మట్టి వాసన - పూలపరిమళం | సమీక్ష
మట్టి వాసన - పూలపరిమళం (పద్మాంజలి జాతీయ మాస పత్రిక మే నెల సంచికలో) (అగ్రగామి వార పత్రికలో ప్రచురితమైన వ్యాసం - 21-04-2022) కవిత్వం సామాన్యుడిని, సమాజాన్ని కదిలించగలిగినపుడే ఆ కవికి గాని కవిత్వానికి గాని సార్థకత దక్కుతుంది. మనిషి శాశ్వతం కాదు కాని తన భావాలు, సాహిత్యం మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయి. ఏనాటికి నశించనిదే అక్షరం. అవి సమాజంలో చైతన్యానికి, మార్పుకి కారణమైతే ఏనాటికైనా ఆ ఘనత తప్పకుండా కవికి దక్కి తీరుతుంది. సమాజాన్ని చైతన్యం చేయడానికే తపించే కొందరు కవులను అభ్యుదయ కవులుగా పిలుస్తుంటాం. సాహిత్యం అంటే అక్షరాలను వెదజల్లడం కాదు. తానుకూడా ఆ భావాలకి కట్టుబడివుండి బతికి చూపించేవాడే అసలైన అభ్యుదయ కవి అవుతాడు. రాముడు ధర్మాన్ని ఆచరించమని బోధించి వదిలేయలేదు, ముందు తన ధర్మాన్ని నిర్వర్తించి చూపించాడు కనుకే ఆదర్శపురుషుడయ్యాడు. తాను నమ్ముకున్న సిద్దాంతాలకు కట్టుబడివున్నవారెవరైనా సరే సమాజానికి ఆదర్శప్రాయులే అవుతారు. రాయలవారి ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే మహాకవులను పోషించారు. అది రాజ్యానికి సాహిత్య పోషకులుగా ఎంతో కీర్తినిచ్చిన విషయం. అయితే వారు ఆయా కవులతో అనేక ప...