రత్నధారణ | నవరత్నాలు | నవగ్రహాలు
రత్న ప్రభావం మనుషులపై ఉంటుందా..? ఏ విధంగా ధరించాలి.?
కచ్చితంగా రత్న ప్రభావం మనిషిపై ఉంటుంది.! కానీ ఆయా రత్నాలు సరైన విధానంలో సరైన జాతి రత్నాలని ఎంపిక చేస్కోవలసి వుంటుంది., రత్నాలు ధరించడం మన సనాతన సాంప్రదాయంలో వేదకాలం నుండి కూడా ఉంది, ఎవరు ఏ రకమైన రత్న ధారణ చేయాలన్నది, జ్యోతిష్యశాస్త్ర భాగమైన రత్న శాస్త్రం తెలియజేస్తుంది.!
రత్నాలు మనకు కీర్తిని, బలాన్ని, ఆయుష్షుని, ఆరోగ్యాన్ని, యశస్సు ని, అదృష్టాన్ని కలిగిస్తాయి..! గ్రహ దోషాలు తొలగడం, గ్రహ సంబంధిత అనుగ్రహం కలగడం వంటి అనేక ప్రయోజానాలున్నాయి. రత్నాన్ని హారం లేదా ఉంగరంలో పొదిగి ధరించాలి. ఒక్కో గ్రహం ఒక్కో రత్నానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అనంత విశ్వంలోని విశ్వ శక్తి (యూనివర్సల్ పవర్)ని గ్రహించి మనిషికి అందులోని పాజిటివ్ ఎనర్జీని అందిస్తాయి. రత్నాలు కిరణాల నుండి వెలువడే కాంతిని గ్రహించి ఆయా గ్రహాల యొక్క ప్రభావాన్ని , ప్రతీకూల శక్తులను తొలగించి శుభాన్ని చేకూరుస్తాయి.! ఆయ రత్నాలు మన శరీరాన్ని తాకుతూ ఉండటం వలన గ్రహాల సానుకూల శక్తులను నిరంతరం గ్రహించి మనపై ఆ సానుకూల వాతావరణాన్ని కలిగించడమే రత్నాల ప్రత్యేకత.!
రత్నాలు మన కలలని సుసంపన్నం చేయగలవు. దోషాలను, బాధలను సునాయాసంగా తొలగించగలవు. కానీ ఆయా రత్నాల ఎంపికే అతి పెద్ద సమస్య..! అయితే ఈ మధ్య కాలంలో రత్నాల అమ్మకం, అతిపెద్ద వ్యాపారంగా మారింది. జ్యోతిష్య పండితులే స్వయంగా రత్నాలు అమ్ముకుంటూ ప్రజల నమ్మకాలతో వ్యాపారం చేస్తున్నారు. తద్వారా ప్రజలు శాస్త్రాలపై విశ్వాసాన్ని కోల్పోవడానికి కారణమవుతున్నారు..!
ఈ నవరత్నాలన్నీ శక్తివంతమైనవే..! ముందుగా జాతక రీత్యా, పరిస్థితులు - అవసరాల రీత్యా రత్నాన్ని ఎంపిక చేస్కోవలసివుంటుంది. ఆ రత్నాన్ని ఎన్ని క్యారెట్లు ధరించాలి, ఏ లోహంలో, ఏ ఆకారంలో చేయించి ఏ వ్రేలికి ధరించాలి అన్నది కచ్చితంగా పరిశీలించాలి.! రత్నానికి రత్న పరీక్ష ఉంటుంది, అసలైన జాతి రత్నాలు మాత్రమే ధరంచాలి. రంగురాల్లెపుడు రత్నాలు కాలేవు..! రత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ మచ్చలు, పగుళ్లు, గీతలు, గుంతలు వంటివి ఉండరాదు. ఉంటే అది దోషరత్నం అనబడుతుంది.! లోపం గల రత్నాన్ని ధరించండం అంటే మన కర్మను మనం కొని తెచ్చుకోవడమే అవుతుంది.! ఎంపిక చేసి తెచ్చుకున్న జాతిరత్నాన్ని పొదిగిన ఉంగరాన్ని ఆ రత్న గ్రహం యొక్క వారం రోజున శుద్ధి చేసి జప, తర్పణాదులు, అభిషేక, మార్జన అనంతరం ధరించాల్సివుంటుంది.!
మన సాంప్రదాయంలో పూర్వం మహిళలు ఏడువారాల నగలు ధరించేవారు.. అది శాస్త్రీయమే, ఏ వారం ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఏ రత్నాల హారాలని ధరించాలన్నది కూడా శాస్త్రాలలో చెప్పడానికి కారణం. ఆయా గ్రహాల నుండి పాజిటివ్ శక్తిని పొందడం, సుఖ సౌఖ్యాలను పొందడం, దోష నివారణ జరగడం, గ్రహ బాధలు తొలగడం, ప్రమాదాలకు దూరం చేయడం, ఆరోగ్య సమస్యలు నివారించడం వంటే ఎన్నో కోణాలు దాగివున్నాయి.
ఆదివారం - రవి - కెంపులు
సోమవారం - చంద్ర - ముత్యాలు
మంగళవారం - కుజుడు - పగడాలు
బుధవారం - బుధుడు - పచ్చ
గురువారం - గురుడు - కనకపుష్యహారం
శుక్రవారం - శుక్రుడు - వజ్రాలు
శనివారం - శని - ఇంద్రనీలం
(రాహువు - గోమేదికం, కేతువు - వైడూర్యం)
ఇలా వారంలోని ఏడు రోజుల్లో ఆయా అధిపతుల యొక్క రత్నాన్ని ధరించడం సాంప్రదాయంగా ఉండేది.. నేడు కూడా కొన్ని దేవాలయాల్లో ఆయా వర్ణ, రత్న ఆభరణాలతో అమ్మవార్లను అలంకరించడం చూడవచ్చు..
జ్యోతిష్యపరంగా రత్నాన్ని ఎలా ఎంపిక చేసి ధరించాలి.?
రత్నాలు పలు రకాలుగా ఎంపిన చేస్కోవలసివుంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో రత్నాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వటం జరగదు, కేవలం భగవత్ ఆరాధనకు ముఖ్య ప్రాధాన్యత ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రంలో అంతర్భాగంగా రత్నశాస్త్రం, పరిహార క్రియలు, వైద్య జ్యోతిష భాగాలలో మరియు మోడర్న్ ఆష్ట్రోలజీ మెథోడ్స్, వెస్టర్న్ ఆష్ట్రోలజీ, జెమ్ సైన్స్, జెమ్ ఆష్ట్రోలజీ పాశ్చాత్య సిద్దాంతాలలో రత్నాల గురించి వివరణలున్నాయి. సుమారు 84 రకాల రత్నాలు చెప్పబడ్డాయి. కానీ వాటిలో కేవలం 9 మాత్రమే నవగ్రహ రత్నాలుగా, నవరత్నాలుగా పరిగణలోకి తీస్కోవటం జరిగింది. వీటిని క్రింది విధంగా ఎంపిక చేయాల్సి వుంటుంది.
~ బర్త్ స్టోన్ : జన్మ నక్షత్రాధిపతి , జన్మరాశ్యాధిపతి, జన్మలగ్నాధిపతి అనుసరించి అదృష్ట రత్నం, జీవన రత్నం, పుణ్య రత్నం అని మూడు రకాలుగా రత్నాలు ధరించడం జరుగుతుంది. వీటి కాల పరిమితి లేదు. అవి జీవితాంతం ధరించవచ్చు.
~ రెమెడీ స్టోన్ : జాతక రీత్యా కలిగే దోషాలకు, మహర్దశలు , అంతర్దశలకు సంబందించిన, లేమ గ్రహచార రీత్యా కలిగే సమస్యలకు పరిహారంగా, మరియు విద్యా ఉద్యోగం వ్యాపారం వివాహం వంటి ఇష్ట కామ్యాలను పొందడానికి ఆయా అనుకూల గ్రహాల యొక్క రత్నాలను ధరించడాన్ని పరిహార రత్నంగా భావించడం జరుగుతుంది. ఇది పరిమిత కాలం ఆ దశాకాలాలు లేక సమస్య నుండి బయటపడే వరకు మాత్రమే ధరించాలి.
~ మెడికల్ స్టోన్ : నవగ్రహాల్లో ఒక్కో గ్రహం మనిషి శరీరంలోని ఒక్కో భాగం మీద ప్రభావం చూపుతారు. అది ఆయా గ్రహాల కారకత్వాల మీద ఆధారపడివుంటుంది. ఆరోగ్య సమస్యను గుర్తించి ఆ గ్రహం యొక్క రత్నాన్ని వినియోగించడం ద్వారా ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు..
శాస్త్రీయంగా కుజుడు రక్తపోటు, మరియు ఎముకలకు కారకత్వం వహిస్తున్నాడు. కుజ కారకత్వ ఆరోగ్య సమస్యకి పగడం వినియోగించాలి.. పూర్వీకులు ఎముక విరిగినపుడు పగడంతో ట్రీట్మెంట్ చేసేవారట, అది కొన్ని రోజుల్లో ఎముకను ధృడపరుస్తుంది. ఇది మన శాస్త్రం చెప్పిన అక్షరం కూడా పొల్లుపోదనడానికి ఇదొక నిదర్శనం. ఇలాగే రవి - కెంపు ధరించడం ద్వారా గుండె సమస్యలు నివారణ,. చంద్ర - ముత్యం ధరించడం ద్వారా మానసిక సమస్యలు నివారణ జరుగుతుంది.
అయితే ఆరోగ్య సమస్య ఉన్నదని నేరుగా రత్నాలను వినియోగించకూడదు. ఒక ఆరోగ్య సమస్య కలిగిందంటే అందుకు జాతకంలో కారకత్వం కచ్చితంగా తెలుస్తుంది ముందుగా ఆ కారకత్వాలను పరిశీలించవలసి వుంటుంది. జన్మ జాతకంలో ఉన్నటువంటి దోషాలు గానీ, దశలు అంతర్థశా నాథుల ప్రభావం గానీ లేక ప్రస్తుత గోచార ప్రభావం గానీ ఆ ఆరోగ్య సమస్యలకు కారకత్వం అవుతుంది. కొన్ని గ్రహాలు జన్మ జాతకంలోనే మారకులుగా ఉంటారు వారి సమయాన్ని చూసి ప్రభావాన్ని చూపుతుంటారు. అలాంటి సమస్య జాతకంలో కనబడినపుడు మాత్రమే ఆయా గ్రహ రత్నాలు వాడాలని వైద్య జ్యోతిష్యం తెలియజేస్తుంది.
అయితే ఏ రత్నాన్ని ఎంత ప్రమాణంలో ఎన్ని క్యారెట్లు ధరించాలి, ఏ వ్రేలికి ధరించాలి, ఏ లోహంలో ధరించాలి అన్న వాటిలోనే అసలైన సూక్ష్మం దాగివుంటుంది. ఏ ఒక్కటి తప్పినా అసలుకే మోసం వచ్చి పర్యవసానాలు అనుభవించక తప్పదు..!
నవగ్రహాలల్లో ఒక్కో గ్రహానికి ఇతర గ్రహాలతో మిత్రుత్వ, శతృత్వాలు ఉంటాయి. మీరు పుట్టిన నక్షత్ర అధిపతికి మీరు ధరించే రత్న అధిపతికి మిత్రుడు లేక సముడు అయుండాలి అంతేగాని శతృవు కాకూడదు. శతృత్వాలు కలిగిన రెండు గ్రహాల ఉంగరాలు ఒకే సమయంలో ధరించరాదు. ఒక గ్రహ దశలో వ్యతిరేక గ్రహ రత్నాని కూడా ధరించరాదు. ఇలా అనేక కీలక విషయాలను పరిగణలోకి తీస్కోవలసివుంటుంది.. అందుకే రత్నాన్ని ఏ విధంగా ధరించాలో మహర్షులు ఒక శాస్త్రంగా మనకు అందించారు. పూర్తి రత్న శాస్త్ర అవగాహన కలిగిన పండితుడి సలహా మేరకు మాత్రమే రత్నాన్ని ధరించాలి. రత్నాలపై కనీస అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వివరాలు అందిస్తున్నాను.. మీ ప్రయోగాలకు మీరే బాధ్యులు.!
గ్రహము - రత్నము - ప్రయోజనం
సూర్యుడు - కెంపు/Ruby
బంగారంలో కుడిచేయి ఉంగరపు వ్రేలికి ధరించాలి.
సూర్యుడు గ్రహాలకు రాజు కాబట్టి కెంపు కూడా ఆ స్థాయిలోనే ఫలితాలను ఇవ్వగలదు, బిక్షగాడ్ని కూడా రాజును చేయగలదు. హృదయ సంబంధిత సమస్యలు, కంటిచూపు, రక్తస్రావం, అతిసారం, అజీర్తి, ఆయుష్షు వంటి విషయాలపై సూర్యుడు ప్రభావం చూపుతాడు. కనుక ఆయా సమస్యల నివారణకు కెంపు ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు నిరాశ, నిస్పృహల నుండి దూరం చేసి సంపూర్ణ ఆత్మ స్థైర్యాన్ని కలిగిస్తుంది.
చంద్రుడు - ముత్యం/PEARL
వెండిలో కుడిచేయి చిటికెన వ్రేలికి ధరించాలి.
చంద్రుడు మనః కారకుడు. మానసిక సమస్యలకు, మానసిక భావోద్వేగాలను నియంత్రిస్తాడు. మానసిక ప్రశాంతత, స్థిరత్వం, మనోహరమైన కంటిచూపు లభిస్తుంది. అనిశ్చితి నుండి విముక్తి, ఆర్థిక భరోసా లభిస్తుంది, సౌఖ్యాలను అందిస్తుంది. డిప్రెషన్, మెంటల్ ప్రెషర్స్, మూత్రాశయ వ్యాధులు, శరీర ద్రవ సమతుల్య జరుగుతుంది. జ్ఞాపక శక్తి మెరుకుపడుతుంది.
కుజుడు - పగడం/RED CORAL
రాగిలో కుడిచేయి ఉంగరపు వ్రేలికి ధరించాలి
ముఖ్యంగా త్రిభుజాకారంలో రాగి లోహంలో చేసిన పగడాన్ని ధరించడం ద్వారా కుజదోషం తొలగుతుంది. తద్వారా శీఘ్ర వివాహం, సంతానం కలుగుతుంది. కుజుడు మనిషి ని ధృడంగా మలుస్తాడు. పగడాన్ని ధరించిన వారి మాట బాట ఎంతో డైనమిక్ గా ఉంటాయి. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. రక్త సంబంధిత, ఎముకల సంబంధిత, జీవశక్తి కోల్పోవడం వంటి సమస్యలకు తక్షణ పరిష్కారంగా పగడం పనిచేస్తుంది.
బుధుడు - మరకతం/పచ్చ/Emerald
బంగారంలో కుడిచేయి చిటికన వ్రేలికి ధరించాలి.
బుధుడు బుద్ధి కారకుడు బుద్ధి మాంద్యం తొలగడానికి సృజనాత్మక శక్తిని పెంపొందించుకోవడానికి, విద్యా ప్రాప్తికి, మేధస్సు పెంపొందిచకోవడానికి, ప్రజాదరణ పొందడానికి ముఖ్యంగా మరకతం ద్వారా వ్యాపార అభివృద్ధి విస్తృతంగా లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి.
నాలుక, చెవి వంటి జ్ఞానేంద్రియాలకు, మెదడు, శ్వాస సంబంధిత సమస్యలకు పరిహారం గా కూడా వినియోగించవచ్చు.
గురువు - కనక పుష్యరాగం/Yellow Sapphire
బంగారంలో కుడిచేయి చూపుడు వ్రేలికి ధరించాలి.
బృహస్పతి దేవతలకు గురువు. ఆయన అనుగ్రహం ఉంటే లేనిది కానిది అంటూ ఏముండదు. ఆరోగ్యం, ఐశ్వర్యం, కీర్తి, ప్రతిష్ఠలు అన్నీ లభిస్తాయి. అయితే ఇది ముఖ్యంగా పండితులకు, అధ్యాపకులకు, రచయితలకు, కవులకు, కళాకారులకు, న్యాయవాదులకు, నాయకులకు శాశ్వత కీర్తిని అందిస్తుందనడంలో సందేహం లేదు. విద్యా ఉద్యోగం వంటి వాటిలో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుంది. శీఘ్ర వివాహానికి దోహదపడుతుంది. ఆరోగ్య పరంగా శరీరంలోని షట్ చక్రాలను ఉత్తేజ పరుస్తుంది. వ్యక్తిత్వం మెరుగుపడేలా దోహదపడుతుంది. వైవాహిక జీవితంలో ఎంతో సఖ్యత కలిగిస్తుంది.
శుక్రుడు - వజ్రము/Diamond
బంగారం లేదా ప్లాటినంలో కుడిచేయి ఉంగర/మధ్య వ్రేలికి ధరించాలి
శుక్రుడు భోగాలకు అనుగ్రహిస్తాడు. వజ్రం ఆర్థిక స్థితిని తెలియజేస్తుంది. రూపము, ఉన్నత స్థితి, భోగాలు, భాగ్యాలు, సుఖాలు, సంతోషాలు, సంతృప్తి, సౌఖ్యం, శృంగారం, కళలు, వ్యాపారం, సంపద వంటి అనేక విషయాలను వజ్రం ప్రభావితం చేస్తుంది. పదవీ యోగాలు, విదేశీయానాలు, విలాస సౌకర్యాల కొనుగోలు మరియు ధరించడం ద్వారా అన్యోన్య దాంపత్య సౌఖ్యం, సంతానం లభిస్తుంది. ఆరోగ్య పరంగా లైంగిక సామర్థ్యం, కోరికలు, సుఖవ్యాధులను నియంత్రిస్తుంది.
శని - ఇంద్రనీలం/Blue Sapphire
వెండిలో కుడిచేయి మధ్యవ్రేలికి ధరించాలి.
శని ప్రాణ కారకుడు. జీవితంలో అతి ముఖ్యమైన అంశాలు ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులు, పదవీ యోగాలు వంటి వాటిపై అత్యంత వేగవంతంగా ప్రభావం చూపుతుంది. అకాల మరణాలను, ఆపదలను దూరం చేస్తుంది. ఇంద్రనీలం అనుకూలిస్తే బిక్షగాడు రాజు కాగలడు, ప్రతికూలిస్తే రాజు బిక్షగాడు కూడా కాగలడు కాబట్టి అత్యంత జాగ్రత్త అవసరం.
రాహువు - గోమేధికము/Hessonite
వెండిలో కుడిచేయి మధ్య వ్రేలికి ధరించాలి
రాహువు చర్మ సమస్యలకు కారకత్వం వహిస్తాడు కుష్ఠు, సోరియాసిస్ వంటి ప్రమాదకర చర్మ సమస్యలకు గోమేధికం అద్భుతమైన పరిహారం కాగలదు. మూర్చ, అలర్జీ, సైనస్, పేగు వ్యాధులు వంటి సమస్యలకు మానసిక ఆందోళనకు ఆర్థిక నష్టాలు, ఉద్యోగ పదవీ నష్టాలకు పరిహారం కాగలదు. నరదిష్ఠి, చేతబడి వంటి క్షుద్ర ప్రయోగాలను సంహరించగలదు.
కేతువు - వైడూర్యము/Cat's eye
వెంటిలో కుడిచేయి ఉంగరపు వ్రేలికి ధరించాలి.
కేతువు జ్ఞాన కారకుడు. వైడూర్యం ధరించడం వలన జ్ఞాన శక్తి మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక, ప్రాపంచిక విషయాలపై పూర్తి అవగాహన కలుగుతుంది. ఆత్మ సంతృప్తి కలిగిస్తుంది, పూర్వ కర్మ ఫలాలను, పాప పుణ్యాలను బేరీజు వేస్తుంది. ఆలోచన శైలిలో పరిపక్వత లభిస్తుంది. పిచ్చివాడిని సైతం జ్ఞానవంతుడిగా మార్చగల శక్తి వైడూర్యానికి ఉంటుంది..
సరైన అవగాహన లేకుండా రత్నాన్ని ధరించడం కంటే ప్రమాదకరం ఇంకొకటి లేదు.. తెలియక వాడటం కంటే పెట్టక మానుకోవడం ఉత్తమం, ఆర్భాటాల కోసం అర్థం లేని రంగు రాళ్లు పెడితే ఇబ్బందుల పాలవ్వక తప్పదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం..!
డా" ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ
జ్యోతిష్య రత్న, జ్యోతిష్య శిరోమణి, జ్యోతిష్య మహర్షి
పిహెచ్‌డి డాక్టరేట్ గోల్డ్ మెడల్ ఇన్ ఆష్ట్రోలజీ
అంతర్జాతీయ జ్యోతిష్య పురస్కార గ్రహీత (USA)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి