మట్టి వాసన - పూలపరిమళం | సమీక్ష
మట్టి వాసన - పూలపరిమళం
(అగ్రగామి వార పత్రికలో ప్రచురితమైన వ్యాసం - 21-04-2022)
కవిత్వం సామాన్యుడిని, సమాజాన్ని కదిలించగలిగినపుడే ఆ కవికి గాని కవిత్వానికి గాని సార్థకత దక్కుతుంది. మనిషి శాశ్వతం కాదు కాని తన భావాలు, సాహిత్యం మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయి. ఏనాటికి నశించనిదే అక్షరం. అవి సమాజంలో చైతన్యానికి, మార్పుకి కారణమైతే ఏనాటికైనా ఆ ఘనత తప్పకుండా కవికి దక్కి తీరుతుంది. సమాజాన్ని చైతన్యం చేయడానికే తపించే కొందరు కవులను అభ్యుదయ కవులుగా పిలుస్తుంటాం. సాహిత్యం అంటే అక్షరాలను వెదజల్లడం కాదు. తానుకూడా ఆ భావాలకి కట్టుబడివుండి బతికి చూపించేవాడే అసలైన అభ్యుదయ కవి అవుతాడు. రాముడు ధర్మాన్ని ఆచరించమని బోధించి వదిలేయలేదు, ముందు తన ధర్మాన్ని నిర్వర్తించి చూపించాడు కనుకే ఆదర్శపురుషుడయ్యాడు. తాను నమ్ముకున్న సిద్దాంతాలకు కట్టుబడివున్నవారెవరైనా సరే సమాజానికి ఆదర్శప్రాయులే అవుతారు. రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే మహాకవులను పోషించారు. అది రాజ్యానికి సాహిత్య పోషకులుగా ఎంతో కీర్తినిచ్చిన విషయం. అయితే వారు ఆయా కవులతో అనేక ప్రబంధకావ్య రచనలతో సాహిత్యాన్ని అభివృద్ధి చెందేలా కృషిచేశారే తప్పా రాజ్యాన్ని, రాజుని కీర్తించాలని కాంక్షించలేదు. కానీ నేటి పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవి. కవుల కలాలకు పదవులు, శాలువా సన్మాన సత్కారాలతో కల్లెం వేస్తున్నారు. మరో రకంగా చెప్పాలంటే కలానికి వెలకట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధిక్కార స్వరం భయటకు రావడం చాలా అరుదు. సమాజంలోని అసమానతలను, అణచివేతను ప్రశ్నించే తత్వం పీడిత అట్టడగు వర్గాల నుండి రావాలి. అటువంటి ప్రశ్నించే తత్వం, ధిక్కార స్వరమే పూలపరిమళమై స్వేచ్ఛా వాయువులను వెదజల్లుతుంది.
ఇది సామాన్యుడి చెమట వాసన, కార్మికుడు ముద్దాడిన నేల మట్టివాసన, చికట్లలో చిక్కిన అట్టడుగు వర్గాలకు మార్గనిర్దేశన చేసే మినుగురుల దివిటీ. సమాజంలో అధ్యాపకులు, పాత్రికేయులు, కవులు, రచయితలకి ఒక ప్రత్యేక స్థానంతో పాటు గురుతర బాధ్యతలున్నాయి. అందరూ మోయాలనేమీ లేదు, మోసేవారు కొందరే అయినా అందులో స్వార్థానికి సగం జీవితం పోతుంది. మిగతా సగం కుటుంబ బాధ్యతలు లాగేస్తుంటాయి. వీటిని జయించాలంటే ఎన్నో త్యాగాలు చేయకతప్పదు. అభ్యుదయ భావాలను మోయడం, ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడం ఆశామాషీ విషయమేమి కాదు. అధికార, ఆధిపత్య, జాత్యహంకారాలను ప్రశ్నించడం. అణచివేతను, అన్యాయాలను ఎదురించడం. ప్రభుత్వాన్ని ధిక్కరించడం కత్తిమీద సాములాంటిదే..! సమాజాన్ని చైతన్యవంతం చేయాలంటే ఆయుధాలు పట్టాల్సిన పనిలేదు, అక్షరాన్ని మించిన ఆయుధం లేదు, కలాన్ని మించిన కవాతు లేదు. కాని తదనంతరం ఎదుర్కోవాల్సిన పర్యవసానాలు అన్నీ ఇన్నీ కావు. వీటన్నిటినీ ఎందుకు భరించాలి.? తద్వారా కవి పొందే లాభం ఏముంది.? అని ప్రశ్నిస్తే.. సమాజాన్ని కదిలించడం, అన్యాయాన్ని ఎదురించడం కంటే తన కుటుంబం గానీ తన వ్యక్తిగత జీవితం గానీ ఎంతమాత్రం ముఖ్యం కాదని బదులిస్తాడు కవి.
కోడం గారి కవిత్వంలో అభ్యుదయ భావాలు ఉండటమే కాదు, ఆయన జీవితం ఆదర్శప్రాయం. ప్రతీ మాట, ప్రతీ కవిత, ప్రతీ పనిలో అభ్యుదయం వాదం దర్శనమిస్తుంది. ఆయన కవిత్వం ఎంత పదునుగా ఉంటుందో, ఆయన మాట కూడా అంతే సూటిగా ఉంటుంది. సన్మాన సత్కారాలకు పదవులకు ఏనాడు తలవంచలేదు. కీర్తి ప్రతిష్ఠలు ఆస్తిపాస్తుల కోసం ఏనాడు తాపత్రయ పడలేదు. పీడిత వర్గాల శ్రేయస్సు కోసం కలాన్ని ఎత్తిన కలం యోధుడు. మనిషి శాశ్వతం కాదు, వారు చేసిన త్యాగాలే శాశ్వతం. దేవుడెక్కడో లేడు కార్మికుడి కష్టంలోను, నిరుపేదలకు అన్నం పెట్టే చేయిలోను ఉన్నాడంటారు. యుక్తవయసు నుండే పోరాటాలను అలవరచుకున్న వ్యక్తి. విద్యార్థి దశలోనే ఎన్నో పోరాటాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆయన పుట్టిన గడ్డ జనగామ పోరాటాలకు పెట్టింది పేరు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, జనగామ జిల్లా సాధన ఉద్యమం వరకు ఎన్నో పోరాటాలు ఇక్కడ జరిగాయి. బహుజన జెండాను ఎగరేసిన సర్దార్ సర్వాయి పాపన్న పుట్టింది ఇక్కడే. నిజాం కాలంలో విస్నూరు దొరలపై నల్లా నర్సింహులు, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ వంటి వారెందరో ఇక్కడ సాయుధ పోరాటాలు చేశారు. నాటి నుండి నేటి వరకు పోరాటాలే జనగామ ప్రజలకు మిగిలాయి. జనగామ ప్రజలు సహజంగానే పూర్వీకుల ఉద్యమ స్పూర్తిని అందిపుచ్చుకున్నారు. దొరల అఘాయిత్యాలు, అణచివేత వంటి విషయాలపై ఇక్కడి ప్రజలకు సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. ఇక అలాంటి కవులు తన కలాన్ని ఆయుధంగా మలిస్తే ఆ పోరాటమే 'పూలపరిమళం'. ఆధ్యాత్మిక అభ్యుదయ చైతన్య జ్యోతి పాల్కురికి సోమనాథుడు, మహాకవి బమ్మెర పోతనామాత్యుడు నడయాడిన నేల ఇది. వారి వారసత్వం పూలపరిమళంగా ఈ నేలంగా వ్యాపించింది. చికటిమయమైన సమాజానికి మార్గనిర్దేశన చేసే చైతన్య దీపికలా ప్రకాశిస్తుంది ఈ 'పూళపరిమళం'.
పూర్వం కుమార్ గారు "శ్రీశ్రీ కవిత్వం - ప్రాచ్య పాశ్చాత్య ప్రభావం" అనే పుస్తకాన్ని ప్రచురించారు, ఇది ఆయన ఎం.ఫిల్. సిద్ధాంత గ్రంథం కాగా కుమార్ గారి నుండి వస్తున్న రెండువ పుస్తకం "పూలపరిమళం". ఇది ఆయన మొదటి కవితా సంపుటి, పాతికేళ్ల సుధీర్ఘ కాలంలో ఆయన రాసిన కవితల సమాహారం.
కేవలం సాహిత్యంలోను లేక తరగతి గదుల్లోను, యూనివర్శిటీ సెమినార్లలోను అభ్యుదయ భావాలను విస్తరింపజేసిన వ్యక్తి కాదు. ఎన్నో ప్రత్యక్ష ఉద్యమాల్లోను సుధీర్ఘకాలం పోరాడిన ఉద్యమకారుడిగా నిలిచారు. తెలంగాణ జాయింట్ ఆక్షన్ కమిటీ, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్, తెలంగాణ విద్యావంతుల వేదిక, విప్లవ రచయితల సంఘం, ఉమ్మడి వరంగల్ రచయితల సంఘం, జనగామ రచయితల సంఘం వంటి అనేక సాహిత్య, సామాజిక సంఘాలలో క్రియాశీలకంగా పనిచేసారు.
బానిసత్వం, అణచివేత, అసమానతలు లేని స్వేచ్ఛాయుత సమాజాన్ని కోరుకుంటున్నారు కుమార్ గారు అందుకే ఈ కవితా సంపుటిని..
" ఈ నేల విముక్తి కోసం
త్యాగాల జెండాను ఎత్తిన అమరులకు/
వీరుల్ని కన్న తల్లులకు/
మా అమ్మ కోడం ప్రమీలకు ప్రేమతో "
అంకితమిస్తున్నా అంటున్నారు.
ఇది ఉద్యమాల పట్ల, ఉద్యమకారుల పట్ల, వారి కుటుంబాల పట్ల, వారు చేసిన త్యాగల పట్ల కుమార్ గారి అంకితభావానికి, గౌరవానికి నిదర్శనం. ఇటివల కాలంలోనే కుమార్ గారి మాతృమూర్తి స్వర్గస్తులయ్యారు. ప్రమీల గారు పూర్తి దైవ భక్తురాలు. దేవతారాధన చేసి తీర్థం పుచ్చుకోకుండా పచ్చి గంగ కూడా ముట్టకపోయేవారు. కుమార్ గారు అందుకు పూర్తి విరుద్ధం. కానీ ఏనాడు ఎవరి మనసు నొప్పించకుండా. 'మాతృదేవో భవ' అన్న పదానికి కట్టుబడి, తల్లి మాత్రమే కనబడే ప్రత్యక్ష దైవం అంటారాయన.
' అమ్మ' అనే కవితలో..
" దుఃఖ సముద్రాన్ని కొంగున దాచి/
అమృత భాండమిచ్చిన కరుణిమ/
తరుణిని మించిన 'దైవం లేదు ' /
అమ్మా.! నీ కమ్మని పిలుపు మళ్లీ వినాలి.!" అంటూ..
తల్లి ప్రమీల గారికి అశృతిలలిచ్చారు. ఈ కవిత తల్లి ఆప్యాయత, అనురాగాలకు ఆలవాలమై పాఠకుల చేత కంటతడి పెట్టిస్తుంది.
పూలపరిమళం కుమార్ గారు పుట్టిన ఊరు మట్టివాసనతో నిండింది. ఆయన మూలాలను వెతికే విధానం ఈ కవితా సంపుటికి అలంకరణగా మారింది. ఆయన పుట్టిన ఊరు 'వడ్డిచర్ల' గురించి రాసిన కవిత..
" చెరువొడ్డున వెలసిన నవీన నాగరికత/
బొడ్డుపేగు మొలచిన నా ఊరు ఒడ్డుచర్ల /
సబ్బండ వర్ణాల ఆదెరువు,
తడారిన కాలం గొంతుక/
దూపతీర్చే పంట నీళ్ల పటువ " అంటూ..
ఈ కవితలో తాను పుట్టిన ఊరుని అద్భుతంగా వర్ణించారు. కుల మత వర్ణ జాతి బేధం లేకుండా వసుధైక కుటుంబంలా కలిసుండే గ్రామీణ ప్రజల జీవిత విధానాన్ని తెలుపుతూ తన బాల్యాన్ని, మిత్రులని యాది చేసుకుంటున్నారు.
"దోస్తుల బతుకు దారుల్లో/ వీడ్కోలు పలికి" అంటూ బాల్య గురుతులను, బాల్య మిత్రులను, పుట్టి పెరిగిన ఊర్లను వదిలి బతకడం కోసం పట్నం వెల్లవలసిన బాధను వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ చేస్తున్న కుమార్ గారు అక్కడి విద్యార్థుల పరిస్థితులను 'కారటు' కవితలో తెలిపారు.
"మా క్యాంపస్ లో కనిపించని మృగమొకటి/
పట్టపగలే స్వైర విహారం చేస్తుంది " అంటూ
తెలంగాణ విద్యార్థుల ఎదుర్కున్న వివక్షను తెలుపుతూ విద్యారణ్యంలో పతార పహారీలో ఉన్న మృగాన్ని వేటాడేందుకు పిలుపునిచ్చాడు. విద్యార్థి దశలోనే అంతటి తెగువ ఎలా ప్రదర్శించాడని ఆశ్చర్యపోవడం మనవంతు.
" తెలంగాణ తల్లి విముక్తికి/
పల్లెలన్నీ ధూం.. ధాం ఆడుతున్నయి"
అంటూ.. ఉద్యమ ఉధృతాన్ని తెలుపుతూ తెలంగాణకు కాలడ్డమేస్తే ఊరుకునేది లేదంటాడు ' జై తెలంగాణ " కవితలో..
" నిరాశలు నిప్పు కణికలై మండుతున్నయి/
నిస్పృహకు లొంగని ఆలోచనలు/
కొత్తదారులను పోగేసుకుంటున్నయి "
అంటూ ఉద్యమనేత జయశంకర్ సర్ ని యాది చేస్కున్నడు.
" జనం బాట మర్సి.. అసెంబ్లీలో/
దొంగాటాడుతున్న పందికొక్కులను /
పలుగ జీరడానికి కదులుతున్న పటాలం తెలంగాణ " అంటూ.. పౌరుష పదజాలంతో హెచ్చరిస్తున్నడు.
మాటలే కాదు చేతల్లోను అందుకు తగ్గలేదు కుమార్ గారు. తెలంగాణ జేఏసీ, విద్యావంతుల వేదిక, జర్నలిస్ట్ ఫోరం వంటి అనేక సంఘాలతో కలిసి తెలంగాణ ఉద్యమంలో విస్తృతంగా పోరాడారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు.
జనగామ జిల్లా సాధన ఉద్యమంలో పాల్గొన్న కుమార్ గారు 'మాయిముంత' అనే కవిత ద్వారా జనగామ చరిత్రను కీర్తిస్తూ, జిల్లా సాధన అవసరాన్ని తెలిపారు.
"రాజును ధిక్కరించిన పోతన పదమై/
దేశీభాష పట్టం కట్టిన పాల్కురి కవితనై/
కోరమీసం మెలేసిన కొమురెల్లిని/
సర్వాయి ఎగరేసిన బహుజన జెండాను" అంటూనే..
మరోచోట..
"త్యాగాలను కడువలో నింపుకున్న /
కడవెండిని కాలరాస్తే మట్టికప్పుతం" అని సూటిగా హెచ్చరించాడు.
" కలాలు కసిగా కవాతు చేస్తున్నయి/
కాగితం కలాలు దున్ని పలుకులు అలికి/
ములుకులు పండిస్తం /
స్వేచ్ఛకోసం పుస్తక పావురాలెగరేస్తం"
అసలు ఈ పదాలను చూస్తే ఒక కవి ఉద్యమం చేస్తే ఇంత ఉధృతంగా ఉంటుందా.? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఒక్క క్షణం గగుర్పాటు కలుగుకమానదు..!
ఈ పదాలు జిల్లా సాధన కోసం కలాన్ని, గళాన్ని ఎత్తిన కవులు, రచయితలు, కళాకారులు, పాత్రికేయులను ఉద్దేశించి రాసినది. ఉద్యమంలో పోరాడుతున్న కవుల నిర్బంధం, ప్రభుత్వ విధానాలకు నిరసనగా, జిల్లా సాధనకు యుద్ధానికైనా, త్యాగానికైనా సిద్ధమని ప్రభుత్వానికి హెచ్చరికతో కూడిన కవిత సందేశాన్ని పంపాడు.
కవి ఏనాడు రాజులు రాజ్యాలకు, సన్మానాలకు సత్కారాలకు తలవంచకూడదంటాడు కుమార్.
" కవి చేయి కలపాల్సింది రాజ్యంతో కాదు/
ఆశలు ఆవిరై బతుకు పండని రైతుకు/
మట్టితో మెతుకులనిచ్చే కుటుంబానికి/
అక్షరాల మేమున్నామని వాగ్దానం చేయి " అంటూ..
కవులకు నిర్దేశం చేస్తున్నాడు.
అంతేకాదు " పురస్కారాల గొలుసుకు, గొంతును ఉరితీయకు" అంటూ కవిని తలవంచి బతికినా చచ్చిన శవానికి తేడా లేదని హెచ్చరిస్తాడు. సమాజానికి చైతన్యం చేసి మార్గనిర్దేశన చేసే బాధ్యత కవులదే అని " అస్తమించిన ఓ అక్షర రవి " చీకటి వెన్నెల మత్తులో విహరించకుండా సమాజాన్ని జాగృతం చేసే కిరణాక్షరమై టార్చ్ లైట్ లా తోవచూపాలని కోరుతాడు.
ఉత్పత్తి రంగాలను మనమే కాపాడుకోవాలంటాడు
'కలనేతడు ' అనే కవితలో..
" కళాత్మక తత్వం నిత్యకృత్యం/
బతుకు పతారాలో ఆకలిసత్యం/
సెమట సుక్కల మధుపర్కాల/
ఒయినంలో కొత్తబట్టల సంబురమైతడు " అంటూ
కళాత్మక కూర్పుతో చేనేత కార్మికుల వస్త్ర కూర్పును వర్ణిస్తున్నాడు. నగ్నత్వంతో సిగ్గుపడ్డ సమాజానికి బట్ట కట్టించిన చేనేత కార్మికుడి సృజనాత్మకత తెలియజేస్తూ నేడు వారు ఎదుర్కుంటున్న సమస్యలను మనముందు ఉంచాడు.
" బొంత పేగుల జీవన సమరంలో /
మీ ఇంటికొస్తే చేనేత వస్త్రమై /
ఆలింగనం చేసుకోండ్రి /
ఫినిక్స్ లా పుంజుకొని మన పరువు కాపాడుతడు " అంటున్నాడు కవి.
అయితే ఒకనాడు దేశ చేనేత రంగం ప్రపంచలోనే అత్యంత విశిష్టమైన కళారంగంగా వెలుగొందింది. కానీ నేడు కష్టాల్లో మునిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలే చేయూతనివ్వాలని, చేనేత తన మానాన్ని పరువును కాపాడతాడని కవి హామీ ఇస్తున్నాడు.
నెమలికన్ను, ప్రతిభాశాలి, కలనేతడు అనే మూడు కవితలు చేనేత రంగం గురించి రాశారు. కుమార్ గారు పుట్టింది చేనేత కులంలో, బాల్యంలోనే చేనేత కష్టాలను, కార్మికుల ఆకలి బాధలను, ఆత్మహత్యలను కళ్లారా చూసినవాడు కావడం వల్ల ఆ కవితల్లో కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యలను క్లుప్తంగా తెలుపగలిగారు. చేనేత వృత్తి బాగుపడాలనే ఆవేదన కవితలో కనిపిస్తుంది.
" శరంలేని పాలకునికి శెవులినబడయ్/
గుణం తప్పినోళ్లకు కండ్లు కనిపించవు/
మా పీనిగెల మీది పేలాలు ఏరుకునుడేంది ? అంటూ
ప్రతిభాశాలి కవితలో చేనేత కార్మికులను మోసం చేస్తూ హక్కులను కాలరాస్తూ, అవకాశాలను దూరం చేస్తూ, ఓటుబ్యాంకుగా వాడుకుంటూ, కష్టాల్లో కూరుకుపోతున్న వృత్తిపై దోపిడీకి పాల్పడుతూ, పాలకులను, నాయకులను, ప్రభుత్వాన్ని, దళారులను కవితలో..
"మా పోగేందో మాకియ్యాలే/
లాకలు మీ ఈపుల మోగుతయ్ బిడ్డా" అని హెచ్చరిస్తున్నాడు కవి.
'మనిషి ఒక పాట' కవితలో..
" రాత్రొక మరణం /
ఉదయమొక జననం/
పొద్దస్తమానమే ఓ జీవితం "
బంధాలు, బంధుత్వాలు, ఆత్మీయతలు, మానవత్వాన్ని కోల్పోతున్న సమాజంలో మన జీవితమంతా సజీవ శిలాజం అంటాడు.
"హార్ధిక బంధాలు వీడి, ఆర్థిక సంబంధాలయి/
పెనవేసుకుంటున్న వేళ /
ప్రేమించిన హృదయం రక్త కన్నీరు ద్రవిస్తోంది " అంటూ..
నేటి ఆధునిక జీవనంలో మనిషి మనీకి ఇచ్చిన విలువ మనుషులకు ఇవ్వటం లేదని క్రెడిట్ కార్డ్ గ్రీన్ కార్డులకు మూడుముళ్లు వేసే స్థాయిలో విపరీతంగా మారిన ఆధునిక ఆర్భాటాలు హెచ్ వన్ వీసా హెచ్ ఐ వీ కంటే ఘోరంగా మారిందని బాధను వ్యక్తం చేశాడు.
పూల పరిమళంలో పలు కవితలు తీవ్రమైన ఆగ్రహంతో అక్షర యుద్ధాన్ని తలపించేలా ఉద్వేగం, ఆవేదన, ఆక్రోశం, అసహనం కనబడతాయి. మనిషి మౌనం వీడి పోరాట బాట పట్టినపుడు మాత్రమే తన హక్కులను, రాజ్యాధికారాన్ని పొందగలడంటాడు. ఇది మార్పుకోసం పోరాడుతున్న కవి కుమార్ గారి తాత్విక వైవిధ్యమే గాని ఇది పూర్తిగా యుద్ధ గీతిక కానే కాదు.
' కలం కూలీ' అనే కవితలో..
"జీవితం దాచేస్తే దాగని పచ్చనోటు/
ఖర్చయిన ముప్పయి /
మిగిలిందయినా నీతో పంచుకోవాలని" అంటూ..
ఆదర్శ జీవితం గడిపే కలంకూలీ జేబులో మిగిలేదేముండదని, అయినా ఆనందంగా తనతో జీవితాన్ని పంచుకున్న భాగస్వామిని ఉద్దేశించి అంటున్నాడు.
ఈ కవితా సంపుటిలో కార్మికులను, కర్షకులను, స్నేహాన్ని, కుటుంబాన్ని, ప్రకృతిని, నవీన సమాజాన్ని, ఆధునిక జీవన విధానాలను అద్దం పట్టేలా పలు కవితలున్నాయి. పాతికేళ్ల సుధీర్ఘ కాలంలో వివిధ సందర్భాలలో ఆయన కలం నుండి జాలువారిన కవితల పరిమళమే 'పూలపరిమళం'. ప్రజల్లో చైతన్యం తీస్కురావాలని అనుక్షణం తపిస్తున్న ఆయన కలానికి సలాం కొడుతూ.. ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను..
డా" ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ
సామాజిక కవి, రచయిత,సర్వోన్నత్ భారతీయ సంవిధాన్
జనగామ, సెల్ : 7416252587


Very good analysis!
రిప్లయితొలగించండి