చాయ్ | కవిత | మోహనకృష్ణ భార్గవ

చాయ్


పొద్దుపొద్దున్నే
గరంగరం చాయ్ తాకన్దే
ఏ పొద్దు మొలవదు
సల్లబడ్డ నరాల్ని
జివ్వున వేడెక్కిస్తది
లైఫ్ ని పరుగులెత్తిస్తది
ఎంతైనా.. చాయ్ కథే 
వేరు కదా..!

ఇరానీ మసాలా అద్రక్
గ్రీన్ జింజర్ లెమన్ 
అబ్బో ఒందళ్లోనే పేర్లు
పేరుకు తగ్గట్లే సరుకు 
ఉన్నోడు లేనోడు తాగే చాయ్ 
బిస్లరీ నీళ్లు, మున్సిపల్ నీళ్లు
ఉన్నోడికి లేనోడు పలుచన తీరు..

గల్లీ నుండి ఢిల్లీ దాకా
రాజకీయ రథాన్ని నడిపిస్తది
సర్పంచ్ నుండి మినిస్టర్ దాకా
దోస్తాన పాఠాలు నేర్పిస్తది
పనులన్నీ ఇట్టే పూర్తి చేస్తది
మస్తుగ లోకాన్ని చూపిస్తది..

సాసర్ లేనిదే తాగని సార్లు
మలాయ్ కావాలనే హుషార్లు
తాగిపడేసే డిస్పోసల్లాంటి
వాడుకొని వదిలేసే 
పూటకూలీల బతుకుల్లా
వాడుకరి జీవాలు..

పొద్దుబోక టైంపాస్ కి  
దోస్తుల్తో తాగేటోల్లు కొందరు
పొద్దు ఎట్లా గడుస్తదోనని 
పొద్దుగూకే యేల గొల్లున 
భయంతో తాగేటోల్లు ఇంకొందరు

పొద్దంతా ఒళ్లుహూనం 
చేస్కుని కష్టపడే శ్రామికుడికి 
రోజుకు మూడు పూటల
తిండి దొరకని పేదరికానికి
ఆకలేస్తే ఆకలిని 
చంపటమే ఏకైక మార్గం

ఆస్వాదన కోసం కాదు
పొద్దంతా ఆకలని చంపటానికి
మరికొంత సమయం పనిచేసే
సత్తువ ఒంట్లో రగిల్చేందుకు
చాయ్ తాగుతూ
ఆకలిని బాధలని ఒత్తిళ్లని
కన్నీళ్లని మరుస్తడు 

చాయ్ చేసే సహాయం
మరెవరూ చేయలేరేమో
అందుకే ఎందరికో
కన్నీరు తుడిచే దోస్తయింది

అలసిన శ్రామికుడి
సెమటచుక్క నీరుగా..
కల్మషమెరుగని 
మనసును పాలుగా..
బతుకు నేర్పిన చేదు 
గుణపాఠాలు తేయాకుగా..

ఇకనైన బతుకు బాగుపడాలనే  
ఆశలని చక్కెరగా..
కష్టాలని ఎదుర్కునే 
ధైర్యాన్ని అల్లంగా నూరిపోసి..
జీవితమనే మంటలో
దేహాన్ని మరిగించి..
తయారుచేసిన తేనీరు..

ఆహా.. 
అంటూ ఆస్వాదిస్తుంటే
బాధలు బెంగలు చటుక్కున
మాయమైపోయి..
అలా.. 
జీవితంపై 
ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తది..

..........................................

డా" ఎక్కలదేవి మోహనకృష్ణభార్గవ
సామాజిక కవి, రచయిత
జనగామ, సెల్ :7416252587

(ప్రజామంటలు దినపత్రికలో 12-03-2022 రోజున ప్రచురితమైనది)

కామెంట్‌లు

  1. మీ కవిత చాల బాగుంది భార్గవ గారు.

    రిప్లయితొలగించండి
  2. వన్ బై టూ చాయ్..
    దో మే తీన్ బనావ్ యార్..
    ఒకరు నుండి ఇద్దరు..
    ఇద్దరు నుండి ముగ్గురు..
    ముగ్గురు నుండి ముప్పై దోస్తుల ఇచ్చేది చాయ్ మాత్రమే...
    గల్లీ నుండి ఢిల్లీ దాంక
    రాజకీయ జ్ఞానాన్ని ఇచ్చేది చాయ్ మాత్రమే..
    బట్టల షాప్ లో నగల షాప్ లో భేరం జేయకుండ బిల్లు కట్టిచ్చేది ఛాయ్ మాత్రమే..
    మున్సిపల్ పని నుండి
    ఎంత ముఖ్యమైన ఇట్టే చేయించేది
    సింగిల్ చాయ్ మాత్రమే...
    చాయ్.. చాయ్ నీవు భలే భలే.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత