ధనుర్మాస వైభవము - గోదాదేవి దివ్య చరిత్ర

                  " ధనుర్మాసము "

చైత్ర, వైశాఖ, -  కార్తీక, మార్గశిర మాసాలు కదా మనము పిలిచేది, మరి ఈ ధనుర్మాసము అంటే ఏమిటి అని చాలా మందికి సహజంగా కలిగే సందేహమే..! ఇంతకీ ఈ ధనుర్మాసము అంటే ఏమిటో దాని విశిష్టత ఏమిటో తెలుసుకుందాం..!

కాలాన్ని మనం సహజంగా సంవత్సరములు, సంవత్సరానికి రెండు భాగాలుగా - రెండు ఆయనములు, సంవత్సరానికి ఆరు భాగాలుగా ఋతువులు, సంవత్సరాన్ని పన్నెండు భాగాలుగా మాసములు, ప్రతీ మాసములో పదిహేను తిథులతో కూడిన రెండు పక్షాలు, అదే మాసంలో ఏడు రోజులతో కూడిన నాలుగు వారాలు ఇదంతా మనం కాలాన్ని కొలిచే ప్రక్రియ..  అయితే ఈ కాలాన్ని సూర్య చంద్రుల సంచార ప్రమాణంగా కొలుస్తారు. సూర్యున్ని ఆధారింతంగా కొలిచే గణిత విధానాన్ని సూర్యమానం అని (సౌరమానం)., చంద్రుని ఆధారితంగా కొలిచే గణిత విధానాన్ని చాంద్రమానం అని పిలుస్తారు., ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే చంద్రుడు శుద్ధ పాడ్యమి రోజున ఉదయించి పదిహేను రోజులకి పూర్తి  పౌర్ణమి ప్రకాశించి తిరిగి మరొక పదిహేను రోజులు కాంతి కోల్పోతూ అమావాస్యకి అస్తమిస్తాడు, ఈ నెలని చాంద్రమాన మాసం అంటాం.. అలాగే సూర్యుడు కూడా ఇరవై ఏడు నక్షత్రాలలో, పన్నెండు రాశులలో సంచరిస్తాడు.

శ్లో" తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః | సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః ||
 రవి ఏ రాశిలోకి ప్రవేశిస్తే అది ఆ రాశియొక్క మాసం అవుతుంది., మేష రాశిలో రవి ప్రవేశిస్తే అది మేషమాసము, వృషభంలో వృషభ మాసము.. ఇవన్ని మనకు పెద్దగా పరిచయం లేని  పేర్లుగానే అనిపించవచ్చు కానీ అందరికీ మకర సంక్రాంతి, సంక్రాంతి పండుగ పరిచయమే కదా..!  సంక్రాంతి అనే పదం సంక్రమణం నుండి వచ్చిందే,  సంక్రమణం అంటే ప్రవేశించుట అని అర్థం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే మాసమే మకర సంక్రాంతి, ఇది ఉత్తరాయణ పుణ్యకాలంతో మొదలవుతుండటంతో ఎంతో వైభవంగా మనం సంక్రాంతి పర్వదినాన్ని నిర్వహిస్తాము.  దీనిని బట్టి రవి రాశి, మాస ప్రవేశానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో మనం అర్థం చేస్కోనవచ్చును. అలాంటిదే ధనుర్మాసము కూడా‌‌..
రవి ధనుస్సు రాశిలో ప్రవేశించిన సమయాన్ని మనం ధనుస్సంక్రమణం అంటాము‌. ఇది వైష్ణవ సాంప్రదాయంలో, ద్రావిడ సాంప్రదాయంలో, సూర్యమాన సిద్దాంత అనుసరణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన మాసము‌.. మరో రకంగా చెప్పాలంటే విష్ణువు ఆరాధనకు కేటాయించిన ప్రత్యేక నెల‌,‌. ఈ ధనుర్మాసములో వైష్ణవ దేవాలయాల్లో తిరుపతి, శ్రీరంగం, యాదాద్రి వంటి వైష్ణవ దివ్యక్షేత్రాలన్నిటిలో విశేషమైన ఉత్సవాలు, మహోత్సవాలు నిర్వహిస్తారు. ప్రజలందరూ అత్యంత భక్తి ప్రపత్తులతో భగవంతుడిని ఆరాధిస్తారు. ఈ నెల అంతా ఒక పండుగలా జరుపుకుంటారు‌.  

తెలుగు రాష్ట్రాలలో ఈ నెలని సంకురుని నెలగా, ధనుర్మాస ప్రారంభాన్ని సంకురుడిని నిలబెట్టుట అని పిలుస్తారు‌., అంటే సూర్య సంక్రమణమే సంకురుడు అనే పేరుతో గ్రామాలలో పిలుస్తుంటారు‌. ధనుస్సంక్రమణ రోజున ప్రతీ గ్రామంలోను దేవాలయాలలో ప్రాతః కాలం నుండే పూజలు ఆరంభిస్తారు‌‌., ఈ మాసమంతా కూడా భక్తి ప్రపత్తులతో గడుపుతుండటం వలన ఈ మాసంలో సంకురుడిని నిలబెట్టినందువల్ల శుభ కార్యాలు నిర్వహించకూడదనే నానుడి కనబడుతుంది కానీ అది వాస్తవం కాదు‌. చాంద్రమాన మాసములలో శూన్య మాసమైన పుష్యమాసం కూడా ఈ ధనుర్మాసములో కలిసి రావడం వలన ఈ మాసంలో శుభకార్యాలు నిర్వహించకూడదంటారే తప్ప ధనుర్మాసములో మార్గశిర మాస శుభ ముహూర్తాలలో శుభ కార్యాలు నిర్వహించుకోవచ్చును. కానీ వైష్ణవ సాంప్రదాయస్తులు ఈ నెల అంతా కూడా ధనుర్మాస దీక్షా పరులు కావడం వలన ఈ నెలలో వారు శుభకార్యాలు నిర్వహించలేరు‌.
ఈ మాసం కార్తీక, మాఘ, శ్రావణ మాసలకంటే తక్కువేమీ కాదు.  వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం ఈ మాసం విష్ణువుకు అత్యంత శ్రేష్టమైనది‌. విష్ణు సంబంధ ఆలయాల్లో నెలంతా కూడా పెద్ద పండగ వాతావరణమే., ప్రతీ రోజు ఉత్సవమే చూడవచ్చు. వైఖానస, పాంచరాత్ర ఆగమ శాస్త్రాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు‌.  సూర్యోదయాత్ పూర్వం బ్రాహ్మీ ముహూర్తంలో సుప్రభాత సేవతో మొదలై తిరుప్పావై, తిరువాయి మొళి, తిరుప్పళ్లాండు, నాళయిర దివ్య ప్రభందాల వంటి ద్రావిడ ప్రభందాలు, స్తోత్ర పారాయణాలు చేస్తారు‌. అర్చనలు, అభిషేకాలు, సహస్రనామార్చనలు, కళ్యాణోత్సవాలు, మహోత్సవాలు, హోమ యజ్ఞయాగాదులు అబ్బో.. ఆ వైభవం, వైభోగం మరెప్పుడు చూడలేము. అంతటి కనులవిందైన. అలంకరణలతో, ప్రత్యేక పూజలతో భక్తులను అనుగ్రహిస్తారు లక్ష్మీ నారాయణులు., ముఖ్యంగా లక్ష్మీ, తులసీ, భూ, నీళా, గోదా,  నారాయణ, శ్రీరామ, శ్రీ కృష్ణ, రంగనాథ, సూర్య, నారసింహ, సుదర్శన, హనుమ ఇలా విష్ణు సంబంధించిన దేవాలయన్నిటిలో ఈ ధనుర్మాసాన్ని నిర్వహిస్తారు.. వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వార్లకు, భాగవతోత్తములకు ప్రత్యేక స్థానం ఉన్నది వారిని స్మరించడం, పూజించడం విశేషం.

బాలభోగం - మహాభోగం :

ధనుర్మాస ప్రసాదం అమృతంతో సమానం అదే బాలభోగం, ఈ మాసంలో ప్రత్యేకంగా పులగం / పొంగలి / కట్టె పొంగలి /చక్కెర పొంగలి,. దధ్యోజనము(పెరుగుతో చేసినది)., చిత్రాన్నము, పులిహోర వంటి నైవేద్యాలని నివేదించి భక్తులకు ప్రసాదంగా అందిస్తారు.  ఈ బాలభోగాన్ని స్వీకరించాలంటే అదృష్టం ఉండి తీరాల్సిందే..!

ధనుర్మాస వ్రత ఫలితం :

ధనుర్మాసంలో భగవంతుడికి మనస్పూర్తిగా నిష్కల్మష భక్తితో  సమర్పించే ఒక్క తులసీ దళమైన అనంత పుణ్య ఫలితాలను అందిస్తుందని,. భగవన్నామ స్మరణ పూర్వ జన్మల కర్మ ఫలాలను, అనంత పాపాన్ని పటాపంచలు చేస్తుందని,. ఒక్కసారి స్నానం చేసి దివ్యక్షేత్రాలను దర్శించిన మాత్రాన వేయి అశ్వమేధ యాగాల ఫలితం లభిస్తుందని,. ధనుర్మాస వ్రతాన్ని జీవితంలో ఒక్కసారి ఆచరించినా కూడా శాశ్వత ముక్తి, వైకుంఠలోక ప్రాప్తి లభిస్తుందని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఇందుకు సాక్ష్యాత్తు గోదాదేవి చరిత్రే సాక్ష్యంగా నిలుస్తుంది.

సిరినోము - కాత్యాయనీ వ్రతం :

ఈ ధనుర్మాసంలో మహిళలు ఎక్కువగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పెళ్లికాని వారికి తప్పకుండా కళ్యాణ యోగం దక్కుతుందని విశ్వాసం. వివాహితులు దీర్ఘ సుమంగళిగా వర్థిల్లాలని కోరుతూ, సత్సంతాన్ని పొందాలని కోరుతూ ఈ వ్రతం ఆచరిస్తారు. ఉదయాత్పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొని భగవంతుని ఆరాధిస్తారు. స్వామిని లక్ష్మీ నారాయణులను తులసీ దళాలతో అర్చిస్తారు. యథాశక్తిగా నైవేద్యాలు సమర్పిస్తారు. సహస్రనామాలు, స్తోత్రాలు, పాటలు, కీర్తనలు, పారాయణం చేస్తారు. అనేక ఉపచారాలతో భగవంతుడిని కొలుస్తారు‌. గోదాదేవి రచించిన తిరుప్పావై పారాయణం చేస్తారు. సంక్రాంతి ముందు వచ్చే భోగితో నెల పూర్తవుతుంది, వ్రత సమాప్తి చేస్తారు.

గోదాదేవి చరిత్ర :


శ్లో" కర్కటే పూర్వ పల్గున్యాం తులసీకా ననోద్భావామ్‌ | పాణ్డ్యే విశ్వం భరాం గోదాం వన్దే శ్రీరంగనాయకమ్‌ ||

గోదాదేవి సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపం. క్రీస్తుశకం ఏడు - ఎనిమిది శతాబ్దపు మధ్యకాలంలో (సుమారు క్రీ.శ. 776.). నలనామ సంవత్సరం,  కర్కాటక మాసం, ఆషాడ శుద్ధ చతుర్దశి రోజున పూర్వ ఫల్గుణి(పుబ్బ) నక్షత్రంలో గోదాదేవి  జన్మించింది.

గోదాదేవి అయోనిజ, తులసి వనంలో దొరికిన కమలం. పన్నెండుమంది ఆళ్వారులలో ఏకైక మహిళ. ద్రావిడ ప్రబంధ రచయిత్రి గోదా. తన కావ్యం తిరుప్పావై వందలాది సంవత్సరాలుగా వైష్ణవ క్షేత్రాలలో వెలుగొందుతూనే ఉంది. తాను రచించిన తిరుప్పావై పాశురములనే వైష్ణవ దివ్యదేశాలన్నిటిలో సేవాకలంలో ఉపయోగిస్తారు. ఇక ధనుర్మాసమంతా తిరుప్పావై పారాయణమే ప్రత్యేకం. అంతటి ప్రాధాన్యత పొందినది.
గోదా అనే పదం కోదై, గోదై అన్న పదాల నుండి ఉత్పత్తి చెందినది. కోదై అంటే తులసీ మాల అని అర్థం. తులసీవనంలో లభించినది కనుక తనని కోదై అని పిలిచేవాడు తండ్రి  విష్ణుచిత్తుడు. గోదాని విష్ణుచిత్తుడు ముద్దుగా ఆండాల్ అని పిలుస్తారు. అంటే నా బంగారు తల్లీ, అమ్మా.. అనే అనే అర్థం వస్తుంది.

విష్ణు చిత్తుడు మధురైకి సమీపంలో‌ ఉన్న శ్రీ విల్లిపుత్తూరు గ్రామంలో నివసించే బ్రాహ్మణుడు, పేరుకు తగ్గట్లుగానే మనసు నిండా విష్ణువుని నింపుకున్న పరమ విష్ణు భక్తుడు. విష్ణువు దర్శించి పేరియాళ్వారు గా ఆళ్వారులలో స్థానాన్ని పొందాడు. ఈయన తులసీ వనాన్ని పెంచుతూ ప్రతీ రోజు ఆ వనంలోని తులసీ దళాలతో మాల అల్లి వటపత్రశాయి అయిన శ్రీమన్నారాయణుడికి సమర్పిస్తారు. ఇది ఆయన దినచర్య. 
ఒకనాడు భగవత్కృపతో సాక్షాత్తూ మహాలక్ష్మి అంశ అయోనిజగా తులసీవనంలో లభించింది. ఎంతో ఆనందంతో తులసీ వనంలో దొరికింది కనుక గోదా అని పిలిచేవారు. గోదా బాల్యం నుండే విష్ణువు పట్ల ఎంతో భక్తి, ప్రేమాభిమానాలు కనబరచేది. లక్ష్మీ ఎక్కడ వున్నా విష్ణువును తలచకుండా ఉండలేదు కదా.. గోదా కూడా తన మనసులో రంగనాథుడు తప్ప మరొక దైవాన్ని తలచేది కాదు. బాల్యంలోనే అద్భుతంగా కావ్యాలు కీర్తనలతో కృష్ణుని స్తుతించేది.

రంగనాథుడితో ప్రేమ :


ఆండాళ్ వయసుతో పాటు రంగనాథుడిపై ప్రేమకూడా పెంచుకుంది, ఆ రంగనికే మనసిచ్చింది. రంగనాథుడినే పరిణయమాడాలని తలచింది.. ఎన్నో ప్రేమ కావ్యాలను రాసింది., రహస్యంగా స్వామి వారికి ప్రేమ సందేశాలు పంపించేది. ఆ సందేశమే తన ప్రేమని బహిర్గతం చేసింది.

ఆండాళ్ తానే స్వయంగా వటపత్రశాయి రంగనాథ మూలవిరాట్టుకు తులసీ, పూలమాలలు అల్లి తండ్రి పేరియాళ్వారుకి అందించేది. అయితే తాను అల్లిన మాల తన స్వామి ఎలా‌ ఉంటుందో అని గోదా ముందు తానే ధరించి అద్దంలో చూస్కుని, ఆ రంగనాథుడికి సమర్పించిన ప్రణయ మాలగా, వివాహ మాలగా ఊహించుకుంటూ మురిసిపోయేది.
 ఒకనాడు అనుకోకుండా విష్ణుచిత్తుడు మాలలను స్వామికి ధరిస్తుండగా మాలలో కేశాలు కనబడ్డాయి. అంతటితో అపవిత్రమైన మాలలను స్వామికి సమర్పించవలసి వచ్చిందని బాధపడిన పెరియాళ్వార్ ఈ కేశాలు ఎక్కడి నుండి వచ్చాయని పరిశీలించగా మరుసటి రోజున అదే విధిగా అల్లిన మాలను ధరించి ఇచ్చిన గోదా ని చూసిన విష్ణుచిత్తుడు ఆగ్రహానికి గురుయ్యాడు. అందుకు సమాధానం గా ఆండాళ్ రంగనాథుడే తన భర్త అని తేల్చి చెప్తుంది‌. అందుకు విష్ణుచిత్తుడు శ్రీ కృష్ణుడు ఈ కాలానికి చెందిన వాడు కాదని, కేవలం స్వామిని అర్చావతార విగ్రహం లాగానే అరాధించాలి తప్పా వివాహం చేస్కోవటం కుదరదని, మాలలని ధరించి అపవిత్రం చేయవద్దని హెచ్చరిస్తాడు. ఆ నాడు గోదా తాకకుండా తానే అల్లిన మాలలను రంగనాథుడికి సమర్పిస్తారు . 

నాటి రాత్రి స్వయముగా రంగనాథస్వామి వారు విష్ణుచిత్తుడి స్వప్నంలో దర్శనమిచ్చి గోదా వేరెవరో కాదని సాక్షాత్తూ భూదేవీ స్వరూపమేనని తాను ధరించి ఇచ్చిన మాలలను మాత్రనే స్వీకరిస్తానని అన్నారు‌‌. నాటి నుండి ప్రతీ రోజు గోదా ధరించిన మాలలనే స్వామికి సమర్పించారు.

గోదా రంగనాథుల పరిణయం :

రంగనాథ స్వామిని వివాహమాడ తలచిన గోదా శ్రీకృష్ణుడి కోసం గోపికలు ఆచరించిన కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించింది. మార్గశిరమాసంలో వచ్చే ధనుర్మాసం మొదలుకొని మకర సంక్రాంతి వరకు ముప్పై రోజులు ఈ వ్రతాన్ని ఆచరించింది. దీనినే ధనుర్నాస వ్రతం, మార్గశిర వ్రతం, సిరినోము, కార్యాయనీ వ్రతం అనే పేర్లతో పిలుస్తారు.
ప్రతీ రోజు బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొని తన మిత్రులతో కలిసి నదీస్నానమాచరించి, పూలని, తులసీ దళాలని సేకరించి, దేవాలయాలని దర్శించి సుప్రభాత సేవతో మొదులుకొని ద్రావిడ ప్రభంద పారాయణాలతో ఈ వ్రతాన్ని ఆచరించింది.. ఈ ముప్పై రోజులలో గోదాదేవి స్వయంగా రోజుకు ఒక పాశురము చొప్పున ముప్పై పాశురములు రచించి పాడి స్వామికి సమర్పించింది‌. అదే తిరుప్పావై.
తిరుప్పావై మొదటి పాశురం :
మార్గళి త్తిజ్ఞ్గల్ మది నిరైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిలైయీర్
శీర్ మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్ కాళ్
కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్
కార్మేనిచ్చజ్ఞ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పరైతరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్

ఇలా ముప్పై పాశురములతో స్వామిని పూజించింది . అంతే కాదు "నాచియార్ తిరుమొఱ్ఱి" అనే ద్రావిడ గ్రంథాన్ని కూడా రచించింది . వీటిలో రంగనాథుడిపై తన పవిత్ర భక్తి, ప్రేమ, అభిమానం, ఆశలు, బావోద్వేగం, అనురాగం, అలకలు, చిలిపి తనం, కోపాలు, తాపాలు, ఆప్యాయ ప్రేమ సందేశాలతో కూడిన అత్యంత పరమ పవిత్రమైన నూటానలబై మూడు పాశురములను రచించి సమర్పించింది. తన రచనలు కావ్యాలు పాశురములు అన్ని కూడా తనలో పరమాత్మను వెతుక్కునే మార్గాలుగానే గోచరిస్తాయి. ఆధ్యాత్మిక తాపత్రయానికి ప్రతీకలుగా నిలుస్తాయి‌‌‌. ఈ కావ్యాలే రంగనాథుడికి దగ్గరచేశాయి.
రంగనాథుడి ఆదేశానుసారం గోదాదేవి పెళ్ళి కూతురుగా అలంకరించి పల్లకిలో ఊరేగిస్తూ రంగని చేర్చిరి. నాటి రాజు  వల్లభ దేవునితో సహా యావత్ ప్రజలందరి సమక్షంలో ఆలయంలో రంగనాథుడితో గోదాదేవికి వివాహం చేశారు‌. వివాహనంతరం గోదా రంగనాథుడిలో లీనమైనది.
భగవద్భందువులందరికీ ధనుర్మాస శుభాకాంక్షలతో..

మీ..
డా" ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ
జ్యోతిష్య శిరోమణి, జ్యోతిష్య మహర్షి,
పిహెచ్‌డి డాక్టరేట్ గోల్డ్ మెడల్ ఇన్ ఆష్ట్రోలజీ.,
అంతర్జాతీయ జ్యోతిష్య శాస్త్ర పరుస్కార గ్రహీత

కామెంట్‌లు

  1. 🙏"గో నీళా సమేత రంగనాథ స్వామియే నమః"🙏

    ధనుర్మాస వైభవము, గోదా దేవి దివ్య చరిత్ర
    మాకు ఈ విధముగా గోదాదేవి చరిత్రని అందించిన డా,, ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ గారికి అభినందనలు తెలియజేస్తున్నాము.🙏

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత