ఆధ్యాత్మిక చైతన్యం - అరుణాచలం | స్మరణాత్ ముక్తిః | క్షేత్ర సమగ్ర విశ్లేషణ | మోహనకృష్ణ భార్గవ

ఆధ్యాత్మిక చైతన్యం - అరుణాచలం 

 అరుణాచల శివ - స్మరణాత్ ముక్తిః


శ్లో॥ దర్శనాత్ అభ్రసదసి, జననాత్ కమలాలయే।
కాశ్యాంతు మరణాన్ ముక్తిః స్మరణాత్ అరుణాచలే ॥


లయకారకుడు, ఈశ్వరత్వం కలిగినవాడు పరమేశ్వరుడు. మనిషి మోక్షగామి., పునర్జన్మ లేనటువంటి శాశ్వత ముక్తిని కోరుకునే వారికి సాక్షాత్తూ పరమేశ్వరుడే ఉపదేశించిన ముక్తి మార్గాలు నాలుగు.. ఒకటి చిదంబరం లింగాన్ని దర్శించడం, రెండు కమలాలయం - తిరువారూర్ లో జన్మించడం, మూడు కాశీలో మరణించడం, నాలుగు అరుణాచల క్షేత్రాన్ని స్మరించడం..

అయితే పుట్టడం, గిట్టడం రెండు భగవంతుడి ఆటలే.! పైగా చిదంబర రహస్యాన్ని ఛేదించి ఆకాశ లింగాన్ని దర్శించడం అన్నది సామాన్యులకు సాధ్యం కాదు కదా.! ఇక ముక్తిని కోరే మానవులకు మిగిలిన ఏకైక మార్గం అరుణాచల క్షేత్ర స్మరణ మాత్రమే.! అందుకే అరుణాచలం ముక్తి మార్గంగా ఆరాధించబడుతుంది.

కేవలం స్మరణ చేతనే ముక్తిని ప్రసాదించే పుణ్యక్షేత్రంగా అరుణాచలం కీర్తించబడుతుంది. అరుణాచల శివ.. అంటూ మూడుసార్లు పలికినంతటనే వేయి సార్లు కాశీ విశ్వనాథ స్వామిని దర్శించిన ఫలితం, కోటిసార్లు గంగానది స్నాన మాచరించిన పుణ్యఫలితాలు కలుగుతాయని పురాణాలు తెలుపుతున్నాయి.

దర్శన మాత్రాన పాపాలను పటాపంచలు చేయగల శక్తి కలిగిన పుణ్యక్షేత్రంగా అనేక పురాణేతిహాస గాథలను, చారిత్రక ఆనవాళ్లను, అనేక వాస్తవిక మాహాత్మ్యాలను అరుణాచలం కలిగి వున్నది.

పరమేశ్వరుడు పంచభూతాత్మకమైన ఐదు క్షేత్రాలలో కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. అగ్ని, ఆకాశము, జలము, పృథివీ, వాయువు అనే పంచభూత తత్వాలతో లింగ రూపకంగా ఈ భూమిపై స్వయంభువుగా వెలసినట్లు వేదశాస్త్రాలు తెలియజేస్తున్నాయి.

అగ్ని - అరుణాచలేశ్వరుడు., ఆకాశము - చిదంబర నటరాజస్వామి., పృథ్వీ - కంచి ఏకాంబరేశ్వరుడు., వాయువు - శ్రీ కాళహస్తీశ్వరుడు., జలము - జంబుకేశ్వరుడు ఈ ఐదు క్షేత్రాలు పంచభూత లింగ క్షేత్రాలుగా ప్రసిద్ధిగాంచాయి.

అరుణాచలం - తిరువన్నామలై :


సాక్షాత్తూ శివుడు ప్రజ్వలించే తేజోరూపక లింగంగా ఉద్భవించిన క్షేత్రం.. శివ భక్తులు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని తపించే క్షేత్రం.. ఎందరికో జ్ఞాన బిక్షనొసగిన క్షేత్రం.. మహర్షులు, సాధువులు, సన్యాసులు నిత్యం స్మరించే క్షేత్రం.. శివ పంచభూత లింగాలలో అగ్ని తత్వాన్ని కలిగిన అత్యంత పరమ పవిత్ర క్షేత్రం అరుణాచలం..

మానవ దేహంలో మణిపూర చక్రం సూర్య, అగ్ని తత్వాన్ని కలిగివుంటుంది, ఈ చక్రానికి అధిపతి రుద్రుడు.. ఈ అరుణాచల క్షేత్రం మణిపూర చక్ర స్థానంగా యోగులు అభివర్ణిస్తారు.

అరుణ - అంటే ఎరుపు లేదా అగ్ని, సూర్యప్రభ అనే అర్థాలు వస్తాయి., అచలం - అంటే గిరి, కొండ అనే అర్థం వస్తుంది. అగ్ని తత్వ తేజో లింగ క్షేత్రం కావటం, కొండ ఎరుపు వర్ణాన్ని కలిగి వుండి, గిరి మెరుస్తూ దర్శనమివ్వడం చేత అరుణాచలం అని పేరొందింది. అరుణై, అన్నామలై, అగ్నిగిరి, అరుణగిరి, ఆనందగిరి, శివగిరి, ముక్తిగిరి, స్వర్ణగిరి, మహాగిరి, ఓంకారాచలం వంటి పేర్లతో పిలుస్తుంటారు. సూర్యుడి కాంతిని మింగి బంగారపు వర్ణంలో మెరిసే కొండ అని భక్తులు ముద్దుగా పిలుచుకుంటారు.

అరుణాచల గిరి ప్రాంగణం అంతా నిత్యం ఆధ్యాత్మిక వాతావరణంలో నిగూఢ శక్తితో నిండి ఉంటుంది, భక్తులు తెలియకుండానే ఏదో తెలియని పారవశ్యానికి లోనౌతుంటారు. నిరంతరం శివనామ స్మరణతో మారుమ్రోగుతుంది. ఆధ్యాత్మిక సాధన, తపస్సు, జ్ఞాన సముపార్జన, ఆత్మజ్ఞానం, ముక్తి కోరుకునేవారు ఇక్కడ నిరంతరం యోగ సాధనలో లీనమౌతుంటారు.

స్థల చరిత్ర :


ఈ క్షేత్రం ఎన్ని యుగాల పూర్వం నిర్మితమైనదో తెలియదు, స్వయంగా విశ్వకర్మ దేవాలయాన్ని నిర్మించినట్లు ఒక కథనం. ఈ లింగాన్ని సాక్షాత్తూ బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది దేవతలు, మార్కండేయాది మహర్షులు సైతం పూజించినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి.

కాగా.. ప్రస్తుత రాతి నిర్మాణం 9వ శతాబ్దంలో చోళులు ఆలయ పునర్నిర్మాణం చేసినట్లు ఆధారాలు లభ్యమౌతున్నాయి. పల్లవులు, పాండ్యులు, హోయసల, వీరవల్లాల, సాంబువరాయులు, సాలువ, తులువ, విజయ నగర రాజులు ఇలా అనేక రాజ్యాలు ఈ దేవాలయ అభివృద్ధికి కృషిచేశారు.

స్థల చరిత్రపై ఎన్నో మౌఖిక కథలు, శాసనాలు ఉన్నప్పటికీ పురాణేతిహాసాల ఆధారంగా దేవస్థానంపై లిఖించబడిన చిత్రాల ఆధారంగా సృష్టి ఆరంభంలో బ్రహ్మ విష్ణువులు ఇరువురిలో ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడటం, శివుడు జ్యోతిలింగ ఆకారంలో దర్శనమిచ్చి లింగ ఆధ్యాంతాలను దర్శించినవారే గొప్ప అని పోటీకి ఆహ్వానించడం వంటి చిత్రాల ద్వారా ఆ తేజో లింగమే ఈ అరుణాచలేశ్వరుడని భక్తులు విశ్వసిస్తారు.

ఈ క్షేత్రం ఆధ్యాత్మిక దేవాలయం మాత్రమే కాదు కళలకు గొప్ప స్థానాన్ని కల్పించిన కేంద్రం కూడా విజయనగర పాలనలో వ్యూహాత్మక పరిపాలక కూడలిగా, పట్టణ కేంద్రంగా ఉండేది.

ఇక్కడ నేడు వేలాది శిలా విగ్రహాలు, వేయికి పైగా శిలా శాసనాలు కనపడతాయి. అంతే కాకుండా అనేక కాంస్య, లోహ శాసనాలు, విగ్రహాలు, అనేక చిత్రాలు దర్శనమిస్తాయి. ఈ దేవాలయం 25 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద గోపురంతో నిర్మితమైంది. తూర్పు గోపురాన్ని 217 అడుగుల ఎత్తుతో శ్రీ కృష్ణదేవరాయలు నిర్మించారు. ఈ గోపురం తమిళనాడు లోనే రెండవ అతి పెద్దదిగా కీర్తినొందింది. అంతే కాకుండా రాయలవారు వేయి స్థంబాల వేదికను కూడా నిర్మించారు.

మరో మూడు దిశలలో వల్లాల మహారాజ గోపురం, కిళి గోపురం., అమ్మని అమ్మన్ గోపురాలు నిర్మించబడ్డాయి. పల్లవులు, చోళులు, పాండ్యులు, హోయసల, వీరవల్ల, దేవరాయలు అనేక మంది రాజులు, రాజ్యాలు అనేక నిర్మాణాలు, శిలలు, నాణాలు, చిత్రాలు రూపొందించారు. అయితే వారి అనంతరం మొఘలులు, బ్రిటీషర్ల పాలనలో అనేక విగ్రహాలు శిధిలమయ్యాయి, అనేక శాసనాలు కనుమరుగయ్యాయి.

అరుణాచల ప్రసిద్ధి :


ఈ అరుణాచల క్షేత్ర వైశిష్ట్యాన్ని వేదవ్యాసుడు స్కాంద మహాపురాణంలో ప్రస్తావించాడు. నాయనార్లు, తిరుజ్ఞాన సంబంధార్లు, అప్పర్లు, తిరునవుక్కురసర్, మానిక్కవసాగర్, తిరుమలార్లు, సెక్కిజార్లు తమ రచనల్లో కీర్తించారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు దర్శించి శ్రీచక్ర మేరు పర్వతంగా.. భగవద్ రామానుజాచార్యుల వారు సుదర్శన గిరిగా కీర్తించారు. ఇలా అనేకమంది మహర్షులు, యోగులు, సాధువులు ఈ క్షేత్రం గురించి అనేక రచనలు, స్తోత్రాలు, కీర్తనలు, భజనలు చేశారు.

అరుణాచల గిరి నాలుగైదు ఉపశిఖర కోణాలతో ఏక ముఖ్య శిఖర ముఖంతో 14 కిలోమీటర్లు విస్తరించి వుంటుంది. గిరి చుట్టు పరిక్రమణలో అష్టదిక్పాలకులైన ఇంద్ర, అగ్ని, యమ, నిఋతి, వరుణ, వాయు, కుభేర, ఈశాన పేర్లతో ఎనిమిది లింగాలతో ఆలయాలు దర్శనమిస్తాయి, వీటిని అష్టలింగాలు అని పిలుస్తారు. ఈ ప్రతీ ఆలయం చంద్ర గుర్తులతో, రాశులతో సంబంధం కలిగివుంటాయి.

క్షేత్రంలోని ప్రతీ రాయి కూడా ఒక లింగంగానే భావించాలని, ఈ క్షేత్రంలో నిత్యం పరమేశ్వరుడు నివసిస్తాడని, ఇక్కడి వృక్షాలు సంజీవని వంటి అమృతతుల్యమైనవని, ఇక్కడ పారే జలం అమృతంతో సమానమని అరుణాచల, పెరియ పురాణాలు తెలుపుతున్నాయి.

దేవాలయం :


~ ఆలయంలోని ప్రధాన మందిరం తూర్పు ముఖంగా ఉంటుంది, అందులో అరుణాచలేశ్వరుడు దర్శనమిస్తాడు. ఎదురుగా నంది వాహనం ఉండటం సహజమే.. కానీ ఈ మందిరం క్షేత్రంలో అత్యంత ప్రాచీనమైనది. గర్భగుడి గోడలపై వెనుకవైపు వేణుగోపాలస్వామి, గజ లక్ష్మీ, దుర్గ, చండీశ్వర, స్వర్ణ భైరవ, దక్షిణామూర్తి, గణపతి, కార్తికేయ, నటరాజస్వామి మరియు లింగోద్భవ చరిత్రను తెలిపే చిత్రాలు కనిపిస్తాయి.

~ రెండవ ఆవరణలో అన్నామలై అమ్మన్ (అమ్మవారు), గణపతి, సుబ్రహ్మణ్య కోవెలలు, పాతాల లింగం, ధ్వజస్తంభం దర్శనమిస్తాయి.

~ మూడవ, నాలుగవ ఆవరణల్లో దీపదర్శన మండపం, కళ్యాణ మండపం, వసంత మండపం, నంది మండపం, రాతి త్రిశూలం, దేవతావృక్షం మొదలైనవి దర్శనమిస్తాయి.

~ ఐదవ ఆవరణలో కృష్ణదేవరాయలు నిర్మించిన వేయి స్థంభాల మందిరం (వేదిక), నాలుగు వైపులా గోపురాలు, పౌరాణిక, చారిత్ర విషయాలను తెలిపే విగ్రహాలు, శిలలు, శాసనలు, చిత్రాలు ఆకర్షిస్తాయి.

గిరి ప్రదక్షిణ ~ గిరివలం :


శ్లో|| యానికానిచ పాపాని, జన్మాంతర కృతానిచ |
తాని తాని ప్రణశ్యంతి, ప్రదక్షిణ పదేపదే ||

భగవంతుడి ఆరాధనలో అత్యంత ప్రధానమైనది ప్రదక్షిణ - పరిక్రమము. గణపతి గణాధిపత్యం పొందేందుకు పార్వతీ పరమేశ్వరుల చుట్టు మూడు ప్రదక్షిణలు చేసి ముల్లోకాలను జయించి ప్రథమ పూజలను అందుకుంటున్నాడు. అనంత శక్తి కేంద్ర బిందువుగా ప్రదక్షిణ చేయడం ద్వారా ఆ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది.

ఎన్నో జన్మజన్మలుగా చేసుకున్న పాపపుణ్యాలను త్యజించి, భగవంతుడికి ప్రదక్షిణలు చేసి శరణువేడుకుంటారు. ఇలా మాతా పితృ గురు ప్రదక్షిణ, దైవ ప్రదక్షిణ, గో(జీవ) ప్రదక్షిణ, వృక్ష ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ వంటి ప్రదక్షిణలతో పాటుగా ఆత్మ ప్రదక్షిణ, పాద ప్రదక్షిణ, దండ ప్రదక్షిణ, అంగ ప్రదక్షిణ వంటి ప్రదక్షిణలు శాస్త్రాలలో చెప్పబడ్డాయి‌.

ఒక దైవ క్షేత్రం, దైవీక మహాత్మ్యాన్ని కలిగిన గిరిపై ప్రధానాలయంతో పాటుగా అనేక ఉపాలయాలు, తీర్థాలు కూడా నెలకొనివుంటాయి. వాటన్నిటి శక్తిని ఆ గిరి తనలో ఇముడ్చుకుని, అనంత శక్తిని ప్రసరింపజేస్తుంది. అటువుంటి గిరిపై వెలసిన అన్ని తీర్థాలు, ఆలయాలను ఒకేసారి ప్రదక్షిణ చేసిన పుణ్యఫలితాలను పొంది, అనంత శక్తిని గ్రహించేందుకు ఉన్నటువంటి ఏకైక మార్గం గిరిప్రదక్షిణ చేయడం మాత్రమే.

ఈ గిరి ప్రదక్షిణ విధానం పూర్వం నుండి ఉన్నప్పటికీ అన్ని క్షేత్రాలలో పరిక్రమణకు సరిపడే వసతులు, వనరులు, దారి.. లేకపోవడం వలన కొన్ని క్షేత్రాలలో మాత్రమే ప్రదక్షిణ ఆచరిస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణలో అరుణాచలం పేరుగాంచింది.


ప్రతీ పౌర్ణమి రోజున అరుణాచలంలో దేశ విదేశాల నుండి అనేకమంది భక్తులు గిరి ప్రదక్షిణలు చేస్తారు. జన సంఖ్య వేలను దాటుతుంది. అరుణాచల గిరి ప్రదక్షిణ ద్వారా సమస్త పాపాలు తొలగిపోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని, పునర్జన్మ లేని శాశ్వత ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. వైరాగ్య భావన కలిగిన వారు తమ శేష జీవితాన్ని ఇక్కడే గడపడానికి ఇష్టపడతారు.

అయితే తెలుగు రాష్ట్రాల్లో సింహాచలంలో, శ్రీశైలం లోను గిరి ప్రదక్షిణ ఎంతో వైభవంగా జరిగుతుంది. ఇటీవల కాలంలో విజయవాడ కనకదుర్గ, యాదాద్రి లక్ష్మీ నరసింహ, పాలకుర్తి సోమనాథేశ్వర, పుష్పగిరి వంటి పలు ప్రముఖ క్షేత్రాలలో గిరిప్రదక్షిణలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రమణ మహర్షి ప్రదక్షిణ అనే పదాన్ని వివరస్తూ.. "ప్ర" అనే అక్షరం పాప వినాశక సూచకం అని, "ద" అంటే కోరికలని నెరవేర్చునది అని, "క్షి" అంటే పునర్జన్మల క్షయం అని, "న" అంటే అజ్ఞానం నుండి విముక్తి కలిగించి అనంత జ్ఞానాన్ని ప్రసాదించునని తెలిపారు.

కార్తీక దీపోత్సవం :


శివుడు తేజో రూపకంగా వెలసిన ఈ క్షేత్రంలో వెలిగే ఈ జ్యోతియే సాక్షాత్ పరమేశ్వర స్వరూపంగా భావిస్తారు. అగ్నిలింగ క్షేత్రమనే పేరుకు తగినట్లుగా ఈ దీపోత్సవం జరుగుతుంది.

స్థానిక ఆచారాల రీత్యా కార్తీమాసంలో వచ్చే కృత్తికా నక్షత్రంలో అరుణాచల గిరిపై దివ్య జ్యోతిని వెలిగిస్తారు. ఇదే అతిపెద్ద జ్యోతిగా కొనియాడబడుతుంది, సుమారుగా 600మీటర్ల తెల్లబట్ట, 2500కిలోల దేశీయ ఆవునేయి ఉపయోగించి వెలిగించిన మహా దీపం, కనీసం మూడు రోజుల పాటు సుమారుగా 24కిలోమీటర్ల మేర దర్శనమిస్తుంది.



నేడు దర్శనానికి తెలుగు ప్రజల ఆసక్తి :

మహా జ్ఞానిగా పేరొందిన రమణ మహర్షి తరువాతే ఈ క్షేత్రం మరింత ప్రసిద్ధి పొందినది అనే విషయాన్ని అంగీకరించక తప్పదు. వారు ఇక్కడే ఆత్మ జ్ఞానాన్ని పొంది, జీవన్ముక్త సూత్రాలను బోధిస్తూ, భగవత్ తత్వాన్ని ప్రచారం చేశారు.

ఇటీవల కాలంలో పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులతో పాటుగా.. ముఖ్యంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, బ్రహ్మశ్రీ గరికపాటి నర్సింహ్మారావు గారు, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు వంటి ప్రముఖ పండితులు ప్రవచనాలలో అరుణాచల క్షేత్రం గురించి, గిరి ప్రదక్షిణ గురించి, రమణ‌ మహర్షి గురించి, ఇక్కడి వివిధ యోగులు, సాధువులు, తపస్సాధకుల గురించి, స్థల చరిత్ర, మాహాత్మ్యాలు, జరిగిన సంఘటనలు వంటి అనేక విషయాలను ప్రస్తావించడం మరియు అరుణాచలం గురించి ప్రత్యేక ప్రసంగాలు చేయడం ద్వారా తెలుగు ప్రజల్లో ఎంతో ఉత్సాహం, ఆసక్తి కలగడం, ఆధ్యాత్మిక చైతన్యానికి కారణమయ్యాయి.



చివరగా నా మాట :

మీ స్థానికంగా.. శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాల పునరుద్ధరణకు కృషిచేయండి, చిన్న దేవాలయాలను ఆదరించండి.. దేవుడు లేని చోటేముంటుంది.? మీరు దర్శించగిలిగినపుడు.. ఈ అరుణాచల శివుడు, కాశీ విశ్వేశ్వరుడు, కేదారీశ్వరుడు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూతాత్మక లింగాలు కూడా మీ స్థానిక దేవాలయంలోనే దర్శనమిస్తారు.! క్షేత్ర దర్శనాలకు పెట్టే ఖర్చులో కొంతైనా స్థానిక దేవాలయాల అభివృద్ధికి కేటాయించండి, భగవంతుడు తృప్తి పడతాడు..


తిరువన్నామలై దగ్గరలో దర్శనీయ స్థలాలు :

~ 56 కి.మీ దూరంలో పడవేడు - స్వయంభూ అరుల్మిగు రేణుకాంబల్ దేవాలయం
~ 117 కి.మీ దూరంలో కాంచిపురం - ఏకాంబరేశ్వర దేవాలయం
~ 85 కి.మీ దూరంలో - అరుల్మిగు పాండురంగన్ తిరు కోవెల (పాండురంగ దేవాలయం)
~ 65 కి.మీ దూరంలో - అవనిభజన పల్లవేశ్వర దేవాలయం (గుహాలయం)
~ 108 కి.మీ దూరంలో - మామండూర్ గుహాలయాలు (పల్లవ గుహలు)
~ 74 కి.మీ దూరంలో - పచ్చియమ్మన్ సమేత మన్నార్సామి దేవాలయం
~ 53 కి.మీ దూరంలో చిట్పేట్ - శ్రీ యోగా రామచంద్ర పెరుమాళ్ దేవాలయం

తిరువన్నమలై లో దర్శనీయ స్థలాలు :

~ శ్రీ అరుణాచలేశ్వరాలయం
~ రమణ మహర్షి ఆశ్రమం
~ స్కందాశ్రమం
~ శ్రీ శేషాద్రి స్వామి ఆలయం
~ యోగి రామ్ సూరత్ కుమార్ ఆశ్రమం
~ విరూపాక్ష గుహ
~ జింగీ కోట
~ వరదరాజ పెరుమాళ్ ఆలయం
~ సాథనూరు డ్యామ్


జ్యోతిష్య శిరోమణి, రత్న, మహర్షి, పురోహిత సార్వభౌమ
డా|| ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ
సామాజిక కవి, రచయిత
అంతర్జాతీయ సాహిత్య పురస్కార‌ గ్రహీత

కామెంట్‌లు

  1. మాకు అరుణాచలేశ్వర దేవాలయ దివ్య చరిత్రను దేవాలయ మహిమను వైభవాన్ని గిరి ప్రదక్షిణ మహిమను దాని వలన కలిగే ఫలితాన్ని స్మరణ ద్వారా ముక్తిని అలాగే స్థల పురాణాన్ని వాటి విశిష్టతను మాకు తెలియజేసి అందించినందుకు మీకు కృతజ్ఞతలు గురువుగారు
    ఓం శ్రీ అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ.
    ఓం నమశ్శివాయ... 🙏🕉

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత