పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ
"పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు" (జననం : 02- 10 - 1926, మరణం : 05 - 11 - 1993) కడ'వెండి' గిన్నెలో కడిగిన తెల్లని ముత్యమతను/ శ్రమజీవుల బువ్వకుండలో కుతకుత ఉడికిన ఎర్రని మెతుకతను/ దోపీడీ గడీలపై సంఘమయి/ దౌర్జన్యాల మీద గుతుపయి/ పీడితుల్ని ఏకం చేసిన 'నల్ల పులి' అతను.. - మోహనకృష్ణ తెలంగాణా ఉద్యమ చరిత్రలో గుర్తింపు నోచుకోలేక చీకటిలో మిగిలిన వీరులెందరో.. సాయుధులై నేల రాలిన తారలెందరో.. పోరు వెనుక దాగిన కన్నీటి గాథలెన్నో.. వారి త్యాగాలను స్పృశించి, గౌరవించాల్సిన బాధ్యత మనందరిది. ఇదే కోవకు చెందిన మరో తార, సాయుధ పోరాటానికి ఊపిరిగా నిలిచిన తెలంగాణ బెబ్బులి, నల్ల పులి నల్లా నర్సింహ్ములు.. ఆయన ఉద్యమ ప్రస్థానంపై విస్తృత చర్చ, పరిశోధన, ప్రచారం అవసరం.. (1 అక్టోబర్ 2023 రోజున - ప్రజా మంటలు దిన పత్రికలో ప్రచురితమైన వ్యాసం..) ' జనగామ' పోరాటాల పురిటి గడ్డ. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం, బానిస సంకెళ్ల నుండి స్వేచ్ఛ కోసం పోరాడి నేల రాలిన అమరులెందరో ఈ నేల చరిత్రలో శాశ్వత స్థానాన్ని నెలకొల్పుకున్నారు. సర్...