ఆచార్య దేవో భవ - గురు (వ్యాస) పౌర్ణమి
"ఆచార్య దేవో భవ - గురు (వ్యాస) పౌర్ణమి ప్రత్యేక వ్యాసం"
"ఆచార్య దేవో భవ" భారతీయ సనాతన సంస్కృతిలో గురువుకు గొప్ప స్థానమున్నది. జన్మనిచ్చిన తల్లి తండ్రుల తరువాత విద్య, జ్ఞానము బోధించి ద్విజుడిగా తీర్చిదిద్ది, రెండవ జన్మని ప్రసాదించిన పరమపూజ్యుడిగా నిలుస్తున్నాడు గురువు. మనిషి జననం నుండి మరణం వరకు ఏదో ఒక కొత్త విషయాన్ని అన్వేషిస్తూ, నిరంతరం సాధనకై పరితపిస్తూ ఉంటాడు. అది సామాజిక అంశమైనా, ప్రత్యక్షంగా కనిపించే భౌతిక పరిశోధనైనా, ఆత్మకు సంబంధించిన భగవత్ ఆధ్యాత్మిక జ్ఞానమైన కావచ్చు, దానిని సాధించడానికి అనుభవ నిష్ణాతుడి మార్గదర్శన తప్పనిసరి, మనం జ్ఞానాన్వేషణలో ఎవరినైతే ఆశ్రయిస్తామో అతడే గురువు. అతడు విద్యార్థికి మార్గదర్శి, పరిపూర్ణమైన జ్ఞానము కలిగి, త్యాగశీలతతో అనంత విద్యను దానం చేసే ఆదర్శవంతమైన స్పూర్తిప్రదాత, సృష్టి స్థితి లయలకు మూలమైన వాస్తవిక తత్వాన్ని బోధించే ఆచార్యుడు..
" గురు బ్రహ్మ, గురుర్ విష్ణుః, గురు దేవో మహేశ్వరః !
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః !! "
వైదిక సంస్కృతిలో గురువే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, సాక్షాత్తూ పరమాత్మ స్వరూపంగా భావిస్తారు.
(పద్మమిత్ర మాస పత్రిక జులై నెల ఎడిషన్ లో ప్రచురితమైన ప్రత్యేక వ్యాసం..)
శ్లో" అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం !
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః !!
సమస్త విశ్వాన్ని, చరచార జగత్తును ఆకాశంలా వ్యాపించి దర్శనమిస్తున్న గురువుకు, అజ్ఞాన తిమిరాంధకారాలను పటాపంచలు చేసి జ్ఞాన నేత్రాలను తెరచే గురువుకు ప్రణమిల్లుతున్నాను.
శ్లో" న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః !
తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః !!
గురువుని మించిన తత్వం లేదు, గురువుని మించిన తపస్సు లేదు, గురువు బోధనలకంటే గొప్ప జ్ఞానము లేనే లేదు, అటువంటి గురువుకు నమస్కారములు..
శ్లో " న స్నానేన న మౌనేన, నైవాగ్ని పరిచర్యయా !
బ్రహ్మచారీ దివం యాతి, సయాతి గురు పూజనాత్ !!
స్నానాది శౌచక్రియలు, అనుష్టానములు, మౌనవ్రతములు, అగ్ని హోత్రాది కర్మలు ఆచరించడం వలన విద్యార్థులు విద్యను, జ్ఞానమును పొందలేరు, కేవలం గురు పూజ ద్వారా మాత్రమే జ్ఞానాన్ని పొందగలరు..
ఇలా దేవతలకు సమానంగా, మరోమాటలో చెప్పాలంటే దేవతలకంటే ఉన్నత స్థానాన్ని గురువుకు ఇస్తారు. గురువు, దైవము ఒకేసారి ఎదురుపడితే ముందుగా గురువుకే నమస్కరించాలి, అపుడే భగవంతుడు కూడా ఆనందిస్తాడు ఇదే సనాతన సంస్కృతిలోని గొప్పదనం..
నిజానికి మన కంటిముందు సమాన్యంగా కనబడుతున్న గురువు, ఇంతటి అసామాన్య పరమాత్మ స్వరూపం ఎలా కాగలడు.? అసలు గురువు అంటే అర్థమేమిటి.? గురు శిష్యుల బంధమేమిటి.?
గురువు : 'గు' అంటే అంధకారం, 'రు' అంటే తన్నిరోధకం.. జన్మజన్మల కర్మ ఫలితాలను అనుభవిస్తూ గాఢమైన అంధకారంలో పడి కొట్టుమిట్టాడే జీవుడికి చీకటి మార్గంలో దీపం వెలుగులా మోక్ష, జ్ఞానాల వైపు నడిపించే కరదీపిక వంటివాడు గురువు. "తమసోమా జ్యోతిర్గమయా" శిష్యుడి జీవితంలో జ్ఞానమనే వెలుగు నింపేవాడు గురువు.
గురువు అనే పదము సామాన్యమైనది కాదు, గురువు అంటే కేవలం కంటి ముందు కనబడుతున్న మానవ స్వరూపము అసలే కాదు, తాత్విక దృష్టితో పరిశీలిస్తే ఋషిపరంపరా గతమైన ఆధ్యాత్మిక చైతన్యం, జ్ఞాన స్వరూపానికి ప్రతీకగా గురువు కీర్తించబడుతున్నాడు.
శ్లో" నారాయణ (సదాశివ) సమారంభాం వ్యాస శంకర మధ్యమాం !
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం !!
ఈ సనాతన వైదిక గురుంపరలో గురువు అనే శబ్ధానికి నారాయణుడు, సదాశివుడు మూలపురుషులుగా ఉంటారు. వీరి తరువాత బ్రహ్మ, దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, దేవగురు బృహస్పతి, దైత్యగురు శుక్రాచార్యుడు ఆది గురువులుగా నిలుస్తారు. తరువాతి వరుసలో భృగువు, వశిష్ఠాది మహర్షులు, వేదవ్యాసుడు, ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మద్వాచార్యుల వంటివారు పరంపరా మధ్యములుగా.. మనకు ప్రత్యక్షంగా విద్యను, జ్ఞనాన్ని, ధర్మాన్ని ఉపదేశించి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించే ఆచార్యుడి వరకు ఈ గురుపరంపర కొనసాగుతుంది. ఇందులో శైవ, వైష్ణవ, మధ్వ, శాక్తేయ, దత్త అవధూత వంటి అనేక గురుపరంపరలు ఉంటాయి. మనకు కనబడుతున్న గురువుకు నమస్కరిస్తే యావత్ గురుపరంపరలోని దైవ, ఋషి, ఆచార్యులకు చెందుతుంది. కనుక శిష్యుడికి గురువే ప్రథమ పూజనీయుడు.
గురువుల్లో రకాలు : సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, వైదిక గురువు, కామ్యక గురువు, ప్రసిద్ధ దేశిక గురువు, నిషిద్ధ గురువు, విహిత గురువు, కారణ గురువు, పరమ గురువు, పరమేష్ఠి గురువు.. ఇలా పలు రకాలుగా గురువులను విభజించారు..
లౌకిక దృష్టిలో వీక్షిస్తే మనకు జన్మనిచ్చిన తల్లి మొదటి గురువు, నడక నేర్పిన తండ్రి రెండవ గురువు, విద్య నేర్పిన అధ్యాపకుడు మూడవ గురువు, ఆత్మ -ఆధ్యాత్మిక జ్ఞానము బోధించినవారు నాలుగవ గురువు, కష్టకాలంలో చేయందించి మార్గాన్ని చూపినవాడు ఐదవ గురువు ఇలా ఏది చేయాలో పాఠం చెప్పే మిత్రుడు గురువే, ఏది చేయకూడదో గుణపాఠం చెప్పే శత్రువు కూడా గురువే, నిషిద్ధ అనైతిక వ్యసనాలను నేర్పేవాడు కూడా గురువే ఇలా మన ధర్మ శాస్త్రంలోనే పలు రకాలుగా గురువులను విభజించారు. ఉదా: మిత్రుడైన కృష్ణుడు గీతను బోధించి అర్జునుడికి గురువయ్యాడు, బంధువైన శకుని దుర్యోధనుడికి దుష్టసూచనలతో మార్గదర్శకుడయ్యాడు. ఇద్దరూ గురువులే ఒకరు ధర్మం వైపు మరొకరు అధర్మం వైపు నడిచారు.
మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు మన లక్ష్యానికి మార్గం చూపి సహకరిస్తుంటారు. అనేక లౌకిక విద్యలను బోధించేవారు, జీవనోపాధి కోసం సహకరించేవారు, ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడానికి, జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి, మలిన పాపాలనుండి విముక్తి కలిగించేవారు, వారందరూ గురు సమానులే.. ఎపుడు ఎవరు ఎక్కడ ఎలా మనకు గురువుగా సాక్షాత్కరించి జీవితాన్ని మలుపు తిప్పుతారో ఊహించలేము. కానీ ఆచార, అనుష్టాన, ధర్మ, మోక్ష, వేద, ఆధ్యాత్మిక జ్ఞానదానం చేసినవాడే పరమగురువు అవుతాడు.
శ్లో" నమస్తే నాథ భగవాన్ శివాయ గురు రూపిణే !
విద్యావతార సంసిద్ద్యై స్వీకృతానేక విగ్రహః !!
నాకు విద్యా జ్ణానాన్ని బోధించేందుకు సాక్షాత్తూ పరమాత్ముడే గురు రూపంలో అవతరించి, నాథుడై, నాయకుడై నన్ను నడిపిస్తున్నాడు. నాకు విద్యను, జ్ఞానాన్ని సిద్ధింపజేసేందుకు విద్యావతారమూర్తిగా అనేక రూపాల్లో దర్శనమిస్తూ నాలో చైతన్యాన్ని నింపుతున్నాడు..
శ్లో" శోషణం పాప పంకస్య దీపనం జ్ఞాన తేజసః !
గురు పాదోదకం సమ్యక్ సంసారార్ణవ తారకమ్ !!
మామూలు మరకలను తొలగించుకోవడానికి ఎంతో కృషి చేయాలి, అలాంటిది మనస్సుకు మలినాన్ని, ఆత్మకు అంటిన పాప భారాన్ని తొలగించుకోవడం సాధ్యమా.? కానీ కేవలం గురువు యొక్క పాద స్పర్శ, పాద జలాన్ని శిరస్సుల జల్లుకోవడం ద్వారా పాపపంకిలం పటాపంచలు కాగలదు. మనషిలో జ్ఞాన జ్యోతిని వెలిగించి, సునాయాసంగా సంసారమనే సాగరాన్ని దాటించగలిగేది గురుకృపమాత్రమే..
శ్లో" గురుసేవ గయా ప్రోక్తా దేహాః స్యాదాక్షయో వటః !
త్వత్పాదం విష్ణుపాదం స్యాత్ తత్ర దత్త మనస్తతమ్ !!
గయా క్షేత్రంలో అక్షయవటవృక్షం వద్ధ, విష్ణుపాదం వద్ద ఏది సమర్పణ చేసినా అక్షయ పుణ్యఫలితాలు కలుగుతాయి. విద్యార్థికి గురుసేవ - గయాక్షేత్రం, గురు శరీరం - అక్షయ వటవృక్షం, గురు పాదం - విష్ణు పాద సమానం, అంతకు మించిన పుణ్యతీర్థమన్నదే లేదు..
శ్లో" ధ్యాన మూలం గురుర్మూర్తిః పూజామూలం గురోః పదం !
మంత్రమూలం గురుర్వాక్యం మోక్షమూలం గురు కృపాః !!
ధ్యానానికి మూలం గురుమూర్తి, పూజకు మూలం గురుపదం, మంత్రానికి మూలం గురువాక్యము, మోక్షానికి మూలం గురుకృప మాత్రమే..
"గురోః ప్రసాదాత్ అన్యత్ర నాస్తి సుఖం మహీతలే" అని గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకంలో నైనా, పరలోకంలోనైనా సుఖం పొందడం దుర్లభం. ఇంతటి మహోన్నత స్వరూపమైన గురువు గురించి వివరించడానికి అక్షరాలు, వర్ణించడానికి పదాలు, కీర్తించడానికి స్తోత్రాలు సరిపోవు. గురువు జ్ఞానియైనా, అజ్ఞానియైనా, ఆడంబరుడైనా, నిరాడంబరుడైనా, నిరుపేదవాడైన, వ్యసనపరుడైనా, దుష్ట ప్రవృత్తి కలిగినవాడే అయినా కూడా మనకు విద్య, వేదము, ధర్మము, జ్ఞానము బోధించి బ్రహ్మ జ్ఞాన సముపార్జనకు దారి చూపినవాడు కచ్చితంగా గురువే అవుతాడు.. ఆ గురువు సాక్షాత్ నారాయణ, సదాశివ, దక్షిణామూర్తి, దత్తాత్రేయ పరంపరా స్వరూపుడే అవుతాడు..
గురు (వ్యాస) పౌర్ణమి :
ప్రాచీన భారతీయ సాహిత్యం, సంస్కృతులకు మూలం భారతీయ తత్వశాస్త్రాలైన శృతులు (వేదాలు), స్మృతులు (ధర్మశాస్త్రాలు), పురాణలు (అష్టాదశ పురాణలు, ఇతిహాసాలు (రామయణం, మహా భారతం), బ్రహ్మ సూత్రాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు.. ఇవి నైతిక విలువలను, సామాజీక జీవన విధానాలను, ధర్మ సూత్రాలను, ఖగోల, న్యాయసూత్ర, అర్థశాస్త్ర, తర్క శాస్త్రం వంటి అనేక మానవ నాగరిక శాస్త్రాలను, అనేకానేక చరిత్రలను, ఆధ్యాత్మిక సూత్రాలను బోధిస్తాయి..
కోట్లాది సంవత్సరాల చరిత్ర కలిగిన వేద వేదాంగ సాహిత్యాన్ని అందించి, అజ్ఞానమనే అనంత శూన్యం నుండి బ్రాహ్మ్యం అనే అనంత జ్ఞానాన్ని అందించిన మహర్షులను.. పరంపరాగతంగా మహర్షులు బోధించిన సూత్రాలను అనుసరిస్తూ బోధిస్తున్న ఆచార్యులను ఆరాధించడానికి కేటాయించిన రోజే.. గురు పౌర్ణమి..
కృష్ణ ద్వైపాయనుడుగా పిలవబడే వేద వ్యాసుడి జన్మ దినోత్సవాన్ని గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. ఆషాఢమాసములో వచ్చే పౌర్ణమి రోజున పరాశరుడు సత్యవతి దంపతులకు వ్యాసుడు జన్మించాడు, వేదాలను విభజించి వేదవ్యాసుడిగా కీర్తించబడ్డాడు..
శ్లో" వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే ! నమోవై బ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమః !!
వ్యాసుడి రూపంలో ఉన్నది విష్ణువే, విష్ణువులో ఉన్నది వ్యాసుడే ఇద్దరు వేరు కాదు, వ్యాసుడే బ్రహ్మజ్ఞాన నిధి.. చిరంజీవులలో ప్రముఖుడు, సనాతన హైందవ సంస్కృతికి మూలమైన వేదాలను విభజించిన మహాద్రష్ట, మహా భారతం, మహా భాగవతం రచించిన అందించినవాడు, అంతేకాదు యావత్ అష్టాదశ పురాణాలను రచించి సమాజానికి అందించినవాడు వ్యాసుడు. అనేక ధర్మశాస్త్రాలను, ఉపనిషత్తులను, వేదాంతము, బ్రహ్మ సూత్రాలను బోధించనవాడు. ఇవే మన వేదాలకు, ధర్మానికి, జ్ఞానానికి సంస్కృతులకు మూలమై విలసిల్లుతున్నాయి. ఇంతటి మహనీయుడు కనుకనే వ్యాసుడు సాక్షాత్ విష్ణువు అంశగా గురుపరంపరలో ప్రముఖుడిగా నిత్యస్మరణీయుడిగా ఆరాధించబడుతున్నాడు.
వేద వ్యాసుడి అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు, సాక్షాత్ భగవంతుడే కృష్ణ ద్వైపాయనుడిగా జన్మించి శృతిస్మృతి పురాణేతిహాసాలను లోకానికి అందించాడు.. ఆయన బాలుడిగా నీలి వర్ణంలో మెరుస్తూ ఉండటం వలన కృష్ణుడని, ద్వీపంలో జన్మంచడం వలన ద్వైపాయనుడని, రెండిటినీ కలిపి కృష్ణ ద్వైపాయనుడని పిలిచారు.. భాగవతం, మహా భారతం రచనల వ్యాసాంగంతో వ్యాసుడిగా, వేదాలను విభజించి వేద వ్యాసుడిగా ఘన కీర్తినొందాడు.. అంతేకాకుండా వేదవ్యాసుడు అంటే ఒక వ్యక్తి కాదు, గొప్ప బ్రహ్మజ్ఞాన స్థానమని, ప్రతీ కల్పంలో వ్యాసుడు మారుతుంటారని కూడా కొందరి అభిప్రాయం.. వ్యాసుడిని ఆరాధిస్తే యావత్ గురుపరంపరని ఆరాధించినట్లే అవుతుంది..
ఇటువంటి వేదవ్యాసుడి జన్మతిథిని పురస్కరించుకొని గురువులను, ఆచార్యులను పూజిస్తారు. ఇది హైందవ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పర్వదినం, కానీ నేటి కాలంలో గురు శిష్య పరంపరలు కనుమరుగవుతున్నాయి. లౌకిక విద్యను నేర్పే అధ్యాపకుడికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుని వదిలేస్తున్నారు తప్పా.. ఈ అనంత జ్ఞానాన్ని వేద, వేదాంత, పురాణ, ఇతిహాస, ఉపనిషత్, ధర్మ సూత్ర, గృహ్య సూత్రాలుగా అందించిన వేదవ్యాసుడి జన్మదినోత్సవాన్ని జరుపుకోలేకపోతున్నారు. ప్రతీ మనిషి జన్మతః దేవ, ఋషి, పితృ ఋణాలను కలిగివుంటారు. ఋషి ఋణాన్ని తీర్చుకోవడానికి ఏకైక మార్గం గురువులను ఆరాధించడమే తప్ప వేరు మార్గం లేదు.
గురు పౌర్ణమి రోజున మన విద్యను, వేదాన్ని, ధర్మాన్ని, జ్ఞానాన్ని బోధించిన ఏ ఆచార్యుడిని అయినా ఆరాధించాలి.. లేదా గురుపరంపరలోని ఎవరిని ఆరాధించిన వ్యాసుడిని, విష్ణువుని గౌరవించినట్లే అవుతుంది. తద్వరా మన ధర్మాచరణ, సనాతన సంస్కృతి పరిరక్షణలో మన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే కాదు, ఋషి ఋణం నుండి విముక్తులమవుతాము, జ్ఞానాన్ని, మోక్షాన్ని పొందగలుగుతాము, భావితరాలకు ఆచారవ్యవహారాలను బోధించినవారమవుతాము..
కనుక తప్పనిసరిగా గురు (వ్యాస) పౌర్ణమి రోజున గురువులను, ఆచార్యులను, పండితులను సత్కరించి, పూజించి, వేదవ్యాస మహర్షిని ఆరాధించి మన హైందవ సనాతన సంస్కృతీ వైభవాన్ని చాటిచెపుదాం..
జ్యోతిష్య రత్న, శిరోమణి, మహర్షి, పురోహిత సార్వభౌమ
డా. ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ
సామాజిక కవి, రచయిత, జ్యోతిష్య పండితులు
జనగామ -7416252587
I would like to thank you for such great post. Your efforts are great and please post like this again. Best Numerologist in India
రిప్లయితొలగించండి