కవులు ప్రజల వైపు నిలవాలి | పూలపరిమళం పుస్తక ఆవిష్కరణ | కోడం కుమారస్వామి

కవులు ప్రజల వైపు నిలవాలి

విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ

జనగామ రచయితల సంఘం ఆధ్వర్యంలో మూడు కవిత్వ పుస్తకాల ఆవిష్కరణ

ప్రముఖ రచయిత, సామాజిక కవి, అభ్యుదయ వాది, సీనియర్ జర్నలిస్, అధ్యాపకులు కోడం కుమారస్వామి రచించి ప్రచురించిన "పూలపరిమళం" పుస్తక ఆవిష్కరణ


జనగామ, 27 ఫిబ్రవరి, ఆదివారం  : సమసమాజ నిర్మాణానికి ప్రజాకవులు శ్రామిక వర్గ ప్రజలవైపు నిలబడాలని విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ పిలుపునిచ్చారు.  తెలుగు సాహిత్యంలో విప్లవ కవిత్వం వస్తు శిల్పాలల్లో గొప్ప బలం పుంజుకుందన్నారు. విప్లవ కవిత్వం చదవకుండా కొందరు కువిమర్శ అసత్యారోపణలు చేస్తున్నారని చెప్పారు. ఆదివారం జనగామలో జనగామ రచయితల సంఘం ఆధ్వర్యంలో పెట్లోజు సోమేశ్వర చారి అధ్యక్షతన  కోడం కుమారస్వామి కవిత్వం "పూలపరిమళం" పుస్తకాన్ని డాక్టర్ కాసుల లింగారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రధాన వక్తగా విరసం నేత అరసవిల్లి కృష్ణ మాట్లాడుతూ  ఫాసిస్ట్ సందర్బంలో రాజ్యం అణచివేత మీద కొన్ని రచయితల సంఘాలు మౌనం వహిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రచయితల మీద జరుగుతున్న అణచివేతను ఐక్యంగా రచయితలు ప్రతిఘటించాలని కోరారు. విప్లవ సాహిత్యంలో ప్రజా జీవితం కొత్తకోణాల్లో ప్రతిఫలిస్తుందని చెప్పారు. కోడం కుమారస్వామి కవిత్వం 'పూలపరిమళం' లో  ఈనేలపై జరిగిన స్థలకాల పరిస్థితులు ప్రతీకగా నిలిచాయని అన్నారు. అరసవిల్లి కృష్ణ రాసిన మరో పుస్తకం ' ఈవేళప్పుడు' కవిత్వం మీద ప్రముఖ విమర్శకులు డాక్టర్ మెట్టు రవీందర్ మాట్లాడుతూ కృష్ణ  సాహిత్యం ఇవ్వాళకే పరిమితం కాకుండా భవిష్యత్తులో సమస్యలకు పరిష్కారాలు చూపిస్తుందన్నారు.   విభిన్న సామాజిక పరిస్థితులను కవిత్వం చేయడమే నేటి ప్రజాపక్షం నిలిచిన రచయితల బాధ్యతగా నిలుస్తుందన్నారు. కేక్యూబ్ వర్మ రాసిన "భూమిరంగు మనుషులు" పుస్తకం మీద వడ్డబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ  వర్మ కవిత్వం రాజ్యం అనుసరిస్తున్న విధానాన్ని ప్రతిఘటించారన్నారు. డాక్టర్ కాసుల లింగారెడ్డి మాట్లాడుతూ   కోడం కుమారస్వామి కవిత్వంలో సామాజిక ఉద్యమ సందర్బాలను తగిన విధంగా చిత్రించారని అన్నారు. ఈ కార్యక్రమంలో విరసం వరంగల్ కన్వీనర్‌ కోడం కుమారస్వామి,  జరసం అధ్యక్షుడు పొట్టబత్తిని భాస్కర్, ప్రధాన కార్యదర్శి ఐల సోమ నరసింహ చారి, జి.కళావతి, జి. కృష్ణ, రామ్మూర్తి, సాంబారాజు యాదగిరి, నక్క సురేష్, ఎర్రోజు శ్రీనివాస్, మోహన్ కృష్ణ, సాదిక్ అలీ, బొట్ల యాదగిరి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

పూలపరిమళం కవిత్వం ఆవిష్కరిస్తున్న కవులు, విరసం నేత కృష్ణ

సాహిత్య సభలో మాట్లాడుతున్న విరసం అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ

సభకు హారైన కవులు, రచయితలు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత