ఏకసూత్ర మణిహారం - పోగుబంధం | ఆచార్య మసన చెన్నప్ప
ఏకసూత్ర మణిహారం - పోగుబంధం
ఆచార్య మసన చెన్నప్ప
ఆర్షకవి, ఆర్షకోకిల, ప్రముఖ సాహితీవేత్త,
మాజీ తెలుగు శాఖాధిపతి
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ప్రముఖ జాతీయ చేనేత మాస పత్రిక "పద్మాంజలి" లో ప్రచురితమైన సమీక్ష..
డా" మోహనకృష్ణభార్గవ ఉన్నత విద్యావంతుడు, జ్యోతిష్య శాస్త్రంలో మంచి పట్టు సంపాదించినవాడు. పట్టుదలగలవాడు కనుకనే అటు సామాజిక రంగంలోను ఇటు రచనా రంగంలోను విశిష్టమైన సేవలందిస్తున్నాడు.
వైదిక సంస్కృతిపై గల అభిమానంతో, అభినివేశంతో పురోహిత వృత్తిలో రాణిస్తూ అందరికి హితుడుగా మెలగుతున్నాడు, సన్నిహితుడిగా ఉంటున్నాడు.
ఇది అతని మొదటి కవితా సంపుటి, కవితా రంగంలో అడుగుపెడుతూనే తన ప్రత్యేకతను చాటుకున్నాడంటానికి "పోగు బంధం" తిరుగులేని ఉదాహరణ.
ఈ సంపుటిలో ఎన్నో కవితా ఖండికలున్నాయి. అవన్నీ మణుల్లాంటివే. మణుల్ని గుది గ్రుచ్చినట్లైతే అది మణిహారం అవుతుంది. ఒకే వస్తువును సూత్రంగా చేసుకొని తయారుచేసిన కవితా మణిహారం " పోగుబంధం"
ఈశ్వర సృష్టిలో పుట్టుకతో ఎవడూ బలవంతుడు కాడు. కానీ భారతదేశంలో పుట్టుకతోనే బలవంతులమని చెప్పుకొనే అవకాశం ఉంది. వెర్రి తలలు వేసిన ఈ అవకాశం వల్ల ఆయా వృత్తుల వారిని అగౌరవపర్చడం కళ్లారాచూస్తున్నాం. మనిషి ఏ పని చేయాలన్నా తెలివి (జ్ఞానం) తప్పనిసరి అవసరం. కానీ ఈ దేశంలో ఏ పనీ చేయనివానికి చేసే సామర్థ్యం లేని వానికే ఎక్కువ తెలివి. అతడేం చెప్తే అదే వేదం. ఇంతకు అతడు వేదం చదివాడా అంటే అదీ లేదు. గీతలో శ్రీ కృష్ణుడు వేదవిహిత కర్మలు చేసేవాడు శ్రేష్ఠుడని, అతడు దేన్ని ప్రమాణంగా చేసుకుంటే దాన్నే లోకులనుసరిస్తారని సెలవిచ్చాడు. కానీ ఈ రోజు వేదం ఎవరికీ పట్టని విద్య. అందరిలో ఉన్న దేవుడే మనలో ఉన్నాడు. మనలో ఉన్న ఆ దేవుడే అందరిలో ఉన్నాడు. అట్టి దేవుణ్ణి సాక్షాత్కరించుకున్నవాడే పండితుడని భగవద్గీత నొక్కి చెప్తుంది. ఐనా పండితమ్మన్యులు బయలుదేరి వేదజ్ఞానాన్ని కలుషితం చేస్తున్నారు. ఇట్టి సందర్భంలో జిజ్ఞాసువులైన వ్యక్తులెవరైనా వేదాల దగ్గరకి వెళ్లి మూలాలను అన్వేషించవలసి ఉందని నా భావన.
మిత్రుడు మోహనకృష్ణభార్గవ ఈ అన్వేషణలో ఉన్నందుకు నాకానందంగా ఉంది. మనిషిని మనిషిగా చూడడం మనిషికి ఉండవలసిన సుగుణం. బ్రాహ్మ్యం, క్షాత్రం, వ్యాపారదక్షత, సేవాతత్పరత ఇవి మానవుల్ని ప్రభావితం చేసే ధర్మాలు. ఎవడేపని చేసినా అది పరహిత కర్మ ఐతే, చేసేవాడు పురోహితుడేనని నా అభిప్రాయం.
మోహనకృష్ణభార్గవ పురోహిత ధర్మానికి నా కైమోడ్పులర్పిస్తున్నాను. అతనితో పాటు నేనూ చేనేత కుటంబంలో పుట్టినందుకు గర్విస్తున్నాను.
వస్త్రహీనుడు సమాజానికి పనికిరాడు, అస్త్రహీనుడు యుద్ధానికి పనికిరాడు కదా.! అస్త్రహీనుడైనా వస్త్రధారి కావలసిందే మరి, అట్టి మహోన్నతమైన సంస్కృతికి పాదులు దీర్చిన పద్మశాలీల ఆత్మగౌరవాన్ని అన్ని దిశలుగా చాటే కావ్యమే ఈ "పోగుబంధం"
వృత్తిని ప్రేమించి గౌరవించే సంస్కృతి కొరవడితే సమాజం క్రమంగా బ్రష్ఠమవుతుంది. కుండలు చేసేవాణ్ణి అగౌరవపరిస్తే కుండలు అందని పరిస్థితి ఏర్పడుతుంది. అన్నం ఉత్పత్తి చేసే రైతును నిందిస్తే అన్నమే కరువవుతుంది. చదువుకున్న వాళ్ళలో ఎంతో మార్పు వస్తే గానీ ఆయా వృత్తులకు గౌరవం లభిస్తుంది. దేశానికి పూర్వ వైభవం వస్తుంది.
ఈ రోజు చేనేత పరిశ్రమ నష్టాల్లో ఉంది. చేనేత పనివారు కష్టాల్లో ఉన్నారు. కారణం అందుకు బాధ్యత సమాజానిదే కానీ ఆవృత్తిని నిర్వహించేవారిది ఎంతమాత్రం కాదు, ఇదే దురదృష్టమంటే.
మోహనకృష్ణభార్గవ ఆయా కవితా ఖండికల్లో చేనేత కళాకారుల బ్రతుకుచిత్రాలను తన కలం కుంచెతో సహజమైన రీతిలో అందించాడు.
ఈ కావ్యం చదువుతుంటే.. ఎందుకురా ఈ వృత్తిని కొనసాగించాలి.? అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఒక వృత్తిని చేబట్టి జీవనయాత్ర సాగించేవాడు ఆకస్మికంగా మరణిస్తే అందుకు సమాజానిదే పూర్తి బాధ్యత.
కానీ అద్భుతమైన రీతిలో అందరి అవసరాలను తీర్చే చేనేతలకిచ్చే గౌరవం శూన్యం. చేనేత కళాకారులను చూసే విధానం హేయం.
నేత శ్రామికుల స్వేదాన్ని అత్తురుతో పోల్చిన కవికి వృత్తి గౌరవం లేదని చెప్పలేం.. కానీ నేత కార్మికుల శ్రమ దోపిడికి గురి అవుతున్న సందర్భంలో ఈ కవి పొందిన ఆవేదన ఇంతంత కాదు.
బట్ట కట్టుకున్నవాడు బాగానే ఉన్నాడు. కానీ నేసినవాడు మాత్రం పేదరికంలో కూరుకొనిపోయాడని కవి వాపోయాడు.
పద్మశాలీల ఆడపడుచు లక్ష్మీ దేవి. ఐనా చిన్న పిల్లల బాల్యాన్ని దారిద్ర్యం చిదిమేయడం బాధాకరం కాదా.!
" సిరికి పుట్టింటి వారమంటూ
నేత బిడ్డ మహాలక్ష్మి అంటూనే
పలకాబలపం పట్టాల్సిన బాల్యాన్ని
పేదరికం చిదిమేసింది"
మనస్సును ద్రవింపజేసే వాక్యాలివి.
" ఊయల రంగుల రాట్నంపై ఊగవలసిన పిల్లలు రాట్నం సుమ్మి తిప్పడంతో బాల్యం మాయమైపోతుందని "
చదువుకుంటే ఈ దుస్థితి కలిగేది కాదన్న మోహన్ మాటలతో ఏకీభవించకుండలేం. ఇంటిల్లిపాదీ కష్టపడితే గానీ వస్త్రం తయారుకాదన్న మాట పరమసత్యం.
చరిత్రకు వస్త్రమే ఆనవాలంటాడీ కవి.
" దేశ చరితకు నీవొక దర్పణం
నీ బ్రతుకే పుడమికి అర్పణం
ప్రగతికిదే నీస్వేద తర్పణం
జగతికనుక్షణం సమర్పణం "
కవితావేశంతో పలికిన ఈ పలుకుల్లో నూరుపాళ్లు సత్యమే ఉందికానీ 'కల్ల' కనిపించదు.
విశ్వ సంస్కృతి - విష సంస్కృతిలో మునిగిపోయినందుకు కవి పడిన బాధ వర్ణనాతీతం.
ఐతే.. మోహన్ ఏ ఆశయంతో ఈ కవితా సంపుటిని రచించాడో మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది !
" శిధిలమైన శిలల క్రింద
చిక్కిన చేనేత చరిత
ఏనాటికైనా వెలుగొందాలి
దేశ చరిత్రకు వస్త్రమే
నిదర్శనంగా నిలవాలి "
ఈ నేపథ్యంలో కవి మోహన్ కులసంఘాల తీరు తెన్నుల్ని దుయ్యబట్టడం విశేషం..
" చేవచచ్చిన నేతలారా, పదవికోసం యావపోదా ? " అంటూ కులరాజకీయాలను గర్హిస్తాడు.
" ఆదరించే నాథుడెవరు ?
పోరాడే నిస్వార్థుడెవరు ? "
అని ప్రశ్నిస్తూ.. సమాధానంగా అతడే ముందుకు రావాలని కోరుతాడు ప్రేమ పూర్వకంగా..
" నాకీ జన్మొద్దమ్మా " అన్న కవితా ఖండిక మళ్లీ మళ్లీ మనచేత చదివించి కంటనీరు పెట్టిస్తుంది.
చేనేత గృహంలో పుట్టించవద్దనే గర్భస్థ శిశువు అవేదన. ఆగర్భ శ్రీమంతులను కూడా శోకాతప్తుల్ని చేస్తుంది.
" ఏముందీ లోకంలో
మీ త్యాగాన్ని గుర్తించిందా ?
మీ కళలకి విలువిచ్చిందా ?
మీ చరితను గౌరవించిందా ?"
అనే పంక్తులు కడుపులోని శిశువు తల్లిని ప్రశ్నించినట్లు కాక సమాజాన్ని ప్రశ్నిస్తున్నట్లు అనిపిస్తుంది.
వృత్తిపరమైన వంశ గౌరవాన్ని పెంచే సదాశయం కృష్ణభార్గవది. అందుకే వంశ సంకీర్తన చేస్తాడు..
" సిరికి పుట్టిల్లు హరికి అత్తిల్లు
భృగుజాతిన పుట్టిన భార్గవుడవేనని
పద్మమందు పుట్టిన పద్మశాలివేనని
వెలుగెత్తి చాటుదాం మనవంశ వైభవం "
పద్మశాలీల్లో ఎన్ని తెగలున్నా.. వారందరిదీ భృగువంశమేనని, తమతమ భేదాలు విడిచి ఐకమత్యం గా ఉండండని ప్రబోదిస్తాడు మోహనకృష్ణ "నేత కళాకారులు" అనే కవితా ఖండికలో..
"చేతన" కవిత కవి మనోధైర్యానికి, ప్రజ్జ్వరిల్లుతున్న అంతశ్చేతనకు ప్రతీకగా నిలుస్తుంది.
" దారం రేఖల నడుమ, వెలుగు కిరణాలు పడని "
అని వెలుగెత్తి చాటుతున్న కవి సామాన్యుడు కాడు. అందుకే ఆవేదనతో తన కవితను నేతన్నకే అంకితమిస్తున్నాడు.
ఈ కవితా సంపుటిలో అన్ని కవితలు ఒక ఎత్తైతే "నేయి బువ్వ - గంజి మెతుకలు" మరొక ఎత్తు.
'నేయి బువ్వ' అంటే నేతితో తినే అన్నం అనుకున్నాడు రచయిత బాల్యంలో.. కానీ నేస్తే కానీ బువ్వ అని తర్వాత ఆయనకు అర్థమైంది. చీరకు గంజి, గంజికి అన్నం, అన్నానికి బియ్యం, బియ్యానికి పైసలు తప్పనిసరి కానీ పైసలు లేనపుడు గంజి ఎక్కడినుంచి వస్తుంది. పక్కింటివాళ్లనడిగి తెచ్చిన రహస్యంగా దానితోనే ఆకలిని తీర్చుకునే దీనస్థితిని మోహనకృష్ణ అపూర్వంగా వర్ణించి పాఠకుల్ని శోకాతప్త హృదయాల్ని చేశాడు.
ఈ ఖండిక కరుణ రసానికి ఆలవాలమైంది. ఇందులో తనతండ్రి ఔదార్యాన్ని మంచానపడిన దీనస్థితిని. చుట్టాల తీరును, ప్రభుత్వ నిస్సహాయస్థితిని, వర్ణించిన విధానం కవి ఆత్మీయతకు అద్దం పట్టింది.
అయినా.. " మేం నేతన్న బిడ్డల " మని చెప్పుకోవడం మన వంశ ప్రతిష్ఠను తెలుపుతుంది.
" తోటోడు బాగుపడితే ఓర్వలేని సమాజం " దేవుని చేతనే రక్షింపబడాలని నిర్వేదానికి గురికావడం కవి వంతయింది..
" అయినా నిలబడే సత్తా మాకుందని " నిరూపించిన మోహనకృష్ణ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. కవి నేటి స్థితిని చూస్తే బాల్యంలో ఎంత కష్టపడ్డాడో తెలుస్తుంది.
" పోగు బంధం " కేవలం ఒక అక్షర మాలిక కాదు, కవితా ఖండికల సమాహారం కాదు, పద్మశాలీల గుండెల్లో గూడు కట్టుకున్న దుఃఖానికి ప్రతిరూపం. సమాజ గౌరవానికి పాటుబడే ఒకవర్గం ఏ విధంగా ఆకలి జ్వాలలకు ఆహుతి అవుతుందో చెప్పే ప్రబంధం ఈ "పోగు బంధం"
నేను ఎన్నో కవితలు చదివాను. కానీ ఇట్లా వంశ గౌరవానికి తావిచ్చి, నేతన్నల దుస్థితిని కళ్లకు గట్టినట్లు వర్ణించిన కవితా సంపుటి "పోగు బంధమే"
పోగుతో పద్మశాలీలకున్న బంధం ఈ నాటిది కాదు. సృష్టి ఆవిర్భావ కాలానికి చెందింది. ఋషుల మార్గంలో నడవడం వల్లనే ఇన్ని కష్టాలెదురౌతున్నాయా అన్న సందేహం కలగకపోదు. అందుకే పద్మశాలీలు చేనేతేతర వృత్తుల వైపు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.
"ఈ కృతి పద్మశాలీల శోకమయ జీవితానికి ఆకృతి, ఆత్మీయతా స్పర్శతో అక్షరాకృతిని కల్గించిన
డా|| మోహనకృష్ణుడు సుకృతి, ఆయనకు నా హృత్పూర్వకమైన సన్నుతి "
ఘంటారావం దిన పత్రికలో ప్రచురితమయిన తెలంగాణ ఉద్యమ నేత, ఉస్మానియా రాజనీతి శాస్త్ర విశ్రాంతాచార్యులు, టీజేసీ నాయకులు, ప్రొఫెసర్ కోదండరాం గారి సమీక్ష
" నేతన్నల బతుకు చిత్రం "
అగ్రగామి పక్ష పత్రికలో ప్రచురితమైన ప్రముఖ సామాజిక కవి, సీనియర్ జర్నలిస్ట్, అధ్యాపకులు. కోడం కుమారస్వామి గారి సమీక్ష
" సృజన జీవుల పక్షం - పోగుబంధం "
సబాల్టర్న్ త్రైమాసిక పత్రికలో ప్రచురితమైన సోమనాథ కళాపీఠం గౌరవ అధ్యక్షులు డా" రాపోలు సత్యనారాయణ గారి సమీక్ష


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి