" ఎవరొస్తారని " కవిత (2020)

"ఎవరొస్తారని.." కవిత - 2020


పచ్చపచ్చని పచ్చిక బయళ్లు
చచ్చిపుట్టిన కొమ్మ‌చిగుళ్లు
మురిపించే పూలవాసన
ఆత్మీయ పలకరింపువోలే
ఆటలాడి అలసిన
పసి హృదయాలను తాకి
పలకరించే తూనీగలెక్కడ.?

కురిసే చినుకు మురిసే మనసు
నేలమ్మని నమ్మి పుడమిని దున్ని
ప్రకృతి పరవశాన్ని అస్వాదిస్తూ
చెమట చుక్కని నీటిబొట్టుగా మార్చిన 
హాలికుడ్ని వసంతమాలికలా వచ్చి 
పులకరించి నాట్యమాడే
మయూరాలెక్కడ.?

ఎండా వాన తేడా తెలియక
తీరం‌తెలియని అగమ్యగోచర
బ్రతుకుబండి నడపలేక అలమటిస్తు
ఆకలికేకల హాలాహళాన్ని మింగిస్తుంటే
శ్రమపీడిత శ్రామికుల గోడువినేందుకు
ఆప్యాయంగా పలకరించే
రామచిలుకలెక్కడ.?

గుప్పెట్లో దాగిన గాలి
కనురెప్పల్లో నిండిన నీరు
దాహాన్ని తీర్చలేని సంద్రం
ఆర్తితో ఆకాశం వైపు చూపు
ఆశ నిరాశల కొలమిలో
మండే అగ్నికి ఆహుతైన
అల్పమైన బ్రతుకుల‌ చూసి
కన్నీరు కార్చే పిచ్చుకలెక్కడ.?

పల్లెలు పట్నాలాయే
అడవులు ఆక్రమణాయే
పొగ దూలితో నిండిన గాలి
శ్వాసదాటక ప్రాణం తీస్తుంటే
పొల్యూషన్ ఎర, ప్లాస్టిక్ తెర
ఫోర్జీ, ఫైజీ అంతర్జాల ఉచ్చులో
రేడియేషన్ ‌దెబ్బకి
చితికిన బ్రతుకులు.!

స్వార్థ శక్తులు దోపిడి దొంగల
చేతిలో నలుగుతు ప్రకృతిని వినాశనం
పశుపక్షాదుల గమనాన్ని శాసిస్తూ
ప్లాస్టిక్ కోరల్లో చిక్కిన పక్షులు
నెత్తుటితో తడిసి ప్రాణాలొదులుతున్న
అల్ప జీవుల కాపాడే పక్షి ప్రేమికులెవరూ.?

డా" ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ
సామాజిక కవి, రచయిత
జనగామ, తెలంగాణ

(పచ్చ'ధనం' పర్యావరణ పరిరక్షణ చైతన్య కవితా సంకలనంలో తృతీయ స్థానంలో నిలిచి, వేయి కవితల్లో ఉత్తమ కవితగా నిలిచి, పుస్తకంలో ప్రచురింపబడిన కవిత..)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత