సుబ్రహ్మణ్య వైభవం - సుబ్రహ్మణ్య షష్ఠి (పార్ట్ -2)

" సుబ్రహ్మణ్య వైభవం "

(పార్ట్ -2, సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా వారి చరిత్ర, )

ఆది దంపతుల గారాల బిడ్డ, గణనాయకుడి ముద్దుల సోదరుడు, కృత్తికల అపురూప తనయుడు, ఆరుముఖాల అరుదైన అవతారం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు.
సుబ్రహ్మణ్యుడు మార్గశిర శుద్ధ షష్ఠి  రోజున కృత్తికా నక్షత్రంలో జన్మించారు. ఆయన జన్మ తిథిని సుబ్రహ్మణ్య షష్ఠి, కుమార షష్ఠి, స్కంద షష్ఠి, కార్తికేయ షష్ఠి, శరవణ షష్ఠి, సుబ్బరాయ షష్ఠి అనే పేర్లతో పిలుస్తారు‌.

నమస్తే నమస్తే మహాశక్తి పాణే |
నమస్తే నమస్తే లసద్వజ్రపాణే ||
నమస్తే నమస్తే కటిన్యస్త పాణే |
నమస్తే నమస్తే సదాభీష్ట పాణే ||
ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, మరొక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకో చేతిని కటిపై ఉంచి, మరొక హస్తంతో అభయాన్ని  అనుగ్రహిస్తూ సదా అభీష్టాలను ఒసగుతున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రణమిల్లుతు, శరణువేడుతున్నాను..

ఎన్నో పేర్లు ఆ స్వామికి..
~ షణ్ముఖుడు లేదా ఆర్ముగం – ఆరు ముఖములు గలవాడు.,
~ స్కందుడు – పరమశివుని స్ఖలనం వల్ల ఆవిర్భావించినవాడు.,
~ కార్తికేయుడు – కృత్తికల తనయుడు, కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు,
~ శరవణభవుడు – శరవణము అనే రెల్లపొదల యందు, నీటి(తటాకము)యందు లో అవతరించినవాడు., 
~ గాంగేయుడు – గంగలోనుండి వచ్చినవాడు,.
~ మహా సేనాపతి – దేవతల సేనానాయకుడు, దేవసైన్య అధిపతి, దేవతలకు రాజు.,
~ స్వామినాధుడు –  శివునకు ప్రణవ మంత్రము ఉపదేశం చేసినవాడు‌,.
~ సుబ్రహ్మణ్యుడు – బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు‌,
~ మురుగన్ – కుమారుడు (తమిళంలో).,
~ దండపాణి, వేలాయుధుడు – శూలము ఆయుధంగా గలవాడు.,
ఏ పేరైననేమి భగవంతుని పిలిచేందుకు.. స్వామి అని తలచినంత మాత్రానే కదిలివచ్చే భక్త సులభుడు. సుబ్రహ్మణ్యుడు శివుడి వీర్యం నుండి ఉద్భవించిన రుద్రాంశ సంభూతుడు,  ఆయన పుట్టుకతోనే అగ్ని వంటి తేజస్సుతో ప్రకాశించినవాడు కనుక ఆయన అగ్నిభూతుడని అధర్వణ వేదంలో కీర్తిస్తారు. వేద ఉపనిషత్ మూలాలు సుబ్రహ్మణ్యుడిని బ్రహ్మ జ్ఞానిగా, మహాజ్ఞాన సంపన్నుడిగా, జ్ఞాన సంపదకు మార్గదర్శిగా మహోన్నత చైతన్యమూర్తిగా, పరమాత్మ స్వరూపంగా కీర్తిస్తున్నాయి.

సుబ్రహ్మణ్య జననం :

బ్రహ్మ నుండి "శివసుతుని చేత" మాత్రమే  మరణం పొందేలా వరం అందుకున్నాడు తారకాసురుడు.. వాడి మరణానికై ఎన్నో వ్యయప్రయాసల కోర్చి, మన్మథుడి సహాకారంతో పార్వతిపై శివునకు ప్రేమ కలగేలా  చేయగలిగారు, పర్యవసానంగా శివుడి మూడవ నేత్రానికి మన్మథుడు భస్మం‌ కాకతప్పలేదు. పరమ శివుని తపస్సు భంగం చేయడం వలన ఆయన ఆగ్రహానికి గురి కాక తప్పదు, శిక్ష అనుభవించక తప్పదు అని తెలిసి కూడా లోక కళ్యాణం కోసం దేవతల మార్గ నిర్దేశంతో తనను త్యాగం చేస్కున్నాడు మన్మథుడు. తదనంతరం దేవతలంతా కలిసి శివపార్వతులకు వివాహం జరిపించారు.. అమ్మవారి అయ్యవారి కళ్యాణానంతరము, పార్వతీ అమ్మవారితో కలిసి పరమశివుడు ఆ కైలాసంలో ఒక వేయి దివ్య సంవత్సరాలు శృంగారలీలాకళోస్సాల హృదయులై క్రీడిస్తూ గుడుపుతున్నారు.. కానీ సమస్త లోకాలన్నీ కూడా తారకాసురుడు పెడుతున్న బాధలు భరింపలేకుండా ఉన్నారు.. శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఎప్పుడు ఉద్భవిస్తాడా అని సకల దేవతలూ అహోరాత్రులూ ఎదురుచూస్తున్నారు. అప్పుడే శివుని నుండి మహా తెజస్సు (వీర్యం) వెలువడింది.
అగ్ని తేజస్సుతో ప్రజ్వరిల్లతున్న ఆ కాంతిపుంజంవంట శక్తిని భరించే శక్తి ఎవరికీ లేకపోయింది. అప్పుడు దేవతలందరి ప్రార్ధన మీద హవ్యవాహనుడు(అగ్ని), ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు. తీసుకోవడం అయితే తీసుకున్నాడు కానీ, శివుని తేజస్సుని ధరించడం అంటే అంత తేలికా..! అంతట అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు, అగ్నిదేవుడు ఆ శివతేజస్సుని భూమాతకు అందిస్తారు. అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా, వెళ్ళి గంగామాతని ప్రార్ధిస్తుంది. అప్పుడు గంగా మాత వారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది. అంతటి గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక, కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లుపొదల తటాకంలో విడిచిపెడుతుంది. ఆ రెల్లుపొదల తటాకం నుండి, ఆరుముఖాలతో, పన్నెండు చేతులతో, దివ్యమంగళ స్వరూపుడై, మార్గశీర్ష శుద్ధ షష్ఠి నాడు, ఒక దివ్య తెజోమయుడైన బాలుడు ఉద్భవించాడు. ఆయనే శ్రీ  సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారు.
గంగానదిలో పడిన పరమశివుడి రేతస్సు  ఆరుభాగాలుగా ఏర్పడింది, ఆరు భాగాలు అలల తాకిడికి ఏకమై ఆరుముఖములు గల స్వామి జన్మించారు, ఆరు ముఖములు గల అరుదైన మూర్తి కనుక ఆయన్ని షణ్ముడు అని పిలుస్తారు. ఆయనను కృత్తికలు స్వీకరించి పెంచారు కనుక కార్తికేయ అనీ, తండ్రి యైన పరమశివుని వద్ద సమస్త విద్యలూ నేర్చుకొన్న స్వామి దేవతల సేనాధిపతిగా నియుక్తుడయ్యాడు.. అటు తరువాత తారకుని సంహరించి లోకాలలో శాంతిని నెలకొల్పాడు మన స్వామి.. తారకుని విజయం అనంతరం దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను కుమారస్వామికిచ్చి వివాహం జరిపిస్తాడు.. అటు తరువాత వచ్చిన స్వామి శ్రీ వల్లి దేవిని ప్రేమించి వివాహమాడారు. అలా శ్రీ కుమారస్వామి, శ్రీ వల్లీ దేవసేన సమేతుడై లోకాలను అనుగ్రహిస్తున్నాడు..
సామాన్యంగా తెలుగునాట వివాహం కాని వారు, సంతానం లేని వారు ముఖ్యంగా కుజ దోషము, సర్ప దోషము, కాలసర్ప దోషము, రాహు కేతు గ్రహ దోషములు వంటి దోషములకు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తుంటారు. ప్రముఖంగా తెలుగు రాష్ట్రాలలో సుబ్రహ్మణ్య స్వామిని సర్ప(నాగ) ప్రతిమతో ప్రతిష్టించి పూజిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం లేని దేవాలయం కనబడదు అంటే అందులో అతిశయోక్తి లేదు.. అనారోగ్య సమస్యలతో, అల్పాయుష్షుతో బాధపడుతున్నవారు. జీవితంలో ఎదురౌతున్న ఒడిదుడుకులు తొలగిపోవడానికి, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల అభివృద్ధి కోసం, పరిపూర్ణ బుద్ది, జ్ఞాన, సంపదలను పొందడానికి ఏకైక మార్గాన్ని మార్గశిర మాసం మన ముందుకు తీస్కువస్తుంది.‌ అదే స్కంద షష్ఠి..
కుమారుడి అనుగ్రహం ఉంటే తొలగని దోషమేముంది, లభించని ఫలితమేముంది.. సకల అభీష్టాలను సునాయాసంగా క్షణకాలంలోనే ప్రసాదించగల ఏకైక దైవం కుమారుడు‌. అందుకే దక్షిణ భారతంలో, ముఖ్యంగా తమిళనాట అధికంగా సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆరాధిస్తారు.
ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః..

మీ..
డా" ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ
జ్యోతిష్య శిరోమణి, జ్యోతిష్య మహర్షి,.
పిహెచ్‌డి డాక్టరేట్ ఇన్ ఆష్ట్రోలజీ (గోల్డ్ మెడలిస్ట్).,
అంతర్జాతీయ జ్యోతిష్య శాస్త్ర పురస్కార గ్రహీత

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత