యమ ద్వితీయ | భగినీ హస్త భోజనం

" భగినీ హస్త భోజనం "

యమ ద్వితీయ - భ్రాతృ ద్వితీయ

కార్తీక శుద్ధ విదియ.. అన్నా చెల్లెల్లకు, అన్నా తమ్ముళ్ళకు ప్రత్యేకమైన పండుగ. శ్రావణ పౌర్ణమి రక్షాబంధనం మొదటి పండగ అయితే భగినీ హస్త భోజనం రెండవ విశేషమైన పండుగ గా జరుపుకోవడం ఆచారంగా వస్తుంది. రక్షాబంధనానికి సోదరి సోదరుని గృహానికి వచ్చి పండగ జరుపుకుంటారు. అదే భగినీ హస్త భోజనానికి సోదరులు సోదరి గృహానికి రావటం ఆనవాయితీగా వస్తుంది. అంటే సోదరి  మెట్టినింట ఆతిథ్యాన్ని స్వీకరించడం. నేను నీకు సర్వదా రక్షగా నిలుస్తానని రక్షాబంధనం రోజున వాగ్దానం చేయడమే గాని సోదరి మెట్టినింటికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకునే ప్రయత్నం చేయరు. పైగా మెట్టినింట భోజనం చేయడం, అత్తవారింట సొమ్ముతినడం పాపంగా భావిస్తుంటారు. కానీ పుట్టినింట సోదరికి రక్ష అవసరమేమున్నది.? సమాజాన్ని ఎదుర్కోవాలన్నా, మెట్టినింట ఎదురయే కష్టాలని ఎదుర్కోవాలన్నా.. వాటిని అర్థం చేస్కుని తోడుగా నిలిచే సోదరుడు ఎంతైనా అవసరం కదా..! అందుకు ఇలాంటి పర్వదినాలు అవకాశాన్ని కల్పిస్తాయి. ఇవి కేవలం ఆతిథ్యాలు, కానుకలు ఇచ్చి పుచ్చుకోవడానికి మాత్రమే కాదు. అక్కచెల్లెళ్ళకు పుట్టింటి అండదండలతో మేమున్నామనే నమ్మకాన్ని, మమకారాలతో తోబుట్టువుల్లో మానసిక బలాన్ని, ప్రేమానురాగాలతో నూతనోత్సాహాన్ని నింపుతాయి. ఇలాంటి ప్రత్యేక పర్వాలు ఇరు కుటుంబాలలో పండగ వాతావరణాన్ని కల్పించడంతో పాటు ఆప్యాయతలని పెంపొందిస్తాయనే సూక్ష్మ ఆంతర్యం ఇందులో దాగివుంది. ఇది భారతీయ కుటుంబ వ్యవస్థని పటిష్ఠ పరచే రక్త బంధానికి నిష్కల్మషమైన ప్రతీక.

శ్లో "కార్తికేతు ద్వితీయాంయా శుక్లాయాం భ్రాతృపూజనం!
యా నకుర్యాత్ వినశ్యంతి భ్రాతరస్సప్తజన్మసు!!

కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వితీయ(విదియ) రోజున సోదరుడు తప్పకుండా తమ సోదరి(అక్క-చెల్లెలు) చేతి భోజనం చేయాలి. అది సోదరుడికి ఆయుష్షును, ఆరోగ్యాన్ని, పుష్టిని కలిగిస్తాయన్నది శాస్త్ర వచనం. ఈ రోజున సోదరులను తమ గృహానికి ఆహ్వానించి యముడు మరియు చిత్రగుప్తులను పూజించి సోదరునికి ఆయుష్షు, ఆరోగ్యం వృద్ధి చెంది, సుఖసంతోషాలతో వర్థిల్లాలని కోరుతారు. తమ సోదరునికి ప్రీతికరమైన భోజనాలను(కేవలం శాఖాహారాలు మాత్రమే), పాయసం లడ్డు మిఠాయి వంటి తీపి పదార్థాలను, వివిధ రకాల పిండి వంటలను స్వయంగా వండి వడ్డిస్తారు. అక్కా చెల్లెళ్ళకు అన్నదమ్ములు నిండుబట్టలు పెట్టి సంతోషపరుస్తారు. 

శ్లో" అస్యాం నిజగృహే పార్థ! నభోక్తవ్యమతో బుధైః!
యత్నేన భగినీహస్తాత్ భోక్తవ్యం పుష్టి వర్ధనమ్!!

ఈ పండగ కి మూడు విశేష కథలున్నాయి..

- నరకాసురవధతో భూమండలమంతా దీపావళి పర్వదినోత్సవాన్ని జరుపుకున్నారు, దీపావళి తరువాత శ్రీ కృష్ణుడు ఈ రోజునే తన చెల్లెలు అయిన సుభద్ర గృహానికి విచ్చేసి సంతోషంగా ఉత్సవాన్ని జరుపుకున్నారని. ఆనాటి నుండి కార్తీక శుద్ధ విదియ రోజున తోబుట్టువులతో ఉత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని ప్రతీతి.

- ఈ రోజున చిత్రగుప్తుడి జన్మ తిథి. ఈ రోజున చిత్రగుప్తుని పూజించడం వలన అకాల మరణాలు, అపమృత్య దోషాలు తొలగిపోతాయి, ఆయుష్షు వృద్ది చెందుతుంది.. 

- మరొక పురాణ కథనం ప్రకారం
యముడి చెల్లెలు యమున. సోదరుడు యముడిని తన ఇంట ఆతిథ్యానికి ఎన్నో మార్లు ఆహ్వానించింది. తప్పకుండా వస్తానని మాటిచ్చిన యముడు ధర్మ పాలనలో క్షణకాలం తీరిక లేనందున ఏనాడు వెళ్లలేకపోయాడు. తన సోదరుడి రాకకై ఎదురు చూస్తున్న యమున సోదర ప్రేమ, సంకల్పబలం గొప్పది.  అనుకోకుండానే కార్తీకమాస శుద్ధ విదియ రోజున యమధర్మరాజు తన పరివారంతో సహా యమున గృహానికి ఆతిథ్యాని విచ్చేశారు. యమున సంతోషానికి అవదుల్లేవు.  ఏరి కోరి తెచ్చిన ఫలాలు, అనురాగాలను నూరిపోసి చేసిన పిండివంటలతో, ఆప్యాయంగా సత్కారాలతో యముడిని పూజించింది. చెల్లెలి ప్రేమకి ముగ్ధుడైన యముడు "ప్రతీ సంవత్సరం ఇదే రోజున తన ఇంటికి ఆతిథ్యానికి వస్తానని, ఈ రోజున ఏ సోదరి అయితే తన సోదరునికి ఆతిథ్యమిస్తుంతో.. వారికి అపమృత్యువు తొలిగిపోతుందని, పరిపూర్ణ ఆయుష్షు కలుగుతుందని, సుఖసంతోషాలతో వర్థిల్లుతారని" ఆశీర్వదించాడు.

ఇలాంటి పర్వదినాలే. మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు పరిపూర్ణత, బాహ్యాంతర ప్రయోజనాలను, సామాజిక విలువలను పెంపొందిస్తాయి‌. పరమార్థం‌ లేనిదే మన శాస్త్రాలు ఏ విషయాన్ని మనకు బోధించవనే విషయాన్ని గ్రహించాలి. అందులో పరమార్థాన్ని అన్వేషించి ఆచరించాలి‌‌..

ధర్మస్య విజయోస్తు..

మీ..
డా" ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ..
M.A(Tel.).,M.A(Phil.).,PhD

కామెంట్‌లు

  1. చాలా మంచి విషయం చెప్పినందుకు ధన్యవాదాలు ఆచార్య మోహనకృష్ణ గారు

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత