"నేతన్నల బతుకు చిత్రం" - ప్రో" కోదండరాం | పోగుబంధం పుస్తక సమీక్ష

ప్రముఖ సామాజిక కవి డాక్టర్ మోహనకృష్ణ భార్గవ రచించిన "పోగుబంధం" పుస్తకంలో తెలంగాణ ఉద్యమ రథసారథి, ఉస్మానియా యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విశ్రాంతాచార్యులు, టీజేఏసి అధినేత ప్రోఫెసర్ కోదండరాం సర్ ముందుమాట.. "నేతన్నల బతుకు చిత్రం" సమీక్ష..
13-Nov-202, ఘంటారావం దినపత్రికలో ప్రముఖంగా ప్రచురితమయినది..

"నేతన్నల బతుకు చిత్రం"


ప్రొఫెసర్ ముద్దసాని కోదండరాం

రాజనీతిశాస్త్ర విశ్రాంతాచార్యులు
ఉస్మానియా విశ్వవిద్యాలయం
టిజేఏసి - టీజేఎస్

డా"మోహనకృష్ణభార్గవ "పోగు బంధం" కవితా సంపుటిలో "శిధిలమైన శిలలకింద చిక్కిన చేనేత చరిత"ను వెలుగులోనికి తేవడానికి ప్రయత్నించాడు.

వ్యవసాయంతో సమానంగా అత్యంత ప్రాధాన్యత కల రంగం చేనేత. ఇప్పటికీ చేనేతరంగం బలంగా నెలకొని ఉన్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 17,069 చేనేత మగ్గాలున్నాయి. కానీ చేనేత కార్మిక సంఘాల అంచనా ప్రకారం సుమారు 50,000 మగ్గాలున్నాయి. ప్రభుత్వ సర్వేలో 40,533 మంది కార్మికులు చేనేతపై ఆధారపడి బతుకుతున్నారు. కార్మిక సంఘాలు ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

కార్మికులలో కొందరు సహకార సంఘాలుగా ఏర్పటి సమిష్టిగా వృత్తిని నిర్వహించుకుంటున్నారు. సంఘం నూలు, రంగులు సరఫరా చేసి తయారైన బట్టలను అమ్ముతుంది. తెలంగాణలో 615 సొసైటీలున్నాయి. సొసైటీ లేని చోట మాస్టర్ వీవర్ నూలు సప్లయి చేసి, నేసిన బట్టను నేత కార్మికునికి కూలీ ఇచ్చి తీసుకొని అమ్ముకుంటాడు‌.

బ్రిటిష్ పాలకులు మిల్లు బట్ట తెచ్చిన తరువాత చేనేత గిరాకీ కొంత తగ్గింది. చేనేత వస్త్రాన్ని ఆదరించి‌న స్థానిక ప్రభువులు నిష్క్రమించడంతో చేనేతను ఆదరించేవారు కరువయ్యారు. బ్రిటీష్ పాలకులు చేనేతకు మద్దతునివ్వక పోగా దాన్ని అణచాలని ప్రయత్నించారు. చేనేత వస్త్రం స్థానంలో తమ దేశంలో తయారైన మిల్లు బట్టను అమ్ముకోవాలని పథకం ప్రకారం తమ అధికారాన్ని ఉపయోగించారు. తొలుత మిల్లు బట్టకన్నా చేనేత బట్ట అగ్గువకు దొరికేది. అందువలన మిల్లులు చేనేతతోని పోటీ పడలేక పోయినాయి.

అయినా తమ మిల్లు వస్త్రాల గిరాకీని దౌర్జన్యంగా, తమ అధికారాన్ని వాడుకొని పెంచుకున్నాయి. దేశంలోని చాలా చోట్ల నేత కార్మికులు బట్ట నేయకుండా అడ్డుకున్నారు. కొన్ని సందర్భాలలో మగ్గం నేయకుండా నేత కార్మికుల బొటన వేలు కోసేసేవారు. ఇన్ని దౌర్జన్యాలకు పాల్పడినా చేనేత రంగం బతికింది.

తెలంగాణలో నేస్తున్న పలు రకాల బట్టలు ప్రపంచ ప్రసిద్ధి గాంచినాయి. నారాయణపూర్, గద్వాల, పోచంపల్లి ఇక్కత్, దుబ్బాక గొల్లభామ చీరలు బాగా తెలిసిన పేర్లు. ఇవికాక కొడకండ్ల దుప్పట్లు, వరంగల్ జంపఖానాలు కూడా ఎంతో పేరు పొందినాయి. పర్షియన్ తివాచీల కన్నా వరంగల్ జంపఖానాలు (తివాచీలు) ఎంతో అందంగా ఉంటాయి. పైన పేర్కొన్న వస్త్రాలు ఇవ్వాళ తెలంగాణ అస్థిత్వానికి ప్రతీకలు. తెలంగాణకు ఖండాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టినాయి.

దురదృష్టకరమైన విషయమేమిటంటే అస్థిత్వ పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో ఈ వస్త్ర పరిశ్రమ పరిరక్షణకు ఎటువంటి చర్యలు లేవు.

ఇవేకాక 1970ల దాకా నేతచీరలు, దోతులు ఇతర వస్త్రాలు విరివిగా నేసేవారు. 1970 దశకంలో నైలాన్ చీరలు, నైలాన్ బట్టలు మార్కెట్ లోనికి రావడంతో చేనేత వస్త్రం గిరాకీ పడిపోయింది. అందువలన అప్పటి వరకు సంతలో విరివిగా అమ్ముడుపోయిన బట్ట కొనుగోలు దార్లను కోల్పోయింది. రాజకీయ నాయకుల ఆలోచనలు కూడా మారిపోయాయి.

స్వాతంత్రోద్యమం నుండి ఎదిగిన నాయకులు ఉన్నంత కాలం చేనేతను కాపాడటానికి పెంపొందించడానికి ఎంతో కృషిచేసారు. దానికి ఎన్నో సాక్షాలున్నాయి. ఇప్పటి నాయకులు చేనేత బతకదు అనే నిర్ణయానికి వచ్చి దాన్ని సమాధి చేసే పనిలో పడ్డారు.

కొన్ని రకాల బట్టలను చేనేతకు రిజర్వు చేస్తూ జారీ అయిన ఉత్తర్వులను తూటు పొడిచారు. చేనేత డిజైన్లను మిల్లులు కాపీ చేసినా నిలువరించడానికి చర్యలు తీసుకోలేదు.
ఆఖరుకు ఇవ్వవలసిన సబ్సిడీలను జారీ చేయలేదు. నూలు రంగుల ధరలను నియంత్రించడానికి, సబ్సిడీలు ఇచ్చి కార్మికులను ఆదుకోవడానికి ప్రయత్నించలేదు. చేనేతకు మార్కెటు లేదని తమ నిర్ణయాన్ని సమర్థించుకోచూస్తున్నారు.

నైలాన్ ప్రవేశంతో తలెత్తిన సమస్యలు గుర్తిస్తూ ఒక మాట చెప్పుకోవాలి. మార్కెటు స్వభావం మారింది. గతంలో మాదిరిగా సాధారణ ప్రజలు చేనేత వస్త్రాలు వాడటం లేదన్నది వాస్తవం. కానీ దాని గిరాకీ పోదు పోలేదు, ఎందుకంటే చేనేత జనజీవితంలో భాగం. పెళ్ళికి, పండుగకు, చేనేత అవసరం, కొన్ని రకాలైన బట్టలు మగ్గం మీదనే తయారవుతాయి. ఇప్పటికీ అగ్గువకు బట్టను నేసి ప్రజల అవసరాలను తీర్చగలుగుతున్నాయి. ప్రభుత్వం పూనుకుంటే తెలంగాణ అస్థిత్వ ప్రతీకలైన ఈ వస్త్రాన్ని బతికించడమే కాదు, దాన్ని విస్తృత పరచవచ్చు. స్వచ్ఛంద సంస్థలు తమ కృషితో పోచంపల్లి వస్త్రాలకు గిరాకీని పెంచగలగలిగాయి. ఆ ప్రయత్నం ప్రభుత్వం చేయగలిగితే, వేల కుటుంబాలకు బతుకుదెరువు దొరుకుతుంది. తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలు సజీవంగా నిలబడతాయి.

ఇన్ని ఒడిదుడుకుల నడుమ చేనేత పరిశ్రమ బతుకుతున్నదంటే అందుకు చేనేత కార్మికుల త్యాగమే కారణం. వారు ఇప్పటికీ నమ్ముకున్న వృత్తిని బతికించే ప్రయత్నం చేస్తున్నారు.
కారణమేమిటంటే చేనేతపని మనిషి సృజనాత్మక వ్యక్తీకరణకు అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తున్నది. ఆత్మగౌరవంతో బతకడానికి ఆలంబనగా ఉన్నది.

చేనేత కార్మికుల స్వగతాన్ని కవి ఇలా అంటాడు :

" ఏ నేతన్న పుడమి తల్లికి 
పచ్చని పైరుతో రంగులద్దెనో
ఏ నేతన్న భరతమాతకి
మువ్వన్నెల త్రివర్ణ చీరకట్టెనో"

అని సమాజంలో నేతన్నల పాత్రను కవి విశదీకరిస్తున్నాడు. అయితే ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వలన నేత కార్మికుల జీవితంలో సమస్యలు ముసురుకున్నాయి. ఈ సన్నివేశంలో నేతకార్మికులల్లో తలెత్తిన మీమాంసను బలంగా వ్యక్తం చేయగలిగినాడు.

ఒకవైపు వృత్తిపట్ల గౌరవం, ప్రేమ మరొకవైపు నానాటికి తగ్గుతున్న ఆదాయం. ఈ పరిస్తితులలో భవిష్యత్తు పై స్పష్టత కరువైంది. వృత్తిలో ఉండాలో లేక దాన్ని వదిలి ఇంకొక వృత్తిని వెతుక్కోవాలో అన్న మీమాంస నేతన్నలలో ఉన్నది.
దాన్ని రచయిత ఈ రచయిత ఈ కవిత సంకలనంలో బలంగా వ్యక్తం చేసిండు.

నేతకార్మికుల జీవితంలో తలెత్తుతున్న సమస్యలను ఈ పుస్తకం అక్షర రూపంలో మన ముందుకు తెచ్చింది.

"శిథిలమైన శిలల కింద
చిక్కిన చేనేత చరిత
ఏనాటికైనా వెలుగొందాలి
దేశ చరితకు వస్త్రమే 
నిదర్శనంగా నిలవాలి"

అని రచయిత ఒక ఆశను వ్యక్తం చేస్తున్నాడు.

" కులం మతం జాతి వర్ణ భేదమెరుగక
పురుడు పోసుకున్న పసిడికాంతుల
మెరుపయి మెరిసే కట్టు చీర
ప్రగతి పట్టుచీర"

అని కార్మికులు తమ‌ కళను గొప్పగా చెప్పుకుంటారు.

మరొక చోట రచయిత వృత్తిలో ఉండాలన్న కోరిక ఉన్నా పేదరికం వల్ల పిల్లల బాల్యం మాయమైపోతుందన్న ఆవేదన రచయిత వ్యక్తం చేస్తున్నాడు.

మరొక వైపు నేతవృత్తి నేతన్నల పాలిటి శాపంగా మారిందన్న మాట కూడా అంటాడు రచయిత.

" ఇలాగే బ్రతకాలని 
మా పెద్దలు రాసిన తలరాతలు
మగ్గానికి కట్టేసిన సంకెళ్లై
మా బతుకుల్ని చిదిమేస్తాయి"

అని కార్మికులు తమ దరిద్రంపై వ్యాఖ్యానిస్తున్నాడు.
అంతేకాదు.

" గాంధీ పట్టిన రాట్నంలో
చిక్కిన పోగులే మా బతుకులు
రాట్నం అరిగినా‌‌ బొక్కలు కరిగినా
నా బతుకులు మారలేదు "

అని కవి మరొకచోట అంటాడు..
రచయిత నేత కార్మికుల్లో నెలకొన్న దారిద్ర్యం వలన తలెత్తున్న అనేక సమస్యలను ఈ పుస్తకంలో ఎత్తి చూపుతున్నాడు‌.

" సిరికి పుట్టింటి వారమంటూ
నేతబిడ్డ మహాలక్ష్మి అంటూనే
పలకా బలపం పట్టాల్సిన బాల్యాన్ని
పేదరికం చిదిమేసింది"

అంటాడు రచయిత.
పేదరికంలో ఆత్మహత్య చేసుకుంటున్న నేతన్నల గురించి ఇట్లా అంటాడు.

"బ్రతుకు బండిని నడపలేక బరువైన జీవితం
నూరేళ్ల జీవితాన్ని ఉరితాడుకు బలిచేస్తూ
అనాథ శవమోలె మిగులుతున్న నేతన్న"

సమస్యలతో సతమతమవుతున్న నేతన్నల బతుకే రచయిత ఇతివృత్తం.

"మగ్గం గుంటలో చతికిలపడ్డ
నేతన్న చెమటచుక్క సిరగా
చేవ చచ్చి కుప్పకూలి, కుళ్లిన
నేతన్న ఎముకలు కలంగా "

రచన చేస్తున్నానని రచయిత అంటాడు.
నేత కార్మికుల జీవిత చిత్రపటం ఇట్లా ఉంటది.

" గుండెల్లో రోదన
కళ్లవెంట అశ్రువులు
విస్తర్లో వడ్డించిన గంజిమెతుకులు
గొంతు దిగమంటూ మొరాయిస్తుంటే
మరుపొద్దు ఎట్లా గడుస్తదంటూ
చీకటి తెరల్లో వెలుగు కిరాణాల కోసం
ఆశతో శ్వాస నిలిపి చూస్తున్న నేతన్నకు
ఈ లోకమేమిచ్చింది
ఆకలి చావులు తప్ప.."

మరొక చోట రచయిత ఇలా అంటాడు..

"బట్టనేసినా కొత్తబట్ట‌ కట్టలేని
మా అతుకుల‌ గతుకుల 
దుర్భర జీవాతాల చూసి
నవ్వుకుంటుంది నూలు పున్నమి"

అని ఆవేదన వ్యక్తం చేసాడు,
ఈ పరిస్థితులనుండి బయట పడటానికి తోడ్పడగల రాజకీయాలను వెతుక్కోవాలని రచయిత సూచిస్తాడు..

" నిన్ను.. నీ కుటుంబాన్ని..
కులాన్ని నిలువెత్తున దోస్తున్న
పార్టీ జెండాలు మోస్తూ.."

ముందుకు సాగలేవని హెచ్చరిస్తాడు.

కార్మికులను దోచుకుంటున్న దళారుల నుండి జాగ్రత్త పడాలని అంటాడు.

" కార్మికుని పొట్టకొట్టి
కోట్లు కూడేస్తున్న
దుర్మార్గపు దళారీ వ్యవస్థని
పాతర పెడితే గానీ
నేత బతుకులు బాగుపడవు"

అని కార్మికులకు రచయిత మార్గనిర్దేశన చేస్తాడు.
చివరకు కార్మికుల కోరికను స్పష్టంగా వ్యక్తం చేస్తాడు.

" ఏనాడూ పట్టుపరుపులు
పరమాన్నాలు కోరనే లేదు
ఆత్మ గౌరవాన్ని నిలుపుకొని
గౌరవంగా బ్రతకాలనుకున్నా"

ఇది కార్మికుల అంతరంగం‌..

సారాంశంలో తేలేదేమిటంటే చేనేత కార్మికులకు తన పనితనాన్ని, తనకున్న కళను చూసి గర్వపడతాడు. తన అవసరం సమాజానికి ఉన్నదనే భావన బలంగానూ ఉన్నది. చేనేత కార్మికులకు కానీ వృత్తి బతుకుదెరువు ఇవ్వలేక పోతున్నదనే బాధ గూడుకట్టుకొన్నది. దాని నుండి బయటపడటానికి ప్రభుత్వమూ, సమాజమూ సహకరించాలని కోరుకుంటున్నాడు‌ రచయిత మోహనకృష్ణ..

కామెంట్‌లు

  1. Greatly written issues are blindfolded, it is great to describe what is happening as society is taking off

    రిప్లయితొలగించండి
  2. Such a great talented in age of Early mr dr mohana krishna bhargava... Great wisdom....

    రిప్లయితొలగించండి
  3. మీ హృదయంలో నరనరానికి పోగులు జత చేర్చి, రక్తంలో ప్రవహించే చేనేత స్థితిగతులను, రక్తనాళాలు శుద్ధి చేసి ప్రతి హృదయం మరింత జీవం పోసే లా ఉంది ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత