనయి.. ఏమి చేయాలో తోచక స్వర్గాధిపతి దేవేంద్రుడిని వేడుకున్నాడట.. అందుకు ఆయన..! కర్ణా.. నీవు జీవితం చివరి క్షణం వరకు కూడా గొప్ప గొప్ప వస్తువులను, భూమిని, బంగారాన్నే దానం చేసావు కానీ.. మీ పితృదేవతల పేరిట అన్నసమారాధన (అన్నదానం) చేయలేక పోయావు.. అందుకే నీకు ఆహారం లభించట్లేదు అన్నాడట.. అది విని వెంటనే తనకు ఒక అవకాశం కల్పించమని వేడుకున్నాడట.. ఇంద్రుడు మహాలయ పక్షంలో పదిహేను రోజులు భూమి మీద ప్రజలకు అన్నదానం చేయమని పంపించాడట.. అదే విధంగా విస్త్రుతంగా అన్నదానాలు చేసి తిరిగి స్వర్గాన్ని చేరుకున్నాడు కర్ణుడు..
అంటే.. ఈ కథ ద్వారా తెలిసే నీతి.. అన్ని దానాల కన్నా అన్నదానము మిన్న అనే నానుడి నిజమైనది.. కాబట్టి.. మహాలయ పక్షంలో చేసే దానాలు విశేషమైన పుణ్యఫలితాలను కలిగిస్తాయి.. ఈ కాలంలో మనం ఏ దానాలు అయితే పుష్కలంగా చేస్తామో.. మన పూర్వీకులకు అవి అంతే స్థాయిలో దక్కడమే కాకుండా మన మరణానంతరం కూడా మనకు అవి పుష్కలంగా లభిస్తాయి..
ప్రస్తుత కాలంలో అన్నదానాలు చేయలేని పరిస్థితుల రీత్యా.. బ్రాహ్మణులు, పండితులు, పౌరోహితులు భోజనానికి రాలేరు కనుక.. ఆ భోజనానికి సరిపడే గ్రాసాన్ని సమకూర్చుతారు.. దీన్ని 'స్వయంపాకం' అని పిలుస్తారు.. పౌరోహితులే స్వయంగా వండి తినడానికి భోజనానికి సరిపడే అన్ని వస్తువులను పెద్దల పేరిట దానం చేస్తారు.. ఇది పూర్తి అన్నదాన ఫలితాన్ని ఇవ్వగలదు.. అందుకే దానం చేయడానికి ముందుగా నాణ్యమైన ధాన్యాలను, వస్తువులను, కూరగాయలను సమకూర్చుకోవాలి అంతేకానీ పనికిరాని పదార్థాలు ఇస్తే అది దానం అనబడదు.. ఎవరి శక్తి అనుసరించి వారు ఇచ్చేది తృణమైనా భక్తితో సమర్పించాలంటారు.. మొహమాటానికి పౌరోహితుడు స్వీకరించినా కూడా అది తరువాత ఏ చెత్త కుప్పలోనో దర్శనమిస్తుంది.. పురోహితుడు భోజనాన్ని స్వీకరిస్తేనే అన్నదాన ఫలితం అని గుర్తుంచుకోవాలి.. అలాగే దానం చేసిన తరువాత తప్పకుండా ఒక పూట అయినా వంట చేసుకుని తినమని పౌరోహితుడిని అభ్యర్థించాలి..
కనుక.. ప్రతీ ధార్మిక కుటుంబీకులు తప్పకుండా రేపటి మహాలయ పక్షాన్ని సద్వినియోగ పరచుకోండి..
మీ.. ఆచార్య..
డా. మోహనకృష్ణ భార్గవ
శ్రీ హనుమత్ రామనాథ సహిత
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం..
జనగామ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి