పోగుబంధం | రాపోలు ఆనందభాస్కర్ సమీక్ష
రాపోలు ఆనంద భాస్కర్
MEMBER OF PARLIAMENT
(2012-2018 RAJYA SABHA)
శుభకామన..
ఎక్కలదేవి మోహనకృష్ణ సామాజిక వర్గ శక్తికి, బహుళ సమాజంలో సముచిత స్థానం సాధనకు, ప్రజాహిత జీవనంలో దామాషా పాటింపునకు చూపుతున్న ఆరాటం స్ఫూర్తిదాయకం.
స్వయంకృషితో తనను తాను నిలుపుకుంటున్న మోహనకృష్ణ పసితనం నుంచి చూపుతున్న పటిమ అనేక సందర్భాల్లో సాటి ప్రజానీకానికి ప్రస్ఫుటమవుతున్నా,
ఎక్కడా తొందర చూపని నిండుదనం తన వ్యక్తిత్వానికి వన్నెతెస్తోంది. మోహనకృష్ణ వాదానికి శాస్త్రీయ ఆధారాలను జోడించే తపన ఆయనకు ప్రత్యేకతను తెచ్చి పెడుతోంది. అందుకే ఆయన భార్గవ వాదాన్ని నేను ఎంతో ఆసక్తితో గమనిస్తున్నాను.
ఆయన జనగామ ప్రాంతంలో సామాజిక వర్గ యువతరాన్ని కదిలించిన తీరు, తెలంగాణ వ్యాప్తంగా వివిధ కార్యకలాపాలలో తన యుక్తియుక్తమయిన పాత్ర నిలుపుకుంటున్న తీరు నేటి యువతరానికి అధ్యయన వస్తువు. ఎక్కలదేవి మోహనకృష్ణ వివిధ మాధ్యమాల ద్వారా చైతన్య వ్యాప్తికి, తన దృక్పథాన్ని వెల్లడి చేసేందుకు చూపే చొరవ ప్రభావవంతం.
అదే రీతిలో మోహనకృష్ణ రచనా వ్యాసంగం పదుననైనది. నిరంతర ఆలోచనలతో, భావాత్మకంగా వ్యక్తీకరించడంలో మోహనకృష్ణ తన కవన, రచన కౌశలాన్ని పదును పెట్టుకుంటున్నారు.
(పుస్తక ఆవిష్కరణ చిత్రాలు - 27-03-2021)
వ్యక్తిగా ఎవరెన్ని చేసినా, వ్యక్తీకరణగా చిరస్తాయిని సమకూర్చుకోవడం అందరికీ వీలుకాదు. అందులో మోహనకృష్ణ తన స్థితిని పదిలం చేసుకుంటున్నారు.
మోహనకృష్ణ తాజా కృతి పోగుబంధం సామాజిక వర్గ స్థితిగతులను, ఏకి, వడికి, చిట్టె కట్టి, రంగులద్ది, సాపు చేసి, మగ్గం మీదికెక్కించి, నేతనేసి, బట్ట మడిచి, ముస్తాబుతో దుకాణం అద్దాల బీరువాలో అందరూ చూసేలా ప్రదర్శించిన నిండైన వస్త్రం.
మోహనకృష్ణ రచనలో అడుగడుగునా భృగు బంధం ఆవిష్కరణ కనిపిస్తుంది. అందుకే ఎంతో పదునుగా సిరులమ్మను నిలదీయగలిగేలా
భృగు గారాలపట్టి...... మా బతుకుల్లో కన్నీరైనా తుడిచే ప్రయత్నం చేయలేదు అంటూ సూటిగా నిష్టురమాడగలుగుతున్నారు. విరిగిన ఎముకల రాట్నం , పట్టుపురుగుల త్యాగం, మగ్గం గుంటలు ఊబిగా మారి...!
మోహనకృష్ణకు సామాజికవర్గ ఉత్పాదక అగచాట్ల పట్ల అవగాహన, ఆక్రోశం వెల్లడి చేస్తున్నాయి.
పౌరుషంతో, పదునైన పదవిన్యాసంతో, ప్రస్ఫుటమైన వ్యక్తీకరణతో మోహనకృష్ణ పోగుబంధం వర్తమానంలో నెలకొన్న చారిత్రక ఆనవాలుగా కూడా నిలిచి ఉండాలని నా శుభకామన...
తేది. 23-12-2020
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి