పరవాలేదు మిత్రమా.! కవిత ! మోహనకృష్ణ భార్గవ

" పరవాలేదు మిత్రమా..! " కవిత

రచన : ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ


మిత్రమా.!

నేను నచ్చలేదా.?
నా రంగు నచ్చలేదా.?
నా రూపు నచ్చలేదా.?
నా భాష నచ్చలేదా.?
నా బాట నచ్చలేదా.?

ఏం పరవాలేదు.!
నీ మనసుకు పట్టిన
మకిలి తుడుచుకో ముందు.!

మిత్రమా.!

నేను నచ్చలేదా.?
నా వృత్తి నచ్చలేదా.?
నా తీరు నచ్చలేదా.?
నా కులం నచ్చలేదా.?
నా జాతి నచ్చలేదా.?

ఏం పరవాలేదు.!
నీ ఒంటికి అంటిన
అడుసు కడుక్కో ముందు.!

మిత్రమా.!
నేను నచ్చలేదా.?

నీ వాకిట నిలిచే
శునకాన్ని కాను నేను.!
నీ కాల్లకు మడుగులొత్తే
బానిసను కాను నేను.!
నీ పడకలో అత్తరుజల్లే
కాంతను కాను నేను.!

నువు పుట్టకముందే పుట్టిన వివక్ష
శతాబ్దాల అంధకారాన్ని మోస్తుంది
అహంకారంతో గడ్డకట్టిన రక్తం
తెల్లని మంచుని చూసి ఈర్షపడుతుంది
ఎండిన సరస్సు లాటి మనసు
ఈర్ష్య ద్వేషాలతో కొట్టుమిట్టాడుతుంది
అసంపూర్ణ మార్గానికి ప్రేమతో బాటవేయి
దురహంకారంతో మసకబారిన
మానవత్వానికి స్నేహపు దివిటీ పట్టు.!

మిత్రమా.!
నేనెవడినంటావా.?

ఆలోచనలకు సానపట్టే
కలం‌ కార్మికుడ్ని నేను..
సమాజ భవితకై
బంగారు బాటను వేస్తా.!

ఆశల విత్తులు జల్లే
‌కలం‌ కర్షకుడ్ని నేను..
ద్వేషం నిండిన గుండెల్లో
స్నేహాన్ని సేద్యం చేస్తా..!

బడుగుల తోడుగ నిలిచే
కలం సైనికుడ్ని నేను..
చివరూపిరి వరకు
కంటికి పాపై పోరాటం చేస్తా..!

నా కలం నిరంతరం మెదిలే కవాతు
నా గలం అనుక్షణం రగిలే సవాలు
నా కలం అసమానతలపై  సింగిణి
నా గలం పీడీత వర్గాలకు పహారా..!

మిత్రమా.!
అయినా నేను నచ్చలేదా.?
ఏం పరవాలేదు..!
అణచివేతలు, అవమానాలు
నాకలవాటే.!

నాపై విసిరిన రాళ్లు, వదిలిన మాటలకు
బదులిచ్చేందుకు, బాధపడేందుకు
ఒప్పించేందుకు, మెప్పించేందుకు
తీరిక లేదు నాకు.. తిట్టుకో ఆనందంగా
ఏం పరవాలేదు..!

మిత్రమా.!
తలపై రాసిన రాతలు, చేయిన గీసిన గీతలు
తిరిగి రాసేందుకు  క్షణం క్షణం‌ కణం‌ కణం
ఆహుతిస్తున్నా.!

పీడిత పిడికిలి బిగించకముందే
సహనం దావానలమై దహించముందే
నవ్వుకో ఆనందంగా..
ఏం‌ పరవాలేదు..!

ప్రేమతో మిత్రుడు.. మోహనకృష్ణ భార్గవ

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత