వర్షపు జల్లులు | కవిత | మోహనకృష్ణ భార్గవ
"వర్షపు జల్లులు"
మోహనకృష్ణ భార్గవ
ఎండిన బతుకులు, పగిలిన గుండెలపై
కరుణించి కురిసే తొలకరి జల్లులకై
ఎదురు చూస్తున్నాం..
కానీ..
ప్రచండ మారుతం విరుచుకుపడుతున్నది..
నీలి మేఘాలు కారుచీకట్లలా
గుడిసెలను కమ్మేస్తున్నాయి..
చీకట్లోకి తోసేస్తున్నాయి..
వాసాలు తడకలు పైకెగసిపడ్తున్నాయి..
నానిన బియ్యపు గింజలు,
వెలగని పొయ్యి దీపం
కడుపుకు బురదంటిన మరకలు,
పూటపూట ఆకలి యుద్ధం..
గుడిసె గుడిసెలను మింగుతున్న
సుడిగుండాలు..
వైరపు వరుణుడి వైఖరి చూసి
నిస్సత్తువతో
ఆకాశం వైపు చూసి రాలుతున్న కన్నీళ్లు..
వర్షాన్ని నిందించలేను,
పేదరికాన్ని భరించలేను..
చలనం లేని సమాజాన్ని అర్థించలేను..
కరుణలేని దైవాన్ని ప్రార్థించలేను..
వర్షపు జల్లుల తొలకరి పలకరింత
పులకరింతలను ఆస్వాదించి
మురిసే శక్తి తాహతు మాకు లేవు..
అందరి పరీస్థితి ఒకటే కాదు..
చిరుజల్లులతో..
కొందరి పెదవులపై చిరునవ్వు విరబూస్తే..
మరికొందరి కంట కన్నీరు జారుతుంది..
ఐనా.. వర్షపు జల్లులను దోసిట్లో పట్టేందుకు..
మనసు చేయి చాస్తుంది.. ఆశతో..
....................
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి