నవయుగ వ్యాస - పోతన | కవి | మోహనకృష్ణ భార్గవ

"నవయుగ వ్యాస - పోతన"

కవిత - డా. మోహనకృష్ణ భార్గవ


కర్షకుడివో కార్మికుడివో
భారతావనిలో
సాహితీ మందారాలను
సేద్యం చేసావు..

సహజ పండితుడవో
విరించి సహపాటివో
శివ భక్తితో వీరభద్ర
విజయాన్ని లిఖించి
పద్య మాలికలతో
ఈశ్వరార్చన జేసి
జీవ పరమాత్మ 
సోపాన తర్కమై
ఛందస్సుకే చంద్రుడవై
ఆచంద్రార్కం నిలిచావు..

శారదా పుత్రుడవై
భాషోదయాన్ని గాంచి
పండితుల పామరుల
రసనపై నవరాసాలు పండించి
నవవిధ భక్తి మార్గాలు బోధించి
ప్రజల ధన్యుల జేసిన
భాగ్య ఫల దాతగా
సాహిత్య శబ్ధ విధాతవై
నన్నయ తిక్కన సోమనల
వారసుడవయ్యావు..

తెనుగు తోటలో
బృందావన విహారిని గాంచి
ఆలంబనగా ఆలింగనజేసి
గోకులాన్ని తలపించే
భాగవత కథామృతాన్ని
విష్ణు భక్తి రసామృతాన్ని
మధుర మాధురీ
కవితామృతాన్ని
జనులకు అందించగా
సంజీవనీ కల్పతరువై
బమ్మెరలో వెలసిన
భాగవతోత్తముడవై
విష్ణుకథా శిరోమణివై
శుకముని సూక్తివై
హరి భక్తుల ముక్తికి
సోపానమైయ్యావు..

రామ భక్తుడవో ‌
రామ మిత్రుడవో
పలికించువాడు
రామభద్రుండేనంటూ
భక్తిలో తడసిన కృతులతో
ఆధ్యాత్మిక చైతన్య శృతులతో
అలౌకిక తన్మయాన్ని కలబోసి
రామచంద్రుని దర్శనమొందిన
భక్త శిరోమణి మాట
జగతి ప్రగతికి బాటగా
చరాచర ప్రాణికి మూటగా
శాశ్వత ఖ్యాతిని పొందిన మేటిగా
అక్షర సౌరభాలతో భగవంతుని
సాక్షాత్కరింపజేసిన నవయుగ
వ్యాసుడవైయ్యావు..

- 02 Oct 2022

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత