హనుమత్ జన్మోత్సవం - విజయోత్సవం

రేపు హనుమత్ విజయోత్సవం., హనుమత్ జన్మోత్సవం (జయంతి) కాదు.!

హనుమాన్ విజయోత్సవం - 23 ఏప్రిల్ 2024, మంగళవారం..

హనుమాన్ జన్మోత్సవం (జయంతి) - 01 జూన్ 2024, శనివారం..



శ్లో" వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే.! పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే.!!

హనుమ వైశాఖ మాసం, బహుళ పక్షంలో వచ్చే దశమి తిథి రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో.. అంజనాదేవీ - కేసరి  దంపతులకు సాక్షాత్ రుద్రాంశ సంభూతుడై జన్మించాడు..

మరి ఈ హనుమత్ విజయోత్సవమేమిటి.?


హనుమే లేకపోతే రామాయణం సంపూర్ణం కాలేదు.. హనుమే లేకపోతే రావణ సంహారం‌ జరిగేది కాదు.. రామ పట్టాభిషేకం జరిగేది కాదు.!

 రావణ సంహారం జరిగిపోయింది, శ్రీ రామ పరివారం అయోధ్య చేరుకుంది.. సీతాసమేతుడై శ్రీరామచంద్రుడు పట్టాభిషేకాన్ని జరుపుకున్నాడు..

సమస్త లోకం ఆనందంలో మునిగిపోయాయి.. శ్రీ రాముడు ఆలోచిస్తూ.. నేడు ఈ సంతోషానికి కారణం.. హనుమ సముద్రాన్ని లంఘించి లంకను చేరి సీత జాడ అన్వేషించడం, అసాధ్యమైన హిమాలయ పర్వతాల నుండి సంజీవని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుడి ప్రాణాలు కాపాడటం.! ఈ రెండిటిలో ఏది జరుగకపోయినా నేడు ఈ ఆనందం కలిగేది కాదు, శాశ్వత దుఃఖమే లోకాలకు మిగిలేది.! 

ఇలా.. ఎన్మో అద్భుతమైన సేవలు చేసిన హనుమ వల్లనే విజయం సాధ్యమైనదని గుర్తిస్తూ.. సభా వేదికగా శ్రీ రాముడు హనుమను ఆలింగనం చేసుకున్నాడు, ఘనంగా సన్మానించాడు.. 

ఒక పరమ భక్తుడికి స్వామి అనుగ్రహం, ఆలింగనం‌ కంటే పరమ వైభవం,  విజయం ఇంకేముంటుంది.. కనుక ఇది ఒక భక్తుడిగా హనుమ సాధించిన విజయంగా  హనుమత్ విజయోత్సవాన్ని జరుపారు.!

అయితే ఉత్తరాది ప్రాంతాలలో చైత్ర పౌర్ణమి రోజునే హనుమత్ జన్మోత్సవాన్ని జరుపుతారు, అందుకు కారణం‌ లేకపోలేదు.. కొన్ని గ్రంధాలలో హనుమ జన్మస్థలానికి, జన్మ తిథిగి సంబంధించిన వ్యత్యాసాలు కూడా లేకపోలేదు.. 

కానీ "కలౌ పరాశర స్మృతి" కలియుగంలో పరాశర స్మృతి పరమ ఆచరణీయమైనది. పరాశర స్మృతిలో సైతం హనుమ వైశాఖ మాసంలోని బహుళ దశమి, శనివారమే జన్మించాడని తెలుపుతుంది.. ఇక పూర్వం నుండి తెలుగు రాష్ట్రాలలో వైశాఖ మాసంలోనే హనుమ జన్మోత్సవాన్ని జరుపుతున్నారు కూడా.!

తెలుగు ప్రజలు.. చైత్రమాస పౌర్ణమి నుండి వైశాఖ బహుళ దశమి వరకు నలబై రోజులు హనుమత్ మండల దీక్షలు స్వీకరిస్తారు.. హనుమత్ విజయోత్సవం రోజున దీక్షా స్వీకరణ, హనునత్ జన్మోత్సవ తరువాత దీక్ష విరమణ చేస్తారు..

"కలౌ కపి వినాయకౌ" అన్నట్లుగా.. కలియుగంలో హనుమ, గణపతి ప్రత్యక్ష ఫలదాతలు..

చిరంజీవిగా నిత్యం మనమధ్యే సంచరిస్తూ.. "యత్ర యత్ర రఘునాథ కీర్తణం.." ఎక్కడెక్కడైతే రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ ఒక బాలుడిగా చేతులు జోడించి రామనామ భక్తి పారవశ్యంతో ఆనంద బాష్పాలు  చిందిస్తూ.. మనల్ని అనుగ్రహించే.. హనుమ స్మరణ, ధ్యానం, ఆరాధన, పూజ, హవనం, దీక్ష, పారాయణం వంటి ఆరాధనలు విశేష అనుగ్రహాన్ని కలిగిస్తాయి..

బుద్ధిర్భలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతాః.! అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్.!! 

హనుమను స్మరించడం ద్వారా బుద్ధి, బలము, యశస్సు, వర్చస్సు పెంపొందుతాయి, భయం తొలగి ధైర్యం కలుగుతుంది.. అజాఢ్యం తొలిగిపోతుంది, వాక్పటుత్వం, పరిపూర్ణమైన జ్ఞానము లభిస్తాయి.. కనుక హనుమని నిత్యం స్మరించి తరిద్దాం.. జై శ్రీరామ్..!!


డా. మోహనకృష్ణ భార్గవ

జ్యోతిష్య రత్న, శిరోమణి, మహర్షి, పురోహిత సార్వభౌమ

శ్రీ హనుమత్ రామనాథ సహిత శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత