తొలి ఏకాదశి | శయన ఏకాదశి విశిష్టత

భగవద్భ‌ంధువులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు 

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం !
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం !!
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం !
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాధం !!


ఆషాడమాసము శుక్లపక్షములో వచ్చే ఏకాదశిని "తొలి ఏకాదశి" అని పిలుస్తారు.. పూర్వం నూతన సంవత్సరం వర్ష ఋతువుతో ప్రారంభమయేదని, వర్షం అంటే సంవత్సరం అని అర్థం కూడా.. వర్ష ఋతువులో వచ్చే మొదటి ఏకాదశి కనుక తొలి ఏకాదశి అని పిలిచారని కూడా  ఒక నానుడి ఉన్నది.. ప్రతీ నెలలో శుక్లపక్షము, కృష్ణ పక్షము రెండు ఏకాదశులు., మొత్తం సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. దక్షిణాయనానికి ముందు వచ్చే ఈ తొలి ఏకాదశి దేవతలకు ఎంతో విశేషమైనది, భక్తులకు ఆచరణీయమైనది.

 సూర్యుడి గమనంలో సంవత్సరానికి ఆరునెలలు భూమధ్యరేఖకు దక్షిణం వైపుగా పయనిస్తాడు దానిని దక్షిణాయనం అని, మరో ఆరు నెలలు భూమధ్యరేఖకు ఉత్తరం వైపుకు పయనిస్తాడు దానిని ఉత్తరాయణం అని అంటారు. అయితే మనకు పగలు రాత్రి కలిపితే ఒకరోజు ఎలా అవుతుందో, దేవతలకు కూడా ఉత్తర, దక్షిణ ఆయనాలు కలిపి ఒక రోజు అవుతుంది., అంటే మనకు ఒక సంవత్సర కాలం దేవతలకు ఒక రోజుతో సమానం., ఉత్తరాయణం ఆరు నెలలు దేవతలకు పగలు అవగా, దక్షిణాయనం రాత్రి అవుతుంది. అంటే దేవతలు నిదురించే కాలం‌.

అయితే.. తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్తారని భక్తుల విశ్వాసం., స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని "శయన ఏకాదశి" అని కూడా అంటారు,. 

పూర్వం మాంధాత అనే చక్రవర్తి, తన రాజ్యంలో తీవ్ర కరువు ఏర్పడటంతో బాధపడుతుందగా.. ఆంగీరస మహర్షి రాజుతో శయన ఏకాదశి వ్రతాన్ని చేయించగా ఫలితంగా వర్షాలు కురవడంతో కష్టాలు తీరాయని పురాణాలు చెప్తున్నాయి..

నేటి కాలంలో వర్షాలు పడకపోతే అనావృష్టి కరువు కాటకాలు‌,. వర్షాలు  ఎక్కువైతే అతివృష్టి నష్టాలు తప్పవు.. ప్రకృతి వైపరీత్యాలను చవి చూస్తున్నది సమాజం.. మనిషి చేస్తున్న తప్పిదాల వల్ల ప్రకృతి తన సహజ లక్షణాలను కోల్పోతున్నది..


ఏకాదశి విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది, పురాణ కథనం ప్రకారం పూర్వం "ముర" అనే రాక్షసుడు విష్ణువుతో యుద్ధం చేశాడు. యుద్ధం నుండి తప్పించుకున్న మురుడిని వెతికిన విష్ణువు అలసి సేదతీరుతాడు, అదే అదునుగా చూసిన మురుడు విష్ణువును సంహరించేందుకు ప్రయత్నిస్తాడు, ఆ క్షణంలో విష్ణువు దేహం నుండి లక్ష్మీ స్వరూపమైన ఒక అనంతమైన శక్తి ఉద్భవించి, ఆ మురుడిని సంహరిస్తుంది. ఆ రోజు ఏకాదశి కావడంతో ఆ తేజస్సును విష్ణువు ఏకాదశి అని పిలిచాడు.

నారాయణుడు ఏకాదశితో..
శ్లో" మమ భక్తాశ్చ యే లోకాః తవ భక్తాశ్చ యే నరాః !
త్రిషు లోకేషు విఖ్యాతాః ప్రాప్స్యంతి మమ సన్నిధిం.!! 

నన్ను రక్షించిన ఏకాదశిని ఎవరైతే భక్తితో ఆరాధిస్తారో వారు ముల్లోకాలలో శాశ్వత కీర్తిని, అంత్యమున ముక్తిని, వైకుంఠ ప్రాప్తిని తప్పకుండా పొందుతారని ఏకాదశికి విష్ణువు వరం అనుగ్రహించాడు.

తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉంటారు,. మరునాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన తరువాతే భోజనం చేయాలని తద్వారా జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని భక్తుల నమ్మకం..

తొలి ఏకాదశి నాడు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు., దానిని "ఉత్థాన ఏకాదశి " అంటారు.  ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు..
 
ఏకభుక్త మధశ్శయ్యా బ్రహ్మచర్య మహింసనమ్ !
వ్రతచర్యా తపశ్చర్యా కృచ్చచాంద్రాయణాదికమ్ !!
దేవపూజా మంత్రజపో దశైతే నియమాః స్మృతాః !!


ఈ నాలుగు నెలల కాలాన్నీ అత్యంత పవిత్రంగా పరిగణించి సాధువులు, సన్యాసులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, చాతుర్మాస్య దీక్ష చేపడారు,. దీక్ష చేపట్టినవారు నాలుగు నెలల పాటు ఎటువంటి ప్రయాణాలు చేయరు,. ఏకభుక్తంగా వ్రతాన్ని ఆచరిస్తూ.. కామ క్రోధాదులను, సౌఖ్యాలు, భోగాలు విసర్జించి నిరంతర మంత్రజప తపస్సు స్వీకరిస్తారు,.  ఆహారం విషయంలో కొన్ని నియమాలు, నిషేధాలు పాటిస్తారు. జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు, రైతులు ఆరోజున ఖచ్చితంగా పేలపిండి పదార్థాలు స్వీకరిస్తారు..

ఈ ఏకాదశి అంటే ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక., యోగ నిద్ర అంటే... భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పటానికి సూచన.,  అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్న మాట., వానా కాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా పండితులు చెప్తున్నప్పటికీ, ఏకాదశి అంటే పదకొండు.. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు., వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటన్నిటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలన్నది ఏకాదశి వ్రతంలో దాగిన ధార్మిక సూత్రం..!

లంఖణం పరమ ఔషధం అన్నట్లు.. ఈ ఉపవాస దీక్ష, నియమ బద్ధమైన జీవన, ఆహార విధానాల‌ ద్వారా మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఆయుర్వేద సూత్రం..!

దక్షిణాయన పుణ్యకాలం..!


విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే, నిజంగానే దేవుడు నిద్రపోతాడా.? సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే, ఈ సృష్టి ఎలా నడుస్తుంది.? ఈ పూజలు ఎవరికి చేయాలి, అంటూ కొందరికి సందేహం కలుగవచ్చు.!

 "విశ్వం వేవేష్ఠి వ్యాప్నోతీతి విష్ణుః" విశ్వమంతటిమి వ్యాపించిన వాడు విష్ణువు అని అర్థం.! ఆ విష్ణువే సూర్య భగవానుడిగా సకల చరాచర జగత్తుకు వెలుగనందిస్తున్నాడు., ఉత్తరాయణం లో ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాలుతాడు.  అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు,. దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు పెద్దలు,. శాస్త్రీయంగా ఇదే దక్షిణాయన పుణ్యకాలం అని పేరు..

ఈ నెలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి, అనేక రోగాలు చుట్టుముడతాయి,. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై, దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది., ఇంతేకాక కష్ట పరిస్థితుల్లోనూ, భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి,. ఇందువలన కామ క్రోధాదులను విసర్జించగలుగుతారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. అలా ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది.

తొలి ఏకాదశి గోపూజకు ప్రాధాన్యత..

ఈ 'తొలి ఏకాదశి' నాడు "గోపద్మ వ్రతం" చేయుట ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు. ఇంతకీ గోవును పూజించుటలో గల ఆంతర్యమేమిటో కూడా ఈ సందర్భంగా కొద్దిగా తెలుసుకుందాం.!

ఈ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది. గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్మలయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వినీ దేవతలు నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణభాగమున వరుణ కుబేరులు, వామభాగము నందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానంబున సరస్వతి, గంగాతీర్థంబులు, గోమయంబున లక్ష్మీ, పాదాగ్రంబున ఖేచరులును, అంబా అంటూ అరచే అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను. కావున గోవును పూజిస్తే! సమస్త దేవతలను పూజించి నట్లేనని, సమస్త తీర్థములలో పుణ్య స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని 'గోమాతకు' ఇంతటి పూజనీయ స్థానాన్ని ఇచ్చారు.

గోపద్మ వ్రతం.. గోమాత నివశించే గోశాలను ఈ 'తొలిఏకాదశి' దినమందు మరింతగా శుభ్రముచేసి అలికి, వివిధ వర్ణాలతో రంగవల్లీ ముగ్గులతో తీర్చిదిద్ది, గోశాల మధ్య భాగమందు బియ్యపు పిండితో పద్మాల ముగ్గులు పెట్టి, శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను గానీ, కలశాన్ని గానీ ఆ‌ పద్మములపై నుంచి, వారిని విధి విధానంగా పూజించి, పద్మానికి ఒక్కొక్క "అప్పడాన్ని" వాటిపై ఉంచి ఆ అప్పడాలను, వాయనాలను, దక్షిణ తాంబూలాదులను దానమివ్వాలి,. 

గోశాలను అలంకరించడం, గోవును పూజించడం, అనంతరం గోశాలలోనే లక్ష్మీ నారాయణులను ఆవాహన చేసి పూజించడం, అనంతరం ముత్తైదువులకు వాయనాలు ఇచ్చి పూజించడం, ఇదే గోపద్మ వ్రతం.. ఈ రోజున గోమాతను పూజించు వారికి సకల అభీష్టములు తప్పక నెరవేరుతాయని పురాణాలలో చెప్పబడినది..

ఈ తొలి ఏకాదశి రోజున ఏమి చేయాలి.?

- నిన్ను ఏది చేయమని భగవంతుడు కోరడు.. భగవంతుడు నీకు ప్రసాదించిందే‌‌.‌. నలుగురికి పంచిపెట్టు.‌! అది ధనమైనా సరే, ధాన్యమైనా సరే, సంతోషమైనా సరే.. అంతే భగవంతుడు సంతృప్తి చెందడానికి మార్గం..!

- ఏకాదశి వ్రతం అంటే ఏకదశి తిథి రోజున ఉపవాసం చేయడమే.. 'ఉప' అంటే దగ్గరగా అని 'వాసం' అంటే ఉండటం అని అర్థం, భగవంతుడి చేరువగా ఉండటమే ఉపవాసం,. ఏకాదశి తిథి ఆద్యంతం భగవంతుడి ఆరాధనలో సమయాన్ని గడపటమే ఉపవాసం.,

- ఏకాదశి రోజున తులసి తీర్థం తప్ప మరేమీ తీస్కోకూడదు, పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇది వర్తించదు. వారి శరీరానికి శక్తికి తగినంత ఆహారాన్ని తీస్కోవచ్చు. ఉపవాసం చేసేవారు కూడా తమ శరీర పరిస్థితుల రీత్యా పాలు వంటి ద్రవ పదార్థాలు స్వీకరించవచ్చు, శక్తి సరిపోనివారు ఏదైనా ఫలహారాలు తీస్కొనవచ్చు‌., భగవంతునికి దగ్గర చేయడమే ఉపవాస రహస్యం గానీ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్కోవడం ఎంతమాత్రం కాదు., కరోనా తరువాత పరిణామాలతో ప్రజల ఆరోగ్య పరిస్థితుల్లో అనేక మార్పులు సంభవించాయి, అవి దృష్టిలో ఉంచుకొని ఉపవాస నియామాలలో కాస్త మార్పులు చేయడం తప్పుకాదు.

- శ్లో " శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం !
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం !!
భగవంతుని గాథలు వినడం, కీర్తించడం, స్మరించడం, స్వామి పాద సేవలో తరించడం, గుడిలో ఇంటిలో హృదయంలో స్వామిని అర్చించడం, సదా స్వామికి ప్రణమిల్లటం, హనుమలా దాసుడై సేవించడం, మిత్రుడిలా ఆత్మ నివేదన చేయడం.. అనేక మార్గల ద్వారా శ్రీమన్నారాయణుడిని ఆరాధించవచ్చు.. ఎవరి శక్తి, అవకాశాలను వారు సద్వినియోగ పరుచుకోవచ్చు.. ఇలాగే భక్తి ఉండాలని నిబంధనలేమి లేవు. భక్తికి సూత్రాలు లేవు, హద్దులు అసలే లేవు..

- పూజ, ఆరాధన, అభిషేకం, అర్చన, దేవాలయ దర్శనం, ప్రదక్షిణ, నదీస్నానం, ధ్యానము, జపము, తర్పణము, దానములు విశేష పుణ్యఫలితాలను ఇస్తాయి.,
- " ఓం నమో భగవతే వాసుదేవాయ ".,
" శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపధ్యే" .,
" ఓం నమో నారాయణాయ " అనే మంత్రాలు జపించాలి.

- విష్ణు సహస్ర నామ స్తోత్రము వంటి పవిత్ర స్తోత్రాలు, భగవద్గీత, భాగవతం, రామాయణం వంటి కావ్యాలు, పురాణాలు పఠనం చేయాలి. గోవింద నామ స్మరణం చేయాలి..
- ఏకాదశి ఉపవాసం పూర్తి చేస్కుని ద్వాదశి అన్నదానం చేయాలి., కనీసం ఒక్క అతిథికైనా చేయి కడిగిన తరువాతే వారు భోజనం చేయాలి.

భగవద్భందువులందరికీ ఆ శ్రీమన్నారాయణుడి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్థిల్లాలని భగవంతుని ప్రార్థిస్తూ..




డా" ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ
జ్యోతిష్య రత్న, జ్యోతిష్య శిరోమణి, జ్యోతిష్య మహర్షి
పిహెచ్‌డి డాక్టరేట్ గోల్డ్ మెడల్ ఇన్ ఆష్ట్రోలజీ
అంతర్జాతీయ జ్యోతిష్య పురస్కార గ్రహీత (USA)

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత