వివక్ష | కవిత | అగ్రగామి | మోహనకృష్ణ భార్గవ
అగ్రగామి పక్షపత్రికలో ప్రచురితమైన
నా కవిత " వివక్ష " - 03-03-2022
..................................
కవితా శీర్షిక : " వివక్ష "
రచన : డా" మోహనకృష్ణభార్గవ
చరవాణి : 7416252587
..................................
ఏదిరా నీకులమంటే..!
మంగలినేను చాకలినేను
కమ్మరి కుమ్మరి కురుమనునేను
వడ్డెర వడ్రంగి విశ్వకర్మనునేను
జాలరి మేదరి గౌడనునేను
జోగిని భోగిని బండారినినేను
బోయనునేను బలిజనునేను
తొగటక్షాత్ర ముదిరాజునునేను
దాసరినేను దాసినినేను
కంటకాసే కాటిపాపనునేను
మట్టి ముద్దాడిన బిడ్డ
మహాదిగను నేను
పుడమికి పూల'మాల'ను
గోవుల కాసే గో 'కుల'మే
నా కులమన్నాడు..!
ఏదిరా నీవర్ణమంటే..!
కార్మికుడి స్వేదం
కంఠం దాటని గరళం
మాడిన పేగుల వలయం
కంటకారిన కన్నీరు 'తెలుపు'
వెలుగును మింగి
గుడెసెల కమ్మిన
చీకటి 'నలుపు'
కాలికింద బతుకు
అహంకారాలకు రాసిన
నెత్తుటి పారాణి 'ఎరుపు'
నిరాశ నిస్పృహల
మట్టి దిబ్బపై
చచ్చిన ఆశల శవాల 'బూడిద'
వర్ణాలన్నీ నావేనన్నాడు
అందుకు కాలికి అంటిన మట్టి
'ఉదా' హరణన్నాడు..!
ఎవడురా నువ్వంటే..!
పాలిచ్చే పశువు
కాలికింది నలిగే చెప్పు
నెత్తిమీద తలపాగా
నువు కట్టే బతుకుబట్టా
నువ్వు తినే కూడు
అది వండిన మట్టి కుండ
కుతకుత ఉడికే మెతుకు
కడాకరుకు నిను మోసే పాడె
నిను పూడ్చే కాపరి నేనన్నాడు
అందుకు కాలే కట్టే సాక్షమన్నాడు..!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి