RRR సినిమాకు వన్నెతెచ్చిన పాట "కొమురం భీముడో"

RRR సినిమాకు "వన్నెతెచ్చిన పాట"

- సుద్దాల అశోక్ తేజ కలం నుండి జాలువారిన "కొమురం భీముడో"








(ఆన్వీక్షికీ పబ్లిషర్స్  ప్రై‌.లి. ప్రతిష్టాత్మకంగా ప్రచురించిన డా. సుద్దాల అశోక్ తేజ కొమురం భీముడో, కొమురం భీముడో పుస్తకంలో ప్రముఖంగా ప్రచురితమైన మోహనకృష్ణ భార్గవ విశ్లేషణ.. "వన్నె తెచ్చిన పాట"..)

ఇపుడు దేశం మొత్తం ఎవరినోటా విన్నా ఒకటే మాట వినిపిస్తుంది. అదే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా రూపొందిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్ (RRR)., ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లో విడుదలైన ఈ సినిమాని చూసిన ప్రేక్షకుల నడుమ ఒకటే చర్చ సాగుతుంది. అది ప్రముఖ సినీ రచయిత, సాహితీ దిగ్గజం సుద్దాల అశోక్ తేజ వ్రాసిన "కొమురం భీముడో" పాట గురించి, ఈ పాట సినిమా అంతటికి ఒక కీలకమైన మలుపుగా నిలుస్తుంది. ఆ సన్నివేశానికి తగ్గట్లు సుద్దాల పాట, కాల భైరవ నోట, కీరవాణి సంగీతంతో పురుడుపోసుకొని ఎన్టీఆర్ నట విశ్వరూపంతో థియేటర్ లో కూర్చున్న ప్రేక్షల రోమరోమాలను నిక్కబొడుచుకునేలా, ప్రేక్షకుడి రక్తం‌ వేడెక్కి బ్రిటీష్ దొరల గుండెలు చీల్చేయాలి అనేంత ఆగ్రహావేశాలు ఆవహించే విధంగా తెరకెక్కించారు..

బ్రిటీషర్ల చేతికి చిక్కిన కొమురం భీమ్ ని  మేకులతో చేసిన కొరడా దెబ్బలతో చిత్రహింసలకు గురిచేస్తూ మోకరిల్లితే వదిలేస్తామంటారు. ఆ కొరడా దెబ్బలకి భీం రక్తసిక్తమవుతాడు, రక్తం నేలన పారుతూ ఓ తల్లి పాదాలను తాకుతుంది. ఒళ్ళు గగుర్పొడిచే ఈ సన్నివేశంలో..

" కాలువై పారే నీ గుండె నెత్తురు
నేలమ్మ నుదుటి బొట్టైతుంది సూడు
అమ్మకాళ్ల పారాణైతుంది సూడు
తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు
కొమురం భీముడో.. కొమురం భీముడో..
పుడమి తల్లికి జనమ 
అరణమిస్తివిరో 
కొమురం భీముడో..! " 
అంటూ వచ్చే చరణాలు..

ఆ సాహిత్యానికి, ఆ సన్నివేశానికి కంటతడిపెట్టని ప్రేక్షకుడు ఉండడు., పుడమి తల్లి స్వేచ్ఛ కోసం జన్మ అరణంగా ఇస్తున్నానంటున్న భీం త్యాగాన్ని పాటతో అల్లిన విధానానికి వీక్షకుల మనసు ' కొర్రాసు నెగడోలే మండుతుంది - రగరాక సూరీడై రగులుతుంది' అనడంలో సందేహంలో లేదు..




కానీ రక్తానికి భయపడి, దెబ్బలకు బాధపడి ఆంగ్లేయులకు లొంగిపోయి తలవంచితే వీరుడెలా అవుతాడు.? అడవి తల్లి బిడ్డ ఎలా అవుతాడు.? భూతల్లి చనుబాలు తాగినవాడివెలా అవుతావు.? ప్రకృతి వడిలో పెరిగిన అడవిబిడ్డలకు నేలమీద ఉండే మమకారం తమ ప్రాణాలకంటే విలువ ఎక్కువే.! గోండుజాతి పులిబిడ్డ, తెలంగాణ ఉద్యమ యోధుడు కొమురం భీం జీవితం, సాహసాలు, ధీరోధాత్త పరాక్రమాలు, ఆయన త్యాగాలన్నిటిని కలబోస్తూ..

" నిన్నుగన్న నేలతల్లి.. 
ఊపిరి పోసిన సెట్టు సేమ.. 
పేరు పెట్టిన గోండు జాతి 
నీతో మాట్లాడుతుర్రా.. 
వినపడుతుందా..!" 
అంటూ సాగిన సుద్దాల కలానికి 
సలాం కొట్టకుండా ఉండలేం..

సుద్దాల మాట తూటాకంటే, పాట ఈటెల కంటే పదునైనవి. పదాలు పదవులను పాలకులను ఉలిక్కిపడేలా చేస్తాయి., అక్షరాలే ఆయుధంగా మారి బానిస చెరనుండి విముక్తి కలిగిస్తాయి. సమాజంలో చైతన్యం నింపే గీతాలకు ప్రజలెపుడు పట్టాభిషేకం చేస్తూనేవుంటారు..

స్వాతంత్ర్య సమరయోధుల తెగువ, త్యాగాలను చూపే అక్షరాలను కూర్చడమంటే కత్తి మీద సాము వంటిదే., యాస, బాష, గోస, తెగువ, స్వాతంత్ర్య కాంక్ష, స్వేచ్ఛ, మట్టి, అడవుల విలువ, ప్రాణ త్యాగం వంటి అనేక అంశాలను సమకాలీన పరిస్థితులతో పాటను మలచిన తీరు సుద్దాలకే సాధ్యం.,

తెలంగాణాలోని అదిలాబాద్ జిల్లా అడవి ప్రాంతంలో జీవించే గోండుల భాష, తెలంగాణా యాస, బానిస బ్రతుకుల‌ గోస కలబోసి రాసిన తీరు అద్భుతం., ట్రైబల్స్ భాషలు కనుమరుగవుతున్న పరిస్థితుల్లో నూరేళ్ళ క్రితం గిరిజనులు వాడిన భాషను అద్భుతమైన రీతిలో పాటగా మలచారు. 'కాల్మొక్తా బాంచెన్' వంటి పదాలు దొరల పాదాలకింద నలిగిన బానిసత్వానికి మిగిలిన గుర్తులు., కొర్రాసు నెగడు (కొర్రాయి), జులుము, ఒంగి తోగాల, ఒంచి తోగాల, ఒప్పం తోగాల, సెదిరే తోగాల, ఒలికి తోగాల వంటి గిరిజన, గొండు, తెలంగాణ పదాల‌ ప్రాసతో పాటకు ప్రాణం పోసిండు., తుడుము అనేది గోండు ప్రజల చర్మ వాయిద్యం, తుడుము తల్లి పేగుల పెరగనట్టేరో అంటూ.. తెలంగాణ సాహిత్యానికి అద్భుతమైన చరణాలతో పట‌్టం గట్టిండు సుద్దాల.,

కొమురం భీముడో పాట నేటి తరానికి ఒక సందేశం వంటిది. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా మనం నేడు స్వేచ్ఛా వాయువులను ఆస్వాదిస్తున్నామనే విషయాన్ని గుర్తుచేస్తుంది. 




రాజమౌళి సుద్దాలతో కొమురం భీం వ్యక్తిత్వం ఉట్టిపడేలా, తెలంగాణ సంస్కృతి, గిరిజన యాసతో కూడిన పదాలతో పాట కావాలని కోరారట. కేవలం యాస ముఖ్యం కాదు., ప్రజల‌ గోస తెలిసినవాడే ఆ బాధలను అక్షరాలతో కూర్చగలడు..

మధువనంలో గజాన్ని వదిలినట్లుగా దానికి తగ్గస్థాయిలోనే సుద్దాల‌ పాట కూర్చారు. అయితే అంతకు పూర్వమే కొమురం భీం జీవితం పై ధీర్ఘ గేయ కవిత, ధారావాహికలో పాట రాసిన అనుభవం ఉండటంతో పాటు సుద్దాలకు ఉన్న విప్లవ కుటుంబ నేపథ్యం. కుబుసం, అన్నదాత సుఖీభవ, ఠాగూర్ వంటి సినిమాలకి రాసిన అభ్యుదయ గీతాలు. అనేక జానపద గీతాల రచనలు, వందలాది సినిమాలకు పాటల రాసిన సుదీర్ఘ అనుభవం ఈ కొమురం భీముడో పాట కూర్పులో మనకు కనబడతాయి.

పాట సామాజిక మాధ్యమాలలో విడుదలైన తరువాత అంతగా గుర్తింపు పొందలేదు, కానీ సినిమా సన్నివేశాన్ని చూసిన తరువాత ఆ సాహిత్యం చిత్రాన్ని పతాక స్థాయికి తీస్కువెల్లింది. ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో సినిమా మొత్తాన్ని ఒంటిచేత్తో గెలిపించింది అనటంలో సందేహం లేదు., ప్రేక్షకులని ఒక రకమైన ఎమోషనల్ వైబ్రేషన్స్ తో నాటి సన్నివేశంలోకి తీస్కుపోతుంది. రాజమౌళి తెరకెక్కించిన తీరు, కాలభైరవ గాత్రం మన కన్నుల ముందే జరుగుతున్నట్లుగా ఆగ్రహం, ఆవేశం, ఆవేదనలను కలిగిస్తాయి. బానిస సంకెళ్లను తెంచుకొని పుడమి తల్లికి స్వేచ్ఛనివ్వడానికి ప్రాణాన్ని అయినా సరే త్యాగం చేయవలసిందే అన్న భావన మనసులో కలిగిస్తుంది. పాట చివరలో ప్రజలు తిరుగుబాటు చేసిన విధానం చైతన్యానికి ప్రతీక అవుతుంది., అశోక్ తేజ తండ్రి గారైన సుద్దాల హనుమంతు తన పాటలు, గేయాలు, గీతాలతో ఊరూరు తిరిగి తెలంగాణ విముక్తి ఉద్యమాన్ని నడిపిన తీరును గుర్తు చేస్తున్నాయి.




తన మాట, పాట, కవిత, యక్షగానాలతో తెలంగాణ విముక్తి పోరాటానికి ఊపిరిపోసిన ప్రజాకవి సుద్దాల హనుమంతు - జానకమ్మల ముద్దుబిడ్డ అశోక్ తేజ., తెలంగాణలోని పూర్వ నల్గొండ జిల్లా గుండాల మండలం‌ సుద్దాల గ్రామంలో‌ వీరు జన్మించారు.
సుద్దాల హనుమంతు తన గానంతోనే యావత్ తెలంగాణా ప్రజల్ని ఉద్యమానికి కలిదించిన వ్యక్తి. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అశోక్ తేజ, బాల్యం నుండే కవితలు, పాటలు రాయడం ప్రారంభించారు. ఇప్పిటికీ సుమారు 1250 పైగా చిత్రాలలో 2500పైగా పాటలు వ్రాసిన ఘనత సొంతం చేస్కున్నారు. అనేక పురస్కారాలు వీరి కలాన్ని ముద్దాడాయి. ఠాగూర్ సినిమాలో రాసిన "నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను" పాట రచనకు జాతీయ ఉత్తమ గీత రచయిత పురస్కారం లభించింది. గత సంవత్సరం విడుదలైన లవ్ స్టోరీ సినిమాలో 'సారంగ దరియా' పాట ఇరు తెలుగు రాష్ట్రాలని ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. ఫిదా సినిమాలో 'వచ్చిండే.. మెల్లా మెల్లగ వచ్చిండే' పాట విశేష ప్రజాదరణ పొంది అనేక రికార్డులు సొంతం చేస్కుంది. మనసుని తాకే బాణీ, తనదైన సహజ శైలితో పరవశింపచేసే విధంగా వందలాది పాటలతో అలరించారు సుద్దాల. 

ఈ కొమురం భీముడో పాటకు సుద్దాలకు తప్పకుండా మరొక జాతీయ ఉత్తమ గీతాల రచయితగా గుర్తింపు, అనేక జాతీయ పురస్కారాలు అంది తీరుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన అందించిన సాహిత్యానికి ఈ పురస్కారాలన్నీ చంద్రునికో నూలుపోగు వంటివే..!

డా" ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ

సామాజిక కవి, రచయిత, విశ్లేషకులు
జనగామ, తెలంగాణ
సెల్ : 7416252587

(ఏప్రిల్ -2022 పద్మాంజలి మాస పత్రికలో ప్రచురితమైంది..)

కామెంట్‌లు

  1. Well explained...... నీ మాటలతో ఈ అంశం ఇంకా ఎంతో విలువను సంపాదించుకుంది...సూపర్ మోహన కృష్ణ భార్గవ....

    రిప్లయితొలగించండి
  2. RRR చిత్రంలోని ఈ పాటలోని ప్రతిఅక్షరం ప్రేక్షకులను పలకరించింది. సీట్లో నిశ్చలంగా కూర్చోనివ్వలేదు. ప్రేక్షకుడిని తెరపైన జన సమూహంలో కి తీసుకెళ్లిపోయింది. ఉద్వేగపరిచింది,ఉద్రేకపరిచింది,
    కంటతడిపెట్టించింది. సుద్దాల కలం వాడి, వేడి, వేదన,ఆవేదన, అర్ద్రతల్లో ఏమాత్రం మార్పులేదు.
    'తగ్గేదేలే'అంటూ పరవళ్లు తీస్తున్న సుద్దాల కవన కుతూహలం కు సలాం..✊
    ఇదంతా ఒక ఎత్తయితే మీ విశ్లేషణకు నా మనఃపూర్వక నమస్సులు.

    రిప్లయితొలగించండి
  3. సుద్దాల అశోక్ తేజ గారి కొమరంముడో అనే పాటలోని ప్రత్యక్షరం అశోక్ తేజగారి అసమాన పద సంపదకు, కొమరం భీమ్ ఆదర్శ వ్యక్తిత్వానికి మేటి నిదర్శనమైతే,
    రాజ మౌళి గారి దర్శక ప్రతిభ, యన్టీ ఆర్ సాటిలేని నటనా విశ్వ రూపం
    మరో కారణాలు.
    ఇన్ని విధాలుగా అద్భుతంగ ప్రేక్షకులను ఎంతగానో కట్టి పడవేసినది. నేడు అంతటా విజయ ఢంకా మ్రోగించుచున్న ఓసినీ దృశ్య రాజం R. R. R.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత