" పోలి పాడ్యమి - పోలి స్వర్గము - పోలి నోము "
" పోలి పాడ్యమి - పోలి స్వర్గము "
"మాసానాం మార్గశీర్షోహం" మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే.! అంటూ సాక్షాత్తూ పరమాత్మ మార్గశిర మాస విశిష్టత తెలియజేస్తున్నాడు.. అంతటి మార్గశిర మాసంలో వచ్చే మొదటి రోజు మార్గశిర పాడ్యమి రోజున ప్రజలు " పోలి పాడ్యమి - పోలి స్వర్గము - పోలినోము " అనే పూజ, నోము జరుపుకుంటారు..
ఈ పోలి పాడ్యమి పూజ స్త్రీలకు ప్రత్యేకమైనది, దీపోత్సవాలకు సంబంధించినది. కార్తీకమాసంలో విశేషమైన దీపారాధనలకు, భగవత్ ఆరాధనలకు, శివకేశవుల సారూప్యతకు ప్రతీకగా అనేక కథలను మనకు అందిస్తూ భక్తికి అసలైన స్వరూపాన్ని, ముక్తికి నిర్వచనాన్ని బోధిస్తున్నాయి..
హైందవ సాంప్రదాయంలో ప్రతీ పర్వదినం వెనక ఒక కథ ఉంటుంది, ఆ కథలో సూక్ష్మమైన నీతి, మనిషి జీవన గమనాన్ని నిర్దేశించే సారాంశం దాగి వుంటుంది. ఈ కథలను కేవలం బాహ్య రూపకంగా కాకుండా సూక్ష్మ దృష్టితో పరిశీలించి అందులో దాగిన సారాన్ని గ్రహించాలి, ఆచరించాలి, తరించాలి. కనీసం నీతిబద్ధంగా, ధర్మబద్ధంగా బతికేందుకు ప్రయత్నించాలి. అపుడే ఆ పర్వదినాలకు, ఆ కథలకు, మన పూర్వీకులు చూపిన మార్గాలకు వారి బోధనలకు అసలై గౌరవం దక్కుతుంది..
అలాంటి ధర్మసూక్ష్మాన్ని బోధించే పర్వదినమే పోలి స్వర్గం నోము.. స్త్రీలు తమ గృహస్థ ధర్మానికి బద్దులై భర్త, అత్తమామ, పిల్లలు, కుటుంబానికి సేవలందిస్తూ తరిస్తూనే భగవంతునికి దూరం కారాదన్నది పోలి కథ సారాంశం.
శ్లో" శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం |
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం ||
ఇతి పుంసార్పితా విష్ణౌ భక్తిశ్చేన్నవలక్షణా |
క్రియతే భగవత్యద్ధా తన్మన్యేధీతముత్తమమ్ ||
భగవంతుడిని ఆరాధించడానికి ఎన్నో మార్గాలున్నాయి.. యజ్ఞము, తపస్సు, పూజ, ధ్యానములతో పాటు శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అంటూ నవవిధ భక్తి మార్గాలు ముక్తికి సోపానాలుగా ఋషులు మనకందించారు., మనసులో భగవంతుడిపై భక్తి, విశ్వాసం దాగివుంటే ఆచరణలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, మరెన్ని సమస్యలు ఎదురైనా భగవంతున్ని ఆరాధించడం ఎవరూ ఆపలేరు.. కష్టాలు, కన్నీళ్లు, మరెన్ని ఆటంకాలు ఎదురైనా చిరునవ్వుతో భగవంతుడిని ఆరాధించడమే భక్తికి అసలైన నిర్వచనం.. అందుకు పోలికథే నిదర్శనం..
ఈ కథ సమాజానికి ఆదర్శం.. పోలికథ స్త్రీలందరికీ అంకితం..
శ్లో"దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్!
దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీర్నమోస్తుతే!!
హైందవ సంస్కృతిలో దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది.. దీపం అంటే మనిషి జీవితంలో వెలుగుని నింపే జ్వాల, ప్రాణం, జ్ఞానం, శక్తి, పరమాత్మ స్వరూపము.
శ్లో"సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా!
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్ !!
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే!
త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య ర్జ్యోతి ర్నమోస్తుతే!!
దీపము పరబ్రహ్మ స్వరూపము, పరమాత్మ స్వరూపము, సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపము.. జీవాత్మకు పరమాత్మకు ప్రతిరూపం వంటిది..
ఇలాంటి దీపారాధన ప్రతీరోజు ఉదయం, సాయంత్రం చేస్తూనే ఉంటాము. కానీ కార్తీక మాసంలో వెలిగించే దీపం అత్యంత విశేషమైన ప్రధాన్యత కలిగివుంది.. ఈ కార్తీకమాసంలో వచ్చే ముప్పై రోజులు స్త్రీలు తప్పకుండా దీపారాధన చేస్తుంటారు.. కుదిరిన వారు దేవాలయంలో లేదా తులసీ, ఉసిరి ప్రాంగణంలో కుదరనివారు తమ గృహంలో దీపారాధన చేస్తుంటారు.. ఇది మనకు పూర్వం నుండి వస్తున్న సాంప్రదాయం. కార్తీక మాసం ముప్పై రోజులు క్రమం తప్పకుండా దీపారాధనతో భగవంతుని ఆరాధిస్తూ కార్తీక పురాణాన్ని పఠించడాన్ని కార్తీక వ్రతం అంటారు.
పోలి నోము..
పూర్వం ఈ కార్తీకమాసంలోని ముప్పై రోజులు దీపారాధన పూర్తి చేస్కుని పోలి - పోలమ్మ అనే మహిళ స్వర్గాన్ని పొందింది.. ఎన్నో అవరోధాలను దాటుకుంటూ నిష్కల్మషమైన మనసుతో పోలి చేసిన దీపారాధన భగవంతుని సాయుజ్యాన్ని చేర్చింది. నిర్మలమైన మనసుతో చేసే దీపారాధన కష్టాలను, కన్నీళ్లని దాటించి శ్రీమన్నారాయణుడి చరణాలకు చేరుస్తుందని పోలికథ తెలుపుతుంది. పోలి భక్తికి గుర్తుగా కార్తీక అమావాస్య మరుసటి రోజు అనగా మార్గశిర పాడ్యమి రోజున ప్రాతఃకాలం అరటి దొప్పలపై (బోదెముక్కలపై) పిండితో చేసిన దీపంపై నేతిలో ముంచిన వత్తులతో నదీ జలాల్లో గాని కోనేరులో గానీ దీపాలను వదులుతారు, ఈ దీపమే స్వర్గానికి మార్గమని భావిస్తారు.. పొలిని స్మరిస్తారు.. ఇదే పోలివ్రతం.
పోలికథ వైపు చూస్తే..
పురాణ కథనం ప్రకారం.. పూర్వం కృష్ణానది తీరంలో ఒక రజక ఉమ్మడి కుటుంబం నివాసముండేవారు.. ఆ ఇంటికిపెద్ద అత్తగారు తానే పరమభక్తురాలుగా భావించేది, ఆవిడకి ఐదుగురు కోడళ్లు అందులో చిన్న కోడలు "పోలమ్మ", కోడలిని కేవలం సేవకురాలిగా చూసేది..
పోలి చిన్నతనం నుండే భక్తిప్రపత్తులతో నిత్యం భగవంతుని సేవలో తరించేది.. తన పూర్తి సమయం భగవత్ ఆరాధన, సేవలోనే గడిపేది.. అందులోనే ఆనందాన్ని వెతికేది.. కానీ పెళ్ళి అయిన తరువాత ఆ ఆనందం ఎక్కువ కాలం మిగలలేదు. అత్త తనకు తాను పరమ భక్తురాలుగా భావిస్తుండటం, సమాజంలో తనంతటి భక్తురాలు లేదని గుర్తించాలనే ఆరాటంతో అహంకారాన్ని కూడా విపరీతంగా పెంచుకుంది.. తన పేరు, కీర్తికి చినకోడలు పోలి అడ్డుగా మారింది, పోలి తన నిశ్కల్మషమైన భక్తిప్రపత్తులతో అత్తగారి అహంకారాన్ని దెబ్బతీసింది..
కార్తీకమాసం రావటంతోనే స్త్రీలందరూ పూజలకు, దీపారాధనలకు సన్నద్ధమవుతారు.. అలాంటి కార్తీక మాసం ప్రారంభం కావడంతోనే పోలి ఇంట దీపం వెలిగించకుండా, భగవంతుడిని ఆరాధించకుండా, పూజా సామగ్రి అందుబాటులో లేకుండా చేసేది.. దీపారాధనకు కావలసిన సామగ్రి అంతా దాచేసి మిగిలిన కోడళ్లతో నదీస్నానానికి బయలుదేరేది.. అటువంటి సమయంలో పోలి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కొంత పత్తి సేకరించి వత్తులు తయారుచేసేది, చల్ల కవ్వానికి ఉన్న వెన్న తీసి దీపాన్ని వెలిగించేది.. ఆ దీపాన్ని అత్తగారు కానీ ఇంట్లోవారు గానీ ఎవరూ చూడకుండా దీపంపై బుట్ట బోర్లించేది..
ఇలా ప్రతీ రోజు నిర్విఘ్నంగా దీపారాధన చేస్తూ వస్తుంది, అమావాస్య రానే వచ్చింది ఉదయాన్నే అత్తగారు జాగ్రత్తపడి యధావిధిగా సామగ్రి దాచివుంచి పోలికి క్షణం తీరిక దొరకకుండా పనులు పురమాయించి మిగతా కోడళ్లతో నదీ స్నానమాచరించడానికి వెళ్లింది.. కానీ పోలి బాధపడలేదు, కష్టాన్ని కూడా ఇష్టంగా స్వీకరించింది.. పనులు పూర్తిచేసుకుని ఇంట దీపాన్ని వెలిగించి భగవంతున్ని ప్రార్థించింది.. అది చూసి భగవంతునికి ఎంతో సంతోషం వేసింది, ఎన్ని అవాంతరాలు కలిగినా, ఎన్ని బాధకు కలిగినా చలించని తన భక్తికి ఫలితంగా పోలిని స్వర్గానికి తీస్కువచ్చేందుకు దైవదూతలు బయల్దేరారు..
నదివైపుగా వస్తున్న విమానాన్ని చూసి అత్తగారు పరమభక్తురాలైన తనను అనుగ్రహించి స్వర్గానికి తీస్కుపోవడానికి దేవదూతలు వచ్చారని సంబరపడింది.. కానీ క్షణంలోనే ఆ విమానం వారిని దాటి పోలిని చేరింది. ఆ దైవదూతలు సజీవ దేహంతో పోలిని స్వర్గానికి తీస్కువెల్తున్నారు, అత్త స్వర్గానికి వెళ్లాలనే ఆత్రంతో పోలి కాళ్లు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసింది., అది చూసిన దైవ దూతలు ఆడంబరాలతో ఆర్భాటాలతో భక్తికి వెలకట్టలేరని పొలి తన నిష్కల్మష భక్తితో భగవంతుని అనుగ్రహాన్ని పొందిందని స్వర్గాన్ని చేరే అర్హత పోలికి మాత్రమే ఉందని అత్తగారిని నేలకు పంపుతారు..
ఇలా పోలి కథ మనకు అసలైన భక్తికి నిదర్శనంగా నిలుస్తున్నది..
మార్గశిర పాడ్యమి రోజున పోలివ్రతం ఆచరించడం, దీపారాధన చేసి నీటిలో వదలటం, పోలి కథ స్మరించటం, అనంత పుణ్యఫలితాలను ఇస్తుంది.
డా. ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ
జ్యోతిష్య రత్న, శిరోమణి, మహర్షి..
చాలా బాగుంది. ధర్మసూక్షాన్ని బోధించే కథలు ఈ తరానికి అవసరం కూడా. హృదయపూర్వక ధన్యవాదాలు మోహన్
రిప్లయితొలగించండిధన్యవాదాలు..
తొలగించండిచాలా చాలా బాగుంది....ధన్యవాదములు.🙏🙏
రిప్లయితొలగించండిధన్యవాదాలు
తొలగించండిVery nice Thammudu .. good knowledge about our sanskriti
రిప్లయితొలగించండిధన్యవాదాలు
తొలగించండిThank you for the information Andi.
రిప్లయితొలగించండి