స్తోత్ర పారాయణం | సందేహాలు - సమాధానం
ఈరోజు ధర్మసందేహం - సమాధానం :
వివిధ దేవతా స్తోత్రాలు ఎవరైనా, ఎపుడైనా పఠించవచ్చా.? స్తోత్రాలు చదవడం మంచిదేనా.? చదవాలంటే అర్హతలేమిటి తెలియజేయగలరు..!
సమాధానం : స్తోత్రము అంటే భగవంతున్ని శబ్ధపూరితమైన శ్లోకాలతో కీర్తించడం.! భగవన్నామాన్ని, భకవత్మాహత్మ్యాన్ని ప్రశంసా గానము చేయడం.! అంటే భగవంతుని గుణగణాలను కీర్తించడమే స్తోత్రం అనబడుతుంది.! భగవంతుడి కృపను పొందడానికి, భక్తి తన్మయంలో తపస్యానందాన్ని పొందడానికి ఎవరి అనుమతి కావాలి.? అది నీ జన్మ హక్కు, మన పూర్వీకులు అందించిన గొప్ప వరం.!
భగవంతుడిని కీర్తించడానికి సమయం, సందర్భం అవసరం అంటారా.? కులాలు, వర్ణాలు, జాతుల అర్హతలు అడ్డుపడతాయంటారా.? ఆధ్యాత్మిక సాధనలో స్తోత్రము చేయడం అత్యంత ఆవశ్యమైవుంటుంది. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా భగవంతుడ్ని స్తోత్రాలతో స్తుతించి ఆయన అనుగ్రహం పొందండి..!
నవవిధ భక్తి మార్గాలు చెప్పబడ్డాయి.
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం !
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం !!
ఇతి పుంసార్పితా విష్ణౌ భక్తిశ్చేన్నవలక్షణా !
క్రియతే భగవత్యద్ధా తన్మన్యేధీతముత్తమమ్ !!
భక్తి, జ్ఞాన, కర్మ యోగాల ద్వారా భగవంతుడ్ని పొందవచ్చు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అంటూ తొమ్మిది రకాల భక్తి మార్గాలు అందుకు మనకు సహకరిస్తాయి. భగవంతుడ్ని పూజించడమే కాదు కీర్తించడం కూడా పరమ భక్తి మార్గమే అవుతుంది.
స్తోత్రములో..
~ భగవత్ ధ్యానము, రూపు, గుణగణాల వర్ణన..
~ ప్రధాన దేవతా స్తుతి, దేవతా చరిత, వారి మాహాత్మ్యం, వారు చేసిన యుద్ధాలు, వారి విజయాలు, భక్తి సాధన, అనుగ్రహ అనుభవాలు, భక్తుల విశ్వాసాలు, తదితర అంశాలు..
~ ఫలశ్రుతి (పారాయణం ఎపుడు ఎలా చేయాలి, తద్వారా ఏమి ఫలితం కలుగుతుంది అనే అంశాలు).
ఇటువంటి పలు అంశాలతో స్తోత్ర కల్పన చేయడం జరుగుతుంది.
స్తోత్ర పారాయణం చేయడానికి ముందుగా కొన్ని ముఖ్యమైన అంశాలు పరిగణలోకి తీస్కోవలసివుంటుంది.!
సూక్తాలు వేరు స్తోత్రాలు వేరు., సూక్తాలు, ఉపనిషత్తులు వేదాల నుండి వచ్చినవి. ఇటువంటి వేద వాఙ్మయాన్ని పఠించాలంటే తప్పకుండా వాటిని గురు ముఖతః ఉపదేశం తీస్కోవలసివుంటుంది. సూక్తాలు, ఉపనిషత్తుల్లో అనుదాత్త, ఉదాత్త, స్వరిత, ధీర్ఘస్వరాలు అనే పలు వేద స్వరాలు ఉంటాయి. వాటిని నేర్చుకోవలసివుంటుంది. వేద మంత్రాలు స్వరం లేకుండా పలకడం దోషంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఇటువంటి వాటికి కచ్చితంగా అభ్యాసం అవసరం.
స్తోత్ర పారాయణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అక్షర దోషాలు ఉండరాదు. విష్ణు సహస్రనామ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం, సౌందర్య లహరి వంటి స్తోత్రాలు చాలా క్లిష్టమైన పదాలతో నిర్మాణమైవుంటుంది. వాటిని పలకడంలో మహా మహా పండితులే కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి స్తోత్రము పారాయణానికి ముందు సరైన అభ్యాసం తప్పనిసరి. అనర్గళంగా స్తోత్ర పారాయణం చేయడం అలవర్చుకోవాలి.
స్తోత్ర పారాయణం ద్వారా మన చుట్టూ మనకు తెలియని శక్తి ఉత్పన్నమనవుతుంది. ధ్యానంలో అంతీర్లమైనపుడు మన ఆత్మ విశ్వశక్తిని ఆకర్షిస్తుంది. దాని నుండి ఒక పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది. ఆ శక్తి మన కోర్కెలను తీర్చగలదు, దోషాలను తొలగించగలదు, విశ్వాన్నే జయించగలరు. కాబట్టి స్తోత్రము ఎపుడు పవిత్ర స్థలంలోను లేదా పవిత్ర భావనతోనూ శుచితో, శ్రద్ధా పూర్వకంగా పఠించవలసివుంటుంది.
ఏ సంస్కృతిలో లేనటువంటి గొప్ప సాహిత్యం మనకు సొంతం. ఎన్నో వేలాది స్తోత్రాలు మన పూర్వీకులు మనకు అందించారు. అవి కేవలం కీర్తనలు మాత్రమే కాదు, వాటిలో ఎన్నో విశ్వ రహస్యాలు, ఆధ్యాత్మిక రహస్యాలు, జీవిత పరమార్థాలు, నిగూఢ అర్థాలు దాగివున్నాయి. అండ పిండ బ్రహ్మాండాలను పదాలతో తులాభారం వేయగల సత్తా మన పూర్వ సాహిత్యానికి ఉన్నది.! వారు పారవశ్యంతో చేసిన రచనలు ఎంతో విషయాన్ని కలిగివుంటాయనడంలో సందేహం లేదు. తులసీ దాస్ రచించిన హనుమాన్ చాలీసా లో "యుగసహస్ర యోజన పరభాను, లీల్యోతాహి మధుర ఫలజాను" అంటూ.. భూమికి సూర్యుడికి మధ్యన ఉన్నటువంటి దూరాన్ని ఒకేఒక్క పదంతో తేల్చి చెప్పేసాడు. అది భక్తి మహాత్మ్యం అనడంలో సందేహమేముంటుంది.!
స్తోత్ర పారాయణం అలవర్చుకోవడం ద్వారా భగవంతుడిపై గాఢమైన ప్రేమ, విశ్వాసాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక మార్గంలో సాగడం వల్ల క్రమశిక్షణ కలిగి జీవన విధానం అలవాటు అవుతుంది. ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపత్రయాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఎంతో గొప్ప సాహిత్యాన్ని మనకు అందించి పూర్వీకులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఆ సాహిత్య పరిమళాలను ఆస్వాదించిండి. భక్తి భావంలో తన్మయాన్ని పొందండి.!
~ మన సాహిత్యంలో వేలాది స్తోత్రాలు ఉన్నాయి. మన ఈ దేహం భగవంతున్ని కీర్తించడానికే అని తెలుసుకోవాలి. మనిషి జన్మ అనుగ్రహించినందుకు కృతజ్ఞతగా కనీసం ఒకటి రెండు స్తోత్రాలతో నిత్యం భగవంతుడిని ఆరాధించడం మన కనీస జీవిత ధర్మం. ఎలాంటి ఆలోచనలు, భయాలు, సందేహాలు లేకుండా మీరు స్తోత్రాలను అభ్యసించండి. మీ పిల్లలకు చిన్న వయసులో అలవాటు చేయండి. అది వారి బంగారు భవిష్యత్తుకు బాటను వేస్తుంది, సంస్కారాన్ని పెంపొందిస్తుంది.
డా" ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ
జ్యోతిష్య రత్న, జ్యోతిష్య శిరోమణి, జ్యోతిష్య మహర్షి
పిహెచ్‌డి డాక్టరేట్ గోల్డ్ మెడల్ ఇన్ ఆష్ట్రోలజీ
అంతర్జాతీయ జ్యోతిష్య పురస్కార గ్రహీత (USA)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి