గోదా దేవి | ఆండాళ్ | తిరు నక్షత్రం

గోదాదేవి దివ్య చరిత్ర


శ్లో.కర్కటే పూర్వ పల్గున్యాం తులసీకాననోద్భావామ్ ! 
పాణ్డ్యే విశ్వం భరాం గోదాం వన్దే శ్రీరంగనాయకమ్‌ !!


గోదాదేవి సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపం. క్రీస్తుశకం ఏడు - ఎనిమిది శతాబ్దపు మధ్యకాలంలో (సుమారు క్రీ.శ. 776.). నలనామ సంవత్సరం,  కర్కాటక మాసం, ఆషాడ శుద్ధ చతుర్దశి రోజున పూర్వ ఫల్గుణి(పుబ్బ) నక్షత్రంలో గోదాదేవి  జన్మించింది.

గోదాదేవి అయోనిజ, తులసి వనంలో దొరికిన కమలం. పన్నెండుమంది ఆళ్వారులలో ఏకైక మహిళ. ద్రావిడ ప్రబంధ రచయిత్రి గోదా. తన కావ్యం తిరుప్పావై వందలాది సంవత్సరాలుగా వైష్ణవ క్షేత్రాలలో వెలుగొందుతూనే ఉంది. తాను రచించిన తిరుప్పావై పాశురములనే వైష్ణవ దివ్యదేశాలన్నిటిలో సేవాకలంలో ఉపయోగిస్తారు. ఇక ధనుర్మాసమంతా తిరుప్పావై పారాయణమే ప్రత్యేకం. అంతటి ప్రాధాన్యత పొందినది.

గోదా అనే పదం కోదై, గోదై అన్న పదాల నుండి ఉత్పత్తి చెందినది. కోదై అంటే తులసీ మాల అని అర్థం. తులసీవనంలో లభించినది కనుక తనని కోదై అని పిలిచేవాడు తండ్రి  విష్ణుచిత్తుడు. గోదాని విష్ణుచిత్తుడు ముద్దుగా ఆండాల్ అని పిలుస్తారు. అంటే నా బంగారు తల్లీ, అమ్మా.. అనే అనే అర్థం వస్తుంది.

విష్ణు చిత్తుడు మధురైకి సమీపంలో‌ ఉన్న శ్రీ విల్లిపుత్తూరు గ్రామంలో నివసించే బ్రాహ్మణుడు, పేరుకు తగ్గట్లుగానే మనసు నిండా విష్ణువుని నింపుకున్న పరమ విష్ణు భక్తుడు. విష్ణువు దర్శించి పేరియాళ్వారు గా ఆళ్వారులలో స్థానాన్ని పొందాడు. ఈయన తులసీ వనాన్ని పెంచుతూ ప్రతీ రోజు ఆ వనంలోని తులసీ దళాలతో మాల అల్లి వటపత్రశాయి అయిన శ్రీమన్నారాయణుడికి సమర్పిస్తారు. ఇది ఆయన దినచర్య.
ఒకనాడు భగవత్కృపతో సాక్షాత్తూ మహాలక్ష్మి అంశ అయోనిజగా తులసీవనంలో లభించింది. ఎంతో ఆనందంతో తులసీ వనంలో దొరికింది కనుక గోదా అని పిలిచేవారు. గోదా బాల్యం నుండే విష్ణువు పట్ల ఎంతో భక్తి, ప్రేమాభిమానాలు కనబరచేది. లక్ష్మీ ఎక్కడ వున్నా విష్ణువును తలచకుండా ఉండలేదు కదా.. గోదా కూడా తన మనసులో రంగనాథుడు తప్ప మరొక దైవాన్ని తలచేది కాదు. బాల్యంలోనే అద్భుతంగా కావ్యాలు కీర్తనలతో కృష్ణుని స్తుతించేది.

రంగనాథుడితో ప్రేమ :


ఆండాళ్ వయసుతో పాటు రంగనాథుడిపై ప్రేమకూడా పెంచుకుంది, ఆ రంగనికే మనసిచ్చింది. రంగనాథుడినే పరిణయమాడాలని తలచింది.. ఎన్నో ప్రేమ కావ్యాలను రాసింది., రహస్యంగా స్వామి వారికి ప్రేమ సందేశాలు పంపించేది. ఆ సందేశమే తన ప్రేమని బహిర్గతం చేసింది.

ఆండాళ్ తానే స్వయంగా వటపత్రశాయి రంగనాథ మూలవిరాట్టుకు తులసీ, పూలమాలలు అల్లి తండ్రి పేరియాళ్వారుకి అందించేది. అయితే తాను అల్లిన మాల తన స్వామి ఎలా‌ ఉంటుందో అని గోదా ముందు తానే ధరించి అద్దంలో చూస్కుని, ఆ రంగనాథుడికి సమర్పించిన ప్రణయ మాలగా, వివాహ మాలగా ఊహించుకుంటూ మురిసిపోయేది

ఒకనాడు అనుకోకుండా విష్ణుచిత్తుడు మాలలను స్వామికి ధరిస్తుండగా మాలలో కేశాలు కనబడ్డాయి. అంతటితో అపవిత్రమైన మాలలను స్వామికి సమర్పించవలసి వచ్చిందని బాధపడిన పెరియాళ్వార్ ఈ కేశాలు ఎక్కడి నుండి వచ్చాయని పరిశీలించగా మరుసటి రోజున అదే విధిగా అల్లిన మాలను ధరించి ఇచ్చిన గోదా ని చూసిన విష్ణుచిత్తుడు ఆగ్రహానికి గురుయ్యాడు. అందుకు సమాధానం గా ఆండాళ్ రంగనాథుడే తన భర్త అని తేల్చి చెప్తుంది‌. అందుకు విష్ణుచిత్తుడు శ్రీ కృష్ణుడు ఈ కాలానికి చెందిన వాడు కాదని, కేవలం స్వామిని అర్చావతార విగ్రహం లాగానే అరాధించాలి తప్పా వివాహం చేస్కోవటం కుదరదని, మాలలని ధరించి అపవిత్రం చేయవద్దని హెచ్చరిస్తాడు. ఆ నాడు గోదా తాకకుండా తానే అల్లిన మాలలను రంగనాథుడికి సమర్పిస్తారు . 

నాటి రాత్రి స్వయముగా రంగనాథస్వామి వారు విష్ణుచిత్తుడి స్వప్నంలో దర్శనమిచ్చి గోదా వేరెవరో కాదని సాక్షాత్తూ భూదేవీ స్వరూపమేనని తాను ధరించి ఇచ్చిన మాలలను మాత్రనే స్వీకరిస్తానని అన్నారు‌‌. నాటి నుండి ప్రతీ రోజు గోదా ధరించిన మాలలనే స్వామికి సమర్పించారు.

గోదా రంగనాథుల పరిణయం :



రంగనాథ స్వామిని వివాహమాడ తలచిన గోదా శ్రీకృష్ణుడి కోసం గోపికలు ఆచరించిన కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించింది. మార్గశిరమాసంలో వచ్చే ధనుర్మాసం మొదలుకొని మకర సంక్రాంతి వరకు ముప్పై రోజులు ఈ వ్రతాన్ని ఆచరించింది. దీనినే ధనుర్నాస వ్రతం, మార్గశిర వ్రతం, సిరినోము, కాత్యాయనీ వ్రతం అనే పేర్లతో పిలుస్తారు

ప్రతీ రోజు బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొని తన మిత్రులతో కలిసి నదీస్నానమాచరించి, పూలని, తులసీ దళాలని సేకరించి, దేవాలయాలని దర్శించి సుప్రభాత సేవతో మొదులుకొని ద్రావిడ ప్రభంద పారాయణాలతో ఈ వ్రతాన్ని ఆచరించింది.. ఈ ముప్పై రోజులలో గోదాదేవి స్వయంగా రోజుకు ఒక పాశురము చొప్పున ముప్పై పాశురములు రచించి పాడి స్వామికి సమర్పించింది‌. అదే తిరుప్పావై.



తిరుప్పావై మొదటి పాశురం :

మార్గళి త్తిజ్ఞ్గల్ మది నిరైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిలైయీర్
శీర్ మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్ కాళ్
కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్
కార్మేనిచ్చజ్ఞ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పరైతరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్


ఇలా ముప్పై పాశురములతో స్వామిని పూజించింది . అంతే కాదు "నాచియార్ తిరుమొఱ్ఱి" అనే ద్రావిడ గ్రంథాన్ని కూడా రచించింది . వీటిలో రంగనాథుడిపై తన పవిత్ర భక్తి, ప్రేమ, అభిమానం, ఆశలు, బావోద్వేగం, అనురాగం, అలకలు, చిలిపి తనం, కోపాలు, తాపాలు, ఆప్యాయ ప్రేమ సందేశాలతో కూడిన అత్యంత పరమ పవిత్రమైన నూటానలబై మూడు పాశురములను రచించి సమర్పించింది. తన రచనలు కావ్యాలు పాశురములు అన్ని కూడా తనలో పరమాత్మను వెతుక్కునే మార్గాలుగానే గోచరిస్తాయి. ఆధ్యాత్మిక తాపత్రయానికి ప్రతీకలుగా నిలుస్తాయి‌‌‌. ఈ కావ్యాలే రంగనాథుడికి దగ్గరచేశాయి.

రంగనాథుడి ఆదేశానుసారం గోదాదేవి పెళ్ళి కూతురుగా అలంకరించి పల్లకిలో ఊరేగిస్తూ రంగని చేర్చిరి. నాటి రాజు  వల్లభ దేవునితో సహా యావత్ ప్రజలందరి సమక్షంలో ఆలయంలో రంగనాథుడితో గోదాదేవికి వివాహం చేశారు‌. వివాహనంతరం గోదా రంగనాథుడిలో లీనమైనది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత