సనాతన వేద సంస్కృతిలో స్త్రీ | డా" మోహనకృష్ణ భార్గవ

 " సనాతన వేద సంస్కృతిలో స్త్రీ "

రచన : ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ


" వేదాలలో స్త్రీ స్థానం "

భారతీయ సనాతన హైందవ సంస్కృతిలో స్త్రీకి అత్యంత పవిత్రమైన పాత్ర ఉన్నది. వేద పురాణ ఇతిహాస సాహిత్యాలలో ప్రధాన స్థానం కల్పించబడినది. నేటి మహిళలు తమ హక్కుల సాధనకై పురుషులతో సమానమైన స్థానాన్ని కల్పించాలని పోరాడుతున్నారు కానీ, భారతీయ సంస్కృతిలో స్త్రీ పురుషుడికన్నా ఎంతో ఉన్నతమైనది. ఎంతో గౌరవించదగినది, పూజింపదగినది.. మహిళను సాక్షాత్తూ భూమాతగా, ప్రకృతి స్వరూపిణిగా, ఆదిశక్తి అంశగా కీర్తిస్తున్నాయి వేద పురాణేతిహాసాలు.. ధరణిలో మహిళకు అందించగల గౌరవం ఇంతకన్నా ఏముంటుంది..!

శ్లో" యాదేవీ సర్వ భూతేషు మాతృ రూపేన సంస్థితాః !
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః !!


తా: ఓ దేవీ భగవతీ..! సర్వభూతములయందు మాతృ రూపుములో నివాసమై వున్నటువంటి నీకు సదా ప్రణమిళ్లుతున్నాను.. (చండీ సప్తశతి)

శ్లో " యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః !
నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం !!
కృచ్ఛ్రేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే !
త్వత్ప్రసాదా జ్జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే !!
పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః !
వసంతి యత్రతాం నౌమి మాతరం భూతిహేతవే !!

తా: ఏ తల్లి కడుపు నన్ను భరించి, రక్షించినదో ఆ తల్లికి, ప్రకృతి రూపిని అయిన అమ్మకు నమస్కరిస్తున్నాను., మిగుల శ్రమలకు ఓర్చి నన్ను గర్భమున మోసినదానవు నీవు., నీ యనుగ్రహముచే నేను కండ్లు తెరచి లోకమును చూడగంటిని.. అమ్మా.! నీకు నిత్యము నమస్కారం.., భూమండలమున ఎన్ని తీర్థాములున్నాయో, ఎన్ని సాగరములున్నాయో.. అన్నియూ నే తల్లియందున్నవో యట్టియమ్మకు.. నీ కైశ్వర్యకాముడనై నిత్యం నమస్కరిస్తున్నాను. (భవిష్యపురాణం)

స్త్రీని ప్రకృతి స్వరూపిణీగా, పరమాత్మ ఆదిశక్తి యొక్క అంశగా మన ధర్మశాస్త్రాలు కీర్తిస్తున్నాయి..

శ్లో " దేవీం వాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపాహ పశవో వదంతి !
సానో మంద్రేష మూర్జం దుహానా ధేనుర్వాగస్మానుప సుష్టుతైతు !!


తా: దేవతల ద్వారా వాక్కు సృష్టింపబడినది., అట్టి వాక్కునే విశ్వమునందలి సకల విధములగు ప్రాణులు పలుకుతున్నారు‌.. అట్టి గంభీరమైన కామధేనువు వంటి ఆ వాక్కు ప్రాణులకు అన్నమును, బలమును, యశస్సును, ఉత్సాహమును ప్రసాదించునది అగుతున్నది. అట్టి వాక్కే వాగ్రూపిణీ అగు దేవీ భగవతీ మాకు సదా సన్నిహితమగు గాక..! (దేవీ భాగవతం)

ఈ సకల చరాచర సృష్టిని ఉత్పత్తి, స్థితి, లయము చేయునది., బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాగా ఈ ముగ్గురిని సృష్టించిన ఆద్యాశక్తి, సకల జగత్తును పోషించే సచ్చిదానంత స్వరూపమగు పరమాత్మ శక్తియే ఆదిపరాశక్తి.

శ్లో" నమో దేవి మహామాయే విశ్వోత్పత్తి కరే శివే ! 
నిర్గుణే సర్వభూతేశి మాతః శంకర కామదే !!


తా: ఓ దేవీ‌.! నీవు మహా మాయవు, సకల జగత్తుని సృష్టించుట నీ స్వభావము. సకల ప్రాణులకు ఆశ్రయం కల్పించుటకు భూమాతగా అవతరించావు‌. నీవే ప్రాణము, శక్తి, బుద్ధి, సంపద, కాంతి, క్షమా, శాంతి, శ్రద్ధా, మేధా, ధృతి, స్మృతి, గాయత్రీ ప్రణవ స్వరూపిణివి‌..(దే.భా)

శ్లో" యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేన సంస్థితాః !


సకల భూతాలలో, సకల ప్రాణులలో, సమస్త లోకాలలో జీవము, శక్తి అనుగ్రహించునది ఆ భగవతీయే.! బ్రహ్మకు సృజనా శక్తిని, విష్ణువునకు పాలనా శక్తిని, శివునకు సంహార శక్తిని అనుగ్రహించి., సృష్టి స్థితి లయ కారకులుగా అనుగ్రహించినది, ఆ భగవతీయే..! పరబ్రహ్మ, పరమాత్మా స్వరూపిణి అయిన ఆ భగవతిని ఆరాధించి, నిత్యోపాసన దేవిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు అనేక విధములైన ఆరాధనలతో శక్తిని పొందుతున్నారు. ఎల్లపుడూ వారు ఆ జగదంబనే స్మరిస్తారు, ధ్యానిస్తారు‌, పూజిస్తారు.. (దే.భా)

శ్లో" ఆరాధ్యా పరమాశక్తిః సర్వైరపి సురాసురైః !
నాతః పరతరం కించి దధికం భువనత్రయే !!
సత్యం సత్యం పునః సత్యం వేద శాస్త్రార్థ నిర్ణయః !
పూజనీయా పరాశక్తి నిర్గుణా సగుణాథవా !!


తా: సమస్త దేవతలకు, రాక్షసులకు, మహర్షులకు, మానవులకు పరాశక్తిని ఆరాధించుటే మార్గం. ఈ సమస్త లోకాదులలో జగదంబను మించిన దైవమెవ్వరూ లేరు‌. నిర్గుణ రూపంలో సగుణ రూపంలో పూజింపదగినది., కేవలం చిన్మయ స్వరూపిణి, పరమాత్మా స్వరూపిణి అయిన పరాశక్తిని మాత్రమే..! అని వేదములు, శాస్త్రములు నిశ్చయంగా నిర్ణయింపబడిన సత్యం, ఇదే ముమ్మాటికీ సత్యం.! (దే.భా)

"సర్వం ఖల్విద మేవాహం నాన్యదస్తి సనాతనం"
జగదంబ పలుకుతూ ఈ జగత్తునంతా వ్యాపించి ఉన్నది నేనే‌.. నేను కాక వేరొక శాశ్వతమైన వస్తువు యేదీ లేనేలేదు.!

శ్లో" అహమేవాస పూర్వం తు నాన్యత్ కించిన్నగాధిప !
తదాత్మరూపం చిత్సంవిత్ పరబ్రహ్మైక నామకమ్ !!
శ్లో" తచ్ఛక్తిః భూతః సర్వేషు భిన్నో బ్రహ్మాది మూర్తిభిః !
కర్తా భోక్తా చ సంహర్తా సకలః సజగన్మయః !!


జగదంబ పలుకుతూ ..! పూర్వము నేను మాత్రమే ఉన్నాను.. వేరే ఇతర పదార్థమేదీయు లేదు. అట్టి సమయంలో జగత్తునంత వ్యాపించివున్న నా స్వరూపం చిత్, సంవిత్, జ్ఞాన విజ్ఞాన ఆనందమయ స్వరూపము, అద్వితీయ సచ్చిదానంద పరబ్రహ్మముగా ఉండెను‌.. అట్టి స్వరూపము అప్రతర్క్యము, అనిర్దేశ్యము, అనౌపమ్యము, అనామయముగా అలరారుతుండెను.. దాని నుండి ఒక అద్వితీయ శక్తి వెలువడినది ఆ శక్తిపేరే 'మాయా' . ఇట్టి మాయా శక్తి నుండి సకల చరాచర జగత్తు సృష్టించబడినది‌. జగత్తునంతటిలో గల సామర్థ్యమే శక్తి అనబడుతుంది. ఆ శక్తియే పరబ్రహ్మ, పరమాత్మగా జగత్తును రక్షించును. ఆ పరబ్రహ్మమే దేవ, మనుష్య, తిర్యక్, స్థావరాదులను, సమస్త ప్రపంచమును సృష్టించి, రక్షించి, పోశించి తనలోనే లయం చేస్కునే శక్తి అగుచున్నది‌..

శ్లో" సాధూనాం రక్షణం కార్యం హంతవ్యా యేప్యసాధవః !
వేద సంరక్షణం కార్యమవతారై రనేకశః !!


జగదంబ పలుకుతూ..! సాధుసత్పురుషులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు, వేదములను రక్షించుటకు.. నా ద్వారా అనేక అవతారములు దాల్చబడినవి.. ఒక్కొక్క యుగములో అనేక అవతారములు ధరించబడుతున్నవి..
ఈశ్వరుడు, విరాట్టు, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, గౌరీ, సరస్వతీ, లక్ష్మీ స్వరూపములు నేనే..! సూర్య చంద్రాదులు, నక్షత్రాలు, గ్రహాలు సర్వం నేనే..! ఈ చరాచర జగత్తు నంతా విస్తరించింది నేనే, ఏ వస్తువైనా సరే, ఎక్కడ చూసినా సరే, ఏది వినా సరే అన్నిటిలో వ్యాపించివున్నది నేనే‌..! నేను కానిదంటూ మరొకటి వేరు లేనేలేదు‌‌.! (దేవీ భాగవతం)



దీనిద్వారా తెలియనది ఒకటే..! ఈ సమస్త జగత్తు, చరాచర జీవకోటి, బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు, మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ, సమస్త దేవతా గణాలు., అండపిండ బ్రహ్మాండాలన్నీ.. ఆ దేవీ జగదంబ నుండి మాత్రమే ఉత్పన్నమైనవని దేవీ భాగవతం ద్వారా తెలుస్తున్నది.

"తద్బ్రహ్మ సత్తా సామాన్యం సీతా తత్త్వ ముపాస్మహే" అంటే ప్రకృతిలో జీవులన్నిటిలో సీతా తత్వము ఇమిడీకృతమై ఉన్నది, అదే బ్రహ్మతత్వము..

ప్రజలు నిత్యం గాయత్రీ మాతను ఉపాసిస్తుంటారు. శాక్తేయులు అనే ప్రత్యేకంగా దేవీ, దుర్గా, చండీ, పరాశక్తి, అంబికా, కాత్యాయనీ, భైరవీ, కాళీ,  వైష్ణవీ, లలితాబింకా, రాజరాజేశ్వరి, త్రిపురాంబిక, వారాహీ వంటి అనేక అవతార మూర్తులను నిత్యం ఉపాసిస్తారు. అంతే కాకుండా వైష్ణవ, స్మార్త, శైవాదులు మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ స్వరూపాలను ఆరాధిస్తారు. ఏ అవతారమైనా.! ఏ స్వరూపమైనా..! ఆ జగన్మాతను ఆరాధించడమే ప్రధానం అయినది.!

గార్గి, ఉషా, ఉశనల, మైత్రేయి, ఘోషా, అపాల, విశ్వవర, లోపాముద్ర, వసుశృత, ఇంద్రాణీ, శ్రద్ధ, మేధీ, సర్పరాజ్ఞీ, కద్రువ, గౌరీవీతి మొదలగు నారీ మణులు వేదాలలో శాస్త్రాలలో బ్రహ్మవాదినులుగా కీర్తింపబడ్డారు. పూర్వం స్త్రీలు వేదాధ్యయనం చేసేవారు. సాహిత్యంలో స్త్రీలు ప్రధాన పాత్ర పోశించారనడంలో సందేహం లేదు.. వేదాలలో చెప్పబడిన మొదటి దైవం ఉషాదేవీ, తన నుండి దేవతల ప్రస్థావనలు ప్రారంభమవుతాయి. వేదములకు అధిష్టాన దేవత గాయత్రీ మాత, విద్యలకు సరస్వతీ అలాంటి వేదాలకు మూలమైన స్త్రీమూర్తులకు, లోకాలను పుట్టించిన జగన్మాతలకు వేదాధ్యయన అధికారం లేదనడంలో అర్థం లేదు‌. కానీ దానికి తగిన నియమనిష్టలను పాటించడం ప్రధానమైవుంటుంది..

శ్లో" పరపత్నీ తు యా స్త్రీ స్యాదసంబంధా చ యోనితః !
తాం బ్రూయాద్భవతీ త్యేవం సుభగే భగినీతి చ !!


మాతా, సోదరీ కాకుండా పరస్త్రీలను.. సుభగే.! భగినీ.! అని పిలవాలని మనస్మృతి తెలుపుతున్నది., అంటే పరస్త్రీలను మాతృ సమానురాలిగా, సోదర సమానురాలిగా సంభోదించాలని, గౌరవించాలని శాస్త్రాలు తెలుపుతున్నాయి. (మనుస్మృతి)

శ్లో" యత్ర నార్యస్తు పూజ్యం తే రమంతే తత్ర దేవతాః !
యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః !!


ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, పూజింపబడతారో అక్కడ దేవతలు సంతోషంగా.. దయామృతాన్ని వర్షింపజేస్తారు‌., ఎక్కడైతే స్త్రీలు బాధింపబడతారో.. అక్కడ కరువు కాటకాలు ఏర్పడతాయి., మహోపద్రవాలు వచ్చి సర్వనాశనమవుతారు. (మ. స్మృ)

శ్లో" శోచంతి జామయో యత్ర వినశ్యత్యాశు తత్కులమ్ !
నశోచంతి తు యత్రైతా వర్ధతే తద్ధి సర్వదా !!


ఎవరిచేతనైతే స్త్రీలు పూజింపబడతారో.. అక్కడ ధనధాన్య సస్య సమృద్ధి అధికంగా కలుగుతుంది., ఎక్కడైతే స్త్రీలు నిరాధరణకు గురౌతారో.. అక్కడ సత్వర వినాశనం తప్పదని మనుస్మృతి తెలుపుతున్నది‌..

స్త్రీలను పూజించడం, గౌరవించడం భారతీయ సాంప్రదాయంలో ముఖ్యమైన భాగం.. వేదాలు ధర్మశాస్త్రాలు ఇదే విషయాన్ని బలపరుస్తున్నాయి. ఉత్సవాలు, సంబరాలు, శుభకార్యాలు, వివాహ, ఉపనయనాది శుభకార్యాదులలో స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. తోబుట్టువులకు, బంధువర్గీయ మహిళలకు వస్త్రాలు ఆభరణాలు సమర్పించి పూజించడం జరుగుతుంది., స్త్రీలను గౌరవించి సంతోషపరచకుండా శుభకార్యాలు జరగవనటంలో సందేహం లేదు..

శ్లో" స్త్రీయోషి దబలా యోషా నారీ సీమన్తినీ వధూః !
ప్రతీపదర్శినీ వామా వనితా మహిళా తథా !! 

స్త్రీ, యోషిత, అబలా, నారీ, సీమంతినీ, వధువు, ప్రతీపదర్శినీ, వామా, వనితా, మహిళా ఇవి సంస్కృతం నుండి గ్రహింపబడిన స్త్రీలకు గల పేర్లని అమరకోశం తెలుపుతున్నది.

ఇవి మాత్రమే కాకుండా అంగనా, భీరూః, కామినీ, వామలోచనా, ప్రమదా, మానినీ, కాంతా, లలనా, నితంబినీ, సుందరీ, రమణీ, రమా, భామా, భామినీ, వరారోహ, వరవర్ణినీ, మత్తకాశినీ, రూపశీలా, మహిషీ, భోగినీ, భార్య, కుటుంబినీ, పురంధ్రీ, సతీ, సాధ్వీ, పుత్రి, పీవరీ, సుచరిత్రా, గౌరీ, కులపాలికా, కళ్యాణీ, నందనా, పత్నీ, సాభిసారికా, కాముకీ, సువాసినీ, ధీమతీ, ఆర్యాణీ,‌ భగినీ, జనయిత్రీ, ఆత్మజ, మాతా, తరుణీ, యువతీ మొదలగు పేర్లు విశేషంగా స్త్రీలకు సంబోధనా నామాలుగా ఉన్నాయి. (అమరకోశం)



ధర్మార్థకామ్యమోక్షార్ది అయిన పురుషుడు వివాహమాడి తన భార్యతో కూడి యజ్ఞయాగాదులు చేసి పితృఋణం, దేవ ఋణం, ఋషి ఋణాలనుండి ముక్తుడవుతాడు.. పురుషునకు భాగ్యాన్ని విశేష గౌరవాన్ని అమృతత్వాన్ని ప్రసాదించేది భార్య మాత్రమే..!
భార్య లేకుండా చేసే ఏ యజ్ఞమైనా, ఏ దానమైనా నిష్ప్రయోజనమే.. అందుకే రాముడు సీత లేకుండా అశ్వమేధ యాగాన్ని చేయలేక బంగారు సీతామూర్తిని నిర్మించి యజ్ఞాన్ని పూర్తి చేశారు. వేద విహిత కర్మలన్నిటిని ధర్మపత్ని సహితంగానే నిర్వహించాల్సివుంటుంది..

 " మూర్దానాం పత్యునారోహ "
జీవికి శిరస్సు ఎంత ప్రధామైనదో.. పురుషునకు స్త్రీ కూడా శిరస్సువలే ప్రధానమైనది., శిరస్సు లేకుండా జీవించటం ఎంత అసాధ్యమో.. భార్య లేని పురుషుడు కుడా శిరస్సు లేనటువంటి వాడే.!

" కార్యేషు దాసి ! కరణేషు మంత్రి ! భోజ్యేషు మాత ! శయనేషు రంభ ! క్షమయా ధరిత్రి !! "
దాసిగా సేవచేస్తూ కుటుంబాన్ని పోశిస్తుంది, మంత్రిగా మార్గనిర్దేశన చేస్తూ పాలిస్తున్నది, తల్లిగా కడుపునిండా అన్నం పెడుతున్నది, రంభగా భర్తకి సుఖాన్ని అందిస్తున్నది, ధరణిలా సహనశీలురాలై క్షమిస్తుంది., 
ఇలాగే ఉండాలని చెప్పటం‌ లేదు.. సహజంగా స్త్రీ తత్వము ఇది, ఎంతైనా.. దయాగుణం, సహన శీలత వారికి జన్మతః వస్తాయేమో..!


తల్లిగా సేవచేసే లక్షణం వారికి జన్మతః వస్తుంది
కనుకనే ప్రతీ స్త్రీలో మాతృమూర్తిని చూడగలుగుతున్నాం. దేవ ఋషి పితృ ఋణాలు తీర్చవచ్చునుగాని, మాతృఋణం తీర్చలేనిది. చెడ్డ కొడుకు ఉండవచ్చు కాని చెడ్డ తల్లి ఉండదు., తల్లిని వదిలేసిన సంతానం ఉంటుంది, గాని తల్లి వదిలేసిన సంతానం ఎవరు ఉండరు., ఇది ప్రకృతి సహజం. మోక్ష మార్గాన్ని చూపే గురువుకన్నా, మోక్ష స్వరూపమైన తండ్రికన్నా, జన్మనిచ్చిన తల్లి.. భుమి కన్నా విలువైనది, తల్లిని పూజించటం కంటే గొప్ప పూజంటూ లేదు.

" తజ్జాయా జాయ భవతి యద్దస్వాం జాయతే పునః "
ఎంతటి పురుషుడైన, పురుషోత్తముడైనా తల్లికడుపునే పట్టాల్సిందే..

మాతృదేవో భవ.! పితృదేవో భవ.!
ఆచార్య దేవో‌ భవ.! అతిథి దేవో భవ.!!
తల్లిని పూజించకుండా ఏ భగవంతుడ్ని పూజించినా వృధానే‌‌. తల్లినే ప్రధాన దైవం‌‌.. తల్లి తరువాతే ఏ దైవమైనా..! ఉపనయనంలో ముందుగా తల్లికే మాతృభిక్ష యాచించటం జరుగుతుంది., సన్యసించిన వారు, జగద్గురువులు, పీఠాధిపతులు ఎవరికి నమస్కరించకూడదు.. కాని తల్లికి నమస్కరించాలి. తల్లిని గౌరవించకపోయినా.. హీనంగా చూసినా.. లేదా వృద్ధాప్యం లో వదిలేసిన.. రౌరవాది నరకాలు తప్పవని శాస్త్రాకర్తలు వాక్యానించారు.

" కలకంఠి కన్నీరొలికిన 
సిరియింటనుండనొల్లదు సుమతీ "
స్త్రీ కంట కన్నీరు వచ్చిన క్షణం గృహంలో లక్ష్మి నివసించదు..


" సగృహం గృహమిత్యాహుః గృహిణీ గృహముచ్యతే గృహంతు గృహీణీహీనం అరణ్యం సదృషం భవేత్ "
స్త్రీ గృహంలో నివసిస్తుంది కనుకనే గృహము అనబడింది, స్త్రీ లేని గృహం అరణ్యంతో సమానం.

సమాజానికి స్త్రీ యొక్క విలువను తెలుపుతూ..
పరమేశ్వరుడు తన శరీరంలో అర్థ భాగాన్ని తన ధర్మపత్ని అయిన పార్వతికి ఇచ్చి 'అర్థనారీశ్వరుడు' అయ్యాడు.! శ్రీమహావిష్ణువు మహాలక్ష్మిని తన వక్షస్థలంపై నిలుపుకొని లక్ష్మీనారాయణుడయ్యాడు.! బ్రహ్మ సరస్వతిని తన వాక్కుపై నిలుపుకున్నాడు.! పార్వతీదేవి శక్తిని, లక్ష్మీదేవి సంపదలను, సరస్వతీదేవి విద్యలను అనుగ్రహిస్తున్నారు.

సృష్టికి మూలం స్త్రీ శక్తి., శక్తికి లేనిదే ప్రాణం లేదు, స్త్రీ లేనిదే సమాజం లేదు.. సకల చరాచర జీవకోటిని పుట్టించేది, పోశించేది ప్రకృతి శక్తి మాత్రమే.. వేదాలలో శాస్త్రాలలో స్త్రీ మూర్తికి మహోన్నత స్థానం ఉన్నది, అది ఆధునిక జీవన విధానాలలో కనుమరుగవుతున్నది.. స్త్రీని గౌరవించడం మనందరి కర్తవ్యం.. ఆధునిక మోజుని వదిలి, ఆ గౌరవాన్ని కాపాడుకోవడం వారి బాధ్యత..!!

డా" ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ

ఎం.ఎ(తెలుగు)., ఎం.ఎ(తత్వశాస్త్రం).,
పిహెచ్‌డి గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆష్ట్రోలజీ.,
జ్యోతిష్య రత్న, జ్యోతిష్య శిరోమణి, జ్యోతిష్య మహర్షి.,
అంతర్జాతీయ జ్యోతిష్యశాస్త్ర పురస్కార గ్రహీత..

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత