శివుడు - రుద్రుడు - రుద్రాభిషేక విశిష్టత

శివుడు - రుద్రుడు - రుద్రాభిషేక విశిష్టత


వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే !
జగతః పితరౌ వన్దే పార్వతీ పరమేశ్వరౌ !!


ఆది పురుషుడు, లయ కారకుడు, సర్వేశ్వరుడు సకల విశ్వానికి మూలపురుషుడు దేవాదిదేవుడు సదాశివుడు పరమేశ్వరుడే "రుద్రుడు" 

భగవద్భందువులందరికీ మహా శివరాత్రి పర్వది‌న శుభాకాంక్షలతో - డా" మోహనకృష్ణ భార్గవ

శివరాత్రి అంటేనే శివారాధన, ఉపవాసం, జాగరణ.. 
ఉపవాసం అంటే ఆహారం మానివేయటం కాదు, భగవంతుడికి దగ్గరగా ఉండటం అని అర్థం.. అంటే ప్రతీక్షణం భగవంతుని స్మరించడం‌‌, అందులో భగవంతుడిని భక్తులకు దగ్గర చేసే శివుడికి సంబంధించిన కొన్ని విశేష అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!

ఓఙ్కారమన్త్ర సంయుక్తం నిత్యం ధ్యాయన్తి యోగినః !
కామదం మోక్షదం తస్మై ఓఙ్కారాయ నమోనమః !!


"శం కరోతితి శంకరః" అనగా సుఖములను కలిగించువాడని అర్ధం. శివుడు అంటే ఆది అంతం లేనటువంటివాడు. సాకార నిరాకార అనంత శక్తి స్వరూపం. అద్వితీయ పరబ్రహ్మ, పరమాత్మ స్వరూపమే పరమేశ్వరుడు. 
చతుర్వేదాలతో పాటు శివపురాణం, లింగ పురాణం, వాయిపురాణం, స్కాంద పురాణం, అగ్నిపురాణం, మార్కండేయ పురాణం వంటి పురాణాలు., అనేక స్మృతి ధర్మశాస్త్రాలు, ఆగమ శాస్త్రాలు పరమేశ్వరుడి మాహాత్మ్యాన్ని తెలియజేస్తున్నాయి.

శివుడికి మొదటి భక్తుడు విష్ణువే..
శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే !
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయగుం శివః !!


సదా విష్ణువు తన మనస్సులో శివుడినే ధ్యానిస్తూ ఉంటాడు, అలాగే శివుడు ఎల్లపుడూ తన మనస్సులో విష్ణువునే స్మరిస్తూ ఉంటాడు. లింగ పురాణం ప్రకారం సృష్ట్యాదిలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు ముందు, ఎవరు గొప్ప అన్న వివాదం ఏర్పడి ఇరువురు యుద్ధానికి సిద్ధమవుతారు., ఆ క్షణంలో వారిముందు ఒక అగ్నిస్థంభం ఏర్పడింది, అది పొడువులో సమస్త విశ్వాన్ని తాకుతూ దాని మూలం దొరకనంత పొడవు వ్యాపించింది, ఆ లింగ ఆద్యంతాలను చేరిన వారే శ్రేష్టులని లింగము ద్వారా వినబడిన మాటలకు బ్రహ్మా విష్ణువులు ఇద్దరు లింగ ఆద్యాంతాలను చేరడానికి బయల్దేరతారు, ఇట్టి వివాదంలో ఇరువురు చేరకపోగా బ్రహ్మ మోసగించి ఆద్యాంతాలను చేరానని చెప్పి శివుని శాపానికి గురౌతాడు, విష్ణువు ఆద్యాంతాలను దర్శించలేనని తెలిపి నిజాయతీతో శివుని అనుగ్రహాన్ని పొందాడు‌. 


శివుడు లింగాకార స్వరూపంగా ఆవిర్భవించిన రోజే "మహా శివరాత్రి". మాఘమాస బహుళ చతుర్దశిని హైందవ సాంప్రదాయంలో శివరాత్రిగా జరుపుకుంటారు. ఇదే రోజు శివ పార్వతుల కళ్యాణం జరిగింది, పర్వతరాజు పుత్రిక అయిన పార్వతిని పరమేశ్వరుడు వివాహమన చేసుకున్నరోజు కావడం ఒక విశేషమైతే.. పార్వతి జీవాత్మ స్వరూపంగా, శివుడు పరమాత్మ స్వరూపంగా ఆధ్యాత్మిక వేత్తలకు దర్శనమిస్తారు. అంటే ఒక వ్యక్తిని, ఒక జీవిని నడిపే శక్తి ఆ ఆదిపరాశక్తి అవగా., ఈ సృష్టి మొత్తాన్ని నడిపేవాడు పరమేశ్వరుడు.. శివరాత్రి శక్తి ఉపాసకులు, ప్రకృతి ఉపాసకులకు ఎంతో ముఖ్యమైనది. కనుక ఆలయాలలో శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాలని మహావైభవంగా నిర్వహిస్తారు. ఇదే రోజు‌న అర్థరాత్రి శివాలయాలలో శివలింగోద్భవ దర్శనం చేస్తారు. ఇక రోజంతా జాగరణ శివరాత్రి ప్రత్యేకం.


భోళాశంకరుడు భక్త సులభుడైన శివుని లింగాకారంతోనే పూజిస్తారు. విష్ణువు అలంకార ప్రియుడు, శివుడికి మాత్రం అభిషేకమే ప్రియమైనది. కేవలం నీటితో అభిషేకిస్తే చాలు స్వామి ప్రసన్నుడౌతాడు. మానవులకే కాదు.. దేవ, రాక్షస, యక్ష, రాక్షసాదులు, కిన్నెర కింపురుషులు, సమస్త మహర్షులు, సమస్త లోకాలు శివుడిని అభిషేకించి స్వామి అనుగ్రహాన్ని, శక్తిని పొందినవారే..! 
అభిషేకాలలో రుద్ర అభిషేకం విలువైనది. శివుని అభిషేకించు విధానమే రుద్రాభిషేకం అని పిలుస్తారు. ఇది "కృష్ణ యజుర్వేద సంహిత" 4వ అధ్యాయం 5 వ ప్రపాఠకంలో చెప్పబడింది. దీనిని "రుద్రాధ్యాయము" అంటారు. రుద్రుడి యొక్క అధ్యాయమే రుద్రాధ్యాయం. లఘు రుద్రాభిషేకం, మహాన్యాస రుద్రాభిషేకం, ఏకవార, శత రుద్రాభిషేకాలు, ఘటాభిషేకాలు అని అనేక రుద్ర అభిషేకాలు మహర్షుల చేత చెప్పబడ్డాయి. వాంఛిత కోర్కెలు పొందడానికి పాశుపత అభిషేకాలు కూడా ఉన్నాయి. శివభక్తాగ్రేసరులు సనత్కుమారుడు, శుక్రాచార్యుడు, మార్కండేయుడు, బోధాయనుడు, రావణాసురుడు వంటి అనేకమంది పలు రకాల అభిషేక విధానాలను ప్రవేశపెట్టారు. వీటిలో న్యాస పూర్వక రుద్ర అభిషేకాలు అత్యంత విలువైనవి. 

శ్రీ కృష్ణుడు సంవత్సరకాలము భస్మోధ్ధూళిత సర్వాంగుడై రుద్రాధ్యాయ పారాయణము చేసేనని కూర్మపురాణమందు తెలుపబడింది. శ్రీ రాముడే బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి శివలింగ ప్రతిష్ఠాపనలు చేశాడు. మార్కండేయుడు శివారాధనతో మృత్యువును జయించి చిరంజీవి అయ్యాడు.

శివుడిని పూజించాలంటే ముందు తాను శివుడిగా మారాలి. అపుడే పరమాత్మ తత్వాన్ని ఆస్వాదించగలడు.

"నారుద్రో రుద్ర మర్చయేత్"
ఆ పరమేశ్వరుడిని పూజించుటకు మానవుడు తననే రుద్రునిగా రౌద్రీకరణ మొనర్చుకొని అభిషేకించాలని వేదాలు, శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. పాంచ భౌతిక శరీరమందు సర్వ దేవాత్మకుడగు రుద్రుడిని ఆవాహన చేసుకొని తానే స్వయంగా రుద్ర స్వరూపముగా భావించి రుద్రుడిని ఆరాధించాలి.

హంసోహం "హ కారః పురుషః ప్రోక్తః స ఇతి ప్రకృతిర్మతా" హకారము పురుష రూపము, సకారము ప్రకృతి రూపము, ప్రకృతి పురుషాత్మకమైనది. అహం అనగా నేను(జీవుడు), సః అనగా పరమేశ్వరుడు అని అర్థము. నేనే పరమేశ్వర స్వరూపుడను, నేనే పరమాత్మను, నేనే పరబ్రహ్మను అని భావించాలి. 

దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవసనాతనః !
త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ !!


దేహము(శరీరము) దేవాలయము గాను, శరీరములోని చైతన్యము(జీవుడు) పరమేశ్వరునిగాను భావించి, మనోబుద్ధి, చిత్తహంకారములగు అంతఃకరణము నందు గల దుర్భావములను, విపరీతమైన కోర్కెలు, ఈర్ష్య, అసూయ, రాగ ద్వేషాల వంటి మాలిన్యాదులను తొలగించి "నేనే పరమాత్మను" అను భావముతో భగవంతుని పూజించాలి. 

జీవుడు దేవుడు వేరు కాదు, జీవుడే దేవుడు అనే భావన కలిగనపుడు, మనుషుల మధ్య అంతరాలు తొలుగుతాయి‌. ఏనాడైతే.. ప్రకృతిలోను, ప్రతీ ప్రాణిలోను, పదార్థంలోను, మనిషిలోను భగవంతుని స్వరూపాన్ని దర్శించగలడు. ప్రతీ జీవాన్ని, పదార్థాన్ని పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధించగలడో..! ఆనాడు ఈర్ష్య, ద్వేషం, అసూయా, కోర్కెలకు స్థానం ఎక్కడ ఉంటుంది.? అదే శివారాధనలో దాగిన అసలైన తత్వం.! జీవుడికి చివర మిగిలేది బూడిద మాత్రమే అన్న సత్యాన్ని తెలుపుతుంది.!


"రుద్రం ద్రావయతీతి రుద్రః" మన ఐహికాముష్మిక బంధముల వల్ల కలుగు దుఃఖ శోకములను పోగొట్టునది "రుద్రము" అనంతమైన దేవతలను (రుద్ర రూపం) అది దేవతలుగా కలిగివున్నది కనుక రుద్రము. "యశ్శత రుద్రీ మధీతే సో అగ్నిపూతో భవతి" ఎవరైతే శత రుద్రమును పఠించుదురో వారు "అగ్ని పూతులు" అవుతారు. అనగా బంగారమును కాల్చి శుద్ధి చేసినట్లు సమస్త పాపముల నుండి విముక్తులై అగ్ని వంటి తేజస్సు పవిత్రత పొందుతారు.

 
"సర్వేషు గ్రహదోషేషు దుస్వప్నాద్భుత దర్శనే
జపాన్ రుద్రాన్ సకృద్విపః సర్వదోషై ప్రముచ్యతే"

ధర్మవిరోదులై కృతకత్యములను ఆచరింపకపోవుట
తనకు విహితములైన బ్రహ్మచర్య, గృహస్థు, వానప్రస్థ, ఆశ్రమ ధర్మముల నతిక్రమించి మహా పాపములను చేసినవారు. తెలిసీ తెలియక రహస్యముగా స్వర్ణస్తేయ సురాపాన గుర్వంగణ గమన బ్రహ్మ హత్యాది మహా మహాపాతకాదులు, గురువాక్షేపణ, వేదశాస్త్ర విమర్శ, నిషిద్ధ పదార్థ భోజనం, పరస్త్రీ సాంగత్యం, అబద్ధ సాక్షము, రత్న ఆభరణ ధాన్య వస్తు, స్త్రీ, శిశు, ఇత్యాది అపహరణ, మహా మహా పాతక నివారణలకు శివారాధన, రుద్ర అభిషేకమే ఏకైక మార్గముగా చెప్పబడినది.

"రోగవాన్ పాపవాన్యస్తు రుద్రంజప్త్వా జితేంద్రియః
రోహాత్పాపాత్ర్పముక్తోసావతులం సుఖమశ్నతే"


గ్రహచారము బాగుండకపోయిన, దుస్వప్నాది దోషములు, వివిధ ఉత్పాతాలు, వివిధ ఉపద్రవ, శారీరక రుగ్మతలు కలిగినా పాపకర్మలచే ఇతరుల వల్ల అభిచారికాది ప్రయోగాలు జరిగినా, సమస్త దుఃఖ నివారణకై, విద్య యందు ఆటంకము జరిగిన ఉన్నత విద్యాధికారము పొందుట కొరకు, ఉన్నత ఉద్యోగం పొందుట కొరకు, వివాహ సంబంధ దోషములకు, సంతానం ప్రతిబంధకములు కలిగిన (పిల్లలు కలగకపోయినా) సమస్త ఆరోగ్య సమస్యలకు, ఆయుఃవృద్ధి కొరకు.. "అనపత్యాధి దోశేషు శాకిన్యాది గ్రహేషుచ, సర్వజ్వర వినాశాయ రుద్రజపో వినిశ్చితః" వివిధ శాకిని ఢాకిన్యాధి గ్రహ దోష నివారణకు, సమస్త విష జ్వర నివారణకు సమస్త దేహ పీడలకు శ్రీ రుద్రా ధ్యాయమే నివారణ మార్గమైయున్నది.


"ప్రథమో దైవ్యోభిషక్" వైద్యుల కంటే, దేవ వైద్యులకంటే, దేవాది దేవుడు పరమేశ్వరుడే ప్రథమ వైద్యుడు.దయార్థ హృదయుడు శివుడు పిలిచినంతనే పలికే దేవోత్తముడు ఆ స్వామిని ఉపాసించిన సకల రోగపీడలు, దీర్ఘకాలిక వ్యాధులు తొలగి నిశ్చయముగా పూర్ణాయుష్షు పొందగలరు.

"వేదేషు శతరుద్రీయం, దేవేషుచ మహేశ్వరః
స్కాంద స్సర్వ పురాణేషు, సర్వ స్మృతిషు మానవం"

అనగా చతుర్వేదములలో రుద్రాధ్యాయమును కలిగి ఉన్న యజుర్వేద తైత్తిరీయ సంహిత శ్రేష్టమైనది
దేవతలలో దేవదేవుడు ఆ మహా దెవుడు "శివుడు"
పురాణములలో "స్కాంద" పురాణం స్మృతుల్లో అనేక ధర్మములను వైదిక వాజ్మయములకు శిరోభూషనమైనది "మనుస్మృతి" శ్రేష్టములైనవి.

"సర్వోపనిషదాం సారో రుద్రాధ్యాయ" అన్ని ఉపనిషత్తుల సారమే రుద్రోపనిషత్తు రుద్రాధ్యాయ 
 మనషిని ఎల్లవేలలా రక్షించును సంసారమనే సాగరాన్ని తరింపగలరు. సర్వ పాపముల నుండి విముక్తి కలుగును. ఇట్టి మానవుడికి దుర్లభమని ఎమివుండబోదు. "ఏతైర్హవా అమృతోభవతి" శత రుద్రియముచే అమృతత్వం కలుగును. అగ్ని వలనే పవిత్రుడగును, శివానుగ్రహమున ఇష్టకామ్యములు పొందును, జ్ణానోత్పత్తి పొందుదురు. "బ్రహ్మలోకే విదీయతే" నిత్య పారాయణము చేయువారు తప్పక బ్రహ్మలోక(శివ సాయుజ్యం) పొందవలరు.

రుద్రాధ్యాయము - మహాన్యాసము వివరణ



శివుని అభిషేకించి స్వామి అనుగ్రహం పొందుటకు మహాన్యాస పూర్వక రుద్ర అభిషేకమే శ్రేష్టమైనది అని తెలుస్తున్నది. వివిధ మంత్రాదులచే న్యాసపూర్వకంగా మంత్రక్రియ అనుష్ఠానములచే రౌద్రీకరణ విధానమున రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకములను చేయవలెనని "బోధాయన మహర్షి" తెలిపెను. శివ భక్త్రాగ్రగణ్యుడు రావణుడు రచించిన "మహాన్యాసకారికలు" కూడా కలవు.

మహన్యాస విధానము :



పంచముఖ ధ్యానం: తూర్పు తత్పుషుడని దక్షిణ అఘోరమని, పశ్చిమ సద్యోజాత, ఉత్తర వామదేవ, ఊర్థ్వ ఈశాన దైవమని, శివుని పంచ ముఖములను ధ్యాన పూర్వకంగా అర్చించాలి.

ప్రథమ న్యాసము: రక్షణ పొందుటకై 33 శరీర భాగములలో ఆయా మంత్రములతో మంత్రోక్త దేవతలని స్థాపించుకొని అర్చించాలి.

ద్వితీయ న్యాసము: ఓం నమో భగవతే రుద్రాయ అను మహా మంత్రముతో ఒక్కొక మంత్ర అనుస్వారము పఠిస్తు స్పృశించాలి.

తృతీయ న్యాసము: సద్యోజాతాది పంచ మంత్రములచే స్పృసించుటతో శివ తేజమును ఆయా స్థానములందు పొందగలరు.

హంస మంత్రం: తాను దైవము ఒకటేయని ఏక భావమున హంసోహం అను మంత్రమును అనుష్ఠించాలి.

సంపుటీకరణం : అష్ట దిక్కులు భూమి ఆకాశ్యాది దశ దిక్కులను ప్రార్థించి వివిధ మంత్రాదులచే పూజించాలి.


దశాంగ రౌద్రీకరణము: పది అవయవ స్థానములలో రుద్ర స్వరూపమును పొందుటయే దశంగ రౌద్రీకరణ, రుద్రత్వ మాపాదించుట వలన ప్రకాశమైన తేజస్సు గలవాడే గాక సమస్త ఉపద్రవాలు దరిచేరవు.

షోడషాంగ రౌద్రీకరణ: పదహారు అవయవములలో బీజాక్షరములచే అభిమంత్రికరణ మొనర్చి అయా అవయవాలకు రుద్రత్వమెర్పడుట. ఇది తనను తన కుటుంబమును తన వంశమును రక్షిస్తుంది. 

ఆత్మ రక్ష: వివిధ మంత్రములతో వివిధ అవయవాలను సృజించి తన రూపములో యున్నది బ్రహ్మయని వారిని "ఆత్మన్" అని భావించాలి. అది ఆత్మ తత్వాన్ని తెలుపుతూ ప్రాణశక్తిని పెంపొందింపజేస్తుంది.

శివ సంకల్పం: శివ సంకల్పం అనగా మంగళకరమైన, శుభమైన సంకల్పం అని అర్థం. తన మనస్సులో సదా శివడినే స్మరిస్తున్నానని తెలుపుతూ, తన మనస్సులో శివుడిని నిలుపుకోవడం.

పురుషసూక్తం: విరాట్పురుషుని వర్ణన మరియు ఇది శ్రేష్టమైన సంపద, చక్కని దేహము, దీర్ఘాయువు, అష్ట సిద్దులు, పొంది మాహా పాపముల నుండి విముక్తి పొందుదురు.

పంచమ న్యాసము: ముప్పై మూడు కోట్ల దేవతలను ప్రార్థించుట.

అష్టాంగం ప్రణామం : 
" ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా, పథ్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోష్టాంగ ముచ్యతే " పాదములనుండి శిరస్సు వరకు నేలను తాకిస్తూ ప్రణమిల్లి, మనస్సులో ధ్యానించి నోటితో "నమఃశివాయ" అని పలుకుతూ శివునికి సాష్టాంగ నమస్కారం చేయాలి.


రుద్ర ధ్యానం: తెల్లని శరీరము, మూడు నేత్రాలు, పంచముఖాలు, పదిచేతులు, సమస్త ఆభరణాలు, నల్లని కంఠం, జటాజూటము, చంద్రవంఖ,సర్పము, యజ్ఞోపవీతం, పులిచర్మం, కమండలం, రుద్రాక్షలు, శూలము వరధ అభయ ముద్రలు కలిగి సకల దేవతలు రాక్షసాదులచే పూజింపబడుతున్న విశ్వరూపుడైన రుద్రుని ధ్యానించుట.

"అగ్నిర్మే వాచి శ్రితః" అనే మంత్రముతో అవయవములను హృదయమును స్పృశించుకుంటు ఆరాధింపవలెను


"ఆరాధతో మనుష్తస్వై శుద్ధైః దేవ సురాదిభిః, ఆరాధయామి భక్త్యాత్వాం మాంగృహాణ మహేశ్వరః"

హే మహేశ్వరా.! దేవాసుర మనుష్యులతో నీవారాధింపబడుదువు. నిన్ను నేను భక్తితో ఆరాధిస్తున్నాను. నీ పాద సేవ భాగ్యము నేను జన్మ జన్మలకు పొందునట్లు అనుగ్రహింపుము.

స్వామిని షోడషోపచార పూజ జరిపి వివిధ పుష్పాలచే అర్చించి యదాశక్తి రుద్ర గాయత్రీ జపించవలెను. తదుపరి స్వామిని పంచామృత వివిధ ఫల రసాలచే సుగంధ పుష్ప బిల్వ శుద్ధోదకాలచే అభిషేకించాలి. రుద్రాధ్యాయముచే అభిషేకించాలి. 

ఆవర్తనం, రౌద్రీ, లఘు రుద్ర, మహా రౌద్రీ, అతి రుద్రము అనే అయిదు విధాలలో వారి శక్త్యానుసారం ఆచరింపవలెను. మంత్ర అనుష్టానం సామాన్యులకు కష్టతరం కనుక ఒక ఆచార్యునిచే జరిపించాలి. ఈ విధంగా జరిపిన రుద్రాభిషేక అర్చన వలన "నూరు అశ్వమేథ యాగములు" జరిపిన ఫలితం కలుగునని భోదాయన మహర్షి తెలిపాడు.


అంతటి మహత్తర "రుద్రాధ్యాయ" పారాయణ అభిషేక, జప, హోమ, తర్పణాదులను ఆచరించి, తరించి ఇష్ట కామ్యములను పొందగలరు.

మీ..

డా. ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ

జ్యోతిష్య శిరోమణి, జ్యోతిష్య రత్న.. జ్యోతిష్య మహర్షి, 
పిహెచ్‌డి - డాక్టరేట్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆష్ట్రోలజీ.,
యూఎస్ఎ ఆష్ట్రోలాజికల్ ఫెల్లోషిప్.,
సర్టిఫైడ్ ఆష్ట్రోలాజికల్ ప్రొఫీషియన్సీ ఇంటర్నేషనల్ అవార్డీ..
ఇండో అమెరికన్ ఆష్ట్రోలాజికల్ అవార్డీ..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత