చాయ్ | కవిత | మోహనకృష్ణ భార్గవ
చాయ్ పొద్దుపొద్దున్నే గరంగరం చాయ్ తాకన్దే ఏ పొద్దు మొలవదు సల్లబడ్డ నరాల్ని జివ్వున వేడెక్కిస్తది లైఫ్ ని పరుగులెత్తిస్తది ఎంతైనా.. చాయ్ కథే వేరు కదా..! ఇరానీ మసాలా అద్రక్ గ్రీన్ జింజర్ లెమన్ అబ్బో ఒందళ్లోనే పేర్లు పేరుకు తగ్గట్లే సరుకు ఉన్నోడు లేనోడు తాగే చాయ్ బిస్లరీ నీళ్లు, మున్సిపల్ నీళ్లు ఉన్నోడికి లేనోడు పలుచన తీరు.. గల్లీ నుండి ఢిల్లీ దాకా రాజకీయ రథాన్ని నడిపిస్తది సర్పంచ్ నుండి మినిస్టర్ దాకా దోస్తాన పాఠాలు నేర్పిస్తది పనులన్నీ ఇట్టే పూర్తి చేస్తది మస్తుగ లోకాన్ని చూపిస్తది.. సాసర్ లేనిదే తాగని సార్లు మలాయ్ కావాలనే హుషార్లు తాగిపడేసే డిస్పోసల్లాంటి వాడుకొని వదిలేసే పూటకూలీల బతుకుల్లా వాడుకరి జీవాలు.. పొద్దుబోక టైంపాస్ కి దోస్తుల్తో తాగేటోల్లు కొందరు పొద్దు ఎట్లా గడుస్తదోనని పొద్దుగూకే యేల గొల్లున భయంతో తాగేటోల్లు ఇంకొందరు పొద్దంతా ఒళ్లుహూనం చేస్కుని కష్టపడే శ్రామికుడికి రోజుకు మూడు పూటల తిండి దొరకని పేదరికానికి ఆకలేస్తే ఆకలిని చంపటమే ఏకైక మార్గం ఆస్వాదన కోసం కాదు పొద్దంతా ఆకలని చంపటానికి మరికొంత సమయం పనిచేసే ...