" ముక్కోటి ఏకాదశి - వైకుంఠ ఏకాదశి విశిష్టత "

భగవద్భందువులందరికీ ముక్కోటి ఏకాదశి - వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు..



శ్లో" శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం !
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం !!
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం !
వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైకనాథం !!

ముక్కోటి ఏకాదశి - వైకుంఠ ఏకాదశి.!



"మాసానాం మార్గశీర్షోహం" మాసాలలో మార్గశిర మాసాన్ని నేనేనంటూ స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ గీతలో తెలియజేసాడు.. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిరమాసం, దీనిని వైష్ణవ మాసం అని కూడా పిలుస్తారు.. మృగశిరా నక్షత్రంతో పౌర్ణమి కలిసి వచ్చే మాసం మార్గశిర మాసం, ఈ మాసానికి అధిపతి చంద్రుడు.. గీతాచార్యుడు 'నక్షత్రానాం మహం శశీ' అంటూ నక్షత్రాలలో చంద్రుడు కూడా నేనే అన్నాడు.. అందుకే చంద్రుడి ఆధిపత్యం, విష్ణువు అనుగ్రహం కలిగిన మాసం మార్గశిర మాసం.. హేమంత ఋతువులో వచ్చే మొదటి మాసం మార్గశిరం..

పూర్వ సౌరమాన కాల గణనలో మార్గశిర మాసమే మొదటి నెల.. అలాగే ప్రాచీన ఋషుల కాలంలో సంవత్సరం మార్గశిర మాసంతోనే ప్రారంభమయ్యేది..
 
ప్రతీ నెలలో శుక్లపక్షము, కృష్ణ పక్షము రెండు ఏకాదశులు., మొత్తం సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు పుష్య మాస శుక్లపక్షములో వచ్చే ఏకాదశి అత్యంత పవిత్రమైనది, దేవతలకు ఎంతో విశేషమైనది, భక్తులకు ఆచరణీయమైనది. సూర్యుడి గమనంలో సంవత్సరానికి ఆరునెలలు భూమధ్యరేఖకు దక్షిణం వైపుగా పయనిస్తాడు దానిని దక్షిణాయనం అని, మరో ఆరు నెలలు భూమధ్యరేఖకు ఉత్తరం వైపుకు పయనిస్తాడు దానిని ఉత్తరాయణం అని అంటారు. అయితే మనకు పగలు రాత్రి కలిపి ఒకరోజు ఎలా అవుతుందో, దేవతలకు కూడా ఉత్తర, దక్షిణ ఆయనాలు కలిపి ఒక రోజు అవుతుంది. ఉత్తరాయణం ఆరు నెలలు దేవతలకు పగలు అవగా, దక్షిణాయనం రాత్రి అవుతుంది. అంటే దేవతలు నిదురించే కాలం‌. అందువల్లే ఆగమ శాస్త్ర రీత్యా దేవాలయ దేవతా ప్రతిష్ఠాపనాదులు కేవలం ఉత్తరాయణంలోనే నిర్వహిస్తుంటారు. అందుకే ఈ కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు.

ముక్కోటి ఏకాదశితోనే దేవతలు మేలుకొలుపు..!


అవును.. దక్షిణాయనం ఆరునెలలు దేవతలకు రాత్రి అవగా మకర సంక్రంతితో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంతో దేవతలకు ఉదయం ప్రారంభమవుతుంది. అనగా మకర సంక్రాంతి ముందు వచ్చే ఏకాదశి దేవతలకు తెల్లవారుజాము అవుతుంది. ఈ సమయంలో దేవతలు మేల్కొంటారు, కనుక అన్ని దేవాలయాలు బ్రాహ్మీ ముహూర్తంలోనే ద్వారాలు తెరచి సుప్రభాత సేవతో ఆరాధనలు ప్రారంభిస్తారు.

మూడుకోట్ల ఏకాదశులతో సమానం.!


ఏకాదశి విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది, పురాణ కథనం ప్రకారం పూర్వం "ముర" అనే రాక్షసుడు విష్ణువుతో యుద్ధం చేశాడు. యుద్ధం నుండి తప్పించుకున్న మురుడిని వెతికిన విష్ణువు అలసి సేదతీరుతాడు, అదే అదునుగా చూసిన మురుడు విష్ణువును సంహరించేందుకు ప్రయత్నిస్తాడు, ఆ క్షణంలో విష్ణువు దేహం నుండి లక్ష్మీ స్వరూపమైన ఒక అనంతమైన శక్తి ఉద్భవించి, ఆ మురుడిని సంహరిస్తుంది. ఆ రోజు ఏకాదశి కావడంతో ఆ తేజస్సును విష్ణువు ఏకాదశి అని పిలిచాడు.

నారాయణుడు ఏకాదశితో..

శ్లో" మమ భక్తాశ్చ యే లోకాః తవ భక్తాశ్చ యే నరాః !
త్రిషు లోకేషు విఖ్యాతాః ప్రాప్స్యంతి మమ సన్నిధిం.!!
 

నన్ను రక్షించిన ఏకాదశిని ఎవరైతే భక్తితో ఆరాధిస్తారో వారు ముల్లోకాలలో శాశ్వత కీర్తిని, అంత్యమున ముక్తిని, వైకుంఠ ప్రాప్తిని తప్పకుండా పొందుతారని ఏకాదశికి విష్ణువు వరం అనుగ్రహించాడు.


పాలకడలిపై శ్రీమన్నారాయణుడు ముక్కోటి ఏకాదశి రోజున మేల్కొని పరివార సమేతంగా గరుడ వాహనారూఢుడై లక్ష్మీనాథుడు మూడు కోట్ల దేవతలతో భూలోకానికి విచ్చేసి భక్తులను అనుగ్రహిస్తారు. ఈ ఏకాదశి రోజున చేసే పూజ, అర్చన, జపము, తపస్సు, ధ్యానము, దానము, యజ్ఞము, ఉపవాసము, జాగరణ ఏదైనా కూడా మూడు కోట్ల రెట్ల ఫలితాన్ని ఇస్తాయి., ఈ ఒక్క ఏకాదశి చేసే ఏకాదశి వ్రతం మూడు కోట్ల ఏకాదశీ వ్రతాలతో సమానం అవుతుంది. కనుక ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు‌.

దీనికి ఒక పురాణ కథ కూడా ఉన్నది..
శ్లో" త్రింశత్‌ కోటిసురైస్సాకం
బ్రహ్మా వైకుంఠమాగతః !
పౌలస్త్యేన నిపీడితాః సురగణాః 
వైకుంఠలోకం యయుః !!
ద్వారే తత్ర విషాదభావమనసాః! 
సూక్తైః హరిం తుష్టువుః !!


రావణాసురుడితో బాధలను అనుభవించలేక మూడు కోట్ల దేవలతలు, మహర్షులు, బ్రహ్మతో కలిసి వైకుంఠాన్ని చేరి పాలకడలిలో శయనిస్తున్న విష్ణువుని స్తోత్రాలతో కీర్తించి మేల్కొలిపారు. తదనంతరం నారాయణుడు వారిని అనుగ్రహించి దుష్ట సంహారం చేశాడు. ఏకాదశి రోజునే మూడు కోట్ల దేవతలు వైకుంఠాన్ని చేరి నారాయణుడిని మేల్కొలిపి అనుగ్రహాన్ని పొందారు కనుక ఈ ఏకాదశి రోజున నారాయణుడిని ఆరాధించడం వలన మూడుకోట్ల దేవతలను ఆరాధించిన ఫలితం, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా మూడు కోట్ల ఏకాదశీ వ్రతాల ఫలితం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి.

వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం.!


వైకుంఠమనగా విష్ణువు నివసించే స్థలం, ముక్తి కొరకై తాపత్రయపడే ప్రాణికోటికి నారాయణుడి చరణ సాయుజ్యాన్ని పొందడమే పరమావధి. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు వైకుంఠ ద్వారాలను తెరచి భక్తులను అనుగ్రహిస్తారు, పాప పుణ్యాలతో సంబంధం లేకుండా స్వర్గాన్ని, ముక్తిని, వైకుంఠ లోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు నారాయణుడు. అంతేకాదు ముక్కోటి ఏకాదశి వ్రతం చేసి ఉత్తర ద్వార దర్శనం చేసిన భక్తకోటికి తప్పకుండా కైవల్య ప్రాప్తి కలుగుతుందని, శాశ్వత ముక్తి లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. వైకుంఠ ఏకాదశి నాడే స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయి, దక్షిణాయనం లో చనిపోయిన వారందరికి నాడే స్వర్గలోకంలో ప్రవేశం, ముక్తి లభిస్తాయని గరుణపురాణం చెప్తున్నది.

వైష్ణవ దివ్య దేవాలయాలలో సంవత్సరాంతం మూసివుంచబడే ఉత్తర ద్వారాలను వైకుంఠ ఏకాదశి రోజున తెరచి భక్తులకు ఉత్తర ద్వారము నుండి భగవంతుని దర్శనం ఇస్తారు. వైష్ణవ దివ్య క్షేత్రాలగు శ్రీరంగం, తిరుపతి మొదలైన 108 దివ్యదేశాలలో ఉత్తర ద్వార దర్శనం అనుగ్రహిస్తారు. ఏదీ ఏమైనప్పటికీ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేస్కుని, ఏకాదశి వ్రతాన్ని, ఉపవాస జాగరణలను జరిపే భక్తులకు పునర్జన్మ ఉండదని, శాశ్వత ముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

పూర్వం వైఖానసుడు అనే మహారాజు నరక బాధలు అనుభవిస్తున్న తన పితరులకు స్వర్గలోక ప్రాప్తి కలగాలని పర్వత మహర్షి సూచనల మేరకు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు తద్వార తన పితరులు స్వర్గ లోకాన్ని పొందారని పురాణ కథనం.



శ్లో" వ్రతేకృతే కులస్థేన యేన కేన నరేణ వా !
తద్వంశ జాశ్చతే సర్వేవిష్ణులోకం యయుస్తదా !!


ఒక వంశంలో ఎవరైనా ఏకదశీ వ్రతాన్ని ఆచరించినా ఆ వంశంలోని వారంతా తరిస్తారు. పితరులు నరకం నుండి విముక్తులవుతారు, స్వర్గ, వైకుంఠ, పుణ్యలోకాలను పొందుతారన్నది శాస్త్ర వచనం.

పుత్రదా ఏకాదశి..!


ముక్కోటి ఏకాదశినే "పుత్రద ఏకాదశి" అని కూడా పిలిస్తారు. సంతానం లేనివారు, ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించినట్లైతే నారాయణుడి అనుగ్రహంతో తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి‌. అందుకు ఫుత్రద ఏకాదశి మాహాత్మ్యాన్ని తెలిపే కథలు కూడా ఉన్నాయి.. పూర్వం సుకేతుడు అనే మహారాజు భద్రావతీ రాజ్యాన్ని పాలించేవాడు, ఆయన ఎంతో ధర్మపరుడు, అతని భార్య చంపక మహారాణి మహా సాధ్వి అయినప్పటికీ సంతానం లేకపోవడమే వారి జీవితంలో తీరని లోటై వారిని వేదిస్తున్నది., వారు తీర్థాలను, ఎన్నో క్షేత్రాలను దర్శించారు, ఎన్నో దానధర్మాలు ఆచరించారు అయినా ఫలితం లేకపోయింది. వారి దుఃఖాన్ని చూడలేకపోయిన కొందరు మహర్షులు వారిని పుత్రదా ఏకాదశి ఆచరింపమని, తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుందని ఉపదేశించారు‌. వారు ఉపదేశానుసారం నియమనిష్ఠలతో పుత్రద ఏకాదశీ వ్రతాన్ని పూర్తి చేశారు. తత్ఫలితంగా నారాయణుడి అనుగ్రహంతో వారికి పుత్ర సంతానం కలిగింది..

ముక్కోటి ఏకాదశి ఆచరించు విధానం :


- ఏకాదశి వ్రతం అంటే ఏకదశి తిథి రోజున ఉపవాసం చేయడమే..
'ఉప' అంటే దగ్గరగా అని 'వాసం' అంటే ఉండటం అని అర్థం, భగవంతుడి చేరువగా ఉండటమే ఉపవాసం,. ఏకాదశి తిథి ఆద్యంతం భగవంతుడి ఆరాధనలో సమయాన్ని గడపటమే ఉపవాసం.,

- ఏకాదశి రోజున తులసి తీర్థం తప్ప మరేమీ తీస్కోకూడదు, పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇది వర్తించదు. వారి శరీరానికి శక్తికి తగినంత ఆహారాన్ని తీస్కోవచ్చు.
ఉపవాసం చేసేవారు కూడా తమ శరీర పరిస్థితుల రీత్యా పాలు వంటి ద్రవ పదార్థాలు స్వీకరించవచ్చు, శక్తి సరిపోనివారు ఏదైనా ఫలహారాలు తీస్కొనవచ్చు‌., భగవంతునికి దగ్గర చేయడమే ఉపవాస రహస్యం గానీ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్కోవడం ఎంతమాత్రం కాదు., కరోనా తరువాత పరిణామాలతో ప్రజల ఆరోగ్య పరిస్థితుల్లో అనేక మార్పులు సంభవించాయి, అవి దృష్టిలో ఉంచుకొని ఉపవాస నియామాలలో కాస్త మార్పులు చేయడం తప్పుకాదు.

- శ్లో " శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం !
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం !!



భగవంతుని గాథలు వినడం, కీర్తించడం, స్మరించడం, స్వామి పాద సేవలో తరించడం, గుడిలో ఇంటిలో హృదయంలో స్వామిని అర్చించడం, సదా స్వామికి ప్రణమిల్లటం, హనుమలా దాసుడై సేవించడం, మిత్రుడిలా ఆత్మ నివేదన చేయడం.. అనేక మార్గల ద్వారా శ్రీమన్నారాయణుడిని ఆరాధించవచ్చు.. ఎవరి శక్తి, అవకాశాలను వారు సద్వినియోగ పరుచుకోవచ్చు.. ఇలాగే భక్తి ఉండాలని నిబంధనలేమి లేవు. భక్తికి సూత్రాలు లేవు, హద్దులు అసలే లేవు..


- పూజ, ఆరాధన, అభిషేకం, అర్చన, దేవాలయ దర్శనం, ప్రదక్షిణ, నదీస్నానం, ధ్యానము, జపము, తర్పణము, దానములు విశేష పుణ్యఫలితాలను ఇస్తాయి.,

- " ఓం నమో భగవతే వాసుదేవాయ ".,
" శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపధ్యే" .,
" ఓం నమో నారాయణాయ " అనే మంత్రాలు జపించాలి.


- విష్ణు సహస్ర నామ స్తోత్రము వంటి పవిత్ర స్తోత్రాలు, భగవద్గీత, భాగవతం, రామాయణం వంటి కావ్యాలు, విష్ణు, పద్మ పురాణాలు పఠనం చేయాలి. గోవింద నామ స్మరణం చేయాలి.,

- దేవాలయ ఉత్తర ద్వార దర్శనం చేయాలి, ఈ రోజున చేసే దానాలు విశేష పుణ్యఫలితాలను ఇస్తాయి కనుక ఎలాంటి దానాలైనా నిస్సంకోచంగా చేయవచ్చు.,

- ఏకాదశి ఉపవాసం పూర్తి చేస్కుని ద్వాదశి అన్నదానం చేయాలి., కనీసం ఒక్క అతిథికైనా చేయి కడిగిన తరువాతే వారు భోజనం చేయాలి.


భగవద్భందువులందరికీ ఆ శ్రీమన్నారాయణుడి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్థిల్లాలని భగవంతుని ప్రార్థిస్తూ..

మీ..
డా" ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ
జ్యోతిష్య శిరోమణి, జ్యోతిష్య మహర్షి.,
పిహెచ్‌డి డాక్టరేట్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆష్ట్రోలజీ.,
అంతర్జాతీయ జ్యోతిష్యశాస్త్ర పురస్కార గ్రహీత

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత