జాతీయవాది - ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ | డా. మోహనకృష్ణ భార్గవ

జాతీయవాది – ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

( 27 సెప్టెంబర్ 1915 – 21 సెప్టెంబర్ 2012 )



(జాగృతి వార పత్రికలో ప్రచురితం) 


(పద్మాంజలి జాతీయ మాసపత్రికలో ప్రచురితం)

      తనకంటూ కావలసింది ఏమీలేదు.. సమాజహితమే తన ధ్యేయం. స్వాతంత్ర్యమే తన జీవిత లక్ష్యంగా చివరి మజిలీ వరకు పోరాటాలే ఊపిరిగా మలుచుకొని, పదవులను, ఆస్తులను తృణప్రాయంగా వదులుకున్న మహాత్ముడాయన. ప్రత్యేక తెలంగాణాని కలగన్న దార్శనికుడు, మన బహుజన నేత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ.

      బలహీనవర్గమైన చేనేత - పద్మశాలీ సామాజిక వర్గంలో పుట్టి మహాత్మా గాంధీ తరువాత బాపూజీగా తెలంగాణ ప్రజలు ప్రేమతో పిలుచుకునే స్థాయికి ఎదిగిన విధానం యావత్ దేశ ప్రజలకు స్పూర్తిదాయకం. ఆయన త్యాగాలు చిరస్మరణీయం. తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానాన్ని, జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తిని సొంతం చేస్కున్నారు.  ఆయన దళిత, బహజన, పీడీత వర్గాల పక్షపాతి. బలహీన వర్గాల అభివృద్ది కోసం తన జీవితాన్ని దారపోసారు. బాపూజీ పోరాటాలు, త్యాగాలు అందరికి తెలిసిన విషయాలే అయినప్పటికీ జాతీయవాదిగా ఆయనలో మరో కోణం దాగివుంది. సాంప్రదాయ కులంలో జన్మించిన ఆయన ఉపనయణ సంస్కారంతో నిత్య వైదిక కర్మలు నిర్వహించేవారు. పూర్తి శాఖాహారిగా జీవించారు. నిజాం అరాచకాలపైన పోరాడిన విధానం యావత్ హిందూ సమాజానికి ఆదర్శప్రాయం.

      పూర్వ అదిలాబాద్, కొమురంభీం అసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గ్రామంలో కొండా అమ్మక్క – పోశెట్టి దంపతులకు, 27 సెప్టెంబర్ 1915 రోజున జన్మించారు. నిజాం నవాబుల ధాష్టికాలు, రజాకార్ల అరాచకాలతో ప్రజల మనసు కొలిమిలో రాచుకున్న నిప్పు నిజాం నవాబును దహనం చేయాలనే కాంక్షతో దశదిశలా విస్తరిస్తుంది.  కానీ దిశా నిర్దేశం చేయగల నాయకత్వ లేకపోయింది. యావత్ హిందూ సమాజాన్ని ఇస్లాం మతమార్పిడీ చేసేందుకు విపరీత స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. చివరి నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత స్వాతంత్ర్య ఉద్యమ ప్రభావం హైదరాబాద్ సంస్థానంపై పడకుండా ఉండటానికి, హిందువులను విచ్ఛిన్నం చేసి తన కాంక్ష అయిన ఇస్లాం రాజ్యాన్ని స్థాపించడానికి బహద్దూర్ యార్ జంగ్ నాయకత్వంలో అంజుమన్ ఇత్తేహాదుల్ ముస్లీమిన్సంస్థను స్థాపించారు. తద్వారా విచ్చలవిడిగా మతమార్పిడీలు చేస్తూ అనేక అకృత్యాలకు పాల్పడేవారు.

      నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర్య ఇస్లాం రాజ్యంగా ప్రకటిస్తూ అసఫియా జెండఎగురవేసేవారు.ఆజాద్ జిందాబాద్ – షాహే ఉస్మాన్ జిందాబాద్అంటూ నినాదాలు చేసేవారు. ఈ సంస్థలో ఖాసీం రజ్వీ చేరిన తరువాత రజాకార్లను తయారుచేశారు. వారి ఆగడాలు పరాఖాష్ఠకు చేరుకున్నాయి. హిందువుల ఇండ్లపై, దుకానాలపై, దేవాలయాలపై దాడులకు పాల్పడేవారు. మహిళలపై మానబంగాలకు పాల్పడేవారు. మహిళల బట్టలిప్పించి బతుకమ్మ ఆడించిన ధాఖలాలున్నాయి.

      ఇటువంటి పరిస్థితుల్లో హిందువుల్లో ఐఖ్యత, నిజాం వ్యతిరేఖ పోరాటాలు అనివార్యమయ్యాయి. హిందువులు రహస్యంగా దేవాలయాల్లో సమావేశమయ్యేవారు. గృహాల్లో హవన్ కుండ్ పూజలు నిర్వహంచేవారు. నిజాం నిరంకుశ పాలన నుండి ప్రజలకు విముక్తి కలిగించేందుకు, బలవంతపు మతమార్పిడులను అరికట్టేందుకు, ప్రజల్లో చైతన్యం తీస్కువచ్చేందుకు అనేక హిందూ సంస్థలు నడుంబిగించాయి. హిందూ సంఘాల ఉద్యమాలు లేనట్లయితే తెలుగు భాష, సంస్కృతులు, సాహిత్యం ఏనాడో అంతమయ్యేవి. ఉర్దూ హైదరాబాద్ సంస్థాన అధికార భాషగా మారేది అనటంలో సందేహం లేదు.

      ఓంకా ఝండా.. హమారా ఓంకాఝండా.. సారా దునియామే లహరా యేంగే ఓంకాఝండా.. హమారా ఓంకా ఝండాఅంటూ ఆర్యసమాజీయులు ఓం ఝండానీ, కాషాయ వర్ణాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు పాడిన పాట, చిందించిన రక్తం, వదిలిన ప్రాణాలే నేడు హైదరాబాద్ సంస్థానంలో సనాతన హిందూ ధర్మాన్ని బతికించాయని చెప్పవచ్చు. 1882 లో రాజా మురళీమనోహర్ హిందూ సోషల్ క్లబ్ స్థాపించారు, అనీబిసెంట్ థియోసాఫికల్ సొసైటీ (దివ్యజ్ఞాన సమాజం) శాఖ హైదరాబాద్‌లో ఏర్పడింది.

      1875వ సంవత్సరంలో  ఆర్యసమాజముసంస్థకి అంకురార్పణ జరిగింది. కాని నిజాం పాలకులు హిందువులకి వాక్ స్వాతంత్ర్యం, భావ స్వాతంత్ర్యం, మత స్వాతంత్ర్యం, పూజా స్వాతంత్ర్యం, ఊరేగింపుల స్వాతంత్ర్యం, సభా నిర్వహణ స్వాతంత్ర్యం లేకుండా చేసింది. హిందువుల సభలు, సమావేశాలని నియంత్రించేవారు.

      నాటికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) విస్తృతంగా దేశమంతటా విస్తరిస్తుంది. దీన్ని గ్రహించిన నిజాం హైదరాబాద్ సంస్థానంలో ఆర్ఎస్ఎస్ ని నిషేదించాడు. కానీ ఆర్యసమాజ్ హైదరాబాద్ సంస్థానం అంతటికీ విస్తరించి, భారీ స్థాయిలో కార్యకలాపాలు చేపడుతుంది.

      ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 1940 నాటికే అటు ఆర్యసమాజ కార్యకలాపాల్లో, ఇటు జాతీయ స్వాతంత్ర్య ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్న ప్రముఖ జాతీయవాదిగా జాతీయ స్థాయిలో గుర్తింపుపొందారు.

      1931లో మహాత్మా గాంధీ చాందా(చంద్రపూర్) పర్యటించగా నిజాం ప్రభుత్వ ఉత్తర్వులని ధిక్కరించి రహస్యంగా చాందా వెళ్ళి గాంధీజీ సమావేశానికి హాజరయ్యారు. నాడు మొదలైన బాపూజీ ధిక్కార స్వరం, గాంధీ మార్గంలో ఉద్యమాలవైపు నడిపించింది. నాడు ఉదృతంగా సాగుతున్న పోరాటాలకు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపన మరింత ఊతమిచ్చింది. ఆర్యసమాజ్, పౌరహక్కుల సంఘం, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ విరివిగా సత్యాగ్రహ దీక్షలు చేపట్టాయి. అందులో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోశించారు.

      1938 లో జాతీయ ఉద్యమంలో తొలిసారి అరెస్ట్ అయ్యారు. ఆ తదుపరి బాపూజీకి అరెస్టులు షరా మాములు విషయంగా మారింది. క్విట్ ఇండియా ఉద్యమంలో పలుమార్లు అరెస్టయిన బాపూజీ వందేమాతర గీతాలాపనతో జైలు మారుమ్రోగేలా నినాదాలు చేసేవారు.

      1940 లో ప్లీడర్ పూర్తిచేసి అడ్వకేటుగా ప్రాక్టీసు ప్రారంభించి సివిల్ కోర్టులో వాదించేవారు‌. నాడు ఎం.ఎన్.రాయ్ డెహ్రాడూన్ లో నిర్వహించిన రాజకీయ శిబిరానికి హాజరయ్యారు. 1939 లో హైదరాబాద్ నుండి రాజురాఘడ్ వెళ్లి తిరిగి హైదరాబాద్ వరకు 500 కిలోమీటర్లు సాహసోపేత ప్రయాణం చేశారు.

      ఆర్యసమాజ్ నిర్వహిస్తున్న సమావేశాల్లో విరివిగా పాల్గొంటూ, స్వేచ్చా స్వతంత్ర్య నినాదాలను ప్రజల్లోకి తీస్కువెల్లేందుగా నగరాలలో రహస్య సమావేశాలను నిర్వహించేవారు. హిందూ సంఘాలను సమన్వయం చేసేందుకు కృషిచేసేవారు. 1939 లో నిజాం రాష్ట్ర పద్మశాలీ సంఘంలో చేరి అనదికాలంలోనే జాతీయ స్థాయి బాధ్యతలు చేపట్టారు.  1940 లో ఆంధ్రహాసభలో చేరారు. రామానంద తీర్థ, జనార్థన్ రాయ్ దేశాయ్ తో కలిసి ఉద్యమాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేసేవారు.

      1940 మధ్యకాలంలో బాపూజీ జాతీయ ఖాదీ ఉద్యమంలో పాల్గొన్నారు. ఖాదీ వస్త్రాల ప్రచారం‌ కోసం స్వయంగా వారే ఖద్దరు వస్త్రాలను అమ్ముతూ విస్తృతంగా ప్రచారం చేసేవారు. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమకారులను భారీగా సమీకరించి ఊరేగింపు, ప్రదర్శనలు నిర్వహించారు. వారికి ఆశ్రయం, వసతులు కల్పించేవారు.

      నాడు కొండా లక్ష్మణ్ షోలాపూర్ లో జాతీయోద్యమ నేత సుభాష్ చంద్రబోస్ ని రహస్యంగా కలిసి హైదరాబాదు సంస్థానంలో జరుగుతున్న అన్యాయాలను, అరాచకాలను తెలియజేశారు. నిజాంకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమాలను వివరించారు. అందుకు సమాధానంగా సుభాష్ చంద్రబోస్ శాంతీయుత పద్దతుల ద్వారా నిజాం తలవంచలేరు అన్నారు.

      నేతాజీ మాటలతో ప్రేరేపితుడైన బాపూజీ హిందూ ఉద్యమాలకు గాంధీవాదుల మద్ధతు, సహకారాలు లభించలేదన్న సత్యాన్ని గ్రహించారు. కానీ అప్పటికే హైదరాబాద్ సంస్థానంలోని హిందువులు కోలుకోలేని స్థాయిలో అణచివేతకు, దాడులకు గురయ్యారు. ఉద్యమకారులు అక్రమ అరెస్టులయ్యారు. ఇదంతా చూస్తున్న బాపూజీ మనసు కన్నీటితో ద్రవిస్తున్నప్పటికీ. చింతిస్తూ కూర్చోలేదు, భయపడి ఆగిపోలేదు.

      ఒక వైపు అడ్వకేటుగా ప్రాక్టీసు చేస్తూనే దంగల్ కార్యక్రమాల్ని నిర్వహించేవారు. యువకులకు రహస్యంగా కర్రసాము వంటి యుద్ధ విద్యలు నేర్పేవారు. ప్రజల్లో దేశభక్తి పెంపొందించాలని కాంక్షించారు. జాతీయవాద భావజాలాన్ని ప్రచారం చేసేందుకు ఎన్నో సమావేశాలు, సదస్సులు, సమావేశాలు ఏర్పాటుచేసేవారు. తాత్యాజీ బాకే, అంబదాస్ రావుల సహకారంతో యువజన సంఘాన్ని స్థాపించాడు. కొండా లక్ష్మణ్ నేతృత్వంలో హైదరాబాదు సంస్థానంలో 43 వక్తృత్వ సంస్థలను స్థాపించారు.

      నాటికి బాపూజీ కదలికలు నిజాం పాలకుల వెన్నులో వణుకు పుట్టించే విధంగా మారుతున్నాయి. అత్యల్ప కాలంలోనే అత్యధిక సంఘాలను స్థాపించి, ఉద్యమారులను ప్రోత్సహించిన తీరు చరిత్రలో  నిలిచిపోతుంది.  వీటి ద్వారా ఆర్యసమాజ సూత్రాలను అనుసరిస్తూ గణేశ, దేవి శరన్నవరాత్రి, శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహించేవారు. నగరంలో భారీ ఊరేగింపులు, భారీ సభలు నిర్వహించేవారు. యజ్ఞోపవీత ధారణ, దేవతారాధనలపై అవగాహణ కల్పించేందుకు కృషి చేసేవారు.

      ఆర్య సమాజ్ తో కలిసి హవన్ కుండ్ ఆరాధన విధానాన్ని ప్రతీ గడపకు చేరేలా ప్రయత్నం చేశారు. తద్వారా నిజాం వ్యతిరేఖ ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి, ప్రజల్లో పరస్పర సమన్వయ, సహకారానికి హవన్ కుండ్ కార్యక్రమం దోహదపడేది. దీనిని గ్రహించిన నవాబు హవన్ కుండ్ కార్యకలాపాలని నిషేదించాడు. అప్పటికింకా ఆయ‌నకు పెళ్ళి కాలేదు. దానికి తోడు ఆయన తండ్రి కూడా దగ్గర కూడా లేకపోవడంతో విప్లవోద్యమంలో చురుగ్గా పాల్గొనే అవకాశం లభించింది.

      జాతీయోద్యమం మరియు హైదరాబాద్ విమోచనోద్యమాల్లో పాల్గొన్న పార్టీలు మరియు సంస్థలు, సంఘాలు, నాయకులు, కార్యకర్తలు అనేక కోర్టు కేసుల్ని ఎదుర్కునేవారు. ఈ కేసులన్నింటినీ బాపూజీ సొంత ఖర్చులతో వాదించేవారు. నిజాం నవాబులు ప్రజల్ని బాంటలు – బానిసలుగా చూసేవారు. వెట్టి అనే చాకిరి విధానం అమలులో ఉండేది. అంటే ప్రజలు నిజామ నవాబు కుటుంబానికి బానిసలుగా పనిచేయాలి. ఇటువంటి విధానాలకు స్వస్తి పలకాలని బాపూజీ పోరాడేవారు. వెనుకబడిన కులాల వారికి ఇచ్చిన ఇనాం భూములను దేశ్ ముఖ్, దేశ్ పాండే, జమిందారు కుటుంబీకులు దౌర్జన్యంగా ఆక్రమించగా బాపూజీ యువజన సంఘాల వారితో కలిసి పోరాడి భూములను తిరిగి అప్పగించేవారు. బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని అమలుపరచడంలో నిజాం ప్రభుత్వం విఫలమైంది‌. ఈ చట్టాన్ని అమలు పరిచేందుకు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యమం చేపట్టారు. హైదరాబాదు, సికిందరాబాద్ లలో అనేక బహిరంగ సభలు, సమావేశాలు ఏర్పాటుచేసి, నిరసన కార్యక్రమాలు చేపట్టి, నిజాంపై ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధమయ్యారు.

      ఆ నాటికే కొండా లక్ష్మ బాపూజీ పై ఎన్నో కేసులు నమోదయ్యాయి. 13 అరెస్ట్ వారెంట్ లు జారీ అయ్యాయి. అయినా పౌరహక్కుల సంరక్షణ కోసం పోరాడుతున్న బాపూజీ పహాడీ అని మారుపేరుతో అనేక కరపత్రాలు, సర్క్యులర్లు విడుదల చేశారు. సెంట్రల్ ప్రావిన్స్ లో రేడియో స్టేషన్ నెలకొల్పే ప్రయత్నం చేశారు. అది కుదరకపోవడంతో సిద్ధవనహళ్లి కృష్ణ శర్మ సహాకారంతో మైసూరులో స్వతంత్ర రేడియో కేంద్రాన్ని ఏర్పాటుచేసి నిజాం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని, నిజాం నవాబుల కుయుక్తులను ప్రచారం చేశారు. అప్పట్లో ఇదొక సంచలనంగా నిలిచింది.  

      నాడు బసవరాజ్ మరియు జ్ఞానకుమారి హెడా వంటి ఉద్యమకారుల సహాకారంతో సుల్తానాబజార్ వద్దగల తపాలా కార్యాలయంపైన మరియు బ్రిటీష్ రెసిడెన్సి పైన జాతీయ పతాకాన్ని ఎగరువేశారు. ఉద్యమాలకు కేంద్రంగా షోలాపూర్ లో వడ్డేపల్లి విఠోబా అనే పద్మశాలీ నాయకుడి గృహంలో కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్యాలయంలో ఉద్యమానికి సంబంధించిన సభలు, రహస్య తీర్మానాలు, కీలక నిర్ణయాలు తీస్కునేవారు.

      ఖాదీ ఉద్యమంతో చేనేతోద్యమ నేతగా గుర్తింపునొందిన బాపూజీ 1945 లో నిజాం రాష్ట్ర పద్మశాలీ మహాసభ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేవలం ఆయన కులానికో వర్గానికో ఏనాడు పరమితమవలేదు. పద్మశాలీ సామాజిక వర్గాన్ని అంతటిని తనతోపాటు ఉద్యమంలో భాగస్వాముల చేసేందుకు ఆ సంఘ బాధ్యతలను ఉపయోగించుకున్నారు. 1947లో మంచిర్యాలలో కిసాన్ మహాసభ ఏర్పాటుచేశారు. ఈ సభకు టంగుటూరి ప్రకాశం, జయప్రకాశ్ నారాయణ వంటి నాయకులు ఆహ్వానించగా నిజాం ప్రభుత్వం వీరిని అడ్డుకుంది. హైదరాబాదు విమోచనోద్యమాన్ని ఉధృతం చేయాలని సంకల్పించి బొంబాయి చేరుకున్నారు. తద్వారా నారాయణ రావ్ పవార్ వంటి ఉద్యమకారులతో కలిసి నిజాంపై బాంబుదాడికి ప్రణాళిక సిద్ధం చేశారు. వారికి కావలసిన ఆయుధాలు – తుపాకులు, బాంబులు అందించారు, షోలాపూర్ లో వీరికి రహస్య నివాసాన్ని ఏర్పాటుచేశారు. నిజాంపై బాంబు దాడికి ఇక్కడి నుండే పూర్తి ప్రణాళిక తయారు చేశారు బాపూజీ. అక్కడే బాంబు విసరడం కోసం సాధన చేసేవారు. కానీ నిజాం పై బాంబుదాడి విఫలమవడంతో నారాయణరావ్ పవార్ బృందం రజాకార్ల చేతికి చిక్కారు.

      తెలంగాణ చరిత్ర బాపూజీ చరిత్ర రెండూ వేరు కాదు. నిజాం  నియంతృత్వ పాలనకు, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేఖంగా పోరాడటమే కాదు. హైదరాబాద్ సంస్థాన విలీనానంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేష్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలపై చూపుతున్న అసమానతలు, అణచివేత, ఆధిపత్య ధోరణి తదితర పర్యవసానాల రీత్యా, తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకుంది. తొలి మరియు మలిదశ ఉద్యమాలలో బాపూజీ ప్రధాన పాత్ర పోశించారు. జాతీయ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఒకవైపు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మరొకవైపు తన భుజస్కందాలపై మోసిన ఏకైక ఉద్యమ నేత బాపూజీ.

 

రచయిత :

డా. ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ

(M.A-Telugu. M.A –Philosophy. PhD )
సామాజిక కవి, రచయిత.
సర్వోన్నత్ భారతీయ సంవిధాన్.
జనగామ జిల్లా., తెలంగాణ
సెల్ & వాట్సాప్ : 7416252587

 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత