కల్తీ ఓటు | కవిత | మోహనకృష్ణ భార్గవ
" కల్తీ ఓటు "
కవిత - మోహనకృష్ణ భార్గవ
రంగు నోటుతో నల్ల ఓటు గుద్ది
మరో తర భవితని మింగి
సమాజ కాంతిని కాలరాసి
అంధకార వీధిలో ఆనందంగా
పయనించే రాహు..
నోట నోట్లు కుక్కిన
కట్టల 'కాల' సర్పానికి
సలాం కొట్టి టెక్కెం మోసి
వంగి వంగి గులాం జేసి
బానిసత్వ ముద్రలో మగ్గే
అమ్మకానికి అంతరాత్మ..
మింగిన చిల్లర అరగక
పేపరుపై కక్కిన ఇంకు కసరు
కసిగా ప్రచారానికి మద్ధతు పలికి
అంగట్లో సరుకై నిజాన్ని అమ్మి
లక్షణాన్ని కోల్పోయిన అక్షరం..
పథకాలతో పతకం వేసి
పతనానికి బాటలు రాసి
శవాలకు పారాణి పూసి
కసిగా సంసారం చేసే నవాబులు
స్వార్థం తో నిండిన సానుభూతి
ఉప్పెనలా కురిపిస్తూ రాత్రికి రాత్రి
గాల్లో ఎగిరే నోట్ల పక్షులు..
ఇదో జీవిత చదరంగం
బ్రతుకులతో జూదమాడే
రాజకీయ రణరంగం
నువ్వు నేను అతీతులం కాదు
మసిపూసిన నకిలీ ముఖాలు
నవ్వుతూ పలకరిస్తాయి
గొంతుకోసే కసాయి రాబందులు
కమ్మని కబుర్లతో కవ్విస్తాయి..
చీకటి నీడలో
మూసిన తలుపులు
నల్లని పరదాల వెనుక
మకిలి పట్టిన మనసులు
గుసగుసలాడతాయి
కబలించి కాటికి పంపే
పన్నాగాలు పన్నుతాయి..
ఆర్భాట చప్పుడ్లలో
వాగ్ధానాల ప్రతిధ్వనుల నడుమ
నిజానికి సమాధి కడతారు..
కట్టుబాట్లకు కాలం చెల్లి
నిజాయితీ తన నైజాన్ని కోల్పోయింది
అలుముకున్న అగాధానికి
నేలరాలిన మిణుగురుల దివిటీ పట్టి
కానరాని భవిష్యత్తును వెతికే
బూటకపు బాటసారులు..
వేలుకు నీలి రంగుని పూసి
జేబును పచ్చ నోటుతో నింపి
ఎర్రని నెత్తుటిని హత్తుకునే
నికార్సైన ఓటర్ కార్మికుడు
కర్షకుల కడుపు కొట్టి
కార్మికుల శ్రమను దోచి
కులవృత్తుల రెక్కలు విరిసే
ఖద్దరు పావురాలు..
నిజానికి ప్రాణం పోసే
కొత్త కథను రాసే కలానికి
కలలకు ప్రాణం పోసే
చరితను తిరగరాసే కాలానికి
పిలుపులు ఆర్తనాద అరుపులై
కారుచీకట్లను తరిమే కాంతి మెరుపులై
సంస్కరణల జెండా ఎగరేసేందుకు
ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసేందుకు
భవితకు వెలుగును చూపే
ఆశా కిరణానికై తాపత్రయం..
రచన :
డా. ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ
ఎం.ఎ తెలుగు., ఎం.ఎ రాజనీతి శాస్త్రం., ఎం.ఎ తత్వశాస్త్రం..
పిహెచ్‌డి గోల్డ్ మెడలిస్ట్..
సామాజిక కవి, రచయిత
కంటెస్టెడ్ ఎమ్మెల్యే - జనగామ 2018

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి